ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్న విదేశీ పెట్టుబడులు
చిల్లర వర్తకుల జేబుకు కేంద్రం చిల్లు పెట్టింది. చిల్లర వ్యాపారంపై బ్రతికే వారి ఆశలపై నీళ్ళు చల్లింది. రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రెడ్ కార్పెట్ వేసి దిగువ, మధ్యతరగతి ప్రజల జీవనోపాధిని మరోసారి ప్రశ్నించింది. ఎప్పటి నుంచో చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని చూస్తున్న యూపిఏ, పార్లమెంట్ వర్షకాల సమావేశాల అనంతరం తన మనషులోని మాట భయటపెట్టింది. మనదేశంలోని కిరాణా,సూపర్ మార్కెట్ వస్తువులను కుప్పకూలుస్తూ విదేశీ వాణిజ్యానికి అనుమతిచ్చేసింది. అదీకాక ఆర్థిక సంస్కరణలకు ఇదే మంచి తరుణమంటూ తన జబ్జలు తానే చరుచుకుంది.
రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ తృణమూలు కాంగ్రెస్, ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకున్నప్పటికీ ప్రభుత్వం వెనుకడుకు వేయడానికి సిద్దపడలేదు. యూపిఏ మొదటి దఫా పాలన కాలంలోనే చిల్లర వ్యాపార రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే వామపక్షాలు అడ్డుతగలడం వల్ల వెనుకడుగు వేసింది. ఈ దఫా మాత్రం స్వపక్షం నుంచి విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికి ప్రభుత్వం మాత్రం తన మాటనే నెగ్గించుకుంది. ప్రపంచంలోకెల్లా అత్యధిక చిల్లర వర్తకం ఉన్న దేశం మనది. ఒక అంచనా ప్రకారం భారత దేశ స్థూల జాతీయోత్పత్తిలో చిల్లర వర్తకం 30 లక్షల కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వర్తకం 2014వ సంవత్సరం నాటికి 45 లక్షల కోట్లకు చేరుకుంటుందని నిపుణుల అంచనా. ఇంత పెద్ద మార్కెట్‌ను తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవాలని బహుళజాతి కంపెనీలు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాయి. భారత్‌లో రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేకపోవడంతో కొన్నాళ్లు వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేశంలోకి సంస్కరణలను ప్రవేశపెట్టడంలో తన వంతు పాత్రను నిర్వర్తించిన ప్రధాని ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న తరుణంలో భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటం కోసమే సంస్కరణలు అమలు చేస్తున్నామని వివరణ ఇచ్చుకున్నాడు. కానీ భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడానికి కారణం ఎవరు అనేది మాత్రం ఆయన చెప్పడం లేదు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ప్రవేశ పెట్టిన సంస్కరణల ఫలితమే దేశం ఈనాడు ఎదుర్కొంటున్న దుస్థితికి కారణం అనేది విస్మరిస్తున్నాడు.
పాలకులు ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగా దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతూ వచ్చింది. యువతకు సరియైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కోట్లాది నిరుద్యోగ భారతీయులు అనివార్యంగా కొద్దిపాటి పెట్టుబడులతో చిల్లర దుకాణాలు తెరవడమే ఏకైక ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. సుమారు కోటి 40 లక్షల చిల్లర దుకాణాలు నేడు దేశంలో వెలిశాయి. వీటిపై నాలుగు కోట్ల మంది చిరువ్యాపారులు ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. పరోక్షంగా కోట్లాదిమందికి
