బతుకుపోరులో ... ఓయూ ''స్వీపర్స్‌''

No comments

ఫోటో గూగుల్ నుంచి సేకరణ
ఇళ్లు అందంగా ఉందంటే  గొప్పతనం  ఇంటి ఇళ్లాలికే చెందుతుంది.అలాగే యూనివర్సిటీ అందంగా ఉందంటే కూడా  క్రెడిట్‌ అంతా యూనివర్సిటీలో పనిచేసే మహిళలకే చెందుతుంది.దేశంలోనే అతి పెద్ద యూనివర్సిటైన ఓయూను తమ సొంత ఇంటిలా భావించి అద్దంలా తీర్చిదిద్దుతున్న వర్కర్స్ జీవితాల గురించి చాలామందికి తెలియదు. ఒక్కరోజు మన ఇళ్లు శుభ్రంగా లేకుంటే ఎంత చిరాగ్గా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఒక పదిరోజులు మన స్వీపర్స్డ్యూటీ చేయకుంటే ఎలాగుంటుందో ఊహించుకోండిఊహే భయంగా ఉంది కదూ?విద్యార్థులు నానా గొడవచేసి పత్రికలకు ఎక్కుతారు. అలాంటి యూనివర్సిటీ మురికికూపంగా,డంప్‌ యార్డ్గా మారకుండా నిరంతరం తమ శ్రమశక్తిని ధారపోస్తున్నారు వీళ్లు. యూనివర్సిటీ పరిధిలో పనిచేసే  ఆడపడుచుల కష్టాలు,సంతోషాల జీవన శైలీని భయటి ప్రపంచానికి చెప్పాలనే చిరు ప్రయత్నమే ఇది.
      రోజంతా దుమ్మూ దూళితో నిండే యూనివర్సిటీ పరిసరాళ్లు వీళ్ల చేతులు పడందే పవనం కాదు. అందరి ఆడవాళ్లు తమ ఇంటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ చిరుద్యోగులు యూనివర్సిటీ గురించి ఆలోచించే పెద్ద మనసున్న మనుషులు. ఒక రకంగా చెప్పాలంటే యూనివర్సిటీని తమ సొంత ఇంటిగా భావిస్తారని చెప్పవచ్చు. చీపురు కట్టను తమ శరీరంలో ఒక భాగంగా చేసుకున్న స్వీపర్లు పనిలోకి దిగారంటే ప్రపంచాన్నే మరిచిపోతారు. యూనివర్సిటీ పరిసరాలను ఊడ్చి ఊడ్చి వీళ్ల నడుములు ఒంగిపోతున్నా పని పూర్తికానిదే విశ్రమించరు. చేతుల్లో ఉన్న చీపురుతో రోడ్లను చీల్చి చెండాడే మహిళలు దుమ్మూ దూళిని కూడా కడుపులోనే దాచుకుంటారు. ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన వీళ్లు 8 గంటలకు పనిని ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకల్లా యూనివర్సిటీ పరిసరాలను అద్దంలా మార్చి 5 గంటలకు ఇళ్లకు చేరుకుంటారు. క్లుప్తంగా ఇది వీరి దినచర్య. ఒకరకంగా కుటుంబ సభ్యులతో కంటే వీళ్లతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు వీళ్లు. బాధైనా, సంతోషమైనా వాళ్ల గ్రూపుల సహచరులతోనే పంచుకుంటారు. స్వీపర్పనిచేసేవాళ్లలో కొద్దిమంది పురుషులు ఉన్నా  సగానికి పైగా మహిళలే ఉన్నారువాళ్ల కష్టాలు, సంతోషాలుఫ్యామిలీ మ్యాటర్స్అన్నీ డ్యూటీలోనే షేర్చేసుకుంటారు.పాటలు పాడతారు.జోకులు వేసుకుంటారు.నవ్వుతారు. నవ్విస్తారు.
