శామీకోద్యమ నాయకుడు - డా||బి.ఆర్‌.అంబేద్కర్‌

No comments
''డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌'' ఈ పేరు తలిస్తేనే దళితుల గుండెల్లో ఉత్తేజం, ఉద్వేగం కలుగుతాయి. తరతరాలుగా నిచ్చనమెట్ల కుల సమాజంలో బానిసత్వం కంటే ఘోరమైన అస్పృశ్యత కారణంగా సమాజంచే చీదరించబడుతూ అనేక అవమానాలు ఎదుర్కొంన్న ఒక అస్పృశ్యుడు భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగాడు. పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దవాడై విదేశాలలో ఉన్నత చదువులు చదివి కూడా ఈ నిచ్చెన మెట్ల కుల సమాజంలో అనేక అవమానాలను, బాధలను సహించాల్సి వచ్చింది. ఈ అమానుషమైన అస్పృశ్యతకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడాడు. అదేవిదంగా వెట్టి చాకిరీకి, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల కోసం, కనీస వేతన చట్టం కోసం, 10 గంటల పని దినాన్ని 8 గంటలకు తగ్గించేందుకు, స్త్రీ అభ్యున్నతి కోసం పోరాడాడు.
అయితే చాలా మంది అంబేద్కర్‌ను అస్పృశ్యుల నాయకుడిగా, కేవలం ఆయన అస్పృశ్యుల సమస్యల కోసం పోరాడిన వ్యక్తిగానే చూస్తారు. కానీ ఆయన అస్పృశ్యుల అభ్యున్నతి కొరకు ఎంత పోరాటం నిర్వహించాడో అంతే పోరాటాన్ని ఈ దేశంలో అణిచి వేయబడుతున్న వర్గాలైన కార్మికులు, రైతులు, స్త్రీల పక్షాన పోరాటం నిర్వహించాడు అనే విషయం చాలా మందికి తెలియదు. తెలిసిన వ్యక్తులు వాటిని మరుగున పరిచి ఆయనను ఒక అస్పృశ్యుల నాయకుడిగానే ముద్రవేశారు. అబేద్కర్‌ తరతరాలుగా జమీందారుల దౌర్జన్యాలకు, దాష్టీకాలకు గురువుతున్న  రైతులను, వ్యవసాయ కార్మికులను ఆయన చూసి చలించిపోయాడు. వారి హక్కుల సాధనకై ఆందోళన నిర్వహించాడు. 
ఆనాటి మహారాష్ట్రలోని కొంకణ ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు భూమిని దున్ని పండిస్తూంటే ఆ భూమి మీద హక్కులు మాత్రం 'ఖోటీ'లనబడే భూస్వామీ వర్గాల చేతులల్లో ఉండేవి. పెద్ద మొత్తాల్లో బీదరైత్నులుండి భూమి శిస్తులు వసూలు చేస్తూ అందులో వారు కొంత తీసుకొని, మిగతాది ప్రభుత్వినికి చెల్లించేవారు. రైతాంగం పండించే పంటలను కూడా కొంత భాగం స్వాధినం చేసుకుంటూ, రైతులను రైతూ కూలీలను బానిసలకంటే ఆధ్వానంగా చూసేవారు. ఈ 'ఖోటీ' అనబడే ఘోర దుర్భర పరిస్థితి కొన్ని దశాబ్దాల పాటు కొనసాగుతూ వచ్చింది. రైతు కూలీలను దోపిడీ చేస్తున్న యీ ఖోటీ పద్దతిని నిర్మూలించాలని అంబేద్కర్‌ కంకణం కట్టుకున్నాడు. 