హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలు

No comments
మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో సుమారు 700 తెగలకుచెందిన 9 కోట్ల మందికి పైగా ఆదివాసులు జీవనం సాగిస్తున్నారు. వీరిలో 92 శాతానికి ప్రధాన జీవనాధారం అటవీ భూములే. మన రాష్ర్టంలో 30 తెగలకు చెందిన ఆదివాసులు, మరో ఐదుతెగలకు చెందిన మైదాన ప్రాంతవాసు లు- 60 లక్షల మందికి పైగా 9 జిల్లాలోని షెడ్యూలు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాజ్యాంగ పరంగా షెడ్యూలు 5,6లలో ప్రత్యేక రక్షణలు కల్పించిన ఆది వాసుల జీవనం నేడు పెనుసంక్షోభాన్ని ఎదుర్కొంటు న్నది. మైదాన ప్రాంత షావుకార్ల, వడ్లీవ్యాపారుల మోసాలకు, అన్యాయాలకు, దోపిడీ దౌర్జన్యాలకు, ఫారెస్టు అధికారుల వేధింపులకు గురౌతూ ఆదివాసులు మనుగడకోసం, మెరుగైన జీవనంకోసం పోరాతున్నారు.
 ఈ సమస్యలన్నింటికీ తోడు వేలాది, లక్షలాది ఎకరాల అటవీ భూములను పరిశ్రమల స్థాపన పేరిట, ప్రాజెక్టుల నిర్మాణం పేరిట, గనుల తవ్వకం పేరిట బడా, బహుళజాతి, కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టటం ద్వారా వారిని అడవుల నుండి శాశ్వతంగా దూరం చేసేందుకు పాలకులు పూనుకున్నారు. ప్రభుత్వాలులు గత ఆరున్నర దశాబ్దాలుగా చేపడుతున్న విధానాల ద్వారా ఆదివాసులకు కల్పించామన్న రక్షణలన్నింటినీ గత రెండు దశాబ్దాలుగా ఒక్కొక్కటిగా తొలగించివేస్తున్నారు.శ్రీకాకుళ గిరిజన రైతాంగఉద్యమానంతరం అటవీ ప్రాంతంలో ఆదివాసుల భూమిహక్కును నామమాత్రంగానైనా పరిరక్షించే 1/70 చట్టాన్ని రాష్ర్టప్రభుత్వం చేసింది. ఈ చట్టాన్ని నీరుగారుస్తూ వచ్చిన ప్రభుత్వాలన్నీ, అటవీ భూములను గిరిజనేతర భూస్వాముల పరం చేయడంతో పాటు, పెద్దఎత్తున బడా పారిశ్రామిక సంస్థలకు కట్టబెడుతూ వచ్చాయి. ఆదివాసుల స్వయంపాలనలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ 1996లో ‘పంచాయితీరాజ్‌ గిరిజన ప్రాంతాల విస్తరణ చట్టం’ (పెసా) తెచ్చింది. 15 సంవత్సరాల తర్వాత ఇటీవల ప్రభుత్వం దాని అమలుకు నిబంధనలు రూపొందించడంలోనే- ఆదివాసుల హక్కుల అధికారాలను పంచాయితీలకు, మండల పరిషత్తులకూ కట్టబెట్టింది. తద్వారా ఆదివాసుల అటవీభూములను అన్యాక్రాంతంచేసే చర్యలను వేగవంతం చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారమే లక్షఎకరాల అటవీభూములను ఆక్రమించుకుని అనుభవిస్తు న్నారని ప్రభుత్వం నియమించిన గిర్‌గ్లానీ కమిటీ వెల్లడించేసింది. కోనేరు రంగారావు భూ కమిటీ ఆదివాసుల భూముల దురాక్రమణను ప్రధానంగా ప్రస్తావించింది. ప్రపంచీకరణ విధానాలను అమలుచేయటం ప్రారంభమైన తర్వాత అదివాసుల జీవనం ‘పెనం మీదనుండి పోయ్యిలో పడిన’ చందం అయ్యింది. విదేశీ, సామ్రాజ్యవాద బడా కంపెనీలు విచ్చలవిడిగా అడవులలోని భూగర్భ, ఉపరితల సహజ సంపదలన్నింటినీ కొల్లగొట్టు కెళ్ళేందుకు పాలకులు అన్నిరకాల అనుమతు లూ ఇచ్చివేస్తున్నారు. విద్యను అందని ద్రాక్షగా మార్చి కార్పొరేటీకరించిన పాలకులు మరో చేత్తో విద్యాహక్కు చట్టం చేసిన విధంగానే; వైద్యాన్ని ఖరీదైన అంగడిసరుకుగా మార్చిన పాలకులే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకాలతో భ్రమలు కల్పిస్తున్నట్లుగానే; ఆహార భద్రతచట్టం అంటూనే ఆదివాసుల హక్కులన్నింటినీ హరించి వేస్తున్న పాలకులు, ఆదివాసీహక్కుల చట్టం-2006 పేరిట మరో చట్టాన్ని ముందుకు తెచ్చారు.