      సాధారణ సర్కార్లెక్కల్లో చెప్పే జీవితాలకు, వీళ్ల  జీవితాలకు అసలు పోలీకే ఉండదు. "యూనివర్సిటీలో ఉద్యోగం" అన్న సంతోషం తప్ప వీళ్ల జీవితం మొత్తం చీకట్లోనే గడుస్తుందిప్రతిరోజు సూపర్వైజర్వీళ్లకు అప్పగించిన పనులను పూర్తిచేయడం వీళ్ల బాధ్యత. ప్రతి పదిహేను మందిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి వాళ్లకు ఊడ్చే బాధ్యతను అప్పగిస్తారు. ఒక్కోక్క గుంపు  ఒక ఏరియాను ఎంచుకొని విధులు నిర్వహిస్తారు. ప్రతి రోజు కనీసం 5 నుండి 6 ప్రాంతాలు వీళ్లు శుభ్రపరచాల్సి ఉంటుందిఏముందిలే పని తూతూ మంత్రంగా చేద్దాంలే అనుకుంటే కుదరదు. పని పక్కాగా ఉండాలి. వీళ్ల సూపర్వైజర్అన్నీంటిని అబ్జర్వ్చేస్తుంటాడు.చలికాలంలోనైనా, వర్షాకాలంలోనైనా వీళ్లకు మినహాయింపులు ఉండవనే చెప్పాలి. వర్షాకాలంలో అయితే తీరిక ఉండక నడుం పడిపోయే పరిస్థితి వస్తుందంటున్నారు స్వీపర్లుఇందులో పనిచేస్తున్నవాళ్లు గత పదినుంచి పదిహేనేండ్లుగా ఇదే పనిచేస్తున్నారు. ఇంత చేస్తున్నా  డ్యూటీలో ఏమైనా జరిగినా వాళ్లకు న్యాయం జరిగే దిక్కులేదు. ఎందుకంటే వీళ్లు పర్మినెంట్ఉద్యోగులు కారు కాబట్టి. కాంట్రాక్ట్ కింద పనిచేసే వీళ్లకు మొదట్లో చాలా తక్కువ జీతం ఉంటే దాన్ని మధ్యనే ఉద్యమాల ఫలితంగా కొంత పెంచారు. ఇంత చేస్తున్నా వీళ్ల జీతాలు మాత్రం వీళ్ల కడుపు నింపలేవు. శాఖలోనైనా ఐదు సంవత్సరాలకే పర్మినెంట్చేసే సర్కార్‌, దుమ్ములోనే బతుకుతున్నవీళ్లను మాత్రం తమ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. అంటే పర్మినెంట్చేయడం లేదు. అలాగే వీళ్ల జీతాలైన పనికి తగ్గ ఉన్నాయా అంటే అదీ లేదు. 2 వేల నుంచి 4 వేలకు చేరడానికి 15ఏండ్లు పట్టిందంటా!. 
     స్వీపర్‌ పనిచేసే వాళ్లలో యువతులే కాదు. తల్లులు, వృద్దులు కూడా ఉన్నారు. మాటలైన రానీ పిల్లలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పి విధులను నిర్వహిస్తున్నవారు కొందరైతే, వయసు మీరిన తల్లిదండ్రులను ఒంటరిగా ఇంట్లో వదిలేసి వచ్చినవారు ఇంకొందరు. ఎప్పటికైనా తమ ఉద్యోగం సర్కార్రికార్డుల్లో చేరకపోతుందా అన్న చిన్న ఆశ వీళ్ల చూపుల్లో కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా యూనివర్సిటీ మొత్తం ఆనందంలో మునిగితేలుతుంటే...స్వీపర్ల జీవితాల్లో మాత్రం వెలుగు కనిపించడం లేదు. స్వీపర్ల సుఖదు:ఖాలను తెలుసుకునేందుకు క్యాంపస్వాయిస్ప్రయత్నించగా, వారు తమ కష్టాల్ని తమ కుటుంబ సభ్యులతో బాధలను పంచుకున్నట్లుగా పంచుకున్నారు. స్వీపర్ల సుఖ, దు:ఖాన్ని వారి మాటల్లోనే తెలుసుకోండి.
