అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ''ఆక్యూపై వాల్‌స్ట్రీట్‌'' తరహా ఆందోళనలు

No comments
ఉద్యమాల సెగ మధ్య ప్రాచ్చం నుండి పశ్చిమానికి మారింది. ఆరబ్‌ దేశాల నుంచి అమెరికా మీదుగా ప్రపంచవ్యాప్తం అవుతోంది. నిన్నటి ఉద్యమాల లక్ష్యం స్వేచ్ఛాగీతిక అయితే నేటి ఆందోళనల ఆశయం అసమానతలకు అంతం పలకడం. ప్రభుత్వాలను పెత్తందారీ పెద్ద చేతుల్లోంచి బైటకు తేవడమే నినాదంగా, స్వయం బందీలవడమే మార్గంగా మొదలైన ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. వేగంగా విస్తరిస్తూ విశ్వవ్యాప్తం అవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1500 నగరాలకు విస్తరించి విశేష ప్రజా మద్దతు కూడగట్టుకుంటూ పాలకుల్లో గుబులు పుట్టిస్తోంది. సమాధి అయిపోయిందనుకుంటున్న వాదాల వివాదాన్ని తట్టి లేవుతున్నాయి ఆ ప్రజాందోళనలు.

నిశ్శబ్దంగా మొదలై నిప్పులా రాజుకుంటున్న ''ఆక్యూపై వాల్‌స్ట్రీట్‌'' ఉద్యమం సరిగ్గా నెలరోజుల క్రితం సెప్టెంబర్‌ 17న అమెరికాలోని మాన్‌హట్టన్‌ లిబర్టీ స్వేర్‌ నుంచి ప్రారంభమైంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆర్థికశక్తులు, బహుళజాతీయ సంస్థల పెత్తనానికి నిరసన వారి ప్రధాన లక్ష్యం. వాల్‌స్ట్రీట్‌ పరిణామాలు ఆర్థికవ్యవస్థను ఎలా దెబ్బతీసి తరతరాల సంక్షోభాన్ని మిగుల్చుతున్నవైనాన్ని బహ్య ప్రపంచానికి తెలియ చెప్పడమే ఆశయం.

''ఆక్యూపై వాల్‌స్ట్రీట్‌'' పేరుతో నెల రోజుల క్రితం కేవలం కొద్ది డజన్ల మందితో ప్రారంభమైన ఆందోళన ఇపుడు ప్రపంచ స్థాయి ఆందోళనగా మారింది. రెండు వారాలకే అమెరికా అంతటా పాకిన ఆందోళనలు ఆ తర్వాత యూరప్‌ దేశాలకు కూడా విస్తరించాయి. ఇప్పుడు జపాన్‌ నగరం టోక్యోకు పాకి ''టోక్యోను ఆక్రమిద్దాం'' అంటూ జననీయులు నినదిస్తున్నారు. ఈజిప్ట్‌, తెహ్రీ స్క్వేర్‌ నిరసనల స్ఫుర్తితో సెప్టెంబర్‌ 17న ఒక్కసారిగా 2 వేల మంది ఆందోళనకారులు మాన్‌హట్టన్‌ వీధుల్లోకి వచ్చారు. సంపన్నుల కాలనీ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. 'అక్కడో జూకోటి పార్క్‌' వద్ద డేరాలు వేసుకుని శాంతియుత ఆందోళన ప్రారంభించారు. ''వుయ్‌ ఆర్‌ 99%'' పేరున ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రదర్శనలే కాక సామాజిక సంబంధాల వెబ్‌సైట్లలో ప్రచారం హోరెత్తించారు. ఉద్యోగాలు కోల్పోయి, సౌకర్యాలకు కోతపడి, దిక్కుతోచని స్థితితో ఉన్న లక్షలాది మంది ప్రజలు దానివైపు ఆకర్షితులు కావడానికి అట్టే సమయం పడ్డలేదు. అమెరికా స్టాక్‌ మార్కెట్లు, బహుళజాతి సంస్థల కేంద్రం వాల్‌స్ట్రీట్‌ను ఆక్రమిద్దాం అన్న నినాదంతో రోజురోజుకీ ఆందోళనకారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. సామాన్యులు, కార్మి సంఘాలు, సెలబ్రిటీల నుంచి సంఘీభావమూ పెల్లుబికీంది. రోజుల వ్యవధిలోనే అమెరికా నుంచి ఇతర దేశాలనూ ఊపేయడం ప్రారంభమైంది. లండన్‌, జర్మనీ, రోమ్‌, హంగ్‌కాంగ్‌లను ఆ వేడి తాకింది.

