సంక్షోభం నుంచి గట్టేక్కెందుకే పాక్ దాడులు

No comments

జనవరి 8 అర్థరాత్రి సరిహ ద్దు దాటుకొని వచ్చి న పాక్‌ సైనికులు ఇద్దరు భారత సైని కుల తలల్ని తెగనరకడంతో ఇరుదేశాల మధ్య ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇటీవల కొన్ని రోజులుగా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రవాణా వాహనాలకు అనుమతులు నిరాకరించడంతో ప్రజలకు నిత్యావసర ఆహార వస్తువులు అందక అష్టకష్టాలు పడ్డారు. ఒకవైపు దేశం అంతర్గత సంక్షోభంలో చిక్కుకొని, నిత్యం ఏదో ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులకు వందలాదిమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, దాయది దేశం పాక్‌ మాత్రం భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. స్నేహ హస్తం అందిస్తూ భారత్‌ ముందుకొస్తుంటే ఆ చేయ్యినే నరికేసేందుకు పాక్‌ ప్రయత్నిస్తోంది. పాక్‌ క్రూరచర్యలకు నిరసనగా దేశవ్యాపితంగా ప్రజానికం పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూంటే, వీర సైనికులు లాన్స్‌ నాయక్‌ హేమరార్‌, సుధాకర్‌ల కుటుంబాలు తమ వారిని పొట్టన పెట్టుకున్న పాక్‌ సైనికులకు తగిన బుద్ధి చెప్పాలని, అదే తమ సభ్యులకు భారత సైనికులు ఇచ్చే నివాళి అని భావిస్తున్నారు.

కవ్వించి, హద్దుమీరి క్రూరమృగాల్లా- ఇద్దరు భారత జవాన్లను హతమార్చి, తలలు తీసుకెళ్ళిన పాక్‌ వైఖరిని చూస్తూ ఊరుకోకూడదని, ఆ దేశంతో తక్షణం చర్చలు ఆపివేసి ప్రతికారం తీర్చుకొని తగిన గుణపాఠం చెప్పాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. పాక్‌ సైనికుల కుట్రలకు దేశంలోనే కాదు, ప్రపంచ  వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా, పాక్‌ మాత్రం తన భూభాగంలోని స్థావరంపై దాడికి పాల్పడి ఒక సైనికున్ని కాల్చి చంపారంటూ దొంగ నాటకం ఆడింది. జరిగిన ఘోరానికి చింతిస్తున్నామని, తమపై అనుమానం ఉంటే థర్డ్‌  పార్టీతో ఎంక్వయిరీ జరిపించుకోండని ఉచిత సలహా పారేసింది. ఒక వైపు కవ్వింపు చర్యలకు పాల్పడలేదని పాక్‌నేతలు బుకాయిస్తున్న సందర్భంలోనే వారి సైన్యం మరింత బరితెగించి జమ్మూ- కాశ్మీర్‌లోని పూంచ్‌, బట్టాల్‌ స్థావరాలపై విరుచుకపడింది. మరోవైపు చాకందాలోని పాక్‌ ఇండియా గేట్‌వేను పాక్‌ మూసేసింది. వందలాది సరుకు రవాణా వాహనాలను రాకుండా పాక్‌ అడ్డుకుంది. మొత్తానికి ఈ చర్యలను బట్టి, పాక్‌ కయ్యానికి కాలుదువ్వుతున్నదన్న వాదనలు బలపడుతున్నాయి.

పాకిస్థాన్‌ రాజకీయ సంక్షోభంలో చిక్కుకొని ఉంది. సగటు పౌరుడు అభద్రతా భావంతో ఉన్నాడు. పేదరికం, నిరుద్యోగం, దారిద్య్రంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ను మరోవైపు ఉగ్రవాద దాడులు పట్టిపీడిస్తున్నాయి. సైన్యానికి, ప్రభుత్వానికి నిరంతరం సంఘర్షణ! ఉగ్రవాదులు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నా వారిని నిలవరించలేని నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్‌ మిగిలి పోతోంది. సైన్యం, ఐఎస్‌ఐల మధ్య ప్రభుత్వాలు నగిలిపోతున్నాయి. ఈ పరిణామాలకుతోడు మార్చిలో పాక్‌ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగను న్నాయి. స్వదేశంలో పాకిస్థాన్‌ ఏం చెయ్యలేక ప్రజల దృష్టిని మళ్లించేం దుకే భారత్‌పై దాడులకు పాల్పడు తోంది. భారత్‌పై తాము పోరాడుతు న్నామనే సంకేతాలు పంపేందుకే పాక్‌ పాలకులు పనిగట్టుకొని ఇలాంటిదాడు లను ప్రొత్సహిస్తున్నారు. పాలకులు, సైన్యం, ఐఎస్‌ఐ- మధ్య ముడుముక్కలుగా మారిన ప్రజాస్వా మ్యం ఆ దేశానికి పెను సవాళ్ళు విసరుతోంది. అవినీతిపై ప్రజా ఉద్యమం కార్చిచ్చులా వ్యాపించి పాలకుల పుట్టి ముంచుతోంది.