      "నా పేరు హబీబున్నిసా. మాణికేశ్వర్నగర్లో ఉంటున్నాను. నలుగురు అమ్మాయిలు ఉన్నారు. అందరికి పెళ్లి అయ్యింది. మా ఆయన ఎగ్జామీనేషన్బ్రాంచ్లో పనిచేసేవాడు. 12 ఏండ్ల క్రితం వర్క్లోనే ఏమైందో ఏమో తెలియదు. పనిచేస్తూ కిందపడిపోయాడు. ఆసుపత్రికీ తీసుకెళ్లే వరకు చనిపోయిండని తెలిసింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన జాబు నాకు ఇచ్చారు. మొదట మూడు సంవత్సరాలు డేలీ వైజ్వర్కర్గా ఎగ్జామీనేషన్బ్రాంచ్లో పనిచేశాను. సులేమాన్సిద్దిఖీ సాబ్వీసీగా ఉన్న కాలంలో నా ఉద్యోగం పర్మినెంట్అయ్యింది. మొదట్లో నాకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తుండ్రీ, కానీ తర్వాత పర్మినెంట్అయ్యాక జీతం పెరిగింది. మొదట్లో చాలా మంది పర్మినెంట్వర్కర్స్ఉండేవాళ్లు. కానీ అంతా రిటైర్మెంట్కావడంతో డైలీ వైజ్వర్కర్స్తో పనిచేయిస్తున్నారు. ఇప్పుడు నేను ఇంకో ఇద్దరు మాత్రమే పర్మినెంట్వర్కర్స్మి ఉన్నాం. నేను కూడా వచ్చే సంవత్సరం మేలో దిగిపోతున్నాను". అందరిలో పెద్దదైన హబీబున్నిసా గారు తను పనిచేస్తున్న గుంపులో తను మాత్రమే పర్మినెంట్స్వీపర్అయినప్పటికీ తనలో ఏమాత్రం గర్హం తొనికిసలాడకుండా తోటివాళ్లుఇంకా పర్మినెంట్‌ కాకుండానే దిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది.చిన్నవాళ్లతో కూడా కలిసిపోయి, తోటి వాళ్ల సుఖ, దు:ఖాల్లో పాలు పంచుకుంటుందంటుంది. కనీసం తెలంగాణ సర్కారులోనైనా వాళ్లకు పర్మినెంట్అవుతే బాగుండని తోటి వాళ్ల జీవితాల గురించి ఆలోచిస్తుందీ పెద్దావిడ హబీబున్నిసా.
     
ఇక గుంపులోనే పెద్దవాడైన రామస్వామీ గారి జీవితం నిత్యం కష్టాలమయమే అని చెప్పవచ్చు. తన కొడుకుల, కూతుళ్ల వయసులో ఉన్న వాళ్లతో కలిసి పనిచేస్తూ ఏటికి ఎదురీదుతున్నాడు. తన కంటే చిన్నవాళ్లైన యువకులు పనిలో తనను ఆటపట్టిస్తూ బనాయిస్తున్న కూడా "వాళ్లు నా పిల్లలాంట్లోళ్లు కదా" అని ఎంజాయ్చేస్తానంటున్నాడు. "వెనకా ముందు ఎవరూ లేరు  నాకు. అందరూ వీళ్లే. ఇదే ప్రపంచం. వాటిని సరదాగా తీసుకుంటేనే బతుకు బండి సాఫిగా సాగుతుందని" అనుభవం నేర్పిన పాఠాన్ని బోధిస్తున్నాడు. 53 ఏండ్ల రామస్వామీది నిత్యం బతుకు పోరాటమే. 40 ఏండ్ల క్రితం ఊన్నఊర్లో సొంత మనుషులే మోసం చేసి,ఉన్న ఏడేకరాల భూమిని, ఇంటినీ కాజేస్తే బతుకుదెరువుకోసం పట్నం బాట పట్టాడు. ముగ్గురు పిల్లలున్న రామస్వామీ తన పిల్లలను పోషించడానికి మొదట్లో ఒక బ్యాంకుల్లో పనిచేశాడు. అది దివాళ తీయడంతో ఉన్న ఉద్యోగం పోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో తెలిసిన బందువుల ద్వారా యూనివర్సిటీలో కాంట్రాక్ట్వర్కర్గా జాయిన్అయ్యాడు. మొదట్లో 2 వేల రూపాయల జీతంతో ప్రారంభమైన రామస్వామీ బతుకు పోరాటం తొమ్మిది సంవత్సరాలకు 4 వేలకు చేరుకుంది. ఇప్పటికే రెండు సార్లు హార్ట్ఆపరేషన్చేయించుకున్న రామస్వామీని దుమ్ములో పనిచేస్తే ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది కదా ? ఇబ్బంది అనిపించదా అంటే?....''ఇబ్బంది అవుతుంది అని కూర్చుంటే పొట్ట నిండదు కదా?...అస్తులు ఎలాగు లేవు. పని దొరికితే అది చేయాలి. ఇక దుమ్మంటావా? అది ఎలాగూ ఉండనే ఉంది. దాంట్లోనే పనిచేయాలి. లేకపోతే లేదు. బతుకే దుమ్ముకొట్టుకుపోయాక ఇక పోయేదేముంది. అంటూ జీవిత సత్యాన్ని ఒడపోస్తున్నాడు.
