చీకటి బతుకులు - సెక్స్ వర్కర్స్ తో ఇంటర్వ్యూ

No comments

''అందమైన లోకమని రంగురంగులుంటాయని...
అందరూ అంటుంటారు రామ రామా....
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా...''
అంటూ ఆచార్య ఆత్రేయ లోకం గురించి 1979లో రాశాడు.
      దేశం వెలిగిపోతుంది, అభివృద్ధివైపు దూసుకెళుతున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్న దేశంలో ఆడది అంగడి సరుకుగా మారిపోయింది. ఒక వైపు పాలకులుగా, చట్టసభలకు నాయకులుగా మహిళలు ఉన్న సందర్భంలోనే దేశ నిర్మాణంలో భాగం పంచుకోవాల్సిన 3 కోట్ల మంది మహిళలు, బాలికలు నేడు నరక కూపంలాంటి వ్యభిచారంలో మ్రగ్గుతున్నారు. వీరిలో దాదాపు 60 శాతం మంది అట్టడుగు కులాలకు చెందిన వారు, 30 శాతం మంది 18 ఏండ్లు నిండని బాలికలు ఉన్నారు. 66 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో, పాలకుల నిర్లక్ష్యం మూలంగా బ్రతకడానికి ఆధారం లేకజానెడు పొట్ట కోసం, కుటుంబాన్ని పోషించుకోవడానికి, పిల్లల భవిష్యత్కోసం గత్యంతరం లేక ఆడది తన శరీరాన్నే పరాయివాళ్ల చేతిలో పణంగా పెడుతున్నారు. దేశంలోని ప్రతి నగరంలో ఇలాంటి వాళ్ళు నిత్యం మనకు కనిపిస్తారు. హైదరాబాద్నగరాన్ని అభివృద్ధి చేశామని, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లామని  గొప్పలు చెప్పుకుంటున్న సమయంలో రాష్ట్ర రాజధానిలోని సికింద్రాబాద్రైల్వే స్టేషన్‌, మహాత్మాగాంధీ బస్స్టాండ్‌, పంజాగుట్టా, ట్యాంక్బండ్‌, దిల్సుఖ్నగర్‌, ఆర్టీసీ క్రాస్రోడ్‌, ఇందిరా పార్క్లాంటి చాలా సెంటర్స్లో ఇలాంటి మహిళలు వందలాది మంది కనిపిస్తారు.


విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్రాసినట్లు...

