ఎరుపెక్కిన అడవికి బాధ్యులెవరు?
భారతావనికి పచ్చని వడ్డాణంలా, అపార ఖనిజ నిక్షేపాల నిలయంగా విరాజిల్లిన దండకారణ్యం తాజా చత్తీస్‌గఢ్ ఘటనతో మరోసారి ఎరువెక్కింది. ‘సల్వాజుడుం’, ‘ఆపరేషన్ గ్రీన్‌హంట్’ల పేరిట రాజ్యం తలపెట్టిన సాయుధ కార్యక్రమం అక్కడి పచ్చదనాన్ని పొట్టనపెట్టుకునే దిశగా సాగుతోంటే, దానిని ప్రతిఘటిస్తున్న విప్లవోద్యమం ఎదురు దాడులకు దిగుతోంది. ఫలితంగా ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు, ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారు.
పదుల సంఖ్యలో రాజకీయ నాయకులు, పోలీసులు హతమౌతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు కొత్తేమి కాకపోయినా ఇంత పెద్ద స్థాయిలో ఒక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు నక్సల్స్ చేతిలో హతమవ్వడాన్ని మాత్రం పెద్ద సంఘటనగా చెప్పవచ్చు. కేంద్ర రాష్ర్ట పాలకులు మృతుల కుంటుంబాలను ఓదార్చి, ఘటనను ఖండించి, అదనపు బలగాలను పంపుతామని హామీ ఇచ్చి తమ బాధ్యతను నిర్వహించారు. ఒక రాష్ర్టంలోని ఒక పార్టీముఖ్య నాయకత్వమంతా దాదాపుగా తుడుచికుపెట్టుకపో యిన తర్వాతనైనా పాలకవర్గాలు, రాజకీయ పక్షాలు, మేధావులు, సమాజం అంతా దీని విషయం తీవ్రంగా ఆలోచించాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కావడానికి కారణాలేమిటో, వాటి పరిష్కారాలేమిటో వెతకాలి. గత నాలుగు దశాబ్దాలుగా కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జరుగుతున్నది ఇదే. పాలక వర్గాలు తమ సొంత ప్రజల్నే చంపడానికి లక్షలాది పారా మిలటరి బలగాలను, పోలీసులను పంపి వేటాడి చంపే స్థితి ఎందుకొచ్చిందనేది చర్చించాలి. చత్తీస్‌గఢ్ ఘటనకు తమదే బాధ్యత అంటూ మావోయిస్టులు ప్రకటించుకున్నట్లు వార్తలు వచ్చాయి. సల్వాజుడుం వంటి ముఠాలను ఏర్పాటుచేసి వేలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నందుకే ఈ దాడికి పాల్పడ్డామని మావోయిస్టులు స్పష్టం చేశారు.
ఆంధ్రరాష్టంలోని జగిత్యాల జైత్రయాత్ర తరువాత 1979లో వామపక్ష విప్లవోద్యమం గోదావరినది దాటి సిరొంచ, గడ్చిరోలి మీదుగా బస్తర్ ప్రాంతానికి, దండకారణ్యానికి విస్తరించింది. దండకారణ్యం కేంద్రంగా దాని చుట్టూ ఉన్న ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను పెంచుకున్నది. అయితే 1990లోనే దండకారణ్యంలో నక్సలైట్ల ప్రాబల్యాన్ని నిరోధించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. 1991లో కాంగ్రెస్ నాయకుడు మహేంద్రకర్మ (సిపిఐ మాజీనాయకుడు) బస్తర్ ప్రాంతంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా ‘జన జాగరణ్ అభియాన్’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. నక్సలైట్ల తీవ్ర ప్రతిఘటనతో ఈ సంస్థ మనలేకపోయింది. మళ్లీ కొంత కాలానికి చత్తీస్‌గఢ్ శాసనసభా నేతగా ఉన్న మహేద్రకర్మ 2005 జూన్‌లో శాంతిసేన పేరిట ‘సల్వాజుడుం’ అనే సంస్థను స్థాపించాడు.
తెగలరీత్యా విభేదాలున్న రాచకోయలు, గుత్తికొయ్యల మధ్య విద్వేషాలను మరింతగా పెంచి మహేద్రకర్మ కొంత విజయం సాధించాడు. నక్సలైట్లకు వెన్నుదన్నుగా గొత్తికోయలు నిలిస్తే వారితో తెగ రీత్యా విభేదాలున్న రాచకోయలు సల్వాజుడుంకు మద్దతు తెలపడంతో గిరిజన సమాజం చీలికలు పేలికలైంది. అప్పటికే గనుల తవ్వకానికి ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వానికి నక్సల్స్ అడ్డుతగిలారు. వారిని అడ్డుతొలగించుకోవాలని భావించి చత్తీస్‌గఢ్ ప్రభుత్వం సల్వాజుడుంకు మద్దతు తెలిపింది. దాదాపు 40 వేల మంది సభ్యులున్న ఈ సేనలో 10 వేల మందికి పైగా సభ్యులకు తుపాకులతో శిక్షణ ఇచ్చింది. నెలకు రూ.1500 జీతంతో దాదాపు నాలుగు వేలమందిని ప్రత్యేక పోలీస్ అధికారులుగా (ఎస్పీఒ) నక్సలైట్లను తుదముట్టించడానికి ప్రభుత్వం నియమించింది. మావోయిస్టులను ఎదుర్కొనే లక్ష్యంతో ప్రారంభమైన సల్వాజుడుం చివరకు లూఠీలకు, హత్యలకు, అత్యాచారాలకు, గృహ దహనాలకు దారితీసింది. వీరి ఆగడాలతో దాదాపు 700 గ్రామాలు నామరూపం లేకుండా పోయాయి. వందలాది మంది అత్యాచారాలకు గురయ్యారు. వెయ్యి మందికి పైగా ఆదివాసీలు హతులయ్యారు. దాదాపు 3.5 లక్షలమంది నిర్వాసితులయ్యారని, రెండు లక్షలమంది గిరిజనుల ఆచూకీ ఇప్పటికీ దొరకడం లేదని చత్తీస్‌గఢ్ ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.