      ఇక ఇదే గుంపులో పనిచేసే లక్ష్మి (పేరు మార్చాము) పరిస్థితి కూడా ఇంచు మించూ ఇంతే అని చెప్పాలి. గవర్నమెంట్‌ ఉద్యోగం చేసే వ్యక్తికి బిడ్డనిస్తే తన కూతురుని కాలు భయటపెట్టనీయకుండా చూసుకుంటాడన్న తల్లిదండ్రుల అంచనాలు తప్పని తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. కట్టుకున్న భర్త ఉద్యోగానికి సరిగ్గా పోకుండా ఇంట్లోనే కూర్చుంటే, ఇళ్లు గడవని స్థితిలో పిల్లల భవిష్యత్తు కోసం గడపదాటాల్సి వచ్చింది. తన జీవితంలో ఎలాగు సుఖపడింది లేదు, కనీసం పిల్లల జీవితాలైన బాగుపడాలనే ఉద్దేశంతో జీతం తక్కువైన తమ పిల్లలను పోషించుకోవడానికి యూనివర్సిటీలో జాయిన్అయ్యి గత ఐదు సంవత్సరాల నుంచి స్వీపర్గా పనిచేస్తుంది. "మా ఉద్యోగాలు పర్మినెంట్అవుతాయనే నమ్మకం ఎలాగు లేదు, కనీసం జీతాలన్నా పెరిగితే బాగుంటుందంటూ" తెలంగాణ సర్కార్మీద ఆశలు పెంచుకుంటుంది లక్ష్మీ గారు.
      వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే ఉన్న ఊరును, కన్న వారిని వదులకొని బతుకుదెరువు కోసం వలస పక్షిలా నగరం బాట పట్టిన స్థితి రహేమున్నిసాది (పేరు మార్చాము) గుంటూరు జిల్లాకు చెందిన రహేమున్నిసా భర్త వికలాంగుడు. అక్కడే ఫ్రూట్బిజినెస్చేసేవాడు. బిజినెస్కాస్త దెబ్బతినడంతో బతుకుదెరువుకోసం పట్నం బాట పట్టారు. వచ్చిన కొత్తలో పని దొరకక ఇబ్బంది పడుతుంటే ఇంటికి దగ్గర్లో ఉండే ఒకామె యూనివర్సిటీలో పనిచూపించి ఆదుకుందిఒకవైపు భర్త ఆలనాపాలన చూసుకుంటునే గత ఐదు సంవత్సరాల నుంచి స్వీపర్గా పనిచేస్తూ బతుకుబండిని లాగుతుంది. మీరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు కదా? తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో నిన్ను ఎవరూ ఏమీ అనలేదా అని ప్రశ్నిస్తే ''ఎవ్వరూ ఏమీ అనలేదు సార్‌, అప్పుడప్పుడు మాత్రం కామెంట్చేస్తూ, ఎక్కువ చేస్తే ఆంధ్రకు పంపిస్తామని అటపట్టిస్తరు. కానీ తర్వాత అంతా మరిచిపోయి సొంత మనుషుల్లాగా చూసుకుంటున్నారు. సొంతొళ్లను వదులుకొని వచ్చిన నాకు ఇక్కడ ఉన్న వాళ్లు  తోడ బుట్టిన వాళ్లకంటే ఎక్కువగా చూసుకుంటున్నారంటూ" కళ్ల నిండ నీళ్లు తెచ్చుకుంటుంది. "అయినా బతకడానికి వచ్చినోళ్లకు ప్రాంతాల గొడవేముంటుంది సార్"అంటుంది.
