ప్రమాదంలో బాల్యం

No comments

అరవెైఐదేళ్ళ స్వాతంత్య్రంలో ‘నేటిబాలలే రేపటి సంక్షోభాల బాధితులు’ అయ్యారు. మక్కుపచ్చలారని బాల్యాన్ని దేశ ఆర్థిక పరిస్థితులు, పౌష్ఠికాహార లోపం, అవిద్య, లింగవివక్ష, ఒత్తిడితోకూడిన చదువులు ఉక్కిరిబిక్కిరిచేస్తూ మొగ్గలోనే తుంచివేస్తున్నాయి. దేశ భావితరాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో వీధి బాలలు, బాల కార్మికులు, పెరిగి పోతున్నారు. 1959 నవంబర్‌ 20న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమితి బాలల హక్కుల ప్రకటనను రూపొందించింది. ఈ హక్కుల ప్రకటనను ఆమోదిస్తూ భారతదేశంతో పాటు 191 దేశాలు సంతాకాలు చేశాయి. వివిధ దేశాలలోని పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడానికి, పరస్పర అవగాహనను పెంచుకోవడానికి బాలల దినోత్సవాన్ని రూపకల్పన చేసింది. మనదేశం ఈ బాలల దినోత్స వాన్ని దేశ ప్రథమ ప్రధాని చాచా నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహిస్తోంది.

ఆయన బాలల కోసం అనేక విధానాలను అవలంభిచారు కానీ అనంతర పాలకులు వాటిని విస్మరించి బాలలపట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు గడిచినా మన ప్రభుత్వాలు బాలల హక్కుల పట్ల వారి భవిష్యత్తు పట్ల సరెైన ప్రణాళికలు రూపొందించలేకపోతున్నాయి. బాలల హక్కుల కోసం నామమాత్రంగా చేసిన  చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో మూడవవంతు భాగాన్ని బాలలు ఆక్రమించారు. ప్రపంచ వ్యాపితంగా దాదాపు 6 కోట్ల మంది వీధి బాలలు ఉండగా ఒక్క మన దేశంలోనే 1 కోటి 80 లక్షల మంది ఉన్నారు. దేశంలోని 30 కోట్లమంది బాలల్లో 6 కోట్ల మంది కార్మికులుగా మగ్గుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఒక స్వచ్ఛంద సంస్థ లెక్క ప్రకారం ప్రతి 10 మంది బాలలో ఇద్దరు బాలకార్మికులు. మూడింట ఒక వంతు పోషకాహారలేమితో కునారిల్లుతున్నారు.

గత ఏడాది మన దేశంలో 3 లక్షల 80 వేలమంది విటమిన్‌ డి లోపం వల్ల, 15.2 శాతం పిల్లలు శ్వాస సంబంధ వ్యాధుల వల్ల, 7 శాతం మంది పిల్లలు అతిసార వల్ల మరణించినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. దేశంలో 50 శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారని, వారిలో దాదాపు 70 శాతం మంది రక్తహీనతతో బాదపడుతున్నారని తెలుస్తోంది. ప్రపంచంలో మన దేశంకంటె వెనుకబడిన దేశాలు బాలల రక్షణపట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే మనం నిర్లక్షంగా వ్యవహరిస్తున్నాము. ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్న భారతావనిలో పాలకుల అవినీతి వల్ల ఏడున్నర కోట్లమంది బాలలు ఆకలితోనే గడుపుతున్నట్లు యునిసెఫ్‌ లెక్కలు చెబుతున్నాయి. గోదాముల్లో నిల్వలుగా పేరుకుపోయిన ధాన్యంతో నిరుపేదల ఆకలి తీర్చమని గతంలో సుప్రీంకోర్టు సలహా ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పనికి ఆహార పథకం, మధ్యాహ్న భోజన పథకం వంటివి ఆర్భాటంగా ప్రారంభమైనా క్రమేణా దళారీల జేబులు నింపడానికే పనికొస్తున్నాయి.
బాలికల పరిస్థితి మరింత భయందోళనకు గురిచేస్తున్నది.
దేశంలో బాల, బాలికల నిష్పత్తి తగ్గిపోతుంటే, బాలికలకు రక్షణలేకుండా పోతుంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో ప్రకారం గత సంవత్సరం దేశంలో 7వేల 58 మంది బాలికలు అత్యాచారానికి గురయినట్లు తెలుస్తుంది. అంటే ప్రతిరోజు దాదాపు 19 మంది బాలకలు అత్యాచారాలకు గురవుతున్నారు. వారిపెై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిలో అత్యధికులు బంధువులే ఉంటున్నట్లు తెలిపింది. అత్యాచారానికి గురెైన బాలికలు సమాజానికి దూరమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో నిలువనీడలేక, సరెైన రక్షణలేక పట్టణాలకు వలసవచ్చిన పిల్లలను అరాచక మూకలు మాయ మాటలు చెప్పి ఆశ్రయం కల్పించి వారిని వేశ్యా వాటికల్లో అమ్ముతున్నాయి. అనధికార లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 20 లక్షలమంది బాలవేశ్యలున్నట్లు తెలుస్తోంది. వారి పునరావాసానికి ప్రభుత్వం నామమాత్ర కమిటీలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వారిని రక్షించలేక పోతోంది.