సల్వాజుడుం పేరుతో పిల్లల చేతికి తూపాకులు ఇచ్చారని ప్రజాసంఘాలు మండిపడ్డాయి. గిరిజనుల్ని ఎత్తుకెళ్లి సల్వాజుడుం శిబిరాల్లో పెడుతున్నారని, అక్కడ ఉండటానికి ఇష్టపడకపోతే వారిని మావోయిస్టులుగా చిత్రీకరిస్తూ క్రూరంగా హింస్తున్నారని హక్కుల సంఘాలు ఆరోపించాయి. కొందరు ఈ విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించగా, సుప్రీం బెంచి తీర్పునిస్తూ, 5వ తరగతి మాత్రమే చదివిన యువకులకు ఆయుధాలిచ్చి, పోలీసులతో సమానమైన అధికారాలు ల్పించడం రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకం అని రాష్ర్ట ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. వెంటనే వారి నుండి ఆయుధాలను వశం చేసుకోవాలని ఆదేశించింది. అయితే చత్తీస్‌గఢ్ ప్రభుత్వం అధికారికంగా సల్వాజుడుంను రద్దుచేసినప్పటికి ప్రత్యేక పోలీసులు అధికారులుగా నియమించిన వారిని మాత్రం ఇంకా కొనసాగిస్తూనే ఉంది. చత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్ ప్రభుత్వం భారీ నిర్బంధ కాండను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరినీ అణచివేసేందుకు ప్రయత్నించింది. ఆపరేషన్ గ్రీన్‌హంట్ రెండో దశలో బస్తర్ ప్రాంతంలో పోలీసులు, పారామిలిటరీ- చింతల్‌నార్ ప్రాంతంలో నక్సలైట్లకు సహాయం చేస్తున్నారనే సాకుతో దాదాపు 300 ఇండ్లనుబూడిదచేసి, ముగ్గురు గ్రామీణులను హత్యచేశారు.
ఆరుగురు మహిలలపై సామూహిక అత్యాచారానికి పాల్ప డ్డారు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల కనుసన్నలలో మిలటరీ, పోలీసులు ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకు పాల్పడి, హక్కుల కార్యకర్తలను, మేధావులను నిర్బంధాలకు గురిచే స్తూ, వేలాదిమందిని హతమారుస్తూ, ఊళ్లకు ఊళ్లను తగలబెడుతూ, లక్షలాదిమందిని నిరాశ్రయులను చేస్తుంటే, ఏనాడూ ఆదివాసులకు అండగా నిలబడని రాజకీయపార్టీలు చత్తీస్‌గఢ్ ఘటను ఖండిం చడం, మహేద్రకర్మపై సాను భూతి వ్యక్తంచేయడం గమనార్హం. ఇవాళ దేశ వ్యాపితంగా అనేక ప్రాంతాల్లో బహుళజాతి కంపెనీలు కాలుమోపి ఈ దేశ వనరుల్ని దోచుకుపోతుంటే రాజకీయ పార్టీలన్నీ ఆ బహుళజాతి కంపెనీలకు రాయితీలు కల్పిస్తూ వారికి అండగా నిలబడున్నాయి తప్ప, ఆ వనరుల్ని కాపాడేందుకు ముందుకు రావడం లేదు. మన రాష్ర్టంలోనే సాగునీటి ప్రాజెక్టు పేరుతో, జలవిద్యుత్ పేరుతో, గనులు, పరిశ్రమల పేరుతో, అడవుల నుంచి ఆదివాసులను వెళ్లగొడుతున్నా అడ్డుకోలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం, గోదావరి జిల్లాలో 300 గిరిజన గ్రామాలు, వారి అస్తిత్వాలు, వారి సంస్కృతి నామరూపం లేకుండా పోతున్నాయి. అణిచివేత ప్రక్రియను ఆపకుండా, పోలీసులు, మిలటరీబలగాలతో సమస్యను పరిష్కారించాలని ప్రభుత్వాలు అనుకు న్నంత కాలం చత్తీస్‌గఢ్ వంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇందుకు బాధ్యత పాలకులు, ప్రభుత్వాలే వహించాల్సి ఉంటుంది.
http://www.suryaa.com/opinion/edit-page/article-139826
Subscribe to:
Post Comments
(
Atom
)


Iron Titanium Table - TITONICS
ReplyDeleteIron Titanium toaks titanium Table: Iron Titanium Table. 예스 벳 In the table, you can play with four players as well as with four players. The table layout pure titanium earrings is simple, titanium trim hair cutter reviews with Rating: titanium headers 4.8 · 10 reviews · $39.99 · In stock