అగ్రవర్ణ పాలకుల కుట్ర !
ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంధ్ర ప్రభుత్వం ఈ మధ్య రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి విఫలం అయింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ బుద్దులు దేశ ప్రజల ముందు నగ్నంగా ప్రదర్శితమయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ, శివసేన పార్టీలు బిల్లుకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నాయి. కోల్-గేట్ కుంభకోణాన్ని సాకుగా చూపి ప్రయోషన్ల బిల్లుకి బి.జె.పి మోకాలడ్డింది. ''ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడం వలన జూనియర్లు సీనియర్లవుతారు. ఇదేం జోకా? ప్రభుత్వ పాలనే జోకైపోయింది'' అని మూలాయం ఎస్సీ,ఎస్టీల జీవితాలపై పరిహాసమాడాడు. నలభై యేళ్లు కూడా నిండని తన కొడుకుని దేశంలోని అతిపెద్ద రాష్రానికి ముఖ్యమంత్రిగా రుద్దిన ములాయం అగ్రకుల సినియర్లపై, ఎస్సీ,ఎస్టీ జూనియర్లు పెత్తనం సాగిస్తారని తెగ ఆందోళన పడ్డాడు. కోడలిని పోటీలేకుండా పార్లమెంటుకి ఎంపిక చేసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థనే పెద్ద జోక్‌గా మార్చిన ములాయం, న్యాయబద్దమైన చట్టాన్ని జోకుగా చెప్పేందుకు బరితెగించాడు. ఈ బిల్లు సందర్భంగా అగ్రవర్ణాల ఓట్ల కోసం ఒక పార్టీ, హిందూ ఓట్ల కోసం మరోక పార్టీ ఈ బిల్లును అడ్దుకోవడమే కాక, తమ కుల దురహంకారాలను కూడా నిస్సిగ్గుగా బైట పెట్టుకున్నాయి.
ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన బిల్లు సమావేశాల చివరి రోజుల్లో ప్రవేశపెట్టడమే ఆ పార్టీ చిత్తశుద్దిని తెలుపుతోంది. ప్రమోషన్ల బిల్లుని ఈ సమావేశాల్లో ఆమోదం పొందడం కష్టమని మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించడమే దీనికి రుజువు. కోల్‌గేట్ కుంభక్షోణానికి సంబంధించి ప్రధాని రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌కి తలొగ్గితే ఎస్సీ,ఎస్టీ ప్రమోషన్ బిల్లుపై చర్చకు సిద్ధమని బి.జె.పి ప్రకటించడం బి.జె.పి మార్కు మోసం. ప్రమోషన్ల బిల్లుపై చర్యకు అనుమతీస్తే కోల్-గేట్ డిమాండ్‌కి వచ్చే నష్టం ఏమిటట? ప్రమోషన్ల బిల్లుపై చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీ కోల్-గేట్ కుంభకోణం నుంచి బైటపడుతుందా? కేవలం ఒక న్యాయమైన బిల్లు చట్టంగా మారే అవకాశం ఇచ్చినంత మాత్రాన బి.జె.పి పోరాట పటిమ మొద్దుబారుతుందా?
భారత దేశ బ్యూరోక్రటిక్‌లో ఒక మెట్టు ఎక్కడానికి అవకాశన్నిచ్చే ముఖ్యమైన,న్యాయమైన బిల్లు, పాలక,ప్రతిపక్ష ముఠాల రాజకీయ వికృత క్రీడలో పావుగా మారిపోయింది. ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించిన లెక్కల ప్రకారమే 149 సెక్రటరీ స్థాయి అధికారుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎస్సీ వ్యక్తి లేడు. 180 మంది అదనపు కార్యదర్శుల్లో ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీ అధికారులు మాత్రమే ఉన్నారు. ఇక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు 477 మంది ఉంటే ఎస్సీలు 31 మంది(6.5%), ఎస్టీలు 15 మంది(3.1%) మాత్రమే ఉన్నారు. ఇక డైరెక్టర్లు 590 మంది ఉంటే వారిలో ఎస్సీలు 17 మంది (2.9%) కాగా ఎస్టీలు 7గురు (1.2%) మాత్రమే. ఉన్నతాధికారుల లెక్క మొత్తం చూస్తే 1324 మందిలో 50 మంది (3.78%)ఎస్సీలు, 28 మంది (2.11%) ఎస్టీలు మాత్రమే ఉన్నారు. ఎస్సీ ఉద్యోగులు 15%, ఎస్టీ ఉద్యోగులు 7.5% రిజర్వేషన్లు ఉండవలసిన చోట కేవలం 3.7, 2.11 శాతం మాత్రమే ఉండడాన్ని బట్టి ఉన్నత స్థానాలను అక్రమించింది ప్రతిభా సంపన్నులని చెప్పుకుంటున్నవారేనని గ్రహించవచ్చు. ఈ సమాచారం అంతా ప్రభుత్వం ఇచ్చినదే. పార్లమెంటులో చర్చజరుగుతున్న సందర్భంగా పి.ఎం.ఓ సహాయ మంత్రి పి.నారాయణ స్వామి ఈ గణాంకాలు ప్రకటించాడు.