1929 ఏప్రిల్‌ 14న రత్నగిరి జిల్లా చిప్లాన్‌లో జరిగిన రైతాంగ మహాసభలో అంబేద్కర్‌ రైతాంగాపు రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్న ఖోటీ పద్దతికి తక్షణమే స్వస్తి చెప్పాలని ఆ ఖోటీ పద్దతికి వ్యతిరేకంగా రైతాంగాన్ని కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపాడు. రత్నగిరి, సతారా, నాసిక్‌, ప్రాంతాల నుండి వేలాఏది మంది రైతాంగాన్ని సమీకరించి, పెద్ద ఉరేగింపుతో బొంబాయి శాసన సభ వరకు వారిని తీసుకెళ్లి ఖోటీ నిర్మూలన గూర్చి ఆందోళన చేసారు. నాటి బ్రిటీష్‌ ప్రభుత్వంపై ఖోటీ నిర్మూలన కోసం, రైతాంగపు స్వేచ్ఛా జీవనం కోసం ఎంతో ఒత్తిడి తెచ్చారు. అంబేద్కర్‌ ఆందోళన ఫలితంగా 1937 సెప్టెంబర్‌ 17న ఖోటీ నిర్మూలన బిల్లును ప్రవేశపెట్టించడంలో విజయం సాధించాడు. అంబేద్కర్‌ చేసిన ఆందోళన ఫలితంగా 1949లో ఖోటీ నిర్మూలన బిల్లు చట్ట రూపంలో అమలులోకి వచ్చింది. దాని ఫలితంగా భూస్వాములకు కొంత నష్టపరిహారాన్ని చెల్లిస్తూ రైతులకు భూమిని దున్నుకునే స్వేచ్ఛ హక్కులను ప్రభుత్వం కల్పిచింది. ఈ విధంగా దున్నే వాడిదే భూమి అనే నినాదానికి అంబేద్కర్‌ ఆద్యుడయ్యాడు. 
అలాగే మహార్‌ కులాల ప్రజలు రాత్రనకా పగలనక వెట్టిచాకిరి చేయడం, ఊళ్లో ఉన్న అగ్రకులాల  పెద్దలను ఒక స్థలం నుండి మరో స్థలానికి భూజాలమీద కావడీల మీద మోసుకెళ్లడం, చచ్చిన శవాలను పారేయడం, గ్రామాన్ని శుద్ధి చేయడం వంటి అమానుష దూరాచారాలు చేయవలసి ఉండేవి. ఈ వెట్టి పనులకు గానూ చారెడు గింజలు పండించుకోవడానికి కొద్దిగా భూమిని ఉపయోగించుకోనిచ్చేవారు దానినే ''మహార్‌వతన్‌'' అని పిలిచేవారు. ఈ వెట్టి చేసే జనానికి చారెడు గింజలు తప్ప వాళ్ళు ఏ ఇతర హక్కులు కలిగి ఉండేవారు. కాదు. కానీ  దేశ్‌పాండే, దేశ్‌ముఖ్‌, కులకర్ణి, పటేల్‌ తలాతి మొదలైన వాళ్ళు ఏ పన్నులు  కట్టకుండా ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకొని నిరుపేద కూలీల చేత వెట్టి పనులు చేయించుకొనేవారు. వారిచేతనే పన్నులు కూడా కట్టించుకునేవారు. భూమి మీద వచ్చే ఫలితాలను మాత్రం ఉన్నత కూలాల వారు అనుభవించేవారు. ఇలాంటి అమానుష దురాచాలైన వెట్టి పనులను వ్యతిరేకిస్తూ ప్రజానీకాన్ని కూడగట్టి డా||బి.ఆర్‌. అంబేద్కర్‌ ఆందోళన నిర్వహించి ''మహార్‌వతన్‌'' నిర్మూలనకు కృషిచేశాడు. ఫలితంగా వెట్టిచాకిరీకి గురైన వ్యవసాయ కూలీలకు భూస్వాముల కబంధ హస్తాలనుండి విముక్తి లభించింది. 
