ఇండియన్ ఆర్మీ అసహ్యకరమైన మరో ముఖం

No comments
తెలిసిన మిత్రుడు నాలుగు రోజుల క్రితం నా ఫేస్ బుక్ లో ఓ కామెంట్ పెట్టాడు. ఎప్పుడు పోలీసులను, మిలటరీని విమర్శిస్తూ వ్యాసాలు రాస్తుంటావు కదా, మరి దీని గురించి ఏమంటావు అంటూ చార్ ధాం వరదల్లో చిక్కుకున్న భక్తులని రక్షించేందుకు మిలటరీ జవానులు వంతెనలా పడుకోని వున్న పోటోను నాకు టాగ్ చేశాడు.

 చార్ ధాం లో మిలటరీ చేస్తున్న సేవల గురించి కూడా త్వరలో ఓ వ్యాసం రాస్తానులే అని రిప్లయి ఇచ్చా. చార్ ధాం లో సైన్యం చేస్తున్న సహాయం అభినందించదగ్గదే. నిజానికి నాకు పోలీసులపై వ్యతిరేకత లేదు, ఉన్నదంత ఈ వ్యవస్థపైనే. గొప్పగా చెప్పబడుతున్న అతి పెద్ద ప్రజస్వామ్యం పైనే నా విమర్శంతా. ఈ వ్యవస్థలో పావులుగా ఉన్న పోలీసులు మానవత్వాన్ని మరిచి, కనీసం మనుషులుగా కూడా ప్రవర్తించకుండా కౄర మృగాలుగా వ్యవహరిస్తున్నారన్నదే నా విమర్శంతా. వివిధ సందర్భాల్లో ప్రజా ఉద్యమాలను ఏంత కర్కషంగా అణచివేస్తున్నారో, అమాయకులను పట్టుకొని ఏంత చిత్రహింసలు పెడుతున్నారో చూస్తున్న నాకు ఈ పోలీసు, మిలటరీలు చేస్తున్న సేవలు పెద్దగా కదిలించలేవేమో!  
మిలటరీ జవానులు చార్ ధాం లో చేస్తున్న సేవల గురించి ఫేస్ బుక్ లో కుప్పలు తెప్పలుగా కామెంట్స్ గుప్పిస్తున్న సమయంలోనే (సరిగ్గా మిత్రుడు ఫేస్ బుక్ లో కామెంట్ పెట్టిన రెండు రెండు రోజులకే) హిందూ పేపర్ లో "Night of Horror" అనే వ్యాసం (30-6-13) ప్రచురితమైంది.దేశాన్ని రక్షించాల్సిన సైనికుల చేతిలో 53 మంది మహిళలు (కాశ్మీర్ లోని కునర్ పుష్పోరా గ్రామస్థులు) అత్యాచారానికి గురై న్యాయం కోసం 22 ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. గొప్ప ప్రజస్వామ్యం అని చెప్పబడుతున్న దేశంలో, దేశాన్ని రక్షించాల్సిన సైనికులే మృగాలుగా మారి ముక్కు పచ్చలారని 8 ఏండ్ల పసిపిల్లల నుంచి 80 ఏండ్ల పండు ముసలిని కూడా అత్యాచారం చేస్తే వీళ్ళా దేశాన్ని రక్షించేది అనిపిస్తుంది. మూడు రోజుల్లో డెలివరీ కాబోతున్న మహిళను సైతం సైన్యం ముసుగులో ఉన్న మానవ మృగాలు రేప్ చేస్తే అతి కష్టం మీద డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలబెట్టాల్సి వచ్చింది. ఇంత కర్కషంగా జంతువులు కూడా వ్యవహరించవు. కాని మన ఘనత వహించిన ఇండియన్ ఆర్మీ మాత్రం ఆ ఘాతకానికి ఒడికట్టారు. తన కళ్ళ ముందే ఎనిమిది మంది సైనికులు తన తల్లిని అత్యాచారం చేస్తుంటే చూసిన ఆ పసి హృదయం పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క సారి ఉహించండి. బాధితులను కలవడానికి వచ్చిన జిల్లా మెజిస్ట్రేట్ ఏస్.ఏం. యాసిన్ మిలటరీ చర్య "హింసాత్మక జంతువుల" లా ఉంది అన్నాడంటే కృర మౄగాల దాడి ఏవిధంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అత్యాచారానికి గురైన బాలకలను పెళ్ళి చేసుకోవడానికి ఏవరు ముందుకు రాక ఇప్పటికి అవివాహితులుగా మిగిలిపోయి, అంగవైకల్యంతో, మానసిక ఒత్తిడికి లోనై, సజీవ శవాలుగా బతుకులను వేలాడ దీస్తున్నారు. ఇది మన ఇండియన్ ఆర్మీ దేశానికి చేస్తున్న ఇంకో రకమైన సేవ. 

