ఈజిప్టులో నిరసన ఉద్యమం

No comments

గత డిసెంబరు-జనవరి నెలల్లో ట్యూనీసియాలో సాగిన ప్రజా ఉద్యమం 23 ఏళ్ల బెన్‌ అలీ ప్రభుత్వాన్ని తొలగించింది. పశ్చిమాసియా దేశాలన్నింటా దీని ప్రభావం పడింది. ముఖ్యంగా ఈజిప్టూలో 20 ఏళ్లుగా అత్యంత నిరంకుశ పాలన సాగిస్తున్న హోస్ని  ముబారక్‌ ప్రభుత్వం ప్రజా ఉద్యమ వెల్లువతో గద్దెదిగింది. యెమెన్‌, బెహరీన్‌, మొరాకో, సిరియా, లిబియా మొదలగు దేశాల్లోని ప్రభుత్వాలు వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలతో గడగడలాడాయి. ఈ నిరసనోద్యమాల సందర్భం, కారణాలు, రూపాలు, నాయకత్వాలు భిన్నంగా వున్నాయి. అయితే అవన్నీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానూ, రాజకీయ మార్పులకొరకూ సాగిన రాజకీయ ఉద్యమాలు.
ఈజిప్టులోని ప్రజావెల్లువకు ప్రత్యేక రాజకీయ ప్రాధన్యత వున్నది. నేటి ప్రపంచంలో అనుకూల భౌతిక పరిస్థితికి అది అద్దం పట్టింది. సమాజంలో మార్పులు తీసుకురావటంలో ప్రజలెంతటి నిర్ణయాత్మక పాత్ర నిర్వహించగలరో అది చూపింది. ప్రజా ఉద్యమపు బలాన్నీ, బలహీనతనూ, పోరాట ఫలాలు ప్రజలకందేట్లు చూడటానికి సరైన రాజకీయ నాయకత్వపు అవశ్యకతనూ ఎత్తి చూపింది. 
నిరసనోద్యమ క్రమం:  8కోట్ల జనాభా కలిగిన ఈజిప్టు, పశ్చిమాసియాలో పెద్దదేశం. ఒక సమయంలో వలసవాద వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామయ్య వ్యతిరేక పోరాటాలు సాగించిన చరిత్ర దానికుంది. ఇజ్రేలి జియోనిస్టులు దురాక్రమించిన మాతృభూమి కొరకు పాలస్తీనా ప్రజల పోరాటాలకు పెట్టని కోటగా వుండేది. అయితే గత నాలుగు దశాబ్దాలుగా ఈజిప్టును పాలిస్తున్న వర్గాలు విద్రోహబాటన నడిచాయి. సామ్రాజ్యవాదులకు, ప్రత్యేకించి అమెరికా సామ్రాజ్యవాదులకు దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పాలకవార్గాలు అత్యంత నిరంకుశ, అణచివేత, దోపిడీ పాలనను ఈజిప్టు ప్రజలపై రుద్దాయి. ముబారక్‌ 30 ఏళ్లు దేశాన్ని పాలించాడు. ఇతని పాలన ప్రజలకు దుర్భరమైంది. ఈ పాలనకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమ వెల్లువెత్తడం సహజ పరిణామం.
ముబారక్‌ పాలన తీరు గురించి సామ్రాజ్యవాదుల పత్రిక ది న్యూయార్క్‌ టైమ్స్‌ ఇలా రాసింది: ''కైరోలో ధనికులకూ, పేదలకూ మధ్య నానాటికీ పెరిగిపోతున్న వ్యత్యాసం కైరో నగర జీవనంలో ప్రభుఖంగా కనిపించే అంశాలలో ఒకటి. అక్కడి సామాజిక ఘర్షణకు అదే మూలం. అయినా ముబారక్‌ పాలన కొద్దిమందికి ఆర్థిక లాభాలు చేకూరుస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించింది. ధనికులు నగరాన్ని విడిచి వెళ్లారు. అమెరికా ధనికుల ఇళ్ల తరహాలో ఎతైన ప్రహరీ గోడలమధ్య బయటివారితో సంబంధంలేని భవంతుల సముదాయాల్లో నివశిస్తున్నారు. సామాన్య ఈజిప్టియన్ల నుండి వారు వేరుపడి ఒంటరిగా వుండటం కొట్టవచ్చినట్లు కన్పిస్తుంది.''. ఈ ప్రైవేటీకరణను రుద్దిందీ, దాని నుండి లాభపడిందీ సామ్రాజ్యవాదులూ, వారి దళారీలేనన్న వాస్తవాన్ని అది చెప్పకుండా వదిలివేసింది.
