రాజకీయ మార్పును కోరుతూ ట్యునీసియాలో ప్రజావెల్లువ

No comments

ఉత్తర ఆఫ్రికాలో మధ్యధరా సముద్రం పశ్చిమ తీరానవున్న చిన్న దేశం ట్యునీసియాలో ప్రజా వెల్లువ పెల్లుబికింది. ఈ వెల్లువ ధాటికి నిరంకుశ పాలకుడు జిన్‌ఎల్‌అబిద్నిబెన్‌ఆలీ 2011 జనవరి 14 అర్థరాత్రి విమానంలో దేశం వదిలి పారిపోయాడు. తలదాచుకునే చోటుకోసం వెదకుతూ ఆ విమానంలో గంటలకొలదీ మధ్యధరా సముద్రంపై ఎగురుతూ గడిపాడు. అతనికి ఆంశ్రయమిచ్చేందుకు ఫ్రాన్సు నిరాకరించింది. చివరికి సౌదీ అరేబియా ఆశ్రయమిచ్చింది. ఇలాంటి నిరంకుశ పాలకులు సాధారణంగా మొదట చేరేదక్కడికే. బెన్‌ఆలీ ప్రభుత్వాన్ని కూలద్రోసిన ఘటనల క్రమం ఇలాసాగింది.
1. 2010 డిసెంబరు 17న 26 ఏళ్ళ పిజి డిగ్రీకల నిరుద్యోగి మహమ్మద్‌ బౌబౌజ్‌ను అనుమతి లేకుండా రోడ్డుప్రక్కన పండ్లు కూరగాయలు అమ్ముతున్న ''నేరాని''కి పోలీసులు అవమానించి కొట్టారు. దీనికి నిరసనగా తన స్వస్థలమైన సిది బౌజిద్‌లోని పోలీస్‌స్టేషన్‌ ముందు ఆత్మాహుతి చేసుకున్నాడు. ఆదేరోజు ఆస్పత్రిలో మృతిచెందాడు. ఆ మరుసటిరోజు మరో యువకుడు ''నిరుద్యోగం పోవాలి'', ''దారిద్య్రం పోవాలి'' అని నినిదాలిస్తూ విద్యుత్తు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో వరుస ఆత్మహత్యలు సాగాయి. దీనితో ప్రజాగ్రహం కట్టలు తెగి వెల్లువలా పైకెగిసింది.
2. ప్రభుత్వం అత్యవసర పరిస్థితినీ, కర్ఫ్యూనూ విధించింది. 23 ఏళ్ల నిరంకుశ పాలనతో విసిగిపోయిన జనం వెనక్కి తగ్గలేదు. బెన్‌ఆలీ ప్రభుత్వంపై వారి ఆగ్రహం పూర్తిస్థాయిలో ప్రజావెల్లువ రూపం తీసుకుంది. కార్మికులు, విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉపాధ్యాయులు, లాయర్లు, పత్రికా రచయితలూ ప్రజా ప్రతిఘటనలలో పాల్గోన్నారు. ప్రజావెల్లువ సాయుధ బలగాల్లో సంక్షోభం తెచ్చింది. ప్రజలపై కాల్పులు జరిపేందుకు సైన్యం నిరాకరించటంతో సంయుక్త దళాధిపతి జనరల్‌ రషీద్‌ అమర్‌ను బెన్‌ఆలీ పదవి నుండి తొలగించాడు.
3. నిరసనకారులను ''ముసుగులు ధరించిన గుండాలు'', ''అతివాదానికీ, టెర్రరిజానికీ ఆత్మలు తాకట్టు పెట్టిన, విదేశాలకు అమ్ముడుపోయిన ఆసాంఘిక శక్తుల''ని బెన్‌ఆలీ మొదట నిందించాడు. అయితే తన పాలన మూలస్థంబాలు కదిలిపోతున్నాయని గుర్తించగానే అంతరంగిక వ్యవహారాల శాఖా మంత్రిని తొలగించం, అవినీతిపై విచారణకు కమిటీ నియామకం వంటి చర్యలు తీసుకున్నాడు. 2011 జనవరి 13న ప్రజలకు ఎక్కువ స్వేచ్ఛలూ ఇస్తాననీ, సంస్కరణలు తెస్తాననీ, 2014లో మళ్లీ పదవికి పోటి చేయకుండా దిగిపోతాననీ వాగ్ధానాలు చేశాడు. అయితే ప్రజానీకం వీటిని పట్టించుకోలేదు. ''బెన్‌ఆలీ దిగిపో'' అని ముక్తకంఠంతో  నినదించారు.