ఉపాధి లభిస్తోంది. సంస్కరణల ఫలితంగానే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి ప్రజలు ప్రత్యామ్నాయంగా చిల్లర వర్తకాన్ని ఎంచుకుంటే నేడు ఆ రంగాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి భారత పాలకులు ఉభలాటపడుతున్నారు. ఇప్పటికే దేశంలో ఉపాధి అవకాశాల పరిస్థితి నిరాశాజనకంగా ఉన్న సమయంలో చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతిస్తే అది ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిల్లర వర్తకుల్లో స్వల్ప వ్యయంతో దుకాణాలు నడిపేవారు, స్వంత షాపులు పెట్టుకున్నవారు, జనరల్ స్టోర్స్ నిర్వాహకులు మొదలు వీధి దుకాణదారులు ఉన్నారు. లక్షలాది మంది సాంప్రదాయేతర రూపాల్లో చిల్లర వర్తకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. కొద్దిమొత్తం పెట్టుబడులతో స్వతంత్రంగా ఈ రంగంలో అడుగుపెట్టే వీలుండటంతో నిరుద్యోగులకు ఈ రంగం పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తున్నాయి. గత పది పన్నెండేళ్లలో చిల్లర వర్తకం మన దేశంలో పెరుగుతూ వచ్చింది. మొత్తంగా రిటైల్ రంగం పెరుగుదల కంటే ఇది వేగంగా పెరుగుతోంది. ఇలా పెరగడానికి ప్రధాన కారణం మనం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పాక్షిక ఉద్యోగా సమస్యకు ఇది ప్రతిబింబంగా భావించవచ్చు. వ్యవసాయ రంగం ఇప్పటికే జనంతో నిండిపోయింది. అదనంగా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు అందులో లేవు. వస్తు తయారీ రంగంలో స్తబ్దత నెలకొంది. దీంతో లక్షలాది మంది భారతీయులు అనివార్యంగా సేవల రంగంలోకి ప్రవేశించి ఉపాధి వెతుక్కోవాల్సి వచ్చింది. అక్కడ కూడా అవకాశాలు అంతగా లేకపోవడంతో కొద్ది పాటి పెట్టుబడులు పెట్టగలిగినవారంతా చిల్లర దుకాణాలు తెరవటం ఏవైక ప్రత్యామ్నాయంగా వచ్చిందే తప్ప ప్రత్యేకంగా ఎంచుకున్నది కాదు.
ప్రస్తుతం వాల్‌మార్ట్ బహుళజాతి కంపెనీ ప్రపంచంలోని 15 దేశాలలో 55 పేర్లతో 8,500 షాపులను తెలిచింది. వాల్‌మార్ట్, పుస్టరికో పేర్లతో అమెరికాలో, వాల్‌మెక్స్ పేరుతో మెక్సికోలో, ఆస్థా పేరుతో లండన్‌లో, బెస్ట్‌ప్రైస్ పేరుతో ఇండియాలో ఇప్పటికే తన వ్యాపారాన్ని నడుపుతుంది. 2006లో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌తో వాల్‌మార్ట్ తన వ్యాపార భాగస్వామ్యాన్ని మన దేశంలో ప్రారంభించింది. బెస్టప్రైస్ పేరుతో వాల్‌మార్ట్ కంపెనీ తన మొదటి షాప్‌ను 2012 మేలో అమృత్‌సర్‌లో ప్రారంభించింది. భారత ప్రభుత్వం రిటైల్ రంగంలో 51 శాతం విదేశీ పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ సెప్టెంబర్ 14న పచ్చజెండా ఉపడంతో తన వ్యాపారాన్ని విస్తరించడానికి వాల్‌మార్ట్‌కు అవకాశం ఏర్పడింది. అయితే వాల్‌మార్ట్ వంటి విదేశీ బహుళజాతీ కంపెనీలు మనదేశ రిటైల్ రంగంలోకి ప్రవేశిస్తే అధనంగా లక్షలాధిగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిపోతాయని ఎఫ్‌డిఐ సమర్థకులు వాదిస్తున్నారు. కానీ వివిధ దేశాల అనుభవం దీనికి భిన్నంగా ఉంది. వాల్‌మార్ట్ వంటి బడా కంపెనీలు భారతదేశంలోకి అడుగుపెడితే అది కొత్తగా ఒక్క ఉద్యోగాన్ని సృష్టిస్తే చిల్లర వర్తకాన్ని నమ్ముకున్న 