''తను శవమై, ఒకరి వశమై
తనువు పుండై ఒకరికి పండై
ఎప్పుడూ ఎడారై
ఎందరికో ఒయాసిస్సై '' 
జీవచ్ఛవల్లా బతుకుతున్నారు.
      వ్యభిచారాన్ని జీవనోపాధిగా స్వీకరించి బహిరంగంగా తిరుగుతున్న వాళ్లు నగరంలో రెండు రకాలుగా కనిపిస్తున్నారు. కొందరు ఎవరికి వారు ఒంటరిగా వ్యాపారాన్ని చేసుకుంటుంటే, గ్రూపులుగా ఏర్పడి వ్యాపారాన్ని  కొనసాగిస్తున్న వారు ఇంకొందరు. కాకినాడ, వైజాగ్‌, రాజమండ్రి వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా గ్రూపులుగా ఉంటే హైదరాబాద్చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు మాత్రం ఒంటరిగానే వ్యభిచారాన్ని చేస్తున్నారు. గ్రూపుల కింద ఉండేవారు నెలసరి కాంట్రాక్ట్కింద ఒక నిర్వాహకురాలి కింద వ్యభిచారాన్ని జీవనోపాధిగా స్వీకరిస్తున్నారు. వాళ్ల ఫుడ్డ్‌, బెడ్అంతా చూసుకుంటాను అనే పేరుతో ఒక్కొక్క మనిషి మీద నిర్వాహకురాలు ఈజీగా 30 వేలు సంపాధిస్తుంటే, ప్రతి రాత్రీ 6 గురు మనుషులకు తన శరీరాన్ని పణంగా పెట్టే వీళ్లకు మాత్రం నెలకు పదిహేను వేల రూపాయలు మాత్రమే మిగులుతాయంటారు.       
     తమ పిల్లల చదువులు సాగాలన్నా, తమ భర్తలు చేసిన అప్పులు తీరాలన్నా కష్టాలు తప్పవంటారు. వ్యభిచారిన్ని జీవనాధారంగా నమ్ముకొని నాలుగు గోడలు దాటి నగరం బాట పట్టిన ప్రతి ఆడవారి వెనుక ఒక విషాదమైన జీవితం దాగుంది. జీవితాన్ని నమ్ముకున్న వాళ్లలో పదిహేనేళ్ల బాలికల నుంచి 45 ఏండ్ల ఆడాళ్ల వరకు ఉన్నారు. వీళ్లు శరీరాన్ని పణంగా పెడుతున్నా చాలా సార్లు కష్టమర్లు డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నాయంటున్నారుతాగుబోతుగాళ్లు హత్యలు, హత్యాచారాలు చేసిన సంఘటలు కూడా ఉన్నాయి. ప్రతి రోజు వృత్తికోసం రోడు్డపౖకి వచ్చాక  తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతామనే నమ్మకం లేదంటున్నారు వీళ్లు. అయితే రోడ్డుమీదకు వచ్చే ఆడాళ్లకు గుట్టుచప్పుడు కాకుండా హోటళ్లలో వ్యభిచారాన్ని నిర్వహించే కాల్గర్స్కు చాలా తేడ ఉంది. వీళ్లంతా తమ కుటుంబ పోషణ కోసం వృత్తిని ఎంచుకుంటే హోటళ్లలో వ్యభిచారం చేసే కాల్గర్స్ల్లగ్జర్లకు, ఫ్యాషన్లకోసం శరీరాన్ని అమ్ముకుంటుంటారు. రోడ్లమీద వ్యభిచారం చేసుకునే వాళ్లు సిటీ మొత్తం మీద మూడు వేల మంది ఉంటే, కాల్గర్స్ల్మాత్రం  ఐదు వేల మందిపైగానే ఉన్నారంటున్నారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. ఇలా హైదరాబాద్లోని ఒక్కో సెంటర్ఒక కథ చెబుతుంది. వెలుగులో ఉండేవారు చీకట్లో బతుకుతుంటే, చీకట్లో ఉండేవాళ్లు వెలుగుకోసం తపిస్తున్నారు. నాలుగు గోడల మధ్య రహస్యంగా సంసారం చేసుకునే ఆడవాళ్లు రోడ్లపాలు కావడం వెను ఒక్కోక్కరిది ఒక్కో కథ...హైదరాబాద్అభివృద్ధి వెలుగు నీడలవెనుక దాగున్న చీకటి బతుకులను పాఠకుల దృష్టికి తీసుకొచ్చెందుకు ముగ్గురం మిత్రులం ఒక పత్రిక కొసం హైదరాబాద్ నగరంలోని కొంతమంది సెక్స్ వర్కర్స్ తో చేసిన ఇంటర్వ్యూ ఇక్కడ.