అవినీతి ఆరోపణలకు ప్రధానిని అరెస్టు చేయాలని సుప్రీం ఆదేశించిందంటే అది సంక్షోభానికి సూచనే అని రాజకీయ విశ్లేషకుల వాదన. ఇంట గెలవలేని పాకిస్థాన్‌ సరిహద్దుల్లో అలజడి సృష్టించి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకే ఈ ఎత్తుగడలకు పాల్పడుతోంది. నిజానికి పాక్‌ ఇలాంటి కవ్వింపు ఘటనలకు పాల్పడడం కొత్త కాదు. దేశ విభజన నాటినుంచీ పాక్‌ వైఖరే ఇంత! ప్రపంచంమొత్తం వేలేత్తి చూపించినా తన బుద్ధి చూపిం చుకుంటూనే ఉంటుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని తేలినా అఫిజ్‌ సయ్యద్‌ నుంచి దావుద్‌ ఇబ్రహీం దాకా అందరిని నెత్తిన పెట్టుకొని ఊరేగిన చరిత్ర పాక్‌ది. భారత్‌తో శాంతి సంబం ధాలు కొరుకొంటున్నామనే నీతులు చెబుతూనే సరిహద్దుల్లో గుంటనక్కల్లా గోతులు తవ్వుతోంది. మూడు సార్లు భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్నా బుద్ధి తెచ్చుకోలేని పాక్‌ మరోసారి కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధపడుతోంది. పాక్‌ దొంగనాటకాల గురించి భారత్‌ కన్నా ఇంకేదేశం రుచిచూసి ఉండకపోవచ్చు. కానీ గతంలో ఎన్నడూ లేనంతగా ఈమధ్య కయ్యానికి కాలుదువ్వుతోంది పాక్‌ సైన్యం. కేంద్ర ఇంటలిజెన్స్‌ అనుమానం వ్యక్తం చేసినట్లు ఈ దూకుడు వెనుక బలీయమైన రాజకీయ కారణాలే ఉన్నాయని తెలుస్తోంది.

12ఏళ్ల క్రితం కాల్పుల విరమణ ఒప్పందంపై రెండుదేశాలు సంతకాలు చేసినప్పటినుంచి భారత్‌ తన పరిధిని ఏనాడూ దాటలేదు. ఈ 12 సంవత్సరాల కాలంలో పాక్‌ అనేక మార్లు కవ్వింపులకు పాల్పడి, యుద్ధానికి కాలుదువ్వినా, మన దేశం ఎన్నో సార్లు స్నేహహస్తం అందిస్తూ పాక్‌తో మైత్రికి చెయ్యిచాచింది. 2001 డిసెంబర్‌లో కుదిరిన ఒప్పందంతో నమ్మకమైన మైత్రి కోసం భారత్‌ ఎన్నో అడుగులు ముందుకు వేసింది. భారత్‌ చర్యలతో ఇటు నేలపై, అటు నింగిలో ఉన్న ఆంక్షలన్నీ రద్దయ్యాయి. రెండు దేశాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. కానీ పాక్‌ మాత్రం కడుపులో కత్తులు నూరుతూ ముఖంపై నవ్వులు పులుముకుంది. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితిమెరుగు పడుతున్నదని అందరూ సంబర పడుతున్న దశలో 2008లో ముంబైైలో బాంబ్‌ పేలుళ్ళు జరిగాయి. ఈ ఘోర కలి పాక్‌ చొరవతోనే జరిగిందన్నది జగమె రిగిన సత్యం. దానికిసజీవసాక్ష్యంగా కసబ్‌ను చూపించినా, ఆ కసాయితో తమకేసంబంధం లేదని బుకాయించింది. ఇక సరిహద్దుల్లో హద్దులు మీరడం పాక్‌ సైనికులకు కొత్తకాదు.

2009లో 28 సార్లు అక్రమ చొరబాట్లు నమోదయ్యాయి. 2010లో అది 44 సార్లకు చేరింది. గత ఏడాది వాటి సంఖ్య 117కి పెరిగింది. ఇదంతా పాక్‌ ప్రభుత్వ కవ్వింపు చర్యల్లో భాగమేఅని అందరికి తెలుసు. మూడు సార్లు భారత్‌తో జరిగిన యుద్ధంలో పాక్‌ తోకముడిచినా తరచూ చొరబాట్లకు పాల్పడుతూ తలనొప్పులు సృష్టిస్తూ నియంత్రణ రేఖను అతిక్రమిస్తూనే ఉంది. ఇంతకీ పాక్‌ తరచూ ఇటువంటి పనికి పాల్పడడానికి కారణాలేమిటి అనేది ఆలోచిస్తే ఈ సమస్యను అర్థం చేసుకోవచ్చు. జమ్మూ- కాశ్మీర్‌ భారత్‌కు కీలకమైన ప్రాంతం. పాక్‌ కోరుకుంటున్న ప్రాంతం కూడా ఇదే. ఈప్రాంతలోని మెజారిటీ ప్రజలు తమతో కలవడానికి సిద్ధంగా ఉన్నారని పాక్‌ వాదిస్తూ దశాబ్దాలుగా భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. 1947లో రెండు దేశాలకు స్వాతంత్య్రాన్ని సాధించి, అప్పుడప్పుడే స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న కాలంలో కాశ్మీర్‌ రాజ్యం కోసం పోరు మొదలయ్యింది. దేశ విభజన సమయంలో నాటి పాలకులు సంస్థానాలకు ఒక వెసులుబాటు కల్పించారు. తమకు ఇష్టమైతే ఏ దేశంతోనైనా కలిసేందుకు వారికి స్వేచ్ఛ ఉందని ప్రకటించారు. కానీ కాశ్మీర్‌రాజు హరిసింగ్‌ స్వతంత్రం గా ఉండాలని నిర్ణయించు కున్నాడు.