ప్రపంచ ఆర్థిక సంక్షోభం పేరు చెప్పి ట్రిలియన్ల కొద్దీ ప్రజా ధనాన్ని ''బెయిలౌట్‌'' లుగా వాల్‌స్ట్రీట్‌ కంపెనీలకు పందేరం పెట్టిన సంగతి విదితమే. తీరా ఆ డబ్బంతా అమెరికా, యూరప్‌ దేశాలపైన అప్పుగా పేరుకుపోయింది. 'బడ్జెట్‌లోటు' తగ్గించాలనీ, 'అప్పుభారం' తగ్గించాలని చెబుతూ 'పొదుపు విధానాల' పేరున కంపెనీలకి పంచిన డబ్బుని ప్రజల వద్ద నుండే వసులు చేయడానికి అమెరికా యూరప్‌ల ప్రభుత్వాలు పూనుకున్నాయి. తమ సంబంధం లేని అప్పును తమపైన భారంగా వేయడానికి వ్యతిరేకంగా అమెరికన్లు నెలరోజులనుండి ఉద్యమిస్తున్నారు. అమెరికా, యూరప్‌ తదితర దేశాలలో ప్రారంభమైన  ఆందోళనలు అక్కడి బ్యాంకర్లకు, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. అయితే వివిద దేశాలలో జరుగుతున్న ఈ ఆందోళనలు కొన్ని చోట్ట చిన్న చిన్నవిగా ఉంటున్నాయి. కొన్ని చోట్ట రోడ్లలో ట్రాఫిక్కును ఆపగల శక్తిగా కూడా ఉంటున్నాయి. ఇటలీ రాజధాని రోమ్‌ నగరంలో త్వరలో జరగనున్న ప్రదర్శనలో కనీసం 1 లక్ష మంది పాల్గోంటారని నిర్వాహకులు చెబుతున్నారు. 

''ప్రపంచ స్థాయిలోనే ప్రభుత్వ అప్పు మనం ఏ మాత్రం భరించలేని స్థాయికి చేరుకుంది. దోపిడీ ప్రభుత్వాలు, అవినీతి బ్యాంకులు, స్పెక్యులేటర్లు కలిసి కూడబెట్టిన ఈ అప్పు ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేనిది. భారాన్ని ప్రజలపై వేస్తూ కూడా ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకోరు వీళ్ళు'' అని ప్రదర్శనకు హాజరవుతున్న యువతులు చెప్పినట్లుగా రాయిటర్స్‌ తెలిపింది. ''వాళ్ళు ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని తీసుకొచ్చారు. సంక్షోభం నుండి కూడా వాళ్ళు లాభాలు దండుకుంటున్నారు. వాళ్ళే ఇదంతా చెల్లించాలి'' అని ప్రదర్శనకు హాజరవుతున్న వారు నినదిస్తున్నారు. 