స్థలం : సికింద్రాబాద్రైల్వే స్టేషన్
#మీ గురించి చెప్పండి, మీది ఊరు? ఇందులోకి ఎలా వచ్చారు?
నా పేరు నాగమణి (పేరు మార్చాము). నా వయసు 38 సంవత్సరాలు. మాది కాకినాడ దగ్గర. మా ఇంట్లో ముగ్గురం ఆడపిల్లలం.నా చిన్నప్పుడు నాన్న రోజు పనికి పోయేవాడు. కానీ ఎందుకో కొన్ని రోజుల తర్వాత పనిదొరకడం లేదని చాలారోజులు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాడు. మా అమ్మ ఇండ్లల్లో పనికిపోయేది. మా నాన్న పనికిపోకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడని రోజు గొడవ జరిగేది. ఒక రోజు ఏమైందో ఏమో బయటకు వెళ్ళిన మా నాన్న ఇంటికి తిరిగి రాలేదు. తర్వాత తెలిసింది. ఆయన ఇంకో మా అమ్మను వదిలిపెట్టి ఆంకో ఆమెతో ఉంటున్నాడని. అప్పుడు నాకు 12 ఏండ్లు. తర్వాత మా అమ్మె కష్టపడి పెద్దచేసింది. అప్పుచేసి నా కన్న పెద్దామే పెండ్లి చేసింది. కొన్నేండ్లుకు పట్నంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి వచ్చి నన్ను పెండ్లి చేసుకుంటానని చెబితే 16 ఏండ్లప్పుడు నా పెళ్లిచేశారు. కానీ ఇక్కడికు వచ్చిన కొంతకాలానికే తెలిసింది ఆయన మాంచి వ్యక్తి కాదని, అమ్మాయిలను వృత్తిలోకి తీసుకొచ్చి అమ్ముతున్నాడని. రోజు నన్ను బాగా కొట్టేవాడు. రెండు మూడు రోజులు తిండికూడా పెట్టలేదు. కొన్ని రోజల తర్వాత ఎవరో వస్తే వాళ్లకు అప్పగించాడు. అప్పుడు నేను కడుపుతో ఉన్నాను. వాళ్ళు నన్ను 'పూనే'కు తీసుకపోయి ఒకామెకు అమ్మేశారు. అదే నేను మొదటి సారి ప్రాంతాన్ని చూడటం, అక్కడకు నాలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. అక్కడ నాకు వాళ్లభాష తెలియదు, ఎవరికితో మాట్లాడాలో కూడా తెలియదు. చాలా సార్లు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించా కానీ కుదరలేదు. పారిపోవాలని ప్రయత్నిచిన ప్రతి సారి బాగా కొట్టేవాళ్లు. కొంత కాలానికి అక్కడున్న తెలుగు వాళుపరిచయం కావడంతో, కొంత ధైర్యం వచ్చింది. వాళ్లతోపాటే రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నా.

#మరి ఇక్కడకు ఎలా వచ్చారు?
పోయిన సంవత్సరం మన రాష్ట్రం నుంచి అమ్మాయిలను బలవంతగా ఎత్తుకొచ్చి అక్కడకు అమ్మేస్తున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మన రాష్ట్రం పోలీసులు రైడ్చేసి 39 మంది తెలుగు వాళ్ళను ఇక్కడకు తీసుకొచ్చారు. అట్లా మళ్లీ ఇక్కడకు తిరిగొచ్చాను.


(telugu girls rescued from pune)
#ఇక్కడకు వచ్చాక ఇందులోనే ఎందుకున్నారు. ఏదైనా పనిచేసుకోవచ్చుగా?
మొదట ఏదైన పనిచేద్దామని ప్రయత్నించాం కానీ ఒకరోజు పనిదొరుకుతే ఇంకోరోజు దొరికేది కాదు. పైగా మా గతం తెలిశాక మేము ఇట్లాంటి వాళ్ళమని ఎవ్వరూ పనికి ఇచ్చేవారు కాదు. వృత్తిలో ఉండటం వలన ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఇక్కడకు వచ్చాక స్వచ్చంధ సంస్థ వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొంత కాలం మందులు కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెపుతుంటారు. చేసుకోవడానికి పని దొరకపోవడంతో రెండు మూడు రోజులకు ఓసారి పనిలోకి వస్తాను