ఇదే సందర్భంలో 1938 డిసెంబర్‌లో శ్రామికులు సమ్మెలు చేయడానికి వ్యతిరేకంగా పారిశ్రామిక వివాదం గురించిన ఒక బిల్లు బొంబాయి విధానసభలో ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లు ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితిలో శ్రామికులు హర్తాళ్‌ చేయడం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. ఈ బిల్లు శ్రామికుల పాలిట శాపం అని డా||బి.ఆర్‌ ఆంబెద్కర్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. ''స్వాతంత్య్రం కోసం సహాయం నిరాకరణ ఒక పవిత్రమైన హక్కు అయితే శ్రామికులకు హర్తాళ్‌ చేసే హక్కు కూడా అంతే పవిత్రమైనదని'' ఈ బిల్లు శ్రామికులకు పౌరస్వేచ్చని నేలరాసే చట్టం అవుతుందని అన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మజ్‌దూర్‌ యూనియన్‌, స్వతంత్ర మజ్‌దూర్‌ పార్టీలు రెండూ కలిసి ఈ చట్టానికి విరుద్దంగా హర్తాల్‌ చేయడానికి యుద్ధ ఢంకా మోగించారు. ఈ సందర్భంగా జరిగిన హర్తాళ్‌లో పరులేకర్‌, డాంగే, నింబ్‌కర్‌ మొదలైన నాయకులతో పాటుగా అంబేద్కర్‌ పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సుమారు ఎనభై వేల మంది శ్రామికులను సంభోదిస్తూ అంబేద్కర్‌ ''శ్రామికుల చేతికి పరిపాలనాధికారం రానంతవరకూ వారి సమస్యలు పరిష్కరించబడవు'' అని పిలుపు నిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ''కార్మిక, కర్షకుల పాలనలోనే నా ప్రజలు యీ దేశంలో సామ్యవాదాన్ని స్థాపించగలరు. అని పెర్కోన్నాడు. 
డా||బి.ఆర్‌ అంబేద్కర్‌ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నకాలంలో కూడా (1942 నుండి 1946) శ్రామికుల ప్రయోజనార్థం అనేక చట్టాలు చేశాడు. టీ తోటల్లో పనిచేసే శ్రామికుల పరిస్థితి మెరుగుపడాలని ఇండియన్‌ టీ కంట్రోలు సంస్కరణ బిల్లుని ఆమోదింపచేశారు. మిల్లులో పనిచేసే కార్మికులకు యుద్ధకాలంలో నష్టం వాటిల్లితే కార్మికులకు నష్టపరిహారాన్ని యాజమాన్యమే చెల్లించే విధంగా బిల్లు అమలయ్యేటట్టు చూశాడు. గనుల్లో పనిచేసే గర్భవంతులైన మహిళా శ్రామికులకు ప్రసవకాలపు సెలవులున్ని. జీతం ఏర్పాటును కలిగించే బిల్లును కూడా ఆయన ఆమోదింపచేశాడు. ఫలితంగా1945 మార్చిలో గనుల్లో పనిచేసే మహిళా కార్మికుల ప్రసవకాల గైరుహాజరు సెలవు విషయంలో ముఖ్యమైన బిల్లుని పాసు చేయించారు. 1846 ఫిబ్రవరిలో ఆయన 10 గంటల పనిదినాన్ని 8 గంటల పనిదినంగా తగ్గించటానికి బిల్లును పాసు చేయించి భారతదేశపు కార్మికుల జీవితంలో విప్లవాత్మకమైన సంస్కరణను తెచ్చారు. 1943 సెప్టెంబర్‌ 9న ప్లీనరీ లేబర్‌ పరిషత్తులో పారిశ్రామీకరణ మీద ఉపన్యాసం ఇస్తూ ''పెట్టుబడిదారీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రెండు విషయాలు తప్పకుండా ఉంటాయని, పనిచేసే వాళ్ళు బీదరికంలో ఉండవలసి వస్తుంది. పనిచేయని వారి దగ్గర లెక్కపెట్టలేనంత పెట్టుబడి పొగవుతుందని తెలిపారు. ఒక వైపు రాజకీయ అసమానత్వం రెండోవైపు ఆర్థిక వ్యత్యాసాలు. శ్రామికులకి కూడు, గూడు, గుడ్డ, ఆరోగ్యమైన జీవితం లభించనంతవరకు, విశేషించి గౌరవంగా తలెత్తుకుని నిర్భయంగా జీవితాన్ని గడపనంతవరకు స్వాతంత్య్రానికి ఏమి అర్ధం లేదు'' అన్నాడు. భారతీయ కార్మిక సమాఖ్య వారు 1943 మే నెల 11వ తేదిన బొంబాయిలో ఏర్పాడు చేసిన ఉత్సవాల్లో  డా||బి.