కానీ పాకిస్థాన్‌ దురాక్రమణకు దిగడంతో చివరి క్షణంలో రాజు హరిసింగ్‌ భారత్‌ తో ఒప్పందం చేసుకొ ని కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన భారత్‌ పాక్‌ సైన్యాన్ని తరిమికొట్టింది. పాక్‌ స్వంత భూభాగంలో లాహోర్‌ను దాటిపో యింది. భారత విజయం ఖాయమైన చివరి క్షణంలో అనుహ్యంగా నాటిప్రధాని నెహ్రు ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరాడు. ఆయన నిర్ణయం సరైనదా కాదా అన్నదానిపై భిన్నాభిప్రా యాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్‌ ఆక్రమించిన కాశ్మీర్‌ భూభాగాన్ని వదిలేసి భారత్‌ ఏకపక్షంగా వెనక్కి తగ్గింది. చేతులారా పాక్‌ జుట్టును వదిలేసినట్లయింది. చివరికి యుద్ధంలో భారత్‌ గెలిచి కూడా ఓడినట్లయింది. 1948 డిసెంబర్‌ 31న రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అప్పుడే నియంత్రణ రేఖను నిర్ధారించుకున్నాయి. 1965 ఆగస్టు 5న పాక్‌ మరోసారి కాశ్మీర్‌ కోసం యుద్ధానికి కాలుదువ్వింది. భారత బలాన్ని, బలగా న్ని ఆంచనా వేయలేక తోక ముడిచింది. కేవలం 20 రోజుల్లోనే ఆ యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలోను ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొంది కానీ నియంత్రణ రేఖను సరిగ్గా నిర్ధారించలేక పోయింది.

1999 మేలో కార్గిల్‌ యుద్ధం మొదలైంది. కాశ్మీర్‌ ఆక్రమణ కోసం మరోసారి ప్రయత్నించి పాక్‌ చేతులు కాల్చుకుంది. ఆసియాలో అణుబాంబు కలిగి ఉన్న దేశాల మధ్య యుద్ధంగా ఇది చరిత్ర కెక్కింది. ‘లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌’ను దాటి పాక్‌ చొరబాటుదారులు భారత్‌లోకి చొచ్చు కొచ్చారు. లడక్‌ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్‌ ప్రయత్నించింది. దాంతో యుద్ధం తప్పనిసరైంది. జర్నల్‌ పర్వేజ్‌ ముషారప్‌ అత్యుత్సాహంతో జరిగిన ఆ యుద్ధంలో పాక్‌కు అంతర్జాతీ యంగా చివాట్లు తప్పలేదు.రాజకీయ సంక్షోభం, మార్చిలో జరగనున్న ఎన్నికలు, లాడెన్‌ను చంపించారన్న విమర్శలు, అమెరికాకు తొత్తుగా మారిందనే వ్యతిరేకత, అతివాదుల్లో, ఛాందస వాదుల్లో అసహనం- పాక్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కొవడానికి పాక్‌కు కనిపించిన సాకు కాశ్మీర్‌. దేశప్రజల్లో ఉన్న భారత వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునేందుకు ఉన్న ఒకే ఒక అవకాశం. సరిహద్దు కవ్వింపులు అందుకే అంటున్నారు రక్షణ నిపుణులు.ప్రజల దృష్టిని మళ్ళించేందుకు యుద్ధమొక్కటే మార్గంగా తోచింది. ఈ యుద్ధంతో భారత్‌ను అశాంతికి గురిచే యవచ్చునని భావిస్తోంది. గత యుద్ధాలు నేర్పిన పాఠాలతో ఇటు భారత్‌- అటు పాక్‌ అణ్వాయుధాల నిల్వలకోసం పరుగులు పెట్టాయి. ఈమధ్యే మనదేశం అగ్ని-5 అనే అత్యాధునిక బ్యాలెస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. 5 వేల కిలోమీటర్లలో లక్ష్యాల ను సైతం చేధించేలా దాన్ని తయారు చేశారు.

ఫోక్రాన్‌ ప్రయోగం తర్వాత భారత్‌ ఎన్నో ఆయుధాలను సమకూర్చుకుంది.గత యుద్ధాల్లో అస్తి నష్టం, ప్రాణ నష్టం తక్కువే కాని ఈ సారి యుద్ధం వస్తే నష్టం ఊహకు అందదు. కేవలం భారత్‌, పాక్‌ మాత్రమే యుద్ధంలో పాల్గొన్నా, రెండు దేశాల్లో ఏ ఒక్క దేశం అదుపు తప్పి అణు బాంబులు దారిమళ్ళినా కష్టమే అంటున్నారు నిపుణులు. మరోవైపు పాక్‌ మాత్రం హైదరాబాద్‌ను లక్ష్యం చేసినట్టు కనిపిస్తోంది. రక్షణలో కీలక రంగాలైన డిఆర్‌డిఎల్‌, డిఆర్‌డివోతో పాటు, న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ హైదరా బాద్‌లో కొలువుండడం పాక్‌ లక్ష్యానికి కారణం. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులుజరిగినా మూలాలు హైదరాబాద్‌లోనే బయట పడుతుండడం ఈ అనుమానాల్ని బలపరుస్తోంది. ఇన్నాళ్లు మనదేశానికి పరోక్షంగా మద్దతుఇచ్చిన అమెరికా ఈసారి జోక్యం చేసుకోనంటోంది. నిజానికి యుద్ధం వస్తే భారత్‌ ఎదురు నిలవగలదా? పాక్‌ నక్కజిత్తులకు చైనా ఎత్తులు తోడైతే పరిస్థితి ఏమిటన్నది అసలు సమస్య!