స్థలం : ట్యాంక్బండ్
#మీ గురించి చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు?
నాపేరు లక్ష్మీ (పేరు మార్చాము) మాది వరంగల్జిల్లా. ఇంట్లో మొత్తం 6 పిల్లలం. 5గురం అమ్మాయిలం. ఒక్క బాబుమా అమ్మ మా ఆరోగ్యం బాగాలేక మా చిన్నప్పుడే చనిపోయింది. మాకు కొంత పొలం ఉండే దాన్ని మా అమ్మకు హాస్పిటల్లో చూపించడానికి అమ్మెసిండు. పనిచేసుకోవడానికి పొలం కూడా లేకపోవడంతో మా నాన్నే కూలీకి పోయేవాడు. అది మేము తినడానికి సరిపోయేది కాదు. కొన్ని సార్లు చేసుకోవడానికి పనులు దొరకపోయేది. దాంతో మేము చాలా సార్లు పస్తులున్నాం. నాకు 15 ఏండ్లప్పుడు నాకంటే వయసులో పెద్దాయనతో నా పెళ్లి చేశారు. అప్పుడు నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. సంవత్సరం తిరగకముందే ఒక బాబు పుట్టాడు. పిల్లగాడు (కొడుకు) పుట్టిన కొన్ని రోజులకే పోలియో సోకడంతో సరిగ్గా నడవడం రాదు. తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. పెండ్లి చేసుకున్న ఆయన సరిగ్గా చూసుకునేవాడు కాదు. కనీసం ఇంట్లోకి కూడా ఏవీ తెచ్చేవాడు కాదు. దీని గురించి మా నాన్న మాట్లాడితే తాగి గొడవచేసేటోడు. నన్ను బాగా కొట్టేవాడు. ఆయన్ని భరించలేక పిల్లలతో దూరంగా ఉంటున్నాను. ఊర్లో పనిదొరకక, ఇబ్బంది పడుతుంటే తెలిసిన ఒక ఆమె ఇక్కడ (హైదరాబాద్‌)పనిచేసేది. ఇక్కడ ఇబ్బంది పడేకన్నా హైదరాబాద్కు వస్తే ఏదైనా పని చూపిస్త కదా అంటే ఇక్కడకు వచ్చాను. ఇక్కడకు వచ్చాక ఆమె పనిచూపించింది. ఇక్కడ బతకాలంటే ఇంతకన్నా వేరే మార్గం లేదని చెప్పింది. కానీ నాకు నచ్చక కొంత కాలం ఇండ్లల్లో పనిచేశాను. కానీ బతకడానికి, ఇళ్లు కిరాయికి డబ్బులు సరిపోయేవి కావు. ఇండ్లల్లో పనిచేస్తున్నా డబ్బులు సరిపోకపోవడంతో మళ్లీ ఆమె ద్వారానే వృత్తిలోకి వచ్చాను. వారానికి రెండు మూడు రోజులు ఇలా చేస్తాను. వృత్తిలోకి వచ్చి ఇప్పటికి పది సంవత్సరాలైంది.
#మీ పిల్లలకు, మీ బంధువులకు మీరు పనిచేస్తున్నావని తెలుసా?
తెలియదు. వాళ్లకు హస్పిటల్లో పనిచేస్తున్నానని చెప్పాను. అందరూ హస్పిటల్ల్లోనే పనిచేస్తున్నాననే అనుకుంటున్నారు.
#మరి, మీరు పనిలో ఉన్నారని మీ పిల్లలకు తెలిస్తే ఏంటి పరిస్థితి?
ఏం చేస్తాం. ఇప్పడివరకైతే తెలియకుండా జాగ్రత్తగా ఉంటున్నాం. తెలియకుండా చూసుకోవాలి. ఒక రోజు మేము పనిలో ఉంటే పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. రాత్రంతా పోలీసు స్టేషన్లోనే (గోపాల్పురం పోలీసు స్టేషన్‌)ఉంచి ఇబ్బంది పెట్టారు. మరుసటి రోజు మధ్యాహ్నాం విడిచిపెట్టారు. అప్పుడు మాత్రం ఇంట్లో తెలుస్తుందేమో అని చాలా భయపడ్డాం. కానీ ఏదో రాసుకొని విడిచిపెట్టారు.
#ఇది ప్రమాధకరమైనది కదా దీని నుంచి బయటపడాలని మీకు అనిపించలేదా?
చాలా సార్లు అనిపిస్తుంది. కానీ దీన్ని కూడా వదులుకుంటే బతకడం కష్టం. పిల్లలను మంచి జీవితాన్ని ఇచ్చేందుకైనా మేము కొంతకాలం ఒళ్లమ్ముకోవాల్సిందే.
#ప్రభుత్వం ఏదైనా ఉపాధి చూపిస్తే దీన్ని మానేస్తారా?
మానేయాలనే ఉంది. కానీ చదువుకోనోల్లకు మాకేం పనిచూపిస్తుంది?  వృత్తిలో నా జీవితం ఎలాగు నాశనమైంది. కనీసం నా పిల్లల జీవితమైనా బాగుండాలని వాళ్ళను చదివిస్తున్నా