ఆర్‌ అంబేద్కర్‌ పాల్గోని మాట్లాడుతూ ''కార్మిక ఉద్యమంలో కావలసింది ప్రయోజన శూన్యమైన పైపై మెరుగులు కాదు. కార్మిక నాయకులు తమ తమ విభేదాలు మరచి, ఒక ఐక్యవేదికగా ఏర్పడి పెట్టుబడి దారి విధానాన్ని ఎదుర్కొవాలని అన్నాడు. కార్మికులు ఉద్యమించి బ్రిటన్‌లో రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని చేజిక్కించుకోగలిగారు. బ్రిటన్‌లో జరిగినట్టుగానే భారతీయ కార్మి వ్యవస్థ ఈ దేశంలో కూడా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని. అందుకు కార్మిక నాయకులంగా ఐక్యంగా సంఘటితం కావాల్సిన అవసరం ఎంతయిన  ఉందని పేర్కోన్నాడు. కార్మిక వర్గం యొక్క శక్తి సామార్ధాలమీదనే ఈ దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని పేర్కొన్నాడు. ఆయన కార్మిక వర్గం యొక్క శక్తి సామార్ధాలను గుర్తించి మీరు అధికారాన్ని చేపట్టేందుకు సంఘాలు కట్టి ఐక్యంగా ఉద్యమించండి అని పిలుపునిచ్చాడు. 
ఈ దేశంలో వున్న ప్రత్యేక పరిస్థితుల్లో కుల,వర్గ పోరాటాలు రెండూ జరగాలని అంబేద్కర్‌ అశించారు. అయితే సామాజిక సమస్య పరిష్కారమైతేనే ఆర్థిక సమస్యపై పోరాటం నిర్వహించడానికి ప్రజలు ఏకమౌతారని ఆయన తన వాదనను వినిపించాడు.  కానీ వర్గపోరాటాలను విస్మరించి, కేవలం సామాజిక పోరాటాలు మాత్రమే నిర్వహించాలని ఆయన చెప్పినట్లు చాలామంది దళిత మేధావులు ఆయన సిద్ధాంతాన్ని వక్రికరిస్తునారు. ఆయన జీవించి ఉన్న కాలమంతా  వర్గ-కుల సమస్యలపై ఆయన పోరాటం నిర్వహిచాడు. చాలామంది దళిత మేధావులు పోరాటాలు నిర్వహించకుండా కేవలం రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమౌవుతాయని ప్రచారం నిర్వహిస్తున్నారు. కులపరంగా విభజించబడిన భారత్‌ వంటి పరిస్థితుల్లో దోపిడికి గురవుతున్న ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు వర్గపోరాటాలు నిర్వహిస్తూనే సామాజిక న్యాయం కోసం కూడా పోరాటం చేయాలి. ఈ రెండింటి సమన్వయం ద్వారా దోపిడికి గురవుతున్న కులాల-వర్గాలను సంఘటితపర్చడం అవసరం. అంటే అంబేద్కరిజాన్ని, మార్కిజాన్ని సృజనాత్మకంగా అన్వయించి కుల-వర్గపోరాల్ని జతపరచి అగ్రకుల భూర్జువా, భూస్వామ్య వర్గాలపై పోరాటం నిర్వహించడం ద్వారానే ఈదేశంలో ఉన్న కుల-వర్గ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనగలము. కానీ నేడు ఆయన వారసులం అని అనుకుంటున్న వాళ్ళు ఏ ఆశయాల కోసం డా|| బి.ఆర్‌ అంబేద్కర్‌ గారు పోరాటం చేశాడో వాటిని విస్మరిస్తున్నారు. అంబేద్కర్‌ ఆశయాలు కొనసాగించడం అంటే కేవలం ఆయన జయంతికి, వర్థంతికి నివాళ్ళు అర్పించడమే అనుకుంటున్నారు. ఆయన జయంతి వర్థంతిలలో తప్పా ఆయన పోరాటాలను గుర్తుకు తెచ్చుకోవడం లేదు. డా|| అంబేద్కర్‌ 119 జయంతి సందర్భంగానైనా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి పునరంకితమవుదాం.

No comments :

Post a Comment