No comments :

Post a Comment

అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ''ఆక్యూపై వాల్‌స్ట్రీట్‌'' తరహా ఆందోళనలు

No comments
ఉద్యమాల సెగ మధ్య ప్రాచ్చం నుండి పశ్చిమానికి మారింది. ఆరబ్‌ దేశాల నుంచి అమెరికా మీదుగా ప్రపంచవ్యాప్తం అవుతోంది. నిన్నటి ఉద్యమాల లక్ష్యం స్వేచ్ఛాగీతిక అయితే నేటి ఆందోళనల ఆశయం అసమానతలకు అంతం పలకడం. ప్రభుత్వాలను పెత్తందారీ పెద్ద చేతుల్లోంచి బైటకు తేవడమే నినాదంగా, స్వయం బందీలవడమే మార్గంగా మొదలైన ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. వేగంగా విస్తరిస్తూ విశ్వవ్యాప్తం అవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1500 నగరాలకు విస్తరించి విశేష ప్రజా మద్దతు కూడగట్టుకుంటూ పాలకుల్లో గుబులు పుట్టిస్తోంది. సమాధి అయిపోయిందనుకుంటున్న వాదాల వివాదాన్ని తట్టి లేవుతున్నాయి ఆ ప్రజాందోళనలు.

నిశ్శబ్దంగా మొదలై నిప్పులా రాజుకుంటున్న ''ఆక్యూపై వాల్‌స్ట్రీట్‌'' ఉద్యమం సరిగ్గా నెలరోజుల క్రితం సెప్టెంబర్‌ 17న అమెరికాలోని మాన్‌హట్టన్‌ లిబర్టీ స్వేర్‌ నుంచి ప్రారంభమైంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆర్థికశక్తులు, బహుళజాతీయ సంస్థల పెత్తనానికి నిరసన వారి ప్రధాన లక్ష్యం. వాల్‌స్ట్రీట్‌ పరిణామాలు ఆర్థికవ్యవస్థను ఎలా దెబ్బతీసి తరతరాల సంక్షోభాన్ని మిగుల్చుతున్నవైనాన్ని బహ్య ప్రపంచానికి తెలియ చెప్పడమే ఆశయం.

''ఆక్యూపై వాల్‌స్ట్రీట్‌'' పేరుతో నెల రోజుల క్రితం కేవలం కొద్ది డజన్ల మందితో ప్రారంభమైన ఆందోళన ఇపుడు ప్రపంచ స్థాయి ఆందోళనగా మారింది. రెండు వారాలకే అమెరికా అంతటా పాకిన ఆందోళనలు ఆ తర్వాత యూరప్‌ దేశాలకు కూడా విస్తరించాయి. ఇప్పుడు జపాన్‌ నగరం టోక్యోకు పాకి ''టోక్యోను ఆక్రమిద్దాం'' అంటూ జననీయులు నినదిస్తున్నారు. ఈజిప్ట్‌, తెహ్రీ స్క్వేర్‌ నిరసనల స్ఫుర్తితో సెప్టెంబర్‌ 17న ఒక్కసారిగా 2 వేల మంది ఆందోళనకారులు మాన్‌హట్టన్‌ వీధుల్లోకి వచ్చారు. సంపన్నుల కాలనీ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. 'అక్కడో జూకోటి పార్క్‌' వద్ద డేరాలు వేసుకుని శాంతియుత ఆందోళన ప్రారంభించారు. ''వుయ్‌ ఆర్‌ 99%'' పేరున ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రదర్శనలే కాక సామాజిక సంబంధాల వెబ్‌సైట్లలో ప్రచారం హోరెత్తించారు. ఉద్యోగాలు కోల్పోయి, సౌకర్యాలకు కోతపడి, దిక్కుతోచని స్థితితో ఉన్న లక్షలాది మంది ప్రజలు దానివైపు ఆకర్షితులు కావడానికి అట్టే సమయం పడ్డలేదు. అమెరికా స్టాక్‌ మార్కెట్లు, బహుళజాతి సంస్థల కేంద్రం వాల్‌స్ట్రీట్‌ను ఆక్రమిద్దాం అన్న నినాదంతో రోజురోజుకీ ఆందోళనకారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. సామాన్యులు, కార్మి సంఘాలు, సెలబ్రిటీల నుంచి సంఘీభావమూ పెల్లుబికీంది. రోజుల వ్యవధిలోనే అమెరికా నుంచి ఇతర దేశాలనూ ఊపేయడం ప్రారంభమైంది. లండన్‌, జర్మనీ, రోమ్‌, హంగ్‌కాంగ్‌లను ఆ వేడి తాకింది.

ప్రపంచ ఆర్థిక సంక్షోభం పేరు చెప్పి ట్రిలియన్ల కొద్దీ ప్రజా ధనాన్ని ''బెయిలౌట్‌'' లుగా వాల్‌స్ట్రీట్‌ కంపెనీలకు పందేరం పెట్టిన సంగతి విదితమే. తీరా ఆ డబ్బంతా అమెరికా, యూరప్‌ దేశాలపైన అప్పుగా పేరుకుపోయింది. 'బడ్జెట్‌లోటు' తగ్గించాలనీ, 'అప్పుభారం' తగ్గించాలని చెబుతూ 'పొదుపు విధానాల' పేరున కంపెనీలకి పంచిన డబ్బుని ప్రజల వద్ద నుండే వసులు చేయడానికి అమెరికా యూరప్‌ల ప్రభుత్వాలు పూనుకున్నాయి. తమ సంబంధం లేని అప్పును తమపైన భారంగా వేయడానికి వ్యతిరేకంగా అమెరికన్లు నెలరోజులనుండి ఉద్యమిస్తున్నారు. అమెరికా, యూరప్‌ తదితర దేశాలలో ప్రారంభమైన  ఆందోళనలు అక్కడి బ్యాంకర్లకు, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. అయితే వివిద దేశాలలో జరుగుతున్న ఈ ఆందోళనలు కొన్ని చోట్ట చిన్న చిన్నవిగా ఉంటున్నాయి. కొన్ని చోట్ట రోడ్లలో ట్రాఫిక్కును ఆపగల శక్తిగా కూడా ఉంటున్నాయి. ఇటలీ రాజధాని రోమ్‌ నగరంలో త్వరలో జరగనున్న ప్రదర్శనలో కనీసం 1 లక్ష మంది పాల్గోంటారని నిర్వాహకులు చెబుతున్నారు. 