''ముబారక్‌ దిగిపో'', ప్రజాస్వామిక పాలననూ, ప్రజాస్వామిక హక్కులను పున:స్థాపించాలి''-ఇవి నిరసనోద్యమ ప్రధాన నినాదాలయ్యాయి. కొద్ది రోజుల్లోనే రాజధాని కైరోనుండి ప్రజాఉద్యమం అన్ని నగరాలకూ వ్యాపించింది. విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, మేధావులు, జనాభాలోని ఇతర సెక్షన్లు లక్షలాదిగా వీధుల్లోకి వచ్చారు. వివిధ రుపాల్లో నిరసన వ్యక్తం చేశారు. తహ్రీర్‌ స్క్వేర్‌ సమీకరణ కేంద్రంగానూ, మార్గదర్శిగానూ రూపొందింది.
ఈ నిరసన ''ఆగ్రహ దినం''గా పిలువబడుతున్న జనవరి 25న ప్రారంభమైంది. ట్యూనిషియా పరిణామాలు ఈజిప్టులో పునరావృతం కానివ్వరాదన్న తలంపులోనే ముబారక్‌ ప్రభుత్వం మొదటి నుండీ వ్యవహరించింది. ప్రదర్శనలను నిషేధించింది. బుల్లెట్ల వర్షం కురిపించింది. అరెస్టులు సాగించింది. అయితే ఈ చర్యలు ప్రజల ఆగ్రహాన్ని మరింతగా పెంచాయి. వారిని మరింతగా మిలిటెంటు చర్యలలోకి తెచ్చాయి.
జనవరి 28న ప్రజలను బుజ్జగించేందుకు మంత్రి వర్గాన్ని రద్దుపరిచినట్లు ముబారక్‌ ప్రకటించాడు. అంతరంగిక భద్రత ముఖ్య అధికారి ఒమర్‌ సులేమాన్‌ను ఉపాధ్యక్షుడిగానూ, వైమానిక దళకమాండర్‌ అహ్మద్‌ సఫీకిని ప్రధానమంత్రిగానూ నియమించాడు. ప్రజలు దీనిని తిరస్కరించారు. ''ముబారక్‌ దిగిపో'' అని ముక్తకంఠంతో నినదించారు. జనవరి 29న పాలక పార్టీ నాయకులపైనా, మంత్రులపైనా, కార్యాలయాలపైన ప్రజలు విరుచుకుపడ్డారు.
జనవరి 30న ప్రజల ద్వేషానికి గురైన అంతరంగిక భద్రతా దళాన్ని రంగం నుండి తప్పించి, టాంకులతో, సాయుధ శకటాలతో సైన్యం ప్రవేశించింది. నిరసనోద్యమ కార్యకర్తలు ప్రదర్శనలను నిర్వహించే కృషిలో నిమగ్నమై వుండగా, అసాంఘికశక్తులు సూపర్‌ మార్కెట్లు, షాపులు, హోటళ్లను దోచుకొన్నాయి. దీనిని అడ్డుకునేందుకు నిరసనోద్యమారులు ప్రయత్నించారు. వారు బృందాలుగా ఏర్పడి రోడ్లను దిగ్బంధించి పేటలలో అరాచకాన్ని అదుపు చేశారు. దక్షిణ కైరో మసీదులల్లోని మైకులలో దోపిడీని అపేందుకు ముందుకురమ్మని యువతకు విజ్ఞప్తి చేశారు. జాతి మ్యూజియంను దోచుకునే ప్రయత్నాన్ని నివారించేందుకు 3000 మంది నిరసనకారులు మ్యూజియం చుట్టూ గొలుసుకట్టి రక్షణగా నిలిచిన సంఘటనను ఒక విలేఖరి సవివరంగా పేర్కొన్నారు.
అదే రోజున 5 సంస్థలు కలిసి ''మార్పు కొరకు జాతీయ కూటమి''గా ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 2న తహ్రీర్‌ స్క్వేర్‌లో పెద్ద ప్రజా ప్రదర్శనకు పిలుపు నిచ్చింది. దేశం నలుమూలలనుండీ 20 లక్షల మంది అక్కడకు చేరి ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించారు. దీనితో 2011 సెప్టెంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటిచేయబోనని ముబారక్‌ ప్రకటించాడు. దీనితో సెప్టెంబరు వరకూ అధికారంలో వుండి రాజకీయ మార్పుల క్రమాన్ని తానే నడిపిస్తానని స్పష్టం చేశాడు.