4. ప్రజల ఆగ్రహమూ. నిరసన అనేక రూపాలలో సాగింది. వారు ప్రభుత్వ భవనాల మీదా, బెన్‌ఆలీ పార్టీ ఆర్‌సిడి కార్యాలయాల మీద దాడులు చేశారు. బెన్‌ఆలీకీ, అతని భార్యకు చెందిన వ్యాపారాలూ, ఆస్థులను లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేశారు. బెన్‌ఆలీ అల్లుడి భవనాలనూ, వాణిజ్య సముదాయాలనూ, అతని కుటుంబీకుల కార్లను తగులబెట్టారు. బెన్‌ఆలీ మేనల్లుడిని చావగొట్టారు. అనేకచోట్ల పోలీసులతో ఘర్షణపడ్డారు. ఈ క్రమంలో వందమంది వరకూ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

స్థూల చరిత్ర: 
క్రీస్తు పూర్వం నుండి నాగరికత వెలసిన దేశమిది. రోమన్‌ సామ్రాజ్యంలోనూ, అట్టోమాన్‌ సామ్రాజ్యంలోనూ భాగంగా వుండేది. 1850 నుండి ఫ్రెంచి వలస పాలనలలో నలిగిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్‌ దురాక్రమణకు గురైంది. ఎడారి ఇసుక రేణువుల ప్రతిఘటనా తుఫానులో చిక్కుకుని ఆధునిక సైనిక తంత్ర నిపుణుడిగా పేరుగాంచిన జర్మనీ జనరల్‌ రోమలస్‌ ఓటమి పాలైనాడు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం జాతీయ విమోచనోద్యమాల వెల్లువలో భాగంగా ట్యునీసియాలో వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం సాగింది. ఫలితంగా 1956లో స్వాతంత్య్రాన్ని పొందింది. జాతీయోద్యమ నాయకుడు బౌర్‌జీబా అధ్యక్షుడిగా ప్రభుత్వమేర్పడింది. జాతీయోద్యమ స్ఫూర్తితో దేశాన్ని నడిపేందుకు పూనుకున్నాడు. పాత వలస రాజ్యాలు వదిలిన చెప్పుల్లో కాళ్లుదూర్చి ఆధిపత్య స్థాపనకు పూనుకున్న ఆమెరికా సామ్రాజ్య వాదం వలస పాలన నుండి బయటపడిన దేశాలన్నింటిలోలాగే ట్యునీసియాలోకీ ప్రవేశించింది. సహాయం పేరిట ప్రపంచబ్యాంకు, ఐయంఎఫ్‌లు కోరలు సాచాయి. 1980 దశకం వచ్చేసరికి అవి దేశ ఆర్థిక విధానాలను నిర్ధేశించే పట్టును సాధించాయి. 
1980లో అంతర్జాతీయ ద్రవ్యనిధి ట్యునీసియాపై సంస్థాగత సర్ధుబాట్ల కార్యక్రమాన్ని రుద్దింది. ప్రజలకిస్తున్న అన్ని రకాల సబ్సిడాలనూ డిగకోయమని ఆదేశించింది. 1984 జనవరిలో ప్రభుత్వం ఆహారసబ్సిడీ తగ్గింపులో భాగంగా రొట్టెధరను రెట్టింపు చేసింది. దీనితో ఆగ్రహించిన ప్రజలు నిరసన ప్రదర్శనలు చేశారు. రాజధాని ట్యునిస్‌లో సాగిన ప్రజాందోళనపై పోలీసు కాల్పులు సాగి 50 మంది మరణించారు. ఈ ఘటన జరిగిన పదినిమిషాల్లోనే అధ్యక్షుడు బౌర్‌బిబా రేడియోలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించాడు. అంతరంగిక శాఖామంత్రిని తొలగించినట్లూ, రొట్టె ధరను పాతస్థాయికి తగ్గించినట్లూ ప్రకటించాడు. అమెరికా రుద్దుతున్న ఆర్థిక కార్యక్రమాన్ని అములు జరిపేదిలేదని స్పష్టం చేసాడు. దీనితో ప్రజాందోళన ఆగింది.