''ప్రపంచ స్థాయిలోనే ప్రభుత్వ అప్పు మనం ఏ మాత్రం భరించలేని స్థాయికి చేరుకుంది. దోపిడీ ప్రభుత్వాలు, అవినీతి బ్యాంకులు, స్పెక్యులేటర్లు కలిసి కూడబెట్టిన ఈ అప్పు ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేనిది. భారాన్ని ప్రజలపై వేస్తూ కూడా ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకోరు వీళ్ళు'' అని ప్రదర్శనకు హాజరవుతున్న యువతులు చెప్పినట్లుగా రాయిటర్స్‌ తెలిపింది. ''వాళ్ళు ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని తీసుకొచ్చారు. సంక్షోభం నుండి కూడా వాళ్ళు లాభాలు దండుకుంటున్నారు. వాళ్ళే ఇదంతా చెల్లించాలి'' అని ప్రదర్శనకు హాజరవుతున్న వారు నినదిస్తున్నారు. 

న్యూయార్క్‌ నగరంలో ఓ ప్రైవేటు పార్కులో గుడారాలతో తిష్టవేసిన ఉదాహరణని ఇటలీ ఆందోళన కారులు అనుకరిస్తున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇటలీ ప్రధాన కార్యాలయం ప్రక్కన గత 20 రోజులుగా రోమ్‌ ఆందోళన కారులు తిష్టవేసి ఆందోళన నిర్వహిస్తున్నారు.  ఇటలీ ప్రభుత్వం 60 బిలియన్‌ యూరోల పొదుపు ఆర్థిక పథకానికి ఇటలీలోని బెర్లుస్కోని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని వలన పన్నులు పెరగనున్నాయి. ప్రజారోగ్యం మరింత ప్రియం కానున్నది. గత శుక్రవారం అతిపెద్ద వాల్‌స్ట్రీట్‌ బ్యాంకు ''గోల్డ్‌మేన్‌ సాచ్‌' కి చెందిన మిలన్‌ ఇటలీ శాఖపైన ఆందోళనకారులు దండెత్తి గోడల నిండా నినాదాలతో నింపారు. ఇటలీలో అతి పెద్ద బ్యాంక్‌ 'యూనిక్రెడిట్‌'' ప్రధాన కార్యాలయంపై మరికొంత మంది కోడిగుడ్లు  విసిరి తమ కోపం తీర్చుకోవడానికి ప్రయత్నించారు. 

న్యూజిలాండ్‌లో పెద్ద నగరం ఆక్లండ్‌లో ప్రధాన వీధిలో కొన్ని వందలమంది ప్రదర్శన నిర్వహించి అప్పటికే అక్కడ ఉన్న మూడువేల మందితో చేరిపోయారు. డ్రమ్ములు, నినాదాలతో హోరెత్తించారు. వెల్లింగ్టన్‌లో రెండోందలమంది. క్రైస్ట్‌ చర్చ్‌ నగరంలో యాభైమంది ప్రదర్శన జరిపారు. ఫిలిప్పైన్‌ రాజధాని మనీలాలలోనూ ఆందోళన కారులు ప్రదర్శన నిర్వహించారు. అమెరికా ఎంబసీ వద్ద ప్రదర్శన జరిపి ''అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి'', ''ఫిలిప్పైన్‌ అమ్మకానికి లేదు'' అని నినదించారు. బ్యానర్లు ప్రదర్శించారు. తైవాన్‌ రాజధాని తైపి స్టాక్‌ ఎక్చేంజి వద్ద వందలాంది మంది ప్రదర్శన నిర్వహించారు. ''మేము తైవాన్‌లో 99 శాతం'' అని నినదించారు. అర్థికవృద్ధి కంపెనీలకే లాభించిందని వారు తెలిపారు. మధ్యతరగతి వేతనాల వలన ఇల్లు, విద్య, ఆరోగ్యం ఖర్చులు ఏమీ నడవడం లేదని వాపోయారు. 

లండన్‌లో ప్రదర్శనకారులు ''ఆక్యూపై స్టాక్‌ ఎక్ఛేంజ్‌'' ఆందోళన నిర్వహించారు. లండన్‌లో ప్రతిరోజు అన్ని రంగాల ప్రజలు తమతో చేరుతున్నారని లండన్‌ ఆందోళనకారులు చెబుతున్నారు. వీరు నిర్వహిస్తున్న ఫేస్‌బుక్‌ పేజీకి ఇప్పటికే 12,000 మంది ఫాలోయర్లు రిజిస్టర్‌ అయ్యారని రాయిటర్స్‌ తెలిపింది. ''ద్రవ్య వ్యవస్థ'' తమ టార్గెట్‌ అని వారు చెబుతున్నారు. ''ఇప్పటి వరకు జరిగింది చాలు'' అని వారు నినదిస్తున్నారు. గ్రీకు ఆందోళనకార్లు శనివారం ''పొదుపు విధానాల వ్యతిరేక దినం'' జరపాలని పిలుపునిచ్చారు. ''గ్రీకు ప్రజలు ఈ రోజు ఎదుర్కొంటున్న పరిస్థితే త్వరలో ఇతర దేశాల ప్రజలకు కూడా పీడకలగా ఎదురుకానున్నది. పరస్పర సహకారమే ప్రజల శక్తివంతమైన ఆయుధం'' అని ''రియల్‌ డెమోక్రసీ'' సంస్థకు చెందినవారు ప్రకటించారు. ప్యారిస్‌లో జి 20 సమావేశాల సందర్భంగా తమ ప్రదర్శనలు నిర్వహించాలని ఫ్రాన్సు ఆందోలనకారులు పథకం వేసుకున్నారు. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో ఏడు చోట్ల మార్చ్‌లను నిర్వహించాలని పథకం వేసుకున్నారు. ఆ ఆందోళనలన్నింటా కొట్టవచ్చినట్లు ఒక లోపం కనిపిస్తున్నది. వీరిలో ఎవరికీ నిర్థిష్టమైన డిమాండ్లు లేవు. డిమాండ్లు ఉండాలన్న విషయాన్ని కూడా వీరు పట్టించుకోవడం లేదు. అమెరికాలో ఆందోళనకారులను డిమాండ్లు ఏమిటని ప్రశ్నిస్తున్నప్పటికీ వారు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఈ ఆందోళనల వెనుక సోరోస్‌ అన్న అమెరికా ధనికుడు ఉన్నాడని ఇప్పటికే పుకార్లు వెల్లువెత్తాయి. ఆయన తనకు సంబంధం లేదని కూడా ప్రకటించినా అవి ఆగలేదు.