విచ్ఛిన్నకుల తరిమివేత: వేలాది ప్రజలు కూడిన తహ్రీర్‌ స్క్వేర్‌తో సహా కైరో అంతటా గూండాలనూ, అసాంఘిక శక్తులనూ ఫిబ్రవరి 3న ముబారక్‌ పంపాడు. ప్రజాఉద్యమాన్ని విచ్ఛిన్నంచేసేందుకూ తీసుకున్న అసహ్యకర చర్య యిది. ప్రదర్శకుపై విచ్ఛిన్నకారులు రాళ్లు, పెట్రోలు  బాంబులు విసిరారు. తుపాకీ కాల్పులు చేశారు. దీనితో ప్రదర్శకులకూ విచ్ఛిన్నకులకూ మధ్య ఘర్షణలు సాగాయి. సైన్యం చూస్తూ వూరకుంది. విచ్ఛిన్నకులనేమీ చేయకుండా స్వేచ్ఛనిచ్చి ప్రదర్శకులను గుర్తింపుకార్డులు చూపమని వేధించింది. అయితే ప్రదర్శకులు అద్భుత ధైర్యాన్ని, ఐక్యతనూ చూపారు. ప్రజల సహాయ సహకారాలు పొందారు. చీకటి పడేసరికి విచ్ఛిన్నకారులను తరిమి వేశారు. తహ్రీర్‌ స్క్వేర్‌ను తమ ఆధీనంలో వుంచుకున్నారు. వారి ప్రభావం కైరోలో విస్తరించింది.
అదేరోజు రాత్రి ముబారక్‌ రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. తాను పదవినుండి తప్పుకోబోనని, కొత్తమంత్రి వర్గాన్ని ఏర్పాటుచేస్తాననీ, తన నాయకత్వంలో తరువాయి చర్యలుంటాయని ప్రకటించాడు. దీనికి ప్రతి స్పందనగా నిరసనకారులు ఫిబ్రవరి 4ను ''ముబరాక్‌ను దించివేసే రోజు''గా పరిగణించి దేశవ్యాపిత ప్రదర్శనలు చేయమని పిలుపునిచ్చారు.
ప్రజాగ్రహాన్ని చవిచూసిన పాలకులు ప్రజలను శాంతపరిచేందుకు నిరసనకారులపై హింసకు పాల్పడిన వారందరినీ శిక్షిస్తాననీ, అరెస్టుచేసిన నిరసనకారులను విడుదల చేస్తాననీ ఉపాధ్యక్షుడు సులేమాన్‌ ప్రకటించాడు. శాంతియుతంగా వున్న ప్రదర్శకులపై (ముబారక్‌ పంపిన గూండాలు) దాడిచేసినందుకు (ముబారక్‌ నియమించిన) ప్రధానమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాడు. ఆ చర్యలను ''వినాశకర పొరపాట''ని ఖండించాడు. కొత్త మంత్రివర్గం కొన్ని ప్రజాకర్షక పథకాలను ప్రకటించింది. సంభాషణలకు సిద్ధంగా వున్నానని సూచించింది. తన తర్వాత పదవిని అప్పగించేందుకు ముబారక్‌ ప్రయత్నిస్తున్నాడు  అతని కుమారుడు పాలక పార్టీ ఎన్‌.డి.పి. ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్టు ఫిబ్రవరి 6న ప్రకటించాడు. తన తర్వాత తన కొడుకును వారసుడిగా చేయాలన్న ముబారక్‌ ప్రయత్నం ఈజిప్టు పాలక ముఠాల్లో వివాదాంశంగా వుంది.
శాంతియుతంగా  అధికార మార్పిడి చేసేందుకు ముబారక్‌ ప్రభుత్వం సుముఖంగా వుందని ఉపాధ్యక్షుడు ఒమర్‌ సులేమాన్‌ సూచించాడు. ఫిబ్రవరి 10న ఒక సైన్యాధికారి తెహ్రీర్‌ స్క్వేర్‌కు వచ్చి ''మీరు కోరుకుంటున్నంతా జరుగుతుందని'' నిరసనకారులకు హామీ యిచ్చాడు. ముబారక్‌ దిగిపోయి సైన్యానికి అధికారమప్పగించాడనీ, అధ్యక్ష భవనం నుండి ఎర్ర సముద్ర తీరాన వున్న షర్మ్‌ ఎల్‌ షేక్‌లోని భవనానికి మారాడనీ ఫిబ్రవరి 11న వార్తలు వెలువడ్డాయి. ప్రజాస్వామ్య పరివర్తనను నడిపిస్తాననీ, కొత్త ప్రభుత్వమేర్పడేవరకూ ఇప్పటి పౌర పరిపానా యంత్రాగమే కొనసాగుతుందనీ సైన్యం ప్రకటించింది. సైన్య సర్వోచ్ఛ సమితి అద్యక్షుడైన రక్షణమంత్రికే సర్వాధికారాలుంటాయి. ఫిబ్రవరి 13న సైనిక పాలకులు రాజ్యాంగ చట్టాన్ని సస్పెండ్‌ చేశారు. పార్లమెంటును రద్దుచేశారు. అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికలు జరుపుతాననీ, రాజ్యాంగ చట్టానికి సవరణ వంటి తదితర చర్యలు తీసుకుంటాననీ వాగ్దానం సైన్యం చేసింది. 1979లో ఇజ్రాయిల్‌తో గత ప్రభ్వుం చేసుకున్న శాంతి ఒప్పందమనే దానితో సభా అన్ని అంతర్జాతీయ ఒప్పందాలనూ గౌరవిస్తానని హామీ యిచ్చింది.

