అణు విలయానికి ఆహ్వానమా?
ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన, ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం చూపే, పర్యావరణాన్ని కాలుష్యంతో నింపివేసే అణువిద్యుత్ కేంద్రాల నిర్మాణాలను నిరసిస్తూ ప్రపంచ వ్యాపితంగానూ ముఖ్యంగా మన దేశంలోనూ వ్యతిరేకత, ఆందోళనలు పెద్దఎత్తున వ్యక్తమౌతున్నాయి. గత సంవత్సరం మార్చినెలలో జపాన్ దేశంలో సంభవించిన సునామీ, భూకంపాలకు దైచీ అణువిద్యుత్ కేంద్రంలో సంభవించిన వినాశనం ప్రపంచ ప్రజలను ఉలిక్కిపడేట్లు చేసింది. దీనితో అన్ని దేశాలలోనూ అణవిద్యుత్ వ్యతిరేక నిరసనాందోళనలు తీవ్రమయ్యాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాపితంగా 30 దేశాల్లో 443 అణురియాక్టర్లు విద్యుదుత్పత్తి సాగిస్తుండగా పుకిషిమాలోని అణువిద్యుత్తు కేంద్రాలలోని పరిణామాల అనంతరం వివిధ దేశాలలోని ప్రజల ఆందోళనల ఫలితంగా ఈ కేంద్రాలలో కొన్నింటి మూసివేతలు, మరికొన్నింటి పాక్షిక మూసివేతలు, మొత్తంగా సమగ్ర సమీక్షలకు సిద్దమౌతున్నాయి. దేశ భద్రతను సైతం నడివీధిలో వేలం వేయటానికి సిద్ధపడిన మన పాలకులు మాత్రం మన దేశంలో అణువ్యవస్థ దుర్భేద్యమైనదని ఢంకా బజాయిస్తున్నారు. ఇందుకు పూర్వరంగం అమెరికాతో సహకార అణు ఒప్పందం; అణు ప్రమాద నష్టపూరిత చట్టాలను నిండు పార్లమెంటులో నిస్సంకోచంగా ఆమోదించుకోవటంలో వివిధ పాలక వర్గ పార్టీలన్నీ 'చేయి' కలిపాయి. తదనుగుణంగా వాటి నిర్మాణాలకు పాలకులు వేగిరపడుతున్నారు.
మనదేశంలో 1960లో నిర్మించిన తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం మొదలుకొని ఇప్పటికి మొత్తంగా ఆరు అణు విద్యుత్ కేంద్రాలలో 20 అణు రియాక్టర్ల ద్వారా 4780 మెగావాట్ల విద్యుదుత్పాదన జరుగుతున్నది. ఇంకా, మహారాష్ట్రలోని జైతాపూర్ (9900 మె.వా) హర్యానాలోని గోరఖ్‌పూర్ (2800 మె.వా), గుజరాత్‌లోని మిథివిర్ధి (6000 మె.వా), మధ్యప్రదేశ్‌లోని ఛుట్కా (1400 మె.వా), ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడ (6000 మె.వా) తమిళనాడులోని కూడంకుళం (9200 మె.వా) అణువిద్యుత్ కేంద్రాలు నిర్మాణంలో వివిధ దశలలో నుండగా, మరికొన్ని అణు విద్యుత్ కేంద్రాలు ప్రతిపాదనల దశలో వున్నాయి. ప్రజల నిరసన, ఆందోళనల నేపథ్యంలో ఇటీవల పక్షిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం 4800 మె.వా స్థాపిత స్థామర్థ్యంతో తూర్పు మిడ్నపూర్ జిల్లా హరిపూర్‌లో నిర్మించ తలపెట్టిన అణువిద్యుత్ కేంద్రాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించింది.
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని కుడంకుళం అణు విద్యత్ కేంద్రానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసన ఆందోళనలు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో తొలిదశ నిర్మాణం పూర్తిచేసుకున్నది. తిరునెల్వేలి జిల్లాలోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఒప్పందం భారత రష్యా ప్రధాన మంత్రుల మధ్య 1988లో జరిగింది. తొలుత ఈ విద్యుత్ కేంద్రాన్ని కేరళ తీరంలో నెలకొల్పాలని ప్రయత్నించినారు కానీ, ప్రజావ్యతిరేకత, ప్రతిఘటనల ఫలితంగా 2003 నాటికి తమిళనాడు తీరంలోని కూడంకుళంలో చివరికి ఖాయం చేశారు.