ఇక ఉన్నత పదవుల్లోకి వచ్చే వారిలో అత్యధికులు ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ,ఎఫ్.ఎస్ క్యాడర్ వారే ఉంటారు. ఇతర్లు ప్రమోషన్ల ద్వారా ఈ క్యాడర్‌లోకి నేరుగా నియమించిచడతారు. ఐ.ఏ.ఎస్ కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్లు 2011 మార్చి నాటికి 3251 మంది ఉంటే వారిలో ఎస్సీలు 454 మంది (13.9 శాతం), ఎస్టీలు 240 మంది (7.3 శాతం), ఓబిసీలు కేవలం 420 మంది, (12.9 శాతం) మొత్తం 34.1% మంది మాత్రమే ఉన్నారు. రాజ్యాంగం నిర్దేశం ప్రకారం 15 శాతం ఎస్సీలు, 7.5 శాతం ఎస్టీలు ఈ టాప్ కేడర్లలో నియమించవలసి ఉండగా అలా జరగలేదు. అంటే ఉన్నత స్థానాల్లో రిజర్వేషన్లు సరిగ్గా అమలు జరగడం లేదని గమనించవచ్చు. అంతేకాకుండా ఇతర ఉన్నత, మధ్యస్థాయి స్థానాల్లో ఎస్సీ,ఎస్టీల కోసం రిజర్వ్ చేసిన అనేక పోస్టులు నేటికి ఖాళీగా ఉన్నాయి. లోక్‌సభలో గత నవంబర్‌లో వి. నారాయఱ స్వామి చేసిన ప్రకటన ప్రకారం 73 ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో ఎస్సీల కోసం రిజర్వ్ చేసిన పోస్టులు 25,034 ఖాళీగా ఉన్నాయి. ఇందులో 4,518 పోస్టుల్లో ప్రమోషన్ ఇవ్వడానికి ఎస్సీ అభ్యర్ధులెవరూ అందుబాటులో లేనందున ఖాళీగా పడి ఉన్నాయి. ఇక ఎస్టీ పోస్టులు 28,178 ఖాళీగా ఉంటే 7,416 పోస్టులు ప్రమోషన్ల కోసం అభ్యర్ధులు లేనందువలస ఖాళీగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఖాళీగా పడి ఉన్న పోస్టులను నింపడానికి ప్రమోషన్ల బిల్లు అవసరం అయింది. ఈ బిల్లు వలన అగ్రవర్ణాలకు చెందిన ప్రతిభాసంపన్నులు కోల్పోతున్న ఉద్యోగాలు ఏమీ లేవు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టంగానే చెబుతున్నారు. అయినా సరే పోస్టులు ఖాళీగా అయినా ఉండొచ్చు గానీ ప్రజలకు సేవలు అందకపోయినా, పరిపాలన కుంటుబడినా పర్వాలేదు గాని ఎస్సీ,ఎస్టీలు ఉన్నత స్థానాల్లో చేరడానికి వీలే లేదు. ఇలా నియమించడం వల్ల బ్యూరోక్రసిలో ఎస్సీ,ఎస్టీలు ప్రవేశిస్తారని, దీని వల్ల ప్రతిభ దెబ్బతింటుందని అగ్రవర్ణాలు గగ్గోలు పెడుతున్నారు.
ఈ బిల్లును అడ్డుకుంటున్నారు. రిజర్వేషన్ కోటాలో కేటాయించిన పోస్టుల్లో కూడా ఎస్సీ,ఎస్టీలు నియమించకుండా నిరోధించడమంటే ఇది స్పష్టంగా కుల వివక్షతే. మాదిగలు, మాలలు, కొండ జాతులు ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లోకి చేరకుండా నిరోధించే కులవివక్ష. ఓట్ల కోసం రిజర్వేషన్లు ప్రకటిస్తూ, ప్రకటించిన రిజర్వేషన్లు కూడా భర్తీ కాకుండా ప్రయత్న పూర్వకంగా నిరోధిస్తున్న అత్యంత నగ్నమైన కుల వివక్ష. భారత దేశ పరిపాలనా వ్యవస్థకు ఒక మూల స్తంభంగా ఉన్న బ్యూరోక్రసీలో ఎస్సీ,ఎస్టీలు లేరు.