నియంత వైదొలిగాడు-నియంతృత్వం వుంది: ముబారక్‌ తొలగిపోవటాన్ని అందరూ ఆహ్వానించారు. ఈజిప్టులో ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్‌ద్వారా నిరసనకు ఆజ్యంపోసిన గూగుల్‌ ఉద్యోగి వాయోల్‌ ''గోనిమ్‌'' కర్తవ్యం పూర్తయిందని'' ప్రకటించాడు. మార్పు కొరకు జాతీయ కూటమి అధ్యక్షుడి ఎల్‌బరాడీ ''నా జీవితంలో ఇది గొప్పరోజ''ని అన్నాడు. ఈజిప్టులో ప్రధాన పక్షమైన ముస్లిం బ్రదర్‌ హుడ్‌ (ముస్లిం సహోదరత్వం) ''ఈజిప్టు ప్రజలు ప్రధాన లక్ష్యాన్ని సాధించారని'' వ్యాఖ్యానించింది. అయితే ప్రజలూ, నాయకత్వంలో వున్న కొందరూ ఈ పరిణామంపై భిన్న అంచనానూ, వైఖరులనూ, ఈజిప్టు రాజకీయ భవితత్వంపై ఆందోళననూ వ్యక్తం చేశారు. వాటిలో కొన్ని: ''సైన్యాన్ని నమ్మటమంటే, మన గోతిని మనం తవ్వుకోవటమే'', ''నియంత పోయాడు కానీ నియంతృత్వం వుంది'', '' అన్ని డిమాండ్లు తీరేవరకూ నిరసన కొనసాగించి తీరాలి'', '' వెంటనే రాజ్యాంగ చట్టాన్ని రద్దు చేయాలి. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకనుగుణంగా కొత్త తాత్కాలిక రాజ్యాంగ చట్టాన్ని తేవాలి'',''రాజకీయ పరివర్తనను సరైన దిశలోయనడిపేందుకు జాతీయ ఐకత్యా ప్రభుత్వాన్నేర్పాటుచేసి సైన్యం ప్రజలతో అధికారాన్ని ప్రంచుకోవాలి'', ''అత్యయిక పరిస్థితి చట్టాలను రద్దుచేయాలి. రాజ్యభద్రతా యంత్రాగాన్ని క్షాళనచేయాలి''. దీని తర్వాత ప్రజలనేక రూపాల్లో తన నిరసనను వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 18న రాజకీయ ఖైదీల విడుదల, మంత్రుల తొలగింపు, అత్యయిక పరిస్థితి చట్టాల రద్దు  తదితర డిమాండ్లతో లక్షలాది ప్రజలు ప్రదర్శనలు చేశారు. సైన్యం లాఠీలు, కొరడాలు నిరసనకారులపై వాడింది. మరోవైపున అవినీతి ఆరోపణలున్న కొందరు మంత్రులపై చట్ట పర చర్యలు తీసుకోవటం ప్రధాన మంత్రి తొలగింపు, రాజకీయ పరివర్తన త్వరితంగా ముగిస్తానన్న వాగ్దానంతో ప్రజలను బుజ్జగించచూసింది. ప్రజలకూ, సైన్యానికీ మధ్య ఘర్షణ, నిరసనోద్యమం కొనసాగుతున్నాయి.