ఈ అణు విద్యుత్ కేంద్రం పట్ల తమిళనాడులోనూ ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని తిరునెల్వేలి, కన్యాకూమారి, తూత్తుకుడి జిల్లాల ప్రజానీకం, వివిధ ప్రజాసంఘాలు ఆదినుండీ తమ భయాందోళనలను, వ్యతిరేకతను వ్యక్తంచేస్తూ వస్తున్నప్పటికీ వాటిని బేఖాతరుచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అణువిద్యుత్ కేంద్ర తొలిదశ నిర్మాణాలను కొనసాగించి పూర్తిచేశాయి. 13,700 కోట్ల వ్యయం అంచనాతో నిర్మిస్తున్న ఈ అణు విద్యుత్ కేంద్రంలో 1000 మె.వా సామర్థ్యంతో రెండు యూనిట్ల నిర్మాణం దాదాపు పూర్తికావస్తున్నది. మరో ఆరు యూనిట్ల నిర్మాణం జరగవలసివుంది. ఈ సంవత్సరం డిసెంబర్‌లో మొదటి యూనిట్‌లో విద్యుదుత్పాదనకు ఎస్.పి.సి.ఎల్ సన్నాహాలలో వుంది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న కూడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని తమిళనాడు రాష్ట్రంలోని అధికార ఎఐడిఎమ్‌కె, ప్రతిపక్ష డిఎంకె పార్టీలతో సహా ఇతర పాలక వర్గ పార్టీలన్ని స్వాగతించినవే, సానుకూలంగా వ్యవహరించినవే! తమిళనాడులో అధికారంలోనున్న ఎఐడిఎంకె పార్టీ అధినాయకురాలు జయలలిత ఈ అణువిద్యుత్ కేంద్ర నిర్మాణంలో అన్ని రకాలైన భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లూ; ఈ ప్రాంతం 'భూకంప మండలం-2' లో వున్న కారణంగా భూకంపాలకు గురయ్యే ప్రమాదం లేదనీ, నిశ్చితంగా వుండవచ్చుననీ ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కూడా! అయినప్పటికీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు, ఆందోళన కొనసాగింది.
జపాన్‌లోని పుకిషిమా అణువిద్యుత్ కేంద్ర విషాద పరిణామాల తర్వాత దేశంలో నిర్మాణంలోవున్న అణువిద్యుత్ కేంద్రాలన్నింటితోపాటు కూడంకుళం అణు విద్యుత్ కేంద్ర ప్రాంతంలోనూ మరింత ఆందోళన అధికమైంది. 'అణు విద్యుత్ కేంద్ర వ్యతిరేక పోరాట కమిటీ'గా ఏర్పడిన ఈ ప్రాంత ప్రజానీకం ఆగస్టు 15 నాటికే వివిధ గ్రామ సభలు జరిపి, తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. విజ్ఞప్తులు, ధర్నాలు, నిరసనలు ప్రకటించారు. సెప్టెంబర్‌లో వారి ఆందోళనను తీవ్రతరం చేశారు. అణు విద్యుత్ కేంద్ర ప్రభావిత ప్రాంతంలోని వివిధ గ్రామాలకు ప్రాతినిధ్యం వహించే 127 మంది ఆందోళన కారులు అణు విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కూడంకుళం సమీపంలోని ఇందితకరాయ్ గ్రామంలో సామూహిక నిరవధిక నిరాహారదీక్ష చేబూని 12 రోజుల పాటు సాగించారు. ఈ ఆందోళనలు సాగిన కాలమంతటా తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాలో విద్యాసంస్థలను బహిష్కరించి విద్యార్థులు ఈ ఆందోళనల్లో భాగస్వాములయ్యారు. ఈ జిల్లాల మత్య్సకారులు తమ జీవనోపాధి అయిన చేపలవేటను ప్రక్కనబెట్టి అణువిద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కుల, మతాతీతంగా ప్రజలంతా ఒక్క గొంతుతో ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఆందోళనకారులతో కూడిన వివిధ ప్రజాసంఘాల, పార్టీల ప్రతినిధి బృందం అక్టోబర్ 7వ తేదీన ప్రధానిని కలిసి అణువిద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయాలనే తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం పట్ల కేంద్ర ప్రభుత్వం నిశ్చయాత్మకంగా వుండటంతో 'పోరాట సమితి' తన ఆందోళనను ఆక్టొబర్ 9 నుండీ తిరిగి ప్రారంభించి ఉదృతం చేసింది. అక్టోబర్ 13 నుండి కుడంకుళం అణువిద్యుత్ కేంద్రంలో పనులేవి సాగనివ్వకుండా, బయటనుండి కార్మికులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఎవ్వరినీ లోనికి వెళ్ళనీయకుండా దిగ్భందించారు. రోజుల తరబడి ప్రజలు వంతులవారిగా రేయింబవళ్ళూ అణువిద్యుత్ కేంద్రానికి దోవతీసే రోడ్లన్నింటిపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఒక వైపు ప్రపంచ వ్యాపితంగా ప్రమాదకరమైన అణువిద్యుత్‌కు వ్యతిరేకంగా ప్రజానీకం అందోళనలు నిర్వహిస్తుంటే భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాత్రం అణువిద్యుత్‌ను స్వాగతిస్తూ మాట్లాడడం దేశ ప్రజానీకాన్ని విస్మయానికి గురిచేసింది. అబ్దుల్ కలాం కుడంకుళం ప్లాంటును సందర్శించి ప్రభుత్వం తరపునా, కంపెనీ తరపునా వకాల్తా పుచ్చుకుని ప్లాంటులో భద్రతా ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చాడు. సమస్త భద్రతా అంశాలను పరిగణలోని తీసుకుని ప్లాంటు నిర్మిస్తున్నారని, ప్లాంటు భూకంప కేంద్ర పాయింటుకు 1300 కి.మీ దూరంలో, సముద్ర మట్టానికి 13.5 మీటర్ల ఎత్తులో ఉందని, ప్లాంటుకు సంబంధించిన భద్రత విషయంలో ఆందోళన అనవసరమని సెలవిచ్చాడు.