న్యూయార్క్‌ నగరంలో ఓ ప్రైవేటు పార్కులో గుడారాలతో తిష్టవేసిన ఉదాహరణని ఇటలీ ఆందోళన కారులు అనుకరిస్తున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇటలీ ప్రధాన కార్యాలయం ప్రక్కన గత 20 రోజులుగా రోమ్‌ ఆందోళన కారులు తిష్టవేసి ఆందోళన నిర్వహిస్తున్నారు.  ఇటలీ ప్రభుత్వం 60 బిలియన్‌ యూరోల పొదుపు ఆర్థిక పథకానికి ఇటలీలోని బెర్లుస్కోని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని వలన పన్నులు పెరగనున్నాయి. ప్రజారోగ్యం మరింత ప్రియం కానున్నది. గత శుక్రవారం అతిపెద్ద వాల్‌స్ట్రీట్‌ బ్యాంకు ''గోల్డ్‌మేన్‌ సాచ్‌' కి చెందిన మిలన్‌ ఇటలీ శాఖపైన ఆందోళనకారులు దండెత్తి గోడల నిండా నినాదాలతో నింపారు. ఇటలీలో అతి పెద్ద బ్యాంక్‌ 'యూనిక్రెడిట్‌'' ప్రధాన కార్యాలయంపై మరికొంత మంది కోడిగుడ్లు  విసిరి తమ కోపం తీర్చుకోవడానికి ప్రయత్నించారు. 

న్యూజిలాండ్‌లో పెద్ద నగరం ఆక్లండ్‌లో ప్రధాన వీధిలో కొన్ని వందలమంది ప్రదర్శన నిర్వహించి అప్పటికే అక్కడ ఉన్న మూడువేల మందితో చేరిపోయారు. డ్రమ్ములు, నినాదాలతో హోరెత్తించారు. వెల్లింగ్టన్‌లో రెండోందలమంది. క్రైస్ట్‌ చర్చ్‌ నగరంలో యాభైమంది ప్రదర్శన జరిపారు. ఫిలిప్పైన్‌ రాజధాని మనీలాలలోనూ ఆందోళన కారులు ప్రదర్శన నిర్వహించారు. అమెరికా ఎంబసీ వద్ద ప్రదర్శన జరిపి ''అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి'', ''ఫిలిప్పైన్‌ అమ్మకానికి లేదు'' అని నినదించారు. బ్యానర్లు ప్రదర్శించారు. తైవాన్‌ రాజధాని తైపి స్టాక్‌ ఎక్చేంజి వద్ద వందలాంది మంది ప్రదర్శన నిర్వహించారు. ''మేము తైవాన్‌లో 99 శాతం'' అని నినదించారు. అర్థికవృద్ధి కంపెనీలకే లాభించిందని వారు తెలిపారు. మధ్యతరగతి వేతనాల వలన ఇల్లు, విద్య, ఆరోగ్యం ఖర్చులు ఏమీ నడవడం లేదని వాపోయారు. 

లండన్‌లో ప్రదర్శనకారులు ''ఆక్యూపై స్టాక్‌ ఎక్ఛేంజ్‌'' ఆందోళన నిర్వహించారు. లండన్‌లో ప్రతిరోజు అన్ని రంగాల ప్రజలు తమతో చేరుతున్నారని లండన్‌ ఆందోళనకారులు చెబుతున్నారు. వీరు నిర్వహిస్తున్న ఫేస్‌బుక్‌ పేజీకి ఇప్పటికే 12,000 మంది ఫాలోయర్లు రిజిస్టర్‌ అయ్యారని రాయిటర్స్‌ తెలిపింది. ''ద్రవ్య వ్యవస్థ'' తమ టార్గెట్‌ అని వారు చెబుతున్నారు. ''ఇప్పటి వరకు జరిగింది చాలు'' అని వారు నినదిస్తున్నారు. గ్రీకు ఆందోళనకార్లు శనివారం ''పొదుపు విధానాల వ్యతిరేక దినం'' జరపాలని పిలుపునిచ్చారు. ''గ్రీకు ప్రజలు ఈ రోజు ఎదుర్కొంటున్న పరిస్థితే త్వరలో ఇతర దేశాల ప్రజలకు కూడా పీడకలగా ఎదురుకానున్నది. పరస్పర సహకారమే ప్రజల శక్తివంతమైన ఆయుధం'' అని ''రియల్‌ డెమోక్రసీ'' సంస్థకు చెందినవారు ప్రకటించారు. ప్యారిస్‌లో జి 20 సమావేశాల సందర్భంగా తమ ప్రదర్శనలు నిర్వహించాలని ఫ్రాన్సు ఆందోలనకారులు పథకం వేసుకున్నారు. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో ఏడు చోట్ల మార్చ్‌లను నిర్వహించాలని పథకం వేసుకున్నారు. ఆ ఆందోళనలన్నింటా కొట్టవచ్చినట్లు ఒక లోపం కనిపిస్తున్నది. వీరిలో ఎవరికీ నిర్థిష్టమైన డిమాండ్లు లేవు. డిమాండ్లు ఉండాలన్న విషయాన్ని కూడా వీరు పట్టించుకోవడం లేదు. అమెరికాలో ఆందోళనకారులను డిమాండ్లు ఏమిటని ప్రశ్నిస్తున్నప్పటికీ వారు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఈ ఆందోళనల వెనుక సోరోస్‌ అన్న అమెరికా ధనికుడు ఉన్నాడని ఇప్పటికే పుకార్లు వెల్లువెత్తాయి. ఆయన తనకు సంబంధం లేదని కూడా ప్రకటించినా అవి ఆగలేదు.