కొన్ని నిర్థారణలు: ఈజిప్టులోని పరిణామాలు కొన్ని విషయాలను స్పష్టంచేశాయి. దశాబ్దాలపాటు ఈజిప్టు ప్రజలు దారిద్య్రం, నిరుద్యోగం, దోపిడీ, అభద్రత, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధిక ధరలు, అణచివేత, నిరంకుశ పాలన క్రింద నలిగిపోయారు. పేరుకుపోతున్న ఆగ్రహం అగ్ని పర్వతంలా పేలి నిరసనోద్యమం వెల్లువెత్తింది. దశాబ్దాల నిరంకుశపాలన పాలకవర్గాల్లో వైరుధ్యాలను తీవ్రంచేసి రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. మూడు దశాబ్దాల ముబారక్‌ నిరంకుశ పాలన ఈజిప్టును సామ్రాజ్యవాద ప్రత్యేకించి అమెరికా సామ్రాజ్యవాద దోపిడీ, అణచివేతలకు గురిచేసింది. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయిలు యూదు దురహంకారులతో సిగ్గులేకుండా రాజీపడింది. ప్రస్తుత నిరసనోద్యమం ఈ అంశాలను విమర్శించడకపోవటం, తన డిమాండ్లుగా చేర్చకపోవటం నిజమే. అయినా ప్రజలలో ముబారక్‌ పాలనపై అసంతృప్తి పెరగడానికి ఇవి కూడా తోడ్పడ్డాయి.

ముబారక్‌ పాలనపై తిరగబడేందుకు ట్యునీషియాలో బెన్‌ఆలీని పదవీచ్చుతుడ్ని చేసిన ప్రజా ఉద్యమం స్ఫూర్తినిచ్చింది. ఉత్సాహవంతులైన కొందరు యువకులు ఇంటర్నెట్‌ద్వారా దేశమంతటా సందేశాలు పంని అగ్నిరగిల్చారు. నిరసన ప్రదర్శనలు హఠాత్తుగా ఎలాంటి నిర్మాణ ప్రయత్నాలూ లేకుండా ప్రధానంగా ప్రారంభమయ్యాయి. ఒక నిరిష్ట రాజకీయ నాయకత్వమూ లేకుండింది. ఆంక్షలూ, నిషేధాలూ వుండటంతో ప్రజాఉద్యమానికి బహిరంగంగా, ప్రత్యక్షంగా నాయకత్వం వహించలేని స్థితిలో ప్రతిపక్షాలున్నాయి. ప్రధాన ప్రతిపక్షపార్టీ ముస్లిం బ్రదర్‌హుడ్‌ కూడా ఇదే స్థితిలో వుంది. నిసనోద్యమం ఊపందుకున్న తర్వాతే రాజకీయపార్టీలు దానితో కలిసాయి. ''ఏప్రిల్‌ 6 యువజనోద్యమం'' ముస్లిం బ్రదర్‌ హుడ్‌ మార్పుకోరకు ఈజిప్టు ఉద్యమం, మాది ఖాలిద్‌ సయీద్‌ ఉద్యమం. కపాయా(ఇకచాలు) ఉద్యమం వంటి సంస్థలు నిరసనోద్యమంలో చురుకుగా వున్నాయి. అవన్నీ కలిసి ఎల్‌ బరాడే నాయకుడిగా ''మార్పు కొరకు జాతీయ కూటమి'' అన్న ఐక్యవేదికను ఏర్పరచుకున్నాయి. ముబారక్‌ నిరంకుశ పాలన ముగియాలన్న , ఈజిప్టులో బూర్జువా ప్రసాజ్వామిక వ్యవస్థ ఏర్పడాలన్న డిమాండుపై ఈ శక్తులన్నీ చివరివరకూ ఐక్యంగా వున్నాయి. అదే సమయంలో పరిస్థిపై అంచనాలు, వైఖరులు, లక్ష్యాలలో అవి విబేధించాయి. ముబారక్‌ ఎత్తుగడలను ఎదుర్కోవటంలో వారి నాయకత్వంలో కొరవడిన ఐక్యత, రాజకీయ అసమగ్రత కూడా వ్యక్తమైంది.

ప్రజలు అత్యుహ్సంతో నాయకత్వమిచ్చిన పిలుపులకు స్పందించారు. సూయెజ్‌ నగరంలోనూ, నైలునదీ తీరానవున్న పారిశ్రామిక వాడల్లోనూ కార్మికులు తమ డిమాండ్ల సాధననకు సార్వత్రిక సమ్మె చేశారు. కొన్ని చోట్ల నిరసనోద్యమానికీ సంఘీభావంగా సమ్మె చేశారు. వేలాది మహిళలూ, పురుషులూ రోజుల తరబడి తహ్రీర్‌ స్క్వేర్‌లో బైఠాయించారు. ముబారక్‌ గూండాల నెదుర్కోవటంలో నిరసనకారులకు ప్రజలండగా నిలిచారు. వారికి నీరు. ఆహారం, అందించారు. వీధులలో వారికి స్వాగతం పలికారు. మహిళలు వెనుకనుండి వారికి రాళ్ళందించారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్సచేసి తాత్కాలిక అసుపత్రులకు తరలించారు. అసాంఘిక, గూండాశక్తుల జాతీయ సంపదను దోచుకునే ప్రయత్నాలను అడ్డుకున్నారు. పిల్లలు, యువత, మహిళలు వీధుల్లో పేరుకున్న చెత్తను తొలగించే పని కూడా ఉత్సాహంతో చేపట్టారు. ఒక్కమాటలో నిరసనోద్యమానికి ప్రజా స్వభావం వుంది. నిరంకుశపాలన ప్రజలనుండి ఏకాకి అయిపోయింది.

