‘ఉప’నిధుల ‘స్వాహా’కారాలు!

No comments
 అరవై నాలుగు సంవత్సరాల ‘స్వతంత్ర’ భారతావనిలో దళితుల, గిరిజనుల సమస్యలు పరిష్కారం కాకపోగా, పెరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలేవీ వారి జీవితాల్లో మార్పు తీసుకొని రాలేక పోయాయి. రాష్ర్టంలో దళితులు, గిరిజ నుల జనాభా 22.08 శాతం ఉంది. 56 వేల దళిత వాడలు, 20 వేల గిరిజన ఆవాసాలు ఉన్నా యి. ఈ వర్గాల అభివృద్ధికి నామమాత్రపు బడ్జెట్‌ కేటాయింపులతో సరిపెట్టడమే కాకుండా, వాటిని కూడా వారి కోసం ఖర్చు చేయడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విఫలమౌతూ వస్తున్నాయి. షెద్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కోసం కేటాయించే ఉప ప్రణాళికా నిధులు వారి అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలనే ఆందోళన కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ 20 లక్షల దళిత, గిరిజన కుటుంబాలకు ఇండ్ల స్థలాలను ప్రభుత్వం సమకూర్చలేక పోయింది. 60 శాతం ఇండ్లకు మంచినీటి సౌకర్యం, 80 శాతం కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజి సౌకర్యం పూజ్యం. రాష్ర్టంలో 40 శాతం దళిత కుటుంబాలకు, 12 వేల గిరిజన కుటుంబాలకు విద్యుత్‌ సౌకర్యం లేదు. 15 వేల గ్రామాలకు స్మశాన వాటికలు సైతం లేవు.

షెడ్యూలు కులాల, తెగల ఉపప్రణాళిక ప్రకారం- రాష్ర్ట ప్రణాళికా బడ్జెట్‌లో వీరి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు చేయాల్సి ఉంది. అంటే రాష్ర్టంలో జనాభా నిష్పత్తి ప్రకారం దళితులకు 13.2 శాతం, గిరిజనులకు 6.6 శాతం నిధులు కేటాయించి ఖర్చు చేయాలి. కేటాయింపులు అరకొరగానే చేసినా, వాటిని కూడా ఖర్చు చేయటంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలమైంది. కేటాయింపుల్లో 7 శాతం నిధులు కూడా ఖర్చు పెట్టలేదని స్వచ్ఛంద సంస్థల సర్వేలలో బయట పడింది. దారిమళ్ళించిన నిధులతో హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు, హుస్సేన్‌సాగర్‌ ఆధునికీకరణ, జలయజ్ఞంల కోసం 4 వేల కోట్లు మళ్లించారు. 2004-5 నుంచి 2010-11 వరకు షెడ్యూల్డ్‌ కులాల, తెగల ఉప ప్రణాళికలో రూ. 25,647 కోట్లు కేటాయించవలసి ఉండగా రూ.12,476 కోట్లు మాత్రమే ఖర్చుచేసినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. మిగతా రూ.13,171 కోట్లు ఇతర రంగాలకు మళ్లించారు.

దళిత, గిరిజనుల పిల్లలు చదువుకోవడానికి, ఉద్యోగాలు పొందటానికి రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించామని, ఉచిత చదువు, హాస్టల్‌ సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా ఆచరణ అందుకు భిన్నంగా ఉంది. పాలకుల విధానాల ఫలితంగా అనేక గిరిజన జాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. గిరిజన పిల్లలలో అత్యధికులు ఇప్పటికీ విద్యకు దూరంగానే ఉంటున్నారు. గిరిజన విద్యార్థులకు గత సంవత్సరం బడ్జెట్‌లో రూ. 385.52 కోట్లు కేటాయించారు. ఖర్చు పెట్టింది మాత్రం రూ.274.57 కోట్లే.
గిరిజన సంక్షేమశాఖ పరిధిలో రాష్ర్టంలో 442 వసతి గృహాలుండగా, బాలురకు 331, బాలికలకు 111 కేటాయించారు. వీటిలో 72,420 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కొ క్క వసతి గృహంలో 2 వం దల మంది వరకు ఉండడం వల్ల వారు అవస్థలు పడుతు న్నారు. అవసర మైనన్ని మరుగుదొడ్లు, స్నానాల గదులు లేవు. ఉన్నవి కూడా నిర్వహణా లో పం వల్ల వినియోగానికి అనుగుణంగా లేవు.

గిరిజన హాస్టళ్ళ విద్యార్థుల ఎడల అధి కారులకే కాక, వార్డెన్లకు, సిబ్బందికి కూడా చిన్న చూపు ఉంది. మెస్‌ ఛార్జీల కేటాయింపులు నామమాత్రంగా ఉండటంతో పాటు, సిబ్బంది అవినీతి వల్ల నాసిరకం ఆహారమే విద్యార్థులకు అందుతోంది. ఫలితంగా డయేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారు. గిరిజన బాలికలను భయపెట్టి వారిపై కొందరు వార్డెన్లు, సిబ్బంది అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అత్యాచారానికి గురై గర్భవతులైన గిరిజన బాలికల ఉదంతాలు నిత్యం బయటపడుతూనే ఉన్నాయి. విద్యను కొనసాగించడంలో గిరిజనులు వెనుకబడి ఉన్నారు. వారు నివసిస్తున్న ప్రాంతాలలో పాఠశాలలు నామమాత్రం. చదువు కోవడానికి పట్టణ ప్రాంతాలకు పంపలేక పిల్లలను గిరిజనులు చదివించుకోలేక పోతున్నారు. ప్రాథమిక విద్యతోనే ఎక్కువ మంది గిరిజన విద్యార్థులు చదువు చాలిస్తున్నారు.