స్థలం : దిల్సుఖ్నగర్.
#మీగురించి చెప్పండీ? ఇందులోకి ఎలా ప్రవేశించారు?
నా పేరు జయమ్మ, మాది నల్గోండ జిల్లాలోని నకిరేకల్‌. అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోవడం వల్లా మా అమ్మమ్మా, తాతయ్యల దగ్గరే పెరిగాను. నేను పదోతరగతి చదువుతుండగా మా మేనమామ నాకు పెళ్లిసంబంధాలు చూడం మొదలెట్టాడు. ఏవో తిప్పలు పడి ఇద్దరక్కలకు ముడిపెట్టి పంపించారు. నా వరకు వచ్చేసరికి కట్నం ఇవ్వలేక రెండోపెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మా ఇంటి పక్కన ఒక ఇంజనీరు దగ్గర పనిచేసే సాగర్తో నాకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మా ఇద్దరి విషయం ఇంట్లో తెలిసి గొడవ చేశారు. దాంతో మేమిద్దరం ఎవరికీ చెప్పకుండా పారిపోయి యాదగిరి గుట్టలో పెళ్ళిచేసుకున్నాం. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్వచ్చి ఉప్పల్లో స్థిరపడ్డాం. పెళ్ళి తర్వాత అతనికీ, నాకు పుట్టింటి వాళ్లతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రెండేళ్లపాటు బాగానే చూసుకున్నాడు. పాప పుట్టాక, తన అసలు రూపం బయటపడింది. రెండు నెలలపాటు పనీ చేయకుండా ఖాళీగా ఉన్నాడు. ఇంట్లోకి సరుకులు కూడా తేలేదు. ఇలాగైతే ఎలా మనం బతకడమెలా? అని నిలదీస్తే 'పట్టణంలో గొప్పగా బతకాలంటే నువ్వు వ్యభిచారం చేయాలి' అన్నాడు. కట్టుకున్నవాడు అలా మాట్లాడితే ఏం చేయాలో అర్థం కాలేదు, నమ్మినవాడి చెయ్యి పట్టుకుని మోసపోయినందున బోరున ఏడ్చాను. నా వాళ్లకు చెప్పుకుందామంటే వారిని కాదనుకుని వచ్చాను. పోనీ ఉన్నచోటే ఏదైనా పనిచేసుకుని బతుకుదామంటే ఒంటరిగా బతికే ధైర్యం లేదు. కొన్ని రోజులపాటు అతనితో పోట్లాడి బతికాను. తర్వాత బిడ్డను బతకనివ్వనంటూ బెదిరించాడు. దాంతో చేసేదిలేక అతని చెప్పినట్లే విన్నాను. రెండ్లేపాటు నన్ను ఇంట్లో బంధించి నాతో వ్యభిచారం చేయించాడు. తర్వాత సికింద్రాబాద్దగ్గరున్న వ్యభిచారగృహాలకు తనే స్వయంగా తీసుకెళ్లేవాడు. అక్కడ సాగర్లాంటి వారు చాలామంది కనిపించారు.
#మరి మీరు ఇందులోనుంచి బయటపడాలని అనుకోవడంలేదా?
చాలామంది బలవంతగా వృత్తిలోకి వస్తున్నారు. వచ్చాకా అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఆరోగ్యం పాడవుతుంది. అందుకే నా జీవితం ఎలాగూ పాడైంది కాబట్టి ఇంకొకరి జీవితం పాడుకాకూడదని, ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ వృత్తిలో ఉన్న వాళ్లు ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రచారం చేస్తుంటాను. నాలాంటి సెక్స్వర్కర్కుకు మంచి చెడు చెబుతుంటాను. సేఫ్సెక్స్పద్దతుల గురించి వివరిస్తుంటాను. వాళ్ళను తీసుకెళ్ళి ఆరోగ్య పరీక్షలు చేయిస్తుంటా. హెచ్ఐవి బారిన పడితే మందులు వాడేలా వారికీ ధైర్యం చెబుతుంటా. ఒకప్పుడు సెక్స్వర్కర్ల వలె హెచ్ఐవి వ్యాప్తి చెందిందనే ప్రచారం ఉండేది. కానీ ఇపుడు మేమే హెచ్ఐవి/ ఎయిడ్స్వ్యతిరేక ప్రచారంలో పాల్గోంటూ హెచ్ఐవి తగ్గుముఖం పట్టేందుకు కృషి చేస్తున్నార.