కానీ ట్యునీసియా రాజకీయ రంగంలో వ్యక్తమైన జాతీయవాద ధోరణులను అమెరికా సహించలేక పోయింది. ఫ్రాన్సు ప్రభావాన్ని తగ్గించి తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు పూనుకుంది. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న సంక్షోభంతో పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణాలను చూపి, బౌర్‌జీబాను ''అసమర్థపాలకుడి''గా ముద్రవేసి 1987లో సైనిక తిరుగుబాటు చేయించింది. సైన్యాధిపతి బెన్‌ ఆలీని అధ్యక్షుడిని చేసింది. ఫ్రాన్సు ప్రక్కన బెట్టి బెన్‌ ఆలీ అమెరికా సామ్రాజ్యవాదుల బంటుగా మారాడు. నవంబరులో సైనిక తిరుగుబాటు జరగ్గా డిసెంబరులో ఐ.ఎం.ఎఫ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. జనవరిలో యూరోపియన్‌ యూనియన్‌తో ఒప్పందం చేసుకున్నాడు. వీటి ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరిట విదేశీ కంపెనీల పరం చేశాడు. స్వేచ్ఛావాణిజ్య కేంద్రాలను తెరచి అక్కడి కార్మికుల వేతనాలను 75 సెంట్లగా నిర్ణయించాడు. పశ్చిమ యూరపు దేశాలకు కారుచౌక శ్రమశక్తిని సమకూర్చాడు. 23 ఏళ్ళ పాలనలో బెన్‌ఆలీ ప్రపంచ బ్యాంకు నిర్ధేశాలను తుచాతప్పక పాటించాడు. ప్రజలకిస్తున్న సబ్సిడీలన్నీ తగ్గించి, ఆహార సరకుల ధరల నియంత్రణ మానివేశాడు. ప్రభుత్వరంగ కార్మికులను పనినుండి తొలగించాడు. ట్యునీసియన్లు పొట్ట చేత పట్టుకుని మృత్యునావల్లో విదేశాలకు వెళ్లారు. 6,50,000 మంది విదేశాల్లో శ్రమిస్తూ 2010 లో వారు వెనక్కు పంపిన ధనం 196 కోట్ల డాలర్లు దీనితో విదేశి అప్పులు, వాటి వడ్డీలు కట్టుకున్నాడు తప్ప ఈ విదేశీ మారకు ద్రవ్యాన్ని దేశాభివృద్థికి వినియోగించలేదు.

ప్రజా వెల్లువకు దారితీసిన పరిస్థితులు:
ఈ విధానాల ఫలితంగా ట్యునీసియా, ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. 15-24 ఏళ్ల వయస్సులోని యవతలో సగం నిరుద్యోగుల, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రైవేటీకరణతో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లాయి. ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయి. అవినీతితోనూ, ప్రభుత్వ ఆస్థుల కొల్లగొడుతూనూ కొద్దిమంది సంపదలు పోగేసుకుంటుండగా, శ్రామిక వర్గాలూ, మధ్య తరగతి జనులూ ఆకలి, దారిద్య్రంలో కూరుకుపోయారు. మధ్యధరా సముద్రపు ఆవలి తీరాన ఉపాధి కొరకు పడవలలో ప్రయాణించి మృత్యువాతపడుతున్న యువకులు జీవితాలు రోజువారీ వార్తలై 'మృత్యునావ'లన్న పేరు స్థిరపడి పోయింది. స్వేచ్ఛా వాణిజ్య కేంద్రాల్లోని వస్త్ర పరిశ్రమలో వేతనాలు హీనస్థాయిలో వున్నాయి. అయినా ఐ.ఎం.ఎఫ్‌ ఆదేశాల ప్రకారం బెన్‌ ఆలీ ఆహారం, పెట్రోలు ధరలు పెంచివేశాడు. అవినీతి, అక్రమార్జనలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. బెన్‌ఆలీ, అతని భార్య వారి బంధుగణం దేశసంపదలో 50 శాతాన్ని కైవశం చేసుకున్నారు. 