మార్కెట్‌ ప్రతికూలతల పేరు చెప్పి రోజూ వేలాది మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు, వేలకోట్ల డాలర్ల పొదుపు మంత్రాలు. ఏ దేశంలో చూసినా 1% కూడా మించని కొందరి పెట్టుబడి దారుల రక్షణ కోసమని ప్రభుత్వాల విపరీత హైరనా. ఏడాది ప్రారంభం నుంచీ అదే తంతు. రెండో మాంద్యం ఛాయలన్న సంకేతాలతో ఎడాపెడా కోతలు మొదలు పెట్టారు. బ్యాంకులు, బహుళజాతి సంస్థలకు మాత్రం బారీ ఉద్ధీపనలు ఇచ్చి సామాన్యులను వారి చావుకు వాళ్లనే వదిలేశారు. ఆ క్రమంలో రోడ్డున పడ్డ లక్షలాది మంది బాధితుల గోడు ఎవరికి పట్టాలి? ఫలితం కడుపు రగిలిన అదే సామాన్యులు ఉద్యమ బాట పట్టారు. అయితే వీరి ఆందోళనకు నిర్థిష్ట డిమాండ్లంటూ ఏం లేవు. డిమాండ్లు లేని ఆందోళనలు ఉండడమే ఆశ్చర్యకరం. బ్యాంకులకు ఉద్ధీపనలు, పొదుపుమంత్రం, ధనవంతుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడమే వారి ప్రాథమిక ఉద్దేశం. బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు తదితర ద్రవ్య కంపెనీల అత్యాశ. ప్రజలను పన్నుల భారాలు కుంగదీస్తున్నాయని చెబుతున్నప్పటికీ సంబంధిత డిమాండ్లు ముందు పెట్టడం లేదు. పది సంవత్సరాల క్రితం ఉప్పెనలా విరుచుకుపడిన వరల్డ్‌ సోషల్‌ ఫోరం కూడా ఇదేరీతిన ఎగసి చప్పున చల్లారింది. అప్పట్లో కూడా దారితెన్నూ లేకుండా నమావేశాలు, మహాసభలు జరిగాయి. బడా కంపెనీల నిధులతోనే అవి జరిగాయనీ, ప్రజాగ్రహాలను పక్కదారి పట్టించడానికే అవి జరిపారని ససాక్ష్యాలతో కొంతమంది రుజువు చేశారు కూడా. అయితే అభివృద్ది చెందిన దేశాలలో జరుగుతున్న ఇప్పటి ఆందోళనలు కూడా అవే కోవలోకి వస్తాయా అన్నది కొంతకాలం పోతే గాని వెల్లడి కాదు. అంతవరకు వేచి చూడాల్సిందే.

No comments :

Post a Comment

అగ్రకులతత్వంతో అధ్యాపక స్పందన

No comments

ఉస్మానియా యూనివర్సిటీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అధ్యాపకులను, అధికారులను మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు అనేక సార్లు అవమానించి, భౌతిక దాడులకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేసినప్పుడు ఔటా నాయకులు ఎందుకు స్పందించలేదు? అనేక మంది ప్రొఫెసర్లపై మతోన్మాద విద్యార్థులు దాడులకు పాల్పడినప్పుడు రాజీనామాలు చేయని అగ్రవర్ణ డీన్‌లు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు ఇప్పుడే ఎందుకు రాజీనామాలు చేస్తున్నారో వివరించాలి. 

భ్రష్ఠత్వానికి పరాకాష్ట (డిసెంబర్ 20, ఆంధ్రజ్యోతి) అన్న వ్యాసంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఉపాధ్యాయునిపై ఒక విద్యార్థి దాడిచేసిన విషయాన్ని ఖండిస్తూ అఖిలేశ్వరి గారు చర్చను లేవనెత్తారు. ఆ వ్యాసంలో లేవనెత్తిన విషయాన్ని కాస్త సీరియస్‌గా పరిశీలిస్తే ఆ వ్యాసకర్తలో ఎక్కడో ఒక దగ్గర అగ్రకుల భావజాలం పనిచేసిందనేది స్పష్టమౌతుంది. ఎందుకంటే మొన్న విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనను వ్యాసకర్త ఖండిస్తూ పరుషమైన పదజాలంతో విమర్శిస్తూ ఒక వర్గం విద్యార్థులపై విరుచుకపడి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 'మన కళ్లముందే జరుగుతున్న విషాదానికి మనమందరమూ బాధ్యత వహించాలని, ఇది యావత్ సమాజాన్ని దిగజారుస్తోంది, సమాజంలోని ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తోందని' ఆవేదన వ్యకం చేశారు. సమాజంలోని ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నం చేసే స్థాయిలో ఆ ఘటన జరిగిందా అనేది సీరియస్‌గా చర్చించాలి. నిజానికి ఉపాధ్యాయునిపై దాడి జరగడానికి కారణాలు ఏమిటనేది ఆలోచించకుండా చర్చలు లేవనెత్తితే విషయం పక్కదారి పట్టి, ఒక వర్గం విద్యార్థులను అపార్థం చేసుకొనే అవకాశం ఉంటుంది. అఖిలేశ్వరి గారి చర్చ అలాగే ఉంది. మొన్న విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయునిపై జరిగిన దాడిని అక్కడ ఉన్న విద్యార్థులందరూ ఖండించారు. దాడికి పాల్పడిన అలెగ్జాండర్ అనే విద్యార్థి వైస్ ఛాన్స్‌లర్ ముందే ఆ ఉపాధ్యాయునికి క్షమాపణలు కూడా చెప్పాడు. తను ఏ బలహీన క్షణంలో దాడికి పాల్పడిందీ వివరించాడు.