#దీంట్లో చాలా కాలంగా ఉన్న మీరు, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలో కూడా పనిచేస్తున్నారు కదా? దీంట్లో ఎదురయ్యే సమస్యల గురించి వివరించండి.
ఇదొక నరకకూపం లాంటి జీవితం. బతకడానికి ఒళ్ళు అమ్ముకునే వాళ్ళంటే ప్రతి ఒక్కరికి చులకనే. డబ్బులిస్తున్నాం కదా అని చాలామంది మగాళ్ళు మృగాలుగా ప్రవర్తిస్తారు. డబ్బుల కోసం పనిచేస్తున్నా మేము కూడా మనుషులమే కదా? కానీ మా దగ్గరకు వచ్చే కష్టమర్లు (విటులు) నీచంగా ప్రవర్తిసారు. ఆరోగ్యం పాడుకాకూడదని మా సంఘాల్లో ( సెక్స్వర్కర్స్బాధితుల కోసం స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన సంఘం) చెప్పినట్లు కండోం వాడమని మా దగ్గరకు వచ్చిన వాళ్ళతో చెబితే చాలా మంది ఒప్పుకోరుకొందరైతే వాళ్ల రూంల్లోకి తీసుకెళ్ళి ఏదో సినిమాలు చూపిస్తూ (నీలి చిత్రాలు) మాతో ఆవిధంగా మృగవాంఛ తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు. కాదంట్లే నోటికొచ్చినట్లు తిడుతుంటారు. కావాలంటే డబ్బులు ఎక్కువ తీసుకొమ్మంటూ విసిరేస్తుంటారు. ఇంకొందరూ మాతో పనిపూర్తిచేసుకొని డబ్బులు ఇవ్వకుండా మాపైనే దాడులకు పాల్పడుతుంటారు.

స్థలం : స్వచ్ఛంద సంస్థ ఆఫీస్‌ - సికింద్రాబాద్‌.
# సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది. మొత్తం నగరంలో వ్యభిచార కూపంలో ఎంత మంది ఉన్నారు. మీ సంస్థలో ఎంతమంది సభ్యులుగా ఉన్నారు.
హైదరాబాద్నగరంలో దాదాపు 3000 మందికి పైగా మహిళలు వృత్తిలో ఉన్నారు. మా సంస్థలో 750 మంది సభ్యులు ఉన్నారు. చాలా మంది మహిళలు నమ్మిన వాళ్ళచేతుల్లో మోసపోయి వృత్తిలో చిక్కుకున్న వారు ఉన్నారు. ఇంకొంత మంది కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆర్థికస్తోమత  లేకపోవడం వలన, పని దొరకపోవడం  వలనఈ వృత్తిని ఎంచుకున్నవాళ్ళు ఉన్నారు. వ్యభిచార కూపంలో చిక్కుకొని చాలా మంది తన ఆరోగ్యాన్ని పాడుచేసుకొని మృత్యువాత పడుతున్నారు. ఇట్లాంటి వారికి చేయూత ఇవ్వాలనే మేము సంస్థను స్థాపించార. కొందరికి ప్రత్యామ్నాయ పనుల్లో శిక్షణకూడా ఇస్తున్నాం.
#ఒక సంస్థ నిర్వాహకులుగా వ్యభిచార గృహంలో ఉండి వ్యభిచారంలో ఉన్న వాళ్ళకు, బయట రోడ్లపై ఉండేవాళ్ళకు తేడా ఏంటీ?
వ్యభిచార గృహాలలో ఉన్న అమ్మాయిలు చాలా మంది బలవంతగా వృత్తిలోకి నెట్టివేయబడిన వాళ్ళే. దేశ వ్యాపితంగా ఇట్లాంటి గృహాలు చాలా ఉన్నాయి. ఢిల్లీ లోని 'జీబిరోడ్‌', కలకత్తాలోని 'సోనగాచి', ముంబాయ్లోని 'కామటిపూర', పూణే లోని  బుధవార్పేట్లలో వేలాది మంది మహిళలను బలవంతగా వృత్తి చేయిస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళు దాదాపు వివిధ రాష్ట్రాలనుంచి అక్రమంగా తరలించబడి ఇక్కడకు అమ్ముడుపోయిన వాళ్ళే. వాళ్ళకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. కుటుంబాలతో సంబంధాలు ఉండవు. ఒక చోట డిమాండ్అయిపోతే మరోచోటకు తరలించబడతారు. ఆరోగ్యం కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉండదు. హెచ్ఐవి బారిన పడితే రోడ్డుమీదకు నెట్టేస్తారు. అదే రోడ్లమీద ఉండి, స్వతంత్రంగా వృత్తిచేసే వాళ్థైతే ఆరోగ్యం కాపాడుకుంటూ, రహస్యంగా వృత్తి చేసుకొంటూ కుటుంబ సభ్యులతో ఉంటుంటారు. స్వతంత్రంగా వృత్తిచేసే వాళ్ళకు మిగితా వాళ్ళతో పోలిస్తే కొంత మేరకు స్వేచ్ఛ వుంటుంది.