దేశంలో విద్య, జనాభాలో 80 శాతంపెైగా ఉన్న బడుగు బలహీన వర్గాల బాలలకు అందని ద్రాక్షగానే మారిపోయింది. 14 సంవత్సరాలలోపు బాలలకందరికి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని చట్టం చేసినప్పటికీ అది అమలుకు నోచుకోవడం లేదు. బడిలో చేరిన ప్రతి 100 మంది పిల్లల్లో దాదాపు 70 మంది పిల్లలు మాధ్యమిక విద్య పూర్తిచేసుకోకముందే డ్రాపౌట్‌కు గురవుతున్నారని ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి. డ్రాపౌట్‌కు గురవుతున్న బాలల్లో 80 శాతం మంది బిసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల పిల్లలు, వారిలో కూడా 60 శాతం మందికి పెైగా బాలికలే ఉంటున్నారు. సర్వశిక్షా అభియాన్‌ తాజా లెక్కల ప్రకారం మన రాష్ర్ట మొత్తం జనాభాలో బడి వయసుగలవారు 1 కోటి 55 లక్షల 75 వేల మంది. వీరిలో పాఠశాలల్లో వివిధ స్థాయిల్లో చేరిన వారు 1కోటి 36 లక్షల 91 వేల మంది. ఇంకా 18 లక్షల 83 వేల మంది విద్యార్థులు బాలకార్మికులుగా మగ్గుతున్నారు. నూటికి 64 శాతం మంది విద్యార్థులు బడి మధ్యలోనే మానేస్తున్నారు.

మినిస్టరీ ఆఫ్‌ హోం ఎఫెైర్స్‌ లెక్కల ప్రకారం 1వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ‘బళ్లో చేరిన’ పిల్లలలో నూటికి 64 మంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు. బళ్లో చేరిన పిల్లలో 1 నుండి 5వ తరగతి వచ్చే వరకు 19 శాతం మంది, 1 నుండి 7వ తరగతి వచ్చే వరకు 34 మంది,1 నుండి 10వ తరగతి వచ్చే వరకు 64 శాతం మంది పిల్లలు బడి మానేస్తున్నారు. కాని సాంఘికంగా, ఆర్థికంగా అట్టడుగున పడి నలుగుతున్న వెనుకబడిన తరగతుల కులాల పిల్లలలో ఈ శాతం మరీ ఎక్కువగా ఉంది. దుర్భర దారిద్య్ర పరిస్థితులే ఇందుకు ప్రధానకారణం.
ఈ గణాంకాలు చూస్తుంటే, రాజ్యాంగం వాగ్దానం చేసినట్లు 14 సంవత్సరాల వరకు నిర్బంధోచిత ప్రాధమిక విద్య అందరికీ అనేది ఇప్పట్లో వాస్తవరూపం ధరించేలా కనిపించడం లేదు.

రాజ్యాంగంలోని 24వ అధికరణం 14 ఏళ్లలోపు పిల్లలను ఫ్యాక్టరీల్లో, గనుల్లో, ఇతర వృత్తుల్లోఉపయోగించుకోవడాన్ని నిషేధించింది. 45వ అధికరణం 14 ఏళ్ల వరకు బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని స్పష్టం చేస్తోంది. ఈ రెండు రాజ్యాంగ భావనలనూ కలిపి చూస్తే బడికి వెళ్లడమన్నది 14 ఏళ్లలోపు బాల బాలికలకు ఉన్న ‘హక్కు’ అని మనం గుర్తించక తప్పదు.14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంద విద్య అందించాలని రాథకృష్ణన్‌ కమిషన్‌ (1948-49), కొఠారీ కమిషన్‌ (1964-66) తమ నివేదికల్లో నొక్కి చెప్పాయి. ప్రాథమిక విద్యకు ప్రాథాన్యం ఇవ్వడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ నివేదికలు సూచించాయి. వాటి అమలు కోసం అనేక కమిషన్‌లు వేసినా లక్షలాది మంది బాల బాలికలు చదువుకు దూరంగా బాలకార్మికులుగా మగ్గుతున్నారు.1979లో కేంద్రప్రభుత్వం ఎం.ఎస్‌‌‌ గురుపాద స్వామి నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. నిరక్షరాస్యతకు, బాలకార్మిక వ్యవస్థకు పేదరికమే పునాది అనీ, పేదరిక నిర్మూలనే ఇందుకు పరిష్కారంమని తేల్చిచెప్పింది. కానీ నేటి ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనకోసం శాశ్వత పరిష్కారాలు ఆలోచించకుండా, కేవలం ఆకర్షనీయమైన పథకాలతో ప్రజలను మభ్యపెడుతు శాశ్వతంగా వారికి అవిటి వాళ్లుగా, ప్రభుత్వాలు విసిరేసే తాయిలాలకోసం ఎదురుచూసే వారిగా తయారుచేస్తోంది. రాష్ర్టంలోని వెనకబడిన వర్గాల ప్రజానీకం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడనంత వరకు వారి పిల్లలు చదువుకు దూరంగా, బాలకార్మికులుగా మిగిలిపోతారు. భవిష్యత్‌ భారతం బాలలచేతుల్లోనే ఉంది.  వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దితేనే భారత్‌ అభివృద్ధివెైపు దూసుకెడుతుంది. లేదంటే అంధకారంలో మగ్గాల్సి వస్తుంది.

(సూర్య 22-11-12)  

No comments :

Post a Comment