గతంలో తన సోదరి స్నేహితురాలు ఉపాధ్యాయుని వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుర్తొచ్చి తాను భావోద్వేగానికి గురయ్యానని వివరించాడు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు. ఇంత జరిగాక తన తప్పును ఒప్పుకున్న విద్యార్థిని పెద్దమనసుతో క్షమించాల్సిన ఉపాధ్యాయులు ర్యాలీలు తీస్తూ, మీడియాకు ఎక్కుతూ, ఈ దాడులకంతటికీ ఒక వర్గం విద్యార్థులే కారణం అంటూ దుష్ప్రచారం చేయడం ఆ వర్గాల విద్యార్థులను అవమానించడమే అవుతుంది. నిజానికి దాడికి పాల్పడిన విద్యార్థికి కానీ, ఆ ఘటన సందర్భంగా అక్కడ ఉన్న విద్యార్థులకు కానీ గతంలో ఉపాధ్యాయులను వేధించిన చరిత్ర కానీ, దాడులు చేసిన చరిత్రకానీ లేదు. ఈ ఘటన జరిగిన తర్వాత దాడికి గురైన అధ్యాపకుడు, నాపై దాడికి పాల్పడిన విద్యార్థి క్షమాపణలు చెప్పడం, అరెస్టు కావడం జరిగింది కనుక ఇంతటితో నేను ఈ విషయాన్ని వదిలేస్తున్నానని చెప్పాడు. యూనివర్సిటీలోని మెజారిటీ అధ్యాపకులు కూడా ఈ విషయాన్ని ప్రొఫెసర్, విద్యార్థులు కూర్చొని సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలని కూడా సూచిస్తున్నారు. కానీ తమ స్వప్రయోజనాలను రక్షించుకొనేందుకు ఔటా నాయకులు ఆ దాడిని ఒక సాకుగా తీసుకొని అగ్రవర్ణ భావజాలంతో ర్యాలీలు తీస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య వైషమ్యాలు పెంచి తమ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారు.

అయితే గతంలో ఇదే విశ్వవిద్యాలయంలో కొందరు ప్రొఫెసర్స్‌పై విద్యార్థులు దాడులకు పాల్పడిన సంఘటనలపై ఈ అధ్యాపకులుగానీ, ఉపాధ్యాయ సంఘం(ఔటా)గానీ స్పందించిన తీరును కూడా చర్చించాలి. మరికొద్ది సంవత్సరాల్లో ప్రథమ శతాబ్దిని పూర్తిచేసుకోబోతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేకమంది బడుగు, బలహీన వర్గాల ఉపాధ్యాయులు ఒక అగ్రవర్ణ విద్యార్థి సంఘం చేతిలో అనేక అవమానాలు, దాడులకు గురయ్యారు. గతంలో ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఒక ప్రొఫెసర్‌పై అగ్రవర్ణ విద్యార్థి సంఘానికి చెందిన కొందరు విద్యార్థులు దాడిచేసి ఆయనను గాయపరచడం జరిగింది. అంతేకాకుండా ఆ ప్రొఫెసర్ భార్యను, కూతురును అవమానిస్తూ కావేరి హాస్టల్ గోడలపై రాతలు రాశారు. ఆయన తోటి ఉపాధ్యాయుల దగ్గర తన బాధను, తనకు జరిగిన అవమానాన్ని వివరించాడు. కానీ ఆ ప్రొఫెసర్‌కు ఏనాడూ ఉపాధ్యాయ సంఘం (ఔటా) మద్దతు తెలుపలేదు. ర్యాలీలు తీయలేదు. దాడికి పాల్పడి, అవమానించిన విద్యార్థి సంఘంపై చర్యతీసుకోలేదు. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో చీఫ్ వార్డన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ కేశవులును అగ్రవర్ణ విద్యార్థి సంఘం తమ కార్యక్రమాల కోసం చందాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

అందుకు అంగీకరించని ప్రొఫెసర్‌పై ఆ విద్యార్థి సంఘ నాయకులు ఆయనపై 'సాంబారు' పోసి కొట్టి, అవమానించారు. తనకు జరిగిన అవమానానికి నిరసనగా ప్రొఫెసర్ కేశవులు ఆనాడు ధర్నా నిర్వహించారు, బాధ్యులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని వీసీకి మొరపెట్టుకున్నారు. ఒక ఎస్సీ ప్రొఫెసర్‌పై దాడులకు పాల్పడిన విద్యార్థులపై చర్య తీసుకోవాలని యూనివర్సిటీలో వామపక్ష, ఎస్టీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఆనాటి వీసీ కానీ ఔటా కానీ చర్య తీసుకోవాలని డిమాండ్ చేయలేదు. ఇదే యూనివర్సిటీలో లా కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న గిరిజన ప్రొఫెసర్ పంతునాయక్‌ను ఏబీవీపీ విద్యార్థి సంఘానికి చెందిన విద్యార్థులు చెప్పులతో కొట్టి, అవమానించినా ఏనాడూ కనీసం ఔటా నాయకులు ఖండించనూలేదు. మైనారిటీ వర్గానికి చెందిన ఒక ప్రొఫెసర్ తన విద్యార్థినితో క్లాస్ రూంలో సబ్జెక్ట్ విషయమై చర్చిస్తుంటే ఇదే మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు ఉపాధ్యాయునికి, విద్యార్థికి మధ్య లైంగిక సంబంధాన్ని అంటగట్టి అవమానించి కొట్టడం జరిగింది.