ప్రొ|| అంజూ అగర్వాలు, సోషయాలజిస్టు - ఢిల్లీ యూనివర్సిటి.
#అసలు వ్యభిచారాన్ని వృత్తిగా గుర్తించవచ్చాంటారా?
వ్యభిచారాన్ని ఎంత మాత్రం వృత్తికాదుఅది డబ్బు మారకం ద్వారా జరిగే లైంగిక దోపిడి, డబ్బు చెల్లించి చేసే అత్యాచారమిది. ఇది అంతర్గతంగా మహిళలకు హానికరమైనది. బాధకరమైనది. 90 శాతం మంది మహిళలు నరకకూపంలోనుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ నిర్ణయం తీసుకునే శక్తి తమ చేతుల్లో లేకపోవడం మూలంగా వారు అక్కడే ఉంటున్నారని అనేక సంస్థల సర్వేల ద్వారా తెలుస్తుంది.
#అసలు వ్యభిచారంలోకి మహిళలు ఎందుకు వస్తున్నారు. మధ్య కాలంలో మధ్యతరగతి మహిళలు కూడా కాల్గర్స్ల్గా మారుతున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణాలేంటి?

(call girls arrested by mumbai police)
వ్యభిచారం వృత్తిలోకి వచ్చినవారిలో చాలామంది తమను, తమ పిల్లలను పోషించుకోవడానికి ఆధారం దొరకకపోవడం, వివాహం విచ్చిన్నం కావడం, కుటుంబ సభ్యులు ఆదరించకపోవడం, ఇంట్లో నుంచి గెంటివేయడం తదితర కారణాల వలన మహిళలు అనివార్య పరిస్థితిలో వృత్తిని ఎంచుకుంటున్నారని అనేక స్టడీస్చెబుతున్నాయి. ఇక మధ్య తరగతి మహిళలు వృత్తిలోకి రావడానికి ప్రధాన కారణం. వ్యవస్థలో వస్తున్న మార్పులు. పెరుగుతున్న వినియోగదారి విధానం. భారతీయ మహిళలు ఉన్నత స్థానాన్ని కోరుకునే క్రమలో అనేక ఒత్తిడిలకు గురవుతున్నారు, సులభంగా డబ్బు సంపాధించేందుకు కూడా చదువుకున్న అమ్మాయిలు, మహిళలు కాల్గర్ల్గా మారుతున్నారు. అయితే గత దశాబ్దం క్రితం ఇది యూరోపియన్దేశాల్లోనే చూశాం మనం. అతి తక్కువ కాలంలో ఇది మన దేశానికి విస్తరించింది.

#కొన్ని స్వచ్ఛంద సంస్థలు వ్యభిచారం చేసే వాళ్ళకు లైసెన్స్ఇవ్వాలని డిమాండ్చేస్తున్నాయి? దీనిని సమర్థించవచ్చంటారా?

ఇలా డిమాండ్చేస్తున్న వాళ్ళు గతంలో లో కలకత్తాలో కార్నివాల్లాంటి ఉత్సవాన్ని నిర్వహించడం మనం చూశాం. వాస్తవానికి వాళ్ళ డిమాండ్వెనుక ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే. చాలా కాలంగా వ్యభిచారాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వాలు (వామపక్ష ప్రభుత్వాలు సహితం) విఫలమయ్యాయి. ప్రభుత్వ ఆర్థిక విధానాల మూలంగా ఎలాంటి ఉపాధి దొరకపోవడం మూలంగా వృత్తిలోకి ఇంకా ఎక్కువమంది నెట్టివేయబడుతున్నారు  కాబట్టి కనీసం లైసెన్స్ఇస్తేనన్న వాళ్ళకు ప్రభుత్వ పరంగా మెడికల్ఫెసిలిటి మరియు కార్మిక చట్టాలు మొదలైనవి పొందవచ్చు అనే ఉద్దేశ్యంతో అడుగుతున్నారు. చాలా దేశాల్లో వ్యభిచారాన్ని లీగలైజ్చేశారు కాబట్టి, అనుభవాల ద్వారా డిమాండ్వస్తుంది. కానీ ప్రభుత్వాలు దీన్ని నిర్మూలించడంలో విఫలమైనంత మాత్రాన దీన్ని లీగలైజ్చేయడమనేది సరైనది కాదు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి నిర్మూలించడం ఒక్కటే మార్గం.