17 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని జర్మనీకి చెందిన మెట్రోక్యాష్ అండ్ క్యారీ కంపెనీ ప్రకటించింది. వాల్‌మార్ట్ రిటైల్ రంగంలో ప్రవేశించిన పదిసంవత్సరాల్లోనే దాదాపు 50 శాతం మంది చిన్న వర్తకంపై ఆధారపడినవారు తన వ్యాపారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని కెన్నిత్ స్టోన్ అనే అమెరికన్ ఆర్థికవేత్త తన సర్వేలో పేర్కొన్నాడు. ఒక్క వాల్‌మార్ట్ కంపెనే చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడం మూలంగా అమెరికాలో దాదాపు 2 లక్షల మంది కార్మీకులు తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వాల్‌మార్ట్ 2006లో షికాగోలోని అస్టిన్ ప్రాంతో కాలుమోపితే 2008 కల్లా ఆ ప్రాంతంలోని మొత్తం 306 చిన్న దుకాణాల్లో 82 దుకాణాలు మూతపడ్డాయని అమెరికా నుంచి వెలువడుతున్న 'అట్టాంటిక్ సిటీస్'' అనే పత్రిక వెలువరించింది. వాల్‌మార్ట్ చుట్టుపక్కల దుకాణాల మూసివేత రేటు 35 శాతం నుంచి 60 శాతం ఉంటుందని ''ది ఎకానమిక్ డెవలప్‌మెంట్ క్వార్టర్లీ'' తన అధ్యయనంలో వెల్లడించింది. వాల్‌మార్ట్ వంటి బహుళజాతి కంపెనీల వల్లా కొత్త ఉద్యోగాల మాట ఎట్లా వున్నా ఉన్న ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఎన్నో అధ్యయనాలు తెలుపుతున్నాయి. వాస్తవాలు ఇలా వుంటే ప్రభుత్వం మాత్రం కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ధరలు తగ్గుతాయని వాస్తవాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. బహుళజాతి కంపెనీలు రిటైల్ రంగంలోకి వచ్చిన తర్వాత ప్రాథమిక దశలో కొన్ని విలాస వస్తువులు చౌక ధరలకు లభించినప్పటికి భవిష్యత్తులో దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. భవిష్యత్తు లాభాల కోసం దేశీయ మార్కెట్ ధరల కంటే కొంత కాలం బడా కంపెనీలు తక్కువకే వస్తువులను అమ్ముతాయి. దీని వల్ల ఆ షాపింగ్ మాల్ చుట్టుప్రక్కల ఉన్న చిల్లర దుకాణాలు మూతవేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా మూత పడిన చిల్లర వ్యాపార రంగాన్ని స్వాధీనం చేసుకున్న బడా కంపెనీలు తమకు ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముతూ వినియోగదారులను దోపిడీ గురిచేస్తాయి. ధాయ్‌లాండ్‌లో విదేశీ పెట్టుబడులు ప్రవేశించిన కొద్ది కాలానికే ఆ దేశంలో రిటైల్ రంగం మొత్తం వ్యాపారంలో 40 శాతాన్ని ఈ కంపెనీలు అక్రమించిచాయి. భారీ ఎత్తున చిల్లర దుకాణాలు మూతపడ్డాయి. యజమానులు నిరుద్యోగులయ్యారు. 2003లో ఎసి నీల్సన్ 'ఆసియాలో రిటైల్ వాణిజ్యం పరిస్థితి'' నివేధికను విడుదల చేసింది. ఈ నివేదికలో చైనా,దక్షిణకొరియా,మలేషియా,సింగపూర్,తైవాన్,ధాయ్‌లాండ్‌లు రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించిన తర్వాత భారీ ఎత్తున షాపింగ్ మాల్స్ పుట్టుకువచ్చాయని, తద్వారా 90 దశకంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించిన రిటైల్ రంగం చావుదెబ్బతిన్నదని స్ఫష్టం చేస్తోంది. అమెరికాలోనే కాదు, తూర్పు ఆసియా దేశాలలో కూడా జరిగింది ఇదే. వాల్‌మార్ట్,టెస్కో,కెర్రిపాల్ వంటి బహుళజాతి కంపెనీలు చిల్లర వర్తకంలో అడుగుపెట్టిన ప్రతిచోట చిరువ్యాపారులు రోడ్డున పడిన పరిస్థితి అంతర్జాతీయంగా అనుభావాలు చెబుతున్నాయి.