మొన్నటికి మొన్న ఆర్ట్స్ కాలేజీలో ఏబీవీపీకి చెందిన ఒక విద్యార్థి మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే మందలించిన లేడీ ప్రొఫెసర్‌ను ఆ విద్యార్థి దుర్భాషలాడి, అవమానిస్తే ఆ ప్రొఫెసర్ ఎగ్జామ్ హాల్ నుంచి ఏడ్చుకుంటూ నిష్క్రమించింది. ఇలాంటి ఘటనలు విశ్వవిద్యాలయంలో గత కొన్నేళ్లలో అనేకం జరిగినప్పటికీ ఏనాడూ ఖండించని ఔటా నాయకులు, అధికారులు మొన్న జరిగిన ఘటనను మాత్రం పెద్దది చేసి ఒక వర్గం విద్యార్థులను శత్రువులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే మేము యూనివర్సిటీ అధికారులను, ఔటా నాయకులను ప్రశ్నిస్తున్నాము. యూనివర్సిటీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అధ్యాపకులను, అధికారులను మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు అనేక సార్లు అవమానించి, భౌతిక దాడులకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేసినప్పుడు ఔటా నాయకులు ఎందుకు స్పందించలేదో వివరించాలి. అనేక మంది ప్రొఫెసర్లపై మతోన్మాద విద్యార్థులు దాడులకు పాల్పడినప్పుడు రాజీనామాలు చేయని అగ్రవర్ణ డీన్‌లు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు ఇప్పుడే ఎందుకు రాజీనామాలు చేస్తున్నారో వివరించాలి.

అనేక సందర్భాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధ్యాపకులు దాడులకు గురైతే ఈ ఔటా నాయకులు ఎందుకు ర్యాలీలు తీయలేదో, మానవహక్కుల కమిషన్‌ను ఎందుకు ఆశ్రయించలేదో వివరించాలి. దాడులకు గురైన ప్రొఫెసర్లు యూనివర్సిటీ ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఏనాడూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వని రిజిష్టార్ ఇవాళ ఎస్సీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి అగ్రవర్ణ ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడితే యూనివర్సిటీ అధికారులంతా ఆగమేఘాలమీద స్పందించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడే యూనివర్సిటీ అధికారుల నిజస్వరూపం, అగ్రవర్ణ స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొఫెసర్లపై జరిగిన దాడికి ఆ విద్యార్థి క్షమాపణలు చెప్పి, పోలీసుల ఎదుట స్వచ్చందంగా లొంగిపోయినప్పటికీ ఔటా నాయకులు ఆ విషయాన్ని అంతటితో వదిలి పెట్టకుండా మానవహక్కుల సంఘాన్ని, గవర్నర్‌ను కలుస్తూ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కదోవ పట్టిస్తున్నారు. యాదృచ్ఛికంగా జరిగిన ఆ ఘటనను ఖండిస్తూనే కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులతో, ప్రిన్సిపాల్‌తో చర్చించి, యూనివర్సిటీలో సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయాలని ఒకవైపు ప్రయత్నిస్తున్నారు. ఔటా నాయకులు మాత్రం విద్యార్థుల ప్రతిపాదనను తోసిపుచ్చుతూ విషయాన్ని మరింత జఠిలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
యూనివర్సిటీలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్యవర్తిత్వం వహించాల్సిన ఉపాధ్యాయులు, బాధ్యత కలిగిన అఖిలేశ్వరి లాంటి వ్యక్తులు సమస్యను సరిగ్గా అర్థం చేసుకోకుండా దానిని ఇంకా జటిలం చేస్తే ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయో ఆలోచించాలి. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులను సన్నిహితంగా గమనిస్తున్న అఖిలేశ్వరి గారు విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడిచేయడం, పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడిచేయడం కంటే తక్కువేమీ కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఒక విద్యార్థి భావోద్వేగానికిలోనై ఒక ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడితే ఆ ఘటనను ఉగ్రవాద చర్యతో పోల్చడం ఏవిధంగా సరైనదో అఖిలేశ్వరిగారే విజ్ఞతతో ఆలోచించుకోవాలి. సమాజం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు దాని నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపంచి, పరిష్కారాన్ని కనుగొనాల్సిన బాధ్యత మేధావివర్గంపై ఉంటుంది. కానీ మేధావులుగా పిలవబడుతున్న విశ్వవిద్యాలయ అధ్యాపకులు సమస్యను జటిలం చేస్తూ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే దీనిద్వారా ఎవరి ప్రయోజనాలు నేరవేరుతాయో విజ్ఞులే ఆలోచించాలి.


డేవిడ్, వంగపల్లి శ్రీనివాస్, కంతి జగన్, మర్పల్లి ఆనంద్
రీసెర్చ్ స్కాలర్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయం


Andhra Jyothi New Year 1/1/2013

No comments :

Post a Comment