ఉన్నవారి చేతుల్లో అధికారం ఉండదు. ఒక వేళ ఉన్నా అది పైఅధికారుల అదుపాజ్ఞలకు లోబడి ఉండవలసిందేనని, తామేమి చేయలేకపోతున్నామంటూ కొందరూ ఎస్సీ,ఎస్టీ ఉన్నతాధికారులు వివిధ సందర్భాలలో తన ఆవేధనను వ్యక్తం చేశారు. అంటే దేశ పాలనా పగ్గాలన్నీ అగ్రకుల ప్రతిభా సంపన్నుల చేతుల్లోనే ఉన్నది తప్ప ప్రతిభ లేదని చెప్పబడుతున్న ఎస్సీ, ఎస్టీ చేతుల్లో లేదని స్పష్టంగా తెలుస్తోంది.
అరవైయారేళ్ల స్వతంత్ర భారతం ప్రపంచంలోని సగం దరిద్రానికి నిలయంగా మగ్గుతోందంటే, శక్తివంతమైన మందులు ఉన్నప్పటికీ బీద గిరిజన జనం ఇప్పటికీ మలేరియా,టైఫాయిడ్ జ్వరాలతో చస్తున్నారంటే, మురుగు కాలవల కోసం కూడా అతి చిన్న యూరప్ దేశాలముందు దేహీ అంటూ బిచ్చమెత్తుతున్నదంటే, మానవాభివృద్ధి సూచికలో 134వ స్థానంలో, తలసరి ఆదాయంలో 128వ స్థానంలో, విద్యా సూచికలో 147వ స్థానంలో దేశం కునారిల్లుతున్నదంటే, బల్లకింద చేయి తడిపితే తప్ప కార్యదర్శి నుంచి క్లర్కు దాకా పైలు ఒక్క అంగుళం కూడా కదలదంటే, దేశ వనరులను ప్రజలకు ఉపయోగపెట్టకుండా విదేశీ కంపెనీలకు అమ్ముకుని అవి విదిల్చే డాలర్ల మెతుకులను ఎరుకునే పాలకులు ఉన్నారంటే కారణం ఎవరు? దీనికంతటికి ఉన్నత పదవుల్లో ఉన్న అగ్రకుల ప్రతిభా సంపన్నులు కారణం కాదా?.... ఈ దేశం ఎస్సీ,ఎస్టీ,బిసి, ముస్లింల చేతుల్లో లేదు. ఈ దేశం ప్రతిభా! ప్రతిభా! అంటూ గొల పెడుతున్న అగ్రకుల సంపన్నుల చేతుల్లో ఉంది. ఎస్సీ, ఎస్టీలు,బిసిలు ప్రధానంగా శ్రమచేసి దేశాన్ని నిర్మిస్తున్న వర్గాల్లో ఉన్నారు తప్ప పెత్తందారుల్లో లేదు. ఒకరు ఇద్దరు ఆ కోవలో ఉన్నా పెత్తందారులకు సేవకులే. కనుక నేటి భారత దేశ దుస్థితికి కారణం అగ్రకుల సంపన్నులే. కులం కులం అంటూ గోక్కుంటున్న అగ్రకుల పేదలకు కూడా అగ్రకుల ప్రతిభావాదంతో ఒరిగిందేమీ లేదు.
ఈ ప్రతిభా సంపన్నుల ఆరవైయారేళ్ల ఏలుబడిలో ఈ దేశం ఊడబొడిచింది ఏమన్నా ఉందంటే అది 18 లక్షల కోట్ల విదేశీ అప్పు, 40 లక్షల కోట్ల స్వదేశీ అప్పు. ప్రపంచ బ్యాంక్ అప్పు ఇస్తే తప్ప ఈ దేశంలో సిమెంట్ రోడ్డు పడని స్థితికి దేశాన్ని దిగజార్చారు. మురుగు కాల్వలు తవ్వాలన్నా నార్వే, హాలాండ్ లాంటి అతి చిన్న దేశాల ముందు జోలె పట్టవలసిందే. 75 శాతం వ్యవసాయ భూములు నీటి పారుదల సౌకర్యం లేక వర్షపు చుక్క కోసం చాతక పక్షుల్లా ప్రతిఏడూ మోరఎత్తి చూడవలసిందే. వీరు ప్రవచించిన ఆధునిక దేవాలయాలు నేర్రెలిచ్చి కారుతోంటే పూడ్వడానికి మళ్లీ ప్రపంచబ్యాంకు పథకాలు కావాలి. ప్రపంచలో సగం దరిద్రం భారతదేశంలోనే నివాసం. దారిద్య్ర రేఖని కిందకి, ఇంకా కిందకి తొక్కేస్తే తప్ప దరిద్రాన్ని తగ్గించలేని దరిద్రం ఈ ప్రతిభా సంపన్నులది.