వాల్‌మార్ట్ వంటి బహుళజాతి కంపెనీలను రిటైల్ రంగంలోకి అనుమతించడం వల్లే చైనా దేశం త్వరిత గతిన అభివృద్ధిని సాధించిందని,ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలని మన్మోహన్ సెలవిస్తున్నాడు. కానీ చైనా అనుభవం భిన్నంగా ఉంది. వాల్‌మార్ట్ సరుకుల్లో దాదాపు 70 శాతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. చైనా వస్తూత్పత్తి రంగం ఎంత బలమైనదో అందరికి తెలిసిందే. ఇలా 70 శాతం చైనా వస్తువులతో వాల్‌మార్ట్ ఎక్కడ వ్యాపారం చేసిన బాగుపడేది చైనా లేదా వాల్‌మార్ట్(అమెరికా) గాని భారత్ కాదు. ఒక దేశంలో సంస్కరణలు అవలింబించేటప్పుడు, అదేశానికి ఏ రంగాల్లో విదేశాల నుంచి సహాకారం అవసరం
ఉంటుందో ఆ రంగాల్లోనే విదేశీ సహాకారాన్ని ఆహ్వానిస్తారు. ఇలా ఆహ్వానించబడిన కంపెనీలు కూడా స్వదేశీ కార్మీకులకే ఉద్యోగం కల్పించాలి. అలా ఆహ్వానించినప్పుడే ఏ దేశానికైనా ఉపయోగం ఉంటుంది. విదేశీ పెట్టుబడుల ద్వారా దేశంలో పారిశ్రామిక ఉత్పాదన పెంచేదై ఉండాలి. సంస్కరణలు జాతిని ఉద్దరించాలి కానీ పరాయి దేశాలకు జాతికి తాకట్టుపెట్టడం కాదు. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను మనదేశంలోకి అనుమతిస్తే ఇక్కడ జరిగేది అదే.
విదేశీ పెట్టుబడిదారులకు మనం విశ్వాసం కలిగించాలని, అప్పుడే విదేశీ పెట్టుబడులు మనదేశానికి వస్తాయని ప్రధాని అంటున్నాడు. విదేశీ పెట్టుబడిదారులేమన్నా శారీరక,మానసిక వికలాంగులా? లేక వారు భారత సమాజంలో సాంఘీక అసమానతలకు లోనవుతున్నారా? వారిలో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించడానికి. పెట్టుబడిదారుల అదుపాజ్ఞలతో నడుస్తున్న బహుళజాతి కంపెనీలు దేశాన్ని దోచుకోవడానికి ప్రవేశిస్తుంటే వాటని నివారించాల్సిందిపోయి వారికి ఎర్రతివాచీలు పరిచి స్వాగతించడం ఎవరి ప్రయోజనాలకోసం ప్రధానే సెలవివ్వాలి. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారతదేశంలో సంస్కరణలు ఇంకా వేగవంతం కావాలని తన అవేదనను వ్యక్తం చేశాడు. అంటే అమెరికా కంపెనీలకు మనదేశంలో ప్రవేశం కల్పించాలని ఆయన కోరాడు. ఆర్థిక మాంధ్యంలో చిక్కుకున్న తన దేశాన్ని ఈ బహుళజాతి కంపెనీలు బయట దేశాలతో వ్యాపారం నిర్వహించి ఆర్థిక మాంధ్యం నుంచి గట్టెకించాలని ఆయన కోరుతున్నాడు. అమెరికా పెద్దన్న మాటలకు తలొగ్గిన మన ప్రధాన్ని స్వపక్షం నుంచి విపక్షలానుంచి తుదకు దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ వెనక్కితగ్గడం లేదు. విదేశీ పెట్టుబడులు మన దేశాభివృద్ధికి, మన ప్రజలకి ఏ విధంగా, ఎంతవరకు ఉపయోగపడుతోందో అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కానీ, మరో దేశపు వత్తిడికి తలొగ్గి మన దేశాన్ని తాకట్టులో పెట్టరాదు.
విదేశీ వస్తువులకు వ్యతిరేకంగా, పాలనకు వ్యతిరేకంగా దేశం యావత్తు పెద్దఎత్తున పోరాటం నిర్వహించిన చరిత్ర మనది. అట్లాంటీ నేలపైకే విదేశీ కంపెనీలకు ఎర్రతివాచీలు పరిచి స్వాగతం పలకడం స్వాతంత్రోద్యమాన్ని, పోరాట నాయకత్వాని కించపడచడమే అవుతుంది. గాంధీ సిద్ధాంతపై నిర్మించబడ్డ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, మరీ గాంధీ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి బహుళజాతి సంస్థల ముందు మోకాలముందు నిలబడడం ఏ వారసత్వమో దేశ ప్రజలకు చెప్పాలి. గతంలో ఫ్రెంచివారు, తర్వాత ఇంగ్లీషువారు ఇలానే వ్యాపారంతో మొదలుపెట్టి తర్వాత పాలకులైన ఉదంతం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్కరణల పుణ్యమా అని మళ్ళీ విదేశీ బహుళజాతి కంపెనీలకు మన భూములను, వ్యాపారాన్నీ అప్పగించడం మన సార్వభౌమత్వాన్ని తాకట్టు పెటడమే అవుతుంది.
Subscribe to:
Post Comments
(
Atom
)

No comments :
Post a Comment