      స్వీపర్లుగా పనిచేస్తున్న వీళ్లందరు ఇంచుమించుగా ఒకేసారి పనిలో చేరినప్పటికీ దాదాపు అందరి పరిస్థితి ఒకేటే నని చెప్పవచ్చుతమ కుటుంబం నడవాలన్నా, పిల్లల భవిష్యత్బాగుండాలన్నా, పనిచేసుకుంటే తప్ప బతుకుబండీ నడవదని చెబుతున్నారు వీళ్లు. గత ఐదు నుంచి 10 సంవత్సరాలుగా ఇదే పనిచేస్తున్నప్పటికీ యూనివర్సిటీ అధికారులు జీతాలు మాత్రం పెంచడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు ఇంటి అద్దెలు, స్కూల్ఫీజులు, కూరగాయల ధరలు పెరుగుతున్న తమ జీతాలు పెరగకపోవడం వల్లా కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు పనిచేసినప్పటికీ ప్రతినెల ఎంతో కొంత అప్పుచేయాల్సి వస్తుందంటున్నారు  స్వీపర్లు. వీళ్లు చేసేది కాంట్రాక్ట్ఉద్యోగం కావడంతో ప్రతి మూడు నెలలకు ఒక సారి రెన్యూవల్చేయాలనే పేరుతో జీతాలు కూడా సరైన సమయానికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట చెప్పుకోవడానికి యూనివర్సిటీలో పనిచేస్తుందనట్లు ఉంది కానీ జీతం మాత్రం నామమాత్రమే అంటున్నారుహైదరాబాద్ వంటి నగరంలో చాలీ చాలని జీతంతో బతకడం మూలంగా అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని, కనీసం వచ్చే తెలంగాణ సర్కార్లోనైన తమ బతుకులు బాగుపడతాయోమో అని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.
      పనిచేస్తున్న సందర్భంలో పైన ఉన్న అధికారులు వేధింపులకు గురిచేస్తరు కదా అట్లాంటివి మీరేమైనా ఎదుర్కొన్నారాఅని ప్రశ్నిస్తే కాసేపు ఒకరి మోకాలు ఒకరు చూసుకొని... "అట్లాంటిది మాకేమి ఎదురు కాలేదు సార్అంటూనేఇంకో ఆమె లేదు సార్ఆమె ఉంటే ఏమీ దాచుకోకుండా అన్నీ చెబుతుండే" అంటూ మౌనంగా ఉండిపోయారు. నిజానికి బతుకు దెరువుకోసం ఇంకొకరిపై అధారపడి ఉన్న స్థితిలో ఇలాంటి నిత్యం మనకు కనిపిస్తుంటాయి. ఆడదాని చీరకొంగు కనిపిస్తే చాలు పిచ్చికుక్కల్లా రెచ్చిపోయే పురుష్యాధిక్య సమాజంలో అనునిత్యం ఆడది బతుకుబండి లాగేందుకు అనేక అవమానాలను, అణిచివేతలను భరిస్తుందనే చెప్పాలి. దీనికి ఓయూ కూడా మినహాయింపేమీ కాదు. నిత్యం ఏదో ఒక మూల వర్కర్స్పై ఇలాంటీ సంఘటనలు జరుగూతూనే ఉన్నాయి. కానీ నోరు విప్పి నిజం చెబితే ఏక్కడ పని కోల్పోవాల్సి వస్తుందో అనే భయంతో అవమానాన్ని పంటికిందే బిగబట్టేస్తున్నారు. బతుకుబండీ లాగే క్రమంలో అనునిత్యం జీవన పోరాటం సాగించే స్వీపర్ల జీవితం కత్తిమీద సామే అని చెప్పవచ్చు. 
 

No comments :

Post a Comment