జపాన్‌లో భూకంపాలు సహజం. కనుక భూకంపం తట్టుకునేలా ప్లాంటు నిర్మించారు. సునామీని తట్టుకోవడానికి పది మీటర్ల ఎత్తున రక్షణ గోడ నిర్మించారు కానీ సునామి అలలు ఇరవై మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. పుకుషిమా వద్ద విద్యుత్ సరఫరా విఫలమైతే ఆటోమేటిక్‌గా ప్రారంభమయ్యే జరరేటర్లు ఉన్నాయి భూకంపం వచ్చిన వెంటనే ప్లాంటు పనిచేయకుండా ఆగిపొయ్యే ఏర్పాట్లు ఉన్నాయి అయినా పెద్ద ప్రమాదం సంభవించింది. సునామీ అలల ద్వారా వచ్చిన సముద్రనీటిలో జనరేటర్లు నిండా మునిగిపోవడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడలేదు. దానితో కూలింగ్ వ్యవస్థ పని చేయడం మానేసింది. ఫలితంగా రియాక్టర్లలో ఇంధనం వేడెక్కి కరిగిపోయి బైటికి లీకు కావడంతో పెద్ద ఎత్తున రేడియేషన్ వాతావరణంలోకి విడుదలయింది. కుడంకుళం వద్ద ఏ కారణం వల్లనైనా విద్యుత్ సరఫరా ఆగిపోతే జనరేటర్లు ఉన్నాయని కలాం తెలిపాడు. జనరేటర్లు మహా అయితే కొద్ది గంటలపాటు మాత్రమే విద్యుత్ అందిస్థాయి తప్ప నిరంతరాయంగా సూదీర్ఘకాలం పాటు విద్యుత్ అందించలేదు. ఆ తర్వాత ఏమిటన్నది సమాధానం లేదు. ''అంతా సవ్యంగా ఉంది'' అని భరోసా ఇవ్వడం వేరు నిజంగానే అంతా సవ్వంగా ఉండటం వేరు అని పుకిషిమా ప్రమాదం తెలియజెప్పింది పుకిషిమా అణు విద్యుత్ ప్లాంటును పనిచేయకుండా చేసి, పూడ్చిపెట్టి, పరిసరాలు శుభ్రం చేయడానికి కనీసం 30 సంవత్సరాలు పడుతుందని జపాన్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. కుడంకుళం వద్ద సైతం అనుకోని ప్రమాదాలు సంభవించవన్న గ్యారంటి లేదు. మన కన్నా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో ముందంజ సాధించిన జర్మనీయే అణు విద్యుత్ వల్ల ప్రమాదం లేదని గ్యారంటీ ఇవ్వలేక అణువిద్యుత్ వినియోగాన్ని రద్దు చేసుకోగా అంతకంటే మెరుగైన వ్యవస్థలు ఇండియా వద్ద ఉన్నాయని భావించగలమా?