అయినా ప్రపంచ బ్యాంకు 7 శాతం మాత్రమే దారిద్య్రంలో వున్నారనీ, దేశం గణనీయంగా అభివృద్ధి చెందిందనే కితాబులిచ్చింది. 93 శాతం మించి ప్రజలకు కనీస అవసరాలన్నీ తీర్చుకోగల ఆదాయం వస్తుంటే ఇంత అశాంతి, తిరుగుబాటు వచ్చివుండేవికావు. సామ్రాజ్యవాదుల పనుపున బెన్‌ఆలీ నిరంకుశ పాలన సాగించాడు. ప్రతిపక్షాలను నిర్ధాక్షిణ్యంగా అణచివేశాడు. ఛాందసవాద  ప్రమాదాన్ని తప్పించటమన్న సాకుతో ఆదార బూర్జుబా మత ధోరణులున్న ప్రధాన ప్రతిపక్షపార్టీపే 1990లో దాడి సాగించాడు. ఆ తర్వాత జాతీయవాదులు, వామపక్ష శక్తులు, ఉదారవాదులు, విద్యార్థి నాయకులపై విరుచుకుపడ్డాడు. ఎన్నికల్లో తనకు 97 నుండి 99 శాతం ఓట్లు పడ్డాయన్న అతని మాటలే ఎన్నికలెంత తంతుగా నడిచాయో తెలుపుతుంది. ట్రేడ్‌యూనియన్లనూ, మానవ హక్కులనూ, సాంస్కృతిక, సామాజిక సంస్థలనూ, చివరకూ క్రీడా సంస్థలనూ కూడా బెన్‌ ఆలీ ప్రభుత్వం అనుమతించలేదు.  ఒక పత్రిక రచయిత వాఖ్యానించినట్లు ''ప్రజలు కలుసుకునేందుకు మిగిలిన ఏకైక స్థలం జైలు''. పత్రికా విలేఖరులను జైళ్లలో కుక్కాడు. విదేశీ పత్రికా విలేఖరులను దేశ:లోకి అనుమతించలేదు. ప్రజావెల్లువ వార్తలు తెలుసుకునేందుకు సెల్‌ఫోనులతో తీసి పంపిన చిత్రాలే ఆధారమయ్యాయి. ఆ నిరంకుశపాలనలో ప్రజలకు ఊపిరాడని స్థితి ఏర్పడింది. ఎప్పుడైనా అంటుకుని దావానంలా వ్యాపించే ఆగ్రహం వారిలో పేరుకుపోయివుంది. పండ్లు, కూరగాయాలు అమ్ముకుంటున్న నిరుద్యోగిపై సాగిన దురంతం దీనికి అజ్యం పోసింది. ప్రజాగ్రహం పెను వుప్పెనగా జ్వలించింది.

నూతన ఆధికారం కోసం పోరాటం:
బెన్‌ఆలీ ప్రభుత్వం కూలిపోయేముందు ట్యునీసియాలోని దోపిడీ పాలక వర్గాలూ, వారి సామ్రాజ్యవాద యజమానులూ ప్రజావెల్లువపై బురద జల్లేందుకూ, అణచివేసేందుకూ అన్నిరకాల పద్ధతులనూ ప్రయోగించారు. అయినా ప్రజావెల్లువ ఆగకపోవటంతో ఆరోజే కనుగొన్నట్లు బెన్‌ఆలీ అత్యంత నిరంకుశ పాలకుడనీ, అతనే ఈ సంక్షోభానికి కరకుడనీ, అతన్ని పదవీచ్యుతుడ్ని చేస్తే సమస్య తీరిపోయినట్లు మాట్లాడటం మొదలు పెట్టారు. సామ్రాజ్యవాద పత్రికలన్నీ ఈ పాటే పాడాయి. తమకు సేవ చేసిన నమ్మినబంటును దేశం దాటించి చెత్తబుట్టలో పడేశాయి. జాతీయ ఐక్యతా మధ్యంతర ప్రభుత్వమన్నది ఈ ప్రయత్నాలలో భాగంగా ఏర్పడిందే. ప్రజా వెల్లువకు నాయకత్వం వహించిన జనరల్‌ యూనియన్‌ ఆఫ్‌ ట్యునీసియన్‌ వర్కర్స్‌ (యుజిటిటి) ప్రతినిధులు ముగ్గురిని ఈ ప్రభుత్వంలో మంత్రులుగా చేర్చుకున్నారు. బెన్‌ఆలీ పార్టీ ఆర్‌సిడి నాయకులతో మంత్రి వర్గాన్ని నింపారు. రక్షణ-విదేశీ వ్యవహరాలు ఆర్థికం అంతరంగిక వ్యవహారాలు వంటి కీలక మంత్రిత్వశాఖలనఅ్న బెన్‌ ఆలీ అనుయాయులతో నింపారు. ఈ మధ్యంతర ప్రభుత్వం కొత్త సీసాలో పాత సారాయి అయింది. కొన్ని ప్రతిపక్ష శక్తులకు కొన్ని శాఖలిచ్చి వారినోళ్ళు కట్టివేశారు. ఇది ప్రజా వెల్లువను వమ్ము చేసే ప్రయత్నం. 