చివరి క్షణం వరకూ ముబారక్‌ గద్దెను పట్టుకునే వున్నాడు. ఇంకా అధికారాన్ని అంటిపెట్టుకుని వుంటే మరింత వినాశనకర ఫలితాలే తనకు వస్తాయన్న నిర్ణయానికొచ్చి తర్వాతే, ఈజిప్తులో పశ్చిమాసియాలో సామ్రాజ్యవాద ప్రయోజనాలకు హానికలగకుండా  వుండాలంటే ముబారక్‌ గద్దె దిగల తప్పదన్న నిర్థారణకు ముబారక్‌కు వత్తాసు పలికిన సామ్రాజ్యవాదులు వచ్చిన తర్వాతే ముబారక్‌ అధికారాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డాడు. తాను అధికారాన్ని బదలాయించిన సైన్యమూ, తాను నియమించిన ఉపాధ్యక్షడూ, ప్రధానమంత్రి ముబారక్‌కు విశ్వసనీయులు. అతని నిరంకుశపాలనకు మూలసంభాలుగా వుండినవారే. సామ్రాజ్యవాద, ప్రత్యేకించి అమెరికా సామ్రాజ్యవాద అనుకూల విధానాలను అమలు పరిపినవారే. పాలస్తీనీయులకు వ్యతిరేకంగా ఇజ్రాయిలు యూదు దురంహాకారులతో సిగ్గుమాలిన ఒప్పందాలు చేసుకున్న వారే.
ఈపిప్టులో ప్రజావ్యతిరేక, ప్రజాస్వామిక వ్యతిరేక, సామ్రాజ్యవాద అనుకూల విధానాలను రూపుదిద్దటంలో 1990ల నుండీ చురుకైన పాత్ర వహించిన ఒమర్‌ సులేమాన్‌నే ఉపాధ్యక్షుడిగా ముబారక్‌ నియమించాడు. అతడు అమెరికా బంటు. అమెరికా గుఢచారి సంస్థ ''అప్పగింత' కార్యక్రమం అమలులో ముఖ్యవాహకంగా పనిచేశాడు. ''అప్పగింత'' కార్యక్రమంమంటే ప్రపచంలో ఎకైడైనా అమెరికాను వ్యతిరేకిస్తున్న లేదా వ్యతిరేకిస్తున్నారని అనుమానించిన వ్యక్తులను ఎత్తుకొచ్చి అమెరికా గుఢాచిరి సంస్థ వారిని పశ్చిమాసియాలోని తమ అనుకూల ప్రభుత్వాలకు అప్పగిస్తుంది. ఆ ప్రభుత్వాలు వారిని హింసించి, ఒప్పందాల ప్రకటనలు రాబట్టుతాయి. లేదా చంపివేస్తాయి.
ముబారక్‌ అధికారాన్ని బదలాయించిన సైన్యం ఈజిప్టు రాజకీయాల్లో ప్రధాన పాత్రధారిగా వుంది. అమెరికాకు ఈ సైన్యంతో సన్నిహిత సంబంధాలున్నాయి; దానికి ద్రవ్యం సమకూరుస్తున్నది. అదెలా ప్రవర్తించాలో ఆదేశిస్తున్నది. నిరసనోద్యమం ఉచ్ఛస్థాయిలో వున్పప్పుడు ఈజిప్టు సైన్య ప్రధాన అధిపతి సామి హఫీజ్‌ అమెరికాలో వున్నాడు. ఈజిప్టుకు తిరిగి వచ్చేలాగా నిరసనోద్యమంతో ఎలా వ్యవహరించాలో అక్కడ పాఠాలు నేర్చుకుని వచ్చాడని పత్రికలే వ్యాఖ్యానించాయి. అమెరికా సామ్రాజ్యవాదులు ఈజిప్టు సైన్యాన్ని ''నిజమైన అధికార కేంద్రం''గానూ, అధికార బదలాయింపు క్రమాన్ని ఒడిదుడుకులు లేకుండా సాఫీగా నిర్వహించగల సామర్థ్యం వున్నదానిగానూ పరిగణించారు. నిరసనోద్యమం సాగిన 18 రోజులూ, ప్రజల ద్వేషానికి గురైన అంతరంగిక భద్రతాదళం కంటే తాను భిన్నమైన దానిగా నిష్ఫక్షనాతమైనదిగా చూపెట్టుకునేందుకూ సైన్యం నాటకాలాడింది. ప్రదర్శకులతో స్నేహాన్ని నటించింది. వారితో ఘర్షణ పడకుండా ఆగింది. సైన్యానికి అధికార బదలాయింపు జరగగానే, అది తన అసలు రూపు బయట పెట్టుకుంది. రాజకీయ పరివర్తనను ఈజిప్టు పాలక వర్గాలకూ, వారి సామ్రాజ్యవాద వత్తాసుదారులకు అనుకూలంగా మలిచేందుకు పూనుకుంది. సామ్రాజ్యవాద యాజమానులు నిర్దేశించిన పద్ధతిలోనే ఈజిప్టు సైన్యం వ్యవహరించింది.