వ్యభిచారం అనేది కుట్టుపనీ, నేతపనీ, వడ్రంగం పనీ వంటి వృత్తే అయితే. వృత్తుల్లాగే ఇది (వ్యభిచారం) కూడా సమాజానికి ఎప్పుడూ కావాలి. ఇంటింటికి కావాలి. కానీ సెక్స్అనేది శరీర ధర్మం. శరీర ధర్మాలేవీ శ్రమలు కావు. శ్రమలు కానీవేవీ వృత్తులు కాలేవు. వృత్తిగా కనపడే ప్రతీదీ వృత్తి కాదంటుంది ప్రముఖ రచయిత్రీ రంగనాయకమ్మ.

ప్రముఖ కవి. సిని రచయిత డాక్టర్సి. నారాయణ రెడ్డి రాసినట్లు.
ఎవరు వీరు ఎవరు వీరు...
దేశ మాత పెదవిపైన మాసిన చిరునవ్వులు..
మనసులేని పిడికిలిలో నలిగిన పువ్వులు...

ఎవరు వీరు ఎవరు వీరు
ఆకలికి అమ్ముడుపోయిన అపరంజి బోమ్మలు..
చెక్కిలి వన్నెలు చిరిగిన చిగురాకు కొమ్మలు...
నవ్వలేక ఏడ్వలేక నిట్టూర్చే శవాలు.
నడిచే జీవచ్చవాలు

ఎవరో కాదు వీరెవరో కాదు
మనిషే దిగజార్చిన పతితలు..
ఎవరో తెలుసా
మన రక్తం పంచుకున్న ఆడపడచులు
మనం జారవిడుచుకున్న జాతి పరువులు.

      ప్రకృతి పరంగా స్త్రీ, పురుషుల మధ్య ప్రేమతో ఉండాల్సిన శారీరక ధర్మం పెట్టుబడిదారీ విధానం వల్ల, పితృస్వామ్య వికృత రూపం మూలంగా అనివార్యపరిస్థితిలో మహిళలు వ్యభిచారంలోకి నెట్టివేయబడుతున్నారు. ప్రాచీన సమజాల్లో అమోదం పొందిన వ్యభిచారం మోనోగమీ మూలంగా ఆదర్శంగా మారి దాన్ని అసహించుకునే స్థితికి వచ్చింది. కానీ నేడు అర్థ,భూస్వామ్య, అర్థ పెట్టుబడిదారి విధానానికి పురుష్యాధిపత్యం తోడవ్వడం మూలంగా తమపై ఆధారపడిన మహిళల్నే అమ్మేసే స్థితికి చేరుకున్నారుఒక అమాయకమైన మహిళను, తను నిండుగా ప్రేమించిన మనిషే తనను అమ్మేసే స్థితికి వచ్చినప్పుడు  మనుషుల మీదా, సమాజం మీదా, సున్నితమైన భావాలమీదా నమ్మకాన్ని పొగొట్టుకుంటుంది. ఇక మహిళకు మిగిలేదంతా బతుకు పోరాటమే. పోరాటంలో అనివార్యంగా ఇటువైపు నెట్టబడుతుంది. దీనికి లైసెన్సులిచ్చినా, ఇవ్వకపోయినా వృత్తిలోకి వచ్చేవాళ్ళు పెరగటమే తప్ప తరగటం ఏమీ ఉండదు. పితృస్వామ్య సమాజ వికృత రూపం మూలంగా రకరకాల సమస్యలతో వ్యభాచారంలో కూరుకుపోయిన మహిళలకు విముక్తి లభిస్తే తప్పా దీనికి పరిష్కారం దొరకదు. దిశగా ఉద్యమాలు జరగాలి. మహిళలను కూడా సమానంగా చూసే సమాజం కోసం పోరాటం నిర్వహించాలి.

No comments :

Post a Comment