కొత్త ప్రభుత్వంలో ఆర్‌సిడి నాయకులను మంత్రులుగా చేయటాని& నిరసిస్తూ 24 గంటల్లో యుజిటిటి ప్రతినిధులు మంత్రిపదవులకు రాజీనామా చేశారు. దీనితో మంత్రివర్గం నుండి ఆర్‌సిడి నాయకులను తొలగించాలన్నది నిరసనకారుల నినాదమైంది. వీరిని తొలగించి జాతీయ పరిష్కార ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటూ యుజిటిటి నాయకత్వాన ప్రజా ప్రదర్శనలు సాగుతున్నాయి. పోలీసులు కూడా ఆందోళనలో చేరుతున్నారు. జాతీయ ఐక్యత అన్న ప్రభుత్వం అణచివేత చర్యలు తీసుకుంటూనే, పాత ప్రభుత్వం నుండి ''పూర్తి తెగతెంపులు'' చేసుకుంటానని వాగ్దానం చేస్తున్నది. అయితే ''పూర్తి తెగతెంపులు'' సామ్రాజ్యవాద ద్రవ్యసంస్థలు రుద్దిన నయాఉదారవాద సంస్కరణలనుండి తెగ తెంపులుగా వుంటాయని చెప్పటం లేదు. రాజకీయ ఖైదీల విడుదల, రాజకీయ పార్టీల ఏర్పాటుకు చట్టం వంటి సంస్కరణలు చేస్తానని వాగ్దానం చేస్తున్నది. ప్రజల కోపాన్ని తగ్గించేందుకు బెన్‌ ఆలీతో సంబంధంవున్న కొందరిని ఆరెస్టు చేయటం వంటి చర్యలను ప్రధానమంత్రి ఘన్నౌఛీ తీసుకున్నాడు. అయితే ప్రజలీ ప్రభుత్వాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తున్నారు. ఎటూ తేలని స్థితిలో ఇప్పటి పరిస్థితి వుంది. అది ఏ వైపుకు దారితీస్తుందన్నది వేచిచూడాల్సి వుంటుంది.

ప్రజా వెల్లువ భవితవ్యం:
అధికార బలంతోనూ, ఆయుధ సంపత్తిలోనూ పాలన సాగించగలమని విర్రవీగిన నిరంకుశపాలకులందరూ పీడిత ప్రజా తిరుగుబాటు ముందు వీగిపోయారు. చరిత్ర చెత్తబుట్టలో చురారు. బెన్‌ఆలీ కూడా ప్రజా వెల్లువ ముంఉదు కూలిపోయాడు. ప్రజా వెల్లువకు అవసరమైన భౌతిక పరిస్థితివుంది. అవి ప్రజావెల్లువను-అప్రయత్న పూర్వక వెల్లువనూ, ట్యునీసియాలో జరిగినట్లు కొంత మేరకు నిర్మాణయుతంగానూ తెచ్చాయి. అయితే ఈ వెల్లువ తనంత తాను ఈ సామాజిక వ్యవస్థను మార్పు చేసే విప్లవంగా పరివర్తన చెందజాలదు. కొన్ని సందర్భాల్లో ఓటమికి గురికావచ్చు. లేదా ప్రభుత్వాధినేతల మార్పును తేవచ్చు, కొన్ని సంస్కరణలను తేవచ్చు. ట్యునీసియా పరిణామాలు రాజకీయ పరిస్థితితో  మార్పును తెస్తాయన్నది నిస్సందేహం. ఆ మార్పు ప్రజానుకూలంగా ఏ మేరకు ఉంటున్నది ప్రజా వెల్లువను నడుపుతున్న వారిపై ఆధారపడి వుంటుంది. 