మార్కెట్‌ ప్రతికూలతల పేరు చెప్పి రోజూ వేలాది మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు, వేలకోట్ల డాలర్ల పొదుపు మంత్రాలు. ఏ దేశంలో చూసినా 1% కూడా మించని కొందరి పెట్టుబడి దారుల రక్షణ కోసమని ప్రభుత్వాల విపరీత హైరనా. ఏడాది ప్రారంభం నుంచీ అదే తంతు. రెండో మాంద్యం ఛాయలన్న సంకేతాలతో ఎడాపెడా కోతలు మొదలు పెట్టారు. బ్యాంకులు, బహుళజాతి సంస్థలకు మాత్రం బారీ ఉద్ధీపనలు ఇచ్చి సామాన్యులను వారి చావుకు వాళ్లనే వదిలేశారు. ఆ క్రమంలో రోడ్డున పడ్డ లక్షలాది మంది బాధితుల గోడు ఎవరికి పట్టాలి? ఫలితం కడుపు రగిలిన అదే సామాన్యులు ఉద్యమ బాట పట్టారు. అయితే వీరి ఆందోళనకు నిర్థిష్ట డిమాండ్లంటూ ఏం లేవు. డిమాండ్లు లేని ఆందోళనలు ఉండడమే ఆశ్చర్యకరం. బ్యాంకులకు ఉద్ధీపనలు, పొదుపుమంత్రం, ధనవంతుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడమే వారి ప్రాథమిక ఉద్దేశం. బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు తదితర ద్రవ్య కంపెనీల అత్యాశ. ప్రజలను పన్నుల భారాలు కుంగదీస్తున్నాయని చెబుతున్నప్పటికీ సంబంధిత డిమాండ్లు ముందు పెట్టడం లేదు. పది సంవత్సరాల క్రితం ఉప్పెనలా విరుచుకుపడిన వరల్డ్‌ సోషల్‌ ఫోరం కూడా ఇదేరీతిన ఎగసి చప్పున చల్లారింది. అప్పట్లో కూడా దారితెన్నూ లేకుండా నమావేశాలు, మహాసభలు జరిగాయి. బడా కంపెనీల నిధులతోనే అవి జరిగాయనీ, ప్రజాగ్రహాలను పక్కదారి పట్టించడానికే అవి జరిపారని ససాక్ష్యాలతో కొంతమంది రుజువు చేశారు కూడా. అయితే అభివృద్ది చెందిన దేశాలలో జరుగుతున్న ఇప్పటి ఆందోళనలు కూడా అవే కోవలోకి వస్తాయా అన్నది కొంతకాలం పోతే గాని వెల్లడి కాదు. అంతవరకు వేచి చూడాల్సిందే.

No comments :

Post a Comment