వలసవాదులకూ, సామ్రాజ్యవాదులకూ పశ్చిమాసియా దేశాలు లాభాల పంట భూమిగా కన్పిస్తున్నాయి. అమెరికా తన ప్రపంచాధిపత్య వ్యూహంలో ఈ ప్రాంతాన్ని కీలకమైనదిగా పరిగణిస్తున్నది. అపార ముడిచమురు వనరులూ, ముఖ్యమైన సముద్ర మార్గాలూ ఇక్కడ వున్నాయి. మాతృభూమి కొరకు పాలస్తీనా ప్రజలు పోరాడుతున్నారు. లెబనాన్‌లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రాజీపడని శక్తిగా హిజ్‌బొల్లా వుంది. ఇరాక్‌ ప్రజలు అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అమెరికా ఆధిపత్యం ముందు లొంగిపోవటానికి ఇరాన్‌ ప్రజలు నిరాకరిస్తున్నారు. ఆప్ఘన్ల ప్రతిఘటన సాగుతూనేవుంది. అరబ్‌ దేశాలలో సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ ఉద్యమాలు అణచివేయలేని విధంగా సాగుతున్నాయి. ఇవన్నీ అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యానికి సవాలుగా వున్నాయి. 
నాజర్‌ అనంతరం, ప్రత్యేకించి ముబారక్‌ పాలనాకాలంలో ఈజిప్టు అమెరికా మితృడిగా వుంటున్నది. 1979లో ఇజ్రాయిలుతో శాంతి ఒప్పందమనే దానిని చేసుకుంది. ముబారక్‌ పాలనతో అమెరికా ఆయుధాలను కొనే దేశంగా ఈజిప్టు మారింది. ఇటీవల అమెరికానుండి 6 వేల కోట్ల డాలర్ల ఆయుధాల కొనుగోలుకు ఈజిప్టు అంగీకరించింది. ఈజిప్టు అంతరంగిక భద్రత కొరకు అమెరికా ప్రతియేటా 200 కోట్ల డాలర్లు సహాయంగా ఇస్తున్నది. ముబారక్‌ నిరంకుశ పాలనకు అమెరికా ఇన్నాళ్ళూ మద్దతునిస్తే వచ్చింది. పాలస్తీనా పోరాటాన్ని చీల్చి బలహీనపరచటంలో ముబారక్‌ ప్రభుత్వం ముఖ్య పాత్ర వహించింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగాన్ని తిరిగి ఇచ్చివేయవలసిన పరిస్థితి ఇజ్రాయిలుకు ఏర్పడినప్పుడు ఇజ్రాయిలు యూదు దురహంకారులకు తోడ్పడింది. పాలస్తీనా భూభాగాన్ని మరింత ఆక్రమించుకునే ధైర్యాన్ని ఇజ్రాయిలు కిచ్చింది. గాజా ప్రాంతంనుండి ఈజిప్టులోకి పాలస్తీనియన్లు రాకుండా 14 కి.మీ పొడవునా ముబారక్‌ ప్రభుత్వం గోడను కట్టింది. గాజా ప్రాంతాన్ని దిగ్బంధనం చేసే ఇజ్రాయిలు వ్యూహానికి తోడ్పడింది. ఈజిప్లులోని అమెరికా అనుకూల ప్రభుత్వం కూలిపోతే, ఇజ్రాయిలు పాలకులకు ఇబ్బందులు పెరుగుతాయి. పశ్చిమాసియాలో అమెరికా ఆయుధ వ్యాపారం దెబ్బతింటుంది. అమెరికా ప్రపంచాధిపత్య వ్యూహం అమలు మందగిస్తుంది.