ప్రజా వెల్లువను తమకనుకూలంగా మలుచుకుని తమ దోపిడీపాలనను కొనసాగించేందుకు దోపిడీ వర్గాలు సకల ప్రయత్నాలూ  చేస్తాయి. తమకు సేవలందించి అప్రదిష్టపాలైన పాలకుడిని వదిలి. మరో సేవక పాలకుడిని ప్రజావెల్లువ మొగదల నిలిపేందుకు పూనుకుంటాయి. ట్యునీసియాలో నేడు జరుగుతున్నది ఇదే. ఒక వేళ ప్రజాశక్తులు ప్రజాశక్తులు పైచేయి కలిగిన ప్రభుత్వ మేర్పరచగలిగినా, అనేక బూటకపు నినాదాలతో దానిని తన కనువుగా మలుచుకునేందుకూ ప్రయత్నాలు చేస్తాయి. ఫిలిఫ్సైన్సులో ప్రజా వెల్లువ అగ్రభాగాన నిలిచిన ఆక్వినో సారధ్యంలోని ప్రభుత్వాన్ని ఆర్థిక మీటలతో తమకనువుగా మలుచుకున్న అనుభవం మన ముందువుంది. అలా ట్యునీసియా జాతీయోద్యమ నాయకుడు బౌర్‌జీబా ప్రభుత్వాన్ని ఆర్థిక మీటలతో బిగించి అసమర్థుడని తొలగించిన అనుభవం కూడా ట్యునీసియా ప్రజల ముందుంది. ప్రజావెల్లువ విజయవంతమై ప్రజానుకూల ప్రభుత్వం ఏర్పడి కొనసాగాలన్నా, సామాజిక వ్యవస్థ మార్పుకు అది దారితీయాలన్నా పీడిత వర్గ ప్రయోజనాలే పరమావధిగాగల రాజకీయ శక్తులూ, నిర్మాణమూ వెల్లువకు నాయకత్వం వహించి నడిపించాల్సి వుంటుంది. అదిమాత్రమే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలదు.
నేడు ట్యునీసియాలో పాత ప్రభుత్వంలో ఆధిపత్యం వహించిన శక్తులను తొలగించాలని కోరుకుంటున్న వర్గాలకూ, శక్తులకూ మారిన రూపంతో పాత శక్తుల ఆధిపత్యాన్నే కొనసాగించాలన్న వర్గాలకూ, శక్తులకూ మధ్య తీవ్రపోరాటం సాగుతున్నది. ప్రతీపశక్తులకు సహకారమిచ్చి పాత అధికార శక్తుల పాలనను తిరిగి నెలకొల్పి కోల్పోయిన తన ప్రాభవాన్ని తిరిగి పొందాలని ఫ్రాన్సు సామ్రాజ్య వాదం ప్రయత్నిస్తుండగా, ఈ ఘర్షణలో తనకనుకూల శక్తులే అధికారంలోకి వచ్చే ప్రయత్నాలను అమెరికా సామ్రాజ్యవాదులు ముమ్మరంగా చేస్తున్నారు. ప్రత్యేకించి గత రెండు దశాబ్దాలుగా ఆరబ్‌, ముస్లిం ప్రజలపై తాము సాగించిన యుద్ధాలతో వారిలో పేరుకుపోతున్న ఆగ్రహం కట్టలు తెంచుకుని పెల్లుబికుతుందన్న భయం సామ్రాజ్యవాదులందరికీ ఉంది. ఈజిప్లు, లెబనాన్‌ తదితర ఆరబ్‌ దేశాలలో ప్రజానిరసనలు ఊపందుకుంటున్నాయి. దీనితో ట్యునీసియా ప్రజా వెల్లువను అణచే వివిధ పద్ధతులను, మార్గాలను పనిని సామ్రాజ్యవాదులు ముమ్మరం చేస్తారు.
ప్రజా వెల్లువను వమ్ముచేసే దోపిడీ వర్గాల, సామ్రాజ్యవాదుల ప్రయత్నాలను ట్యునీసియాలోని ప్రజాశక్తులు ఇంతవరకూ ఎదుర్కొని నిలవటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ ఘర్షణలో అంతిమ విజయం ఎవరిదన్నది సాగుతున్న పోరాట క్రమం నిర్ణయిస్తుంది. రాజకీయ మార్పు కొరకు పోరాడుతున్న శక్తులు పైచేయి పొందితే ప్రజలకు కొన్ని హక్కులు రావటానికీ.జీవన పరిస్థితుల్లో కొంత మెరుగుదలకూ అవకాశాలు ఏర్పడుతాయి. పోరాట అనుభవాలు ప్రజల చైతన్యాన్ని మరో మెట్టు ఎక్కిస్తాయి. ఇది శుభపరిణామం.నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాట కొలమిలో కాలుతూ, కాకలు తీరుతున్న ట్యునీసియా ప్రజలు ఆ దిశగా పయనిస్తారని ఆశిద్దాం.

No comments :

Post a Comment