2001-10 సంవత్సరాల మధ్యకాంలో రాష్ర్ట వ్యాపితంగా 3,12,308 మంది గిరిజన బాల, బాలికలు 1వ తరగతిలో చేరినా 2009-10 నాటికి చదువు కొనసాగించిన వారి సంఖ్య 72,606కి తగ్గిపోయింది. గిరిజనులకు గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకొంటున్నది. 272 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 84, 876 మందికి విద్య, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెబుతున్నది. ఇవే కాక, ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసి 84,675 మందికి విద్య, వసతిని ఒకే చోట కల్పిస్తున్నట్లు విద్యాశాఖ తెలియచేస్తోంది. ఈ పాఠశాలల్లో 48 ప్రాథమిక పాఠశాలలు, 223 ప్రాథమికోన్నత పాఠశాలలు, 330 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ వీటిలో ప్రాథమిక పాఠశాలలు 48 మాత్రమే ఉండడం వల్ల- మొత్తం ఆశ్రమ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది.

ఈ పాఠశాలల్లోనూ సౌకర్యాలు సంక్షేమ హాస్టళ్ళకు భిన్నంగా లేవని విద్యార్థులు చెబుతున్నారు. ఇందుకు బడ్జెట్‌ కేటాయింపులు తక్కువగా ఉండడమే కారణం. అంతే కాకుండా కేటాయించిన బడ్జెట్‌లను పూర్తిగా విడుదల చేయకపోవటం, విడుదల చేసిన నిధులను పూర్తిగా ఖర్చుపెట్టటం కూడా జరగ డం లేదు. బడ్జెట్‌ కేటా యిం పులు, మంజూరు, ఖర్చు పరిశీలిస్తే, ఈ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సదుపాయా లకు, భోజనవసతికి ఏమాత్రం సరిపోదని అర్థమౌతుంది. వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టామని, అందుకు నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వప్రచారం సాగుతూనే ఉన్నా, వాస్తవంలో వీరు నిర్లక్ష్యానికి గురవు తున్నారు. వారికి కేటాయించిన నిధుల్ని కూడా దారిమళ్ళిస్తున్నారు. దళితుల జనాభా ప్రకారం బడ్జెట్‌లో కేటాయింపులు జరగడం లేదు.

స్పెషల్‌ కాంపొనెంట్‌ ప్లాన్‌ ప్రకారం ఎస్సీలకు నిధులు కేటాయించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. 2004-05 నుండి 2010-11 వరకు సబ్‌ ప్లాన్‌ ప్రకారం బడ్జెట్‌ కేటాయింపులు, ఖర్చులు, మళ్లించిన నిధులు పరిశీలిస్తే వెనుకబడిన కులాల అభివృద్ధి పట్ల పాలకుల నిర్లక్ష్యం తేటత్లెమౌతుంది. ఈ ఆరు ఏళ్ళ బడ్జెట్‌ మొత్తం రూ,1,58,313 కోట్లు కాగా, ఎస్సీలకు కేటాయించింది రూ. 25,648, విడుదల చేసింది రూ.21,309, ఖర్చు చేసింది రూ.12,476, దారి  మళ్లించినది రూ.13,171 కోట్లు. అంటే ఖర్చు చేసిన దానికంటె దారి మళ్లించిందే ఎక్కువ.

వెనుకబడిన కులాల వారు ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడి ఉండటం వలన చదువులో వారి పిల్లలు ముందుకు సాగలేక పోతున్నారు. ప్రాథమిక విద్యతోనే అత్యధికులు చదువుకి దూరమవుతున్నారు. గత 10 సంవత్సరాలలో 4,76,514 మంది పిల్లలు ఒకటవ తరగతి చేరగా, పదో తరగతికి 1,76,514 మంది మాత్రమే చేరుకోగా, దాదాపు మూడువంతుల పిల్లలు చదువు మానుకోవలసి వచ్చింది.దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడి ఉండడానికి, దుర్భరమైన జీవితాలు గడపటానికి భూ పంపిణీ జరగక పోవటమే కారణం. నేటికి 80 శాతం దాకా వ్యవసాయ భూము లు భూస్వాముల, సంపన్న వర్గాల చేతుల్లో ఉన్నాయి.

ఈ భూములు పేదల పరమైతే, ఆ సేద్యం ద్వారా వచ్చే ఆదాయం బడుగు బలహీన్వర్గాల వారి జీవితా ల్లో మార్పు తీసుకొస్తుంది. సాంస్కృతిక మార్పుతో బాటు వారి పిల్లలను చదివిం చుకోగలిగే స్థితి ఏర్పడుతుంది. భూస్వామ్య ప్రతినిధి వర్గాలైన పాలకులు భూ కామందుల వద్దనున్న భూములను పేదలకు పంచలేరని 64 సంవత్సరాల ‘స్వతంత్ర’పాలన స్పష్టంచేసింది. అన్ని కులాలలోని పేదలు ఉద్యమించి పంచుకో వడం ద్వారానే వారికి భూమిపైహక్కు ఏర్పడుతుంది. ఆ దిశగా గిరిజనులు, వెను కబడిన కులాలు, ఇతర కులాల పేదలు ఐక్యంగా పోరాటాన్ని నిర్వహించాలి.

 (సూర్య 31-3-12)

No comments :

Post a Comment