కనుక ఈజిప్టులోని పరిణామాలు అమెరికా సామ్రాజ్యవాదులకు ఆందోళన కలిగించాయి. ముబారక్‌ను కాపాడేందుకు చివరిక్షణం వరకూ ప్రయత్నించాయి. ముబారక్‌ను నిలపటం సాధ్యం కాదని తేలిన తర్వాత అతన్ని తప్పించారు. అధికారం సైన్యానికి బదలాయింపు జరిగేట్లు చేసారు. రాజకీయ పరివర్తనను తన ప్రయోజనాలకనువుగా తిప్పేందుకు పూనుకున్నారు. ట్యూనీషియా పరిణామాలు వచ్చిన వెంటనే ఈజిప్టు సైన్యాధిపతి అమెరికా వెళ్లాడు. ఈజిప్టులో అలాంటి పరిస్థితే తలెత్తితే ఏంచేయాలో చర్చించాడు. నిరసనోద్యమం ఉచ్ఛదశలో వుండగా, ఈజిప్టులో అమెరికా గూఢచారిగా 40 ఏళ్లు పనిచేసిన ఫ్రాంక్‌ వీజ్నర్‌ను ఈజిప్టుకు ప్రత్యేక దూతగా అమెరికా పంపింది. సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదాలు, డిమాండ్లు నిరసనోద్యమం లేవనెత్తలేదు; అమెరికాకు విశ్వాసంగా వుండే వర్గానికీ రాజకీయ శక్తులకూ అధికార బదిలీ జరిగింది. గత ప్రభుత్వపు ఒప్పందాలన్నింటినీ గౌరవిస్తానని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. దీనితో అమెరికా ఈజిప్టుకు సహాయమందిస్తానని ప్రకటించింది.
అయితే అమెరికా నిర్ధేశించిన మార్గంలోనే ఈజిప్టులోని రాజకీయ పరిణామాలక్రమం సాగిందని చెప్పలేము. ఈజిప్టు ప్రజలు తమ అసంతృప్తినీ, నిరసననూ, ఆకాంక్షలనూ వ్యక్తపరచగల ప్రతి అవకాశాన్నీ వినియోగించుకున్నారు. సమగ్రతగల రాజకీయ నాయకత్వం లేకపోయినా, ప్రధానంగా అసంఘటితంగానే అప్రయత్నంగానే నిరంకుశ పాలనను వ్యతిరేకించారు. నిరసనోద్యమం ప్రజలకు ఒక పాఠశాల అయింది. తమ బలాన్నీ, బలహీనతలను గుర్తించేట్లు చేసింది. నిజమైన, బూటకపు మిత్రులను గుర్తించేట్లు చేసింది. శతృవు ఉపయోగిస్తున్న ఎత్తుగడలనూ, పద్ధతులనూ అర్థం చేసుకునేట్లు చేసింది. వలసవాదానికీ, సామ్రాజ్యవాదానికీ, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడిన అనుభవం ఈజిప్టు ప్రజలకుంది. పాలస్తీనా, ఇరాక్‌, ఆప్ఘనిస్తాన్‌, లెబనాన్‌ దేశాలలో సామ్రాజ్యవాద జోక్యం, పెత్తనం, బెదిరింపులు దురాక్రమణ విధానాలపై పోరాడుతున్న ప్రజలపట్ల సంఘీభావం వుంది.ఈజిప్టు ప్రజలు కూడా ప్రపంచీకరణ, ఆయుధ వ్యాపారం, టెర్రరిజంపై పోరు విధానాలతో పీడింపబడుతున్నారు. కనుక వారీ పోరాటాలనుండి తగిన గుణపాఠాలు తీసుకుంటారు. నిరసనోద్యమం ఇంకా సాగుతున్నది. ఒక నిరంకుశ పాలకుడు తొలగినంతనే ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థకు పరివర్తన ముగియలేదని వారు గుర్తించారు. ప్రజాస్వామ్యానికి శతృవులపై చైతన్యయుత, నిర్మాణయుత నిరంతర పోరాటం లేకుండా చిన్న విజయాలను కూడా నిలబెట్టుకుని, అనుభవించటం సాధ్యం కాదు. నిరంకుశ పాలనకు మూలస్థంబాలుగా వున్న భూస్వామ్య విధానానికీ, సామ్రాజ్యవాదానికీ వ్యతిరేకంగా నిరంతరరాయ పోరాటం సాగించకుండా నిజమైన అర్థంలో ఈజిప్టులో ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పటం సాధ్యంకాని పోరాట జీవిత అనుభవం నుండి ఈజిప్టు ప్రజలు గుర్తిస్తారని ఆశిద్దాం.

No comments :

Post a Comment