భారత దేశమే భారత దేశ ప్రజల చేతుల్లో లేదు. బ్రిటిష్ వాడు ఉన్నదాకా వాడొక్కడే ఈదేశానికి ప్రభువు. ఇప్పుడయితే ప్రభువులకు కొదవలేదు. అమెరికా,ఫ్రాన్స్,రష్యా,జపాన్,జర్మనీ, చీమ తలకాయంత హాలండ్, బెల్జీయంలు చివరికి నిన్నగాక మొన్న లేచి నిలబడిన దక్షిణకోరియా కూడా భారత పాలకులకు ప్రభువులే. ఈ దేశాలన్నింటా గొలుసుకట్టులా వ్యాపించి ఉన్న బహుళజాతి కంపెనీలే భారత దేశంతో పాటు అనేక పేదదేశాలకు ప్రభువులు. అరవైయారేళ్ల పాటు ఈ ప్రభువులకు సేవ చేయడంలోనే అగ్రకుల పాలకులు, ప్రతిభావాదులు గడిపారు తప్ప భారత ప్రజలకు సేవ చేయడంలో కాదు. వెలికి తీసిన వనరుల్లో,వినియోగంలోకి తెచ్చిన సంపదల్లో అత్యధిక భాగం విదేశాలకు తరలిపోయింది. వాల్‌స్ట్రీట్ బ్యాంకుల్లో, లండన్ పైనాన్స్ కంపెనీల్లో, స్విస్ బ్యాంకుల్లో, ప్యారిస్, బెర్లిన్,టోక్యో తదితర ఆధునిక నగరాల ప్రవేటు ఆకాశహర్మ్యాలలో భారత దేశ సంపద కుప్పలుగా పేరుకుపోయింది. ఆ కుప్పల నుంచి భారత దేశాంలోకి తిరిగి వస్తున్నదే విదేశీ పెట్టుబడులు. మన డబ్బుని మనం ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఎఫ్.ఐల రూపంలో కొద్దిగా విదిలించడానికి దేశ సార్వభౌమాధికారిన్ని బలితీసుకుంటున్నాయి బహుళజాతి కంపెనీలు. ప్రతిభా సంపన్నులు చూడవలసింది, ఆవేశపడవలసింది ఈ దోపిడిని చూసి గానీ, ఆరకొర వేతన బతుకుల కోసం అతృత పడుతున్న ఎస్సీ,ఎస్టీ,బిసిలను చూసి కాదు. చేతనైతే తమ ప్రతిభను సరిహద్దు దాటిపోతున్న సంపదను అడ్డుకోవడంలో ప్రతిభావాదులు చూపాలి. భారత ప్రజల చేజారిపోయిన భారత సార్వభౌమాధికారాన్ని తిరిగి ప్రజల చేతుల్లోకి చేర్చడంలో చూపాలి. ఆదివాసుల కాళ్ళకింద ఉన్న ఖనిజవనరులను కొల్లగొట్టడం కోసం సల్వాజుడుంలనూ, రణవీర్ సేనలను సృష్టిస్తున్న పాలకుల కుట్రలను నిలవరించడంలో చూపాలి. ప్రపంచ సామాజిక పటంపై దేశాన్ని అట్టడుగు స్థాయిలో నిలిపిన కుల వ్యవస్థను రూపుమాపి సమానత్వం నెలకొల్పడం కోసం తమ ప్రతిభను సానపెట్టాలి. నిస్సహాయ ఆదివాసీ ప్రజలపైనా, ఈనాన్య ప్రజలపైనా లక్షలాది సైనికులతో యుద్ధం చేస్తున్న పాలకుల దురన్యాయాలను ఎదుర్కొవడంలో ప్రతిభను వినియోగించాలి. కూలీ డబ్బులతో, ఖాళీ కడుపులతో, దీక్షలు అవసరం లేని నిరసనలతో, కులాల ఉక్కు సంకేళ్లతో బతుకులీడుస్తున్న బీదాబిక్కి జనానికి దక్కుతున్న కాసిన్ని మెతుకులలో భాగం కోసం పోటీపడే ప్రతిభ అసలు ప్రతిభే కాదని ప్రతిభావాదులు గుర్తించాలి.
Subscribe to:
Post Comments
(
Atom
)

No comments :
Post a Comment