ప్రపంచ దేశాల 'వెనకడుగు' - భారత పాలకుల బరితెగింపు:
ప్రమాదరహితంగా అణువిద్యుత్ కేంద్రాల నిర్వహణ సాధ్యంకాదనే విషయాన్ని మనదేశంతో సహా వివిధ ప్రపంచ దేశాల్లో సంభవించిన ప్రమాదాలు నిర్వివాదంగా రుజువుచేస్తున్నాయి. 1984లో రష్యాలోని చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రేలుడులో వేలాదిమంది మృత్యువాతపడగా, దాని నుండి వెలువడిన అణుధార్మిక దుష్పలితాలను ఆ దేశ ప్రజలు ఈనాటికీ అనుభవిస్తున్నారు. అనాటి నుండి మొదలుకొని, ఈ సంవత్సరం పుకిషిమా అణువిద్యుత్ కేంద్ర విలయం వరకు అణువిద్యుత్ కేంద్ర ప్రమాదాల జాబితా చాలా పెద్దదే వుంది. వీటి ఫలితంగా అనాటికి జరిగినే ప్రాణ, ఆస్థి నష్టమేకాక, వాటినుండి వెలువడే అణుధార్మికతతతో ఈనాడేకాగ రానున్న తరాలుకూడా తీవ్ర దుష్బ్రభావాలు ఎదుర్కొనున్నాయి. పుకుషిమా అణువిద్యుత్ కేంద్ర వినాశనం అనంతరం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఎఐఇఏ) నిపుణుల బృందంతో నిర్వహించిన అధ్యయనంలో సునామీలాంటి
ఉత్పాతాల్ని సమర్థంగా కాచుకునే వ్యవస్థ ఇప్పటికింకా ఏర్పాటు కాలేదని తేల్చిచెప్పింది. సునామీ, భూకంపాలవంటి ఉత్పాతాలు సంభవించినపుడు తక్షణ నిర్ణయాలు తీసుకోలేని సంక్లిష్ట అధికార వ్యవస్థలు అవరోధంగా మారాయని తన నివేధికలో పేర్కొంది.
పుకిషిమా ఘోర పరిణామాలనంతరం జపాన్, తన దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలన్నింటినీ పునస్సమీక్ష చేయాలని నిర్ణయించింది. 2022 నాటికి జర్మనీ, తన దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలన్నింటినీ మూనివేయాలని, 2034 నాటికి దశలవారిగా స్విట్జర్లాండ్ తమ దేశంలోని అణు విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా ఆపివేయాలని నిర్ణయించుకోగా, అణువిద్యుత్ కేంద్రాల నిర్వహణపై ఇటలీలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలంతా వాటి రద్దునుకోరుతూ తీర్పునిచ్చారు. ఈ పరిణామాలనంతరం జపాన్ సైతం అణువిద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నది. సెప్టెంబర్ 19న జపాన్ రాజధాని టోక్యోలో 'అణువిద్యుత్‌కు వీడ్కోలు పలకండంటూ'' 60 వేల మంది పౌరులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు.
వివిధ రంగాలలో ప్రపంచాలనే శాసించే అభివృద్ధిని సాధించామంటున్న అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర సామ్రాజ్యవాద దేశాలన్నీ తమతమ దేశాలలోని అణువిద్యుత్ కేంద్రాలలో సంభవించే ప్రమాదాలనే నివారించలేక చేతులెత్తివేస్తూండటాన్ని మనం గమనించవచ్చు. ఆయా దేశాలలో వీటిపట్ల ప్రజలనుండి వ్యక్తమౌతున్న వ్యతిరేకతల కారణంగా అవి తమ దేశంలోని అణువిద్యుత్ కేంద్రాల మూసివేతలకో, పాక్షిక మూసివేతలకో, పునస్సమీక్షలకో పూనుకుంటూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారిస్తున్నాయి. అత్యున్నత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నామన్న దేశాలే కల్పించలేని భద్రతను అణువిద్యుత్ కేంద్రాల విషయంలో మన పాలకులు తాము కల్పిస్తామనటం ప్రగల్భాలాలు పలకటమేకాదు. ప్రజలను నిలువుగా వంచించటమే.
ఈ నేపథ్యంలో మనదేశ ప్రజల అవసరాల కనుగుణమైన దేశీయ విద్యుత్ విధానాన్ని రూపొందించాలని, దేశ ప్రజల జీవితాలలో పెను విషాదాన్ని నింపే అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణం సాగిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని నిలిపివేయాలని, మన దేశంలో లభ్యమయ్యే ప్రమాద రహితమైన జల,వాయు, సూర్యరశ్మి, గ్యాస్ తదితర వనరులపై అధారపడి విద్యుత్ అవసరాలను అందుకోవాలని విద్యుత్‌ను ప్రజా అవసరాలకు రైతాంగాని, దేశీయ పరిశ్రమలకు ప్రాధాన్యతా క్రమంలో అందించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు, ప్రజాతంత్ర వాదుల, దేశభక్తియుత శక్తులు ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
సూర్య 09-10-2012
Subscribe to:
Post Comments
(
Atom
)

No comments :
Post a Comment