సరిగ్గా ఇలాగే మణిపూర్ లో 2004 జులై 11 వ తేదీన తంగియం మణోరమ అనే 32 ఏళ్ళ మహిళను ఇండియన్ ఆర్మీ ఇంటరాగేషన్ పేరుతో ఇంటి నుంచి తీసుకెళ్ళి ఆమెపై అత్యాచారం చేసి, పొత్తి కడుపులో తుపాకితో కాల్చి పొదల్లో పడేశారు. ఈ విషయం తెలిసిన 12 మంది మహిళలు నగ్నంగా అసాం రైఫిల్స్ కార్యాలయం ముందు "Indian army rape us" అని బ్యానర్ తో నిరసన వ్యక్తం చేశారు.

ప్రత్యక అధికారాల చట్టం పేరుతో సైనికులు ఏంత కర్కషత్వంతో వ్యవహరిస్తే మహిళలు ఇలాంటి నిరసన రుపాన్ని ఎంచుకుంటారు? ప్రత్యేక సాయుధ బలగాల చట్టం పేరుతో ఈశాన్య రాష్టాలలో సైన్యం చేస్తున్న కృరత్వానికి నిరసనగా "ఇరోం షర్మిళ" అనే మహిళ గత 14 ఏండ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం ఆ అధికారాలను రద్ధు చేయకుండా ఇంకొన్ని అధికారాలను కట్టబెట్టెందుకు పావులు కదుపుతుంది.
ఇది మన ప్రజస్వామ్య ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న రక్షణ. కాశ్మీర్ మీడియా సర్వీస్ సర్వే ప్రకారం 1989 నుంధి 2013 మే వరకు ఒక్క కాశ్మీర్ లోనే  సైన్యం చేతిలో 10,058 మంచి మహిళలు అత్యాచారాలకు, వేధింపులకు గురయ్యారంటే సైన్యం నీడన మన మహిళలు ఎంత క్షేమంగా ఉన్నరో అర్థమవుతుంది.  

మన రాష్ట్రంలోని వాకపల్లి లో కూడా పోలీసులు చేసిన నిర్వాహకం ఇదే. నక్సలైట్ల పేరుతో సోదాలు నిర్వహిస్తున్న గ్రెహౌండ్స్ వాకపల్లి లోని 9 మంది ఆదివాసి స్త్రీలను తమ కుటుంబ సభ్యుల ముందే అత్యాచారం చేశారు.
                   (వాకపల్లి గిరిజన మహిళలతో తెలుగు రచయితలు, మహిళా సంఘాల నాయకులు )
వాకపల్లి గిరిజన మహిళలు మమ్ముల్ని గ్రెహౌండ్ పోలీసులు అత్యాచారం చేశారని ఎమ్మార్వో మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించుకున్నా ఎవరు న్యాయం చేయలేదు. వాకపల్లి నుంచి రాష్ట్ర రాజధాని వరకు ఆ మహిళలు పాదయాత్ర చేసి, మాపై అత్యాచారం చేసిన మానవ మృగాలను శిక్షించాలని ఆందోళన నిర్వహించినా ఇప్పటి వరకు వారికి న్యాయం జరగలేదు.       

"ఢిల్లీలో ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే అమె జ్ఞాపకార్థం భారత దేశం మొత్తం దాదాపు 15 రోజులు వెలుగుతున్న కొవ్వొత్తులతో నిండిపోయిందే! మరి మాకు న్యాయం జరగాలని ఒక్క క్రొవ్వొతైనా వెలిగించరా" అని పుష్పోరా గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు వారికి ఏమని సమాధానం చెబుదాం. వారికి అండగా నిలుద్దామా లేక మౌనంగా ఉందామా? 

No comments :

Post a Comment