అటవీ ఉత్పత్తులు సేకరించి సంతల్లోనో, ఐటిడిఏ ద్వారానో అమ్ముకుంటూ, పోడు వ్యవసాయం చేసుకుంటూ సాప్రదాయక ఆదివాసుల జీవనం సాగిస్తూ వస్తున్నారు. తాము వ్యవసాయంచేస్తున్న ప్రాంతంలో భూసారం తగ్గాక మరో ప్రాంతాన్నెంచుకొని వ్యవసాయం చేయటమనే పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు. అయితే వీరు సాగుచేసుకుంటున్న అటవీ భూములకు చట్టబద్ధ పట్టాలను, వాటిపై మరొకరి ఆధిపత్యాన్ని ఎరగరు. పాలకులు తీసుకువచ్చిన ఆదివాసీ హక్కుల చట్టం వీరికి అదనంగా హక్కులు కల్పించకపోగా, సాంప్రదాయకంగా అడవిపై సంక్రమించిన హక్కులను హరించివేయటానికే మరోరూపంలో పూనుకున్నది. ఒక్కో ఆదివాసీ కుటుంబానికి 5 ఎకరాల నిర్దిష్ఠ, నిర్ణీత అటవీ భూమిపై ప్రభుత్వ పట్టానిచ్చి, వారిని శాశ్వతంగా అక్కడివరకే కట్టడి చేయబూనుకోవడం ఈచట్టం అసలు ఉద్దేశ్యం. తద్వారా పాలకులు, మిగిలిన అటవీ భూములన్నింటినీ యథేచ్ఛగా దోపిడీ వర్గాలకు కట్టబెట్టేందుకు చట్టపరంగా వెసులుబాటు పొందే ఆలోచన దీని వెనుక దాగిఉంది.సమతా కేసులో సుప్రీంకోర్టు 1/70ని పునరుద్ఘాటిస్తూ ఏజన్సీ ప్రాంత భూములను గిరిజనేతరులకు ఇవ్వరాదని పేర్కొన్నది. పాలకులు ఈ తీర్పును నీరుగార్చుతూ వచ్చారు. ఏజన్సీ ప్రాంత భూములు ప్రభుత్వ ఆధ్వర్యంలో వినియోగిస్తున్నట్లుగా నాటకమాడి జిందాల్‌ వంటి వివిధ సంస్థలకు కట్టబెడుతూ వస్తున్నారు. ఈ విధానాలకు, చర్యలకు వ్యతిరేకంగా తీవ్రనిర్బంధాన్ని, అణచివేతలను ఎదుర్కొంటూ దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ముందుకు సాగుతున్నారు. ఒరిస్సాలోని కళింగ నగర్‌లో తమ భూములను ఆక్రమించి నిర్మిస్తున్న టాటా ఉక్కు కర్మాగార స్థాపనను నిరసించిన ఆదివాసులపై ప్రభుత్వం కాల్పులు జరిపి 12 మందిని బలిగొంది.‘పోస్కోకు ‘వేదాంత’ కోసం అటవీ భూఆక్రమణలకు వ్యతిరేకంగా ఆదివాసులు పోరాటం సాగిస్తున్నారు. మన రాష్ర్టంలోని విశాఖ జిల్లా చింతపల్లి ఏజన్సీలోని బాక్సైట్‌ గనుల తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కన్నెధారకొండ మైనింగ్‌ లీజుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 9 మండలాల పరిధిలోని 276 ఆదివాసీ గ్రామాలకు చెందిన లక్షాయాభైవేల మందిని నిర్వాసితుల్ని చేసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఉభయగోదావరి, ఖమ్మం జిల్లాల్లోని ఆదివాసులు బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ‘ఆడవికి ఆడవి’, ‘భూమికి భూమి’ నినాదంతో ఉద్యమిస్తున్నారు.ఆదివాసుల జీవనాన్ని ఈ విధంగా విధ్వంసం చేయడంతో పాటు, వారి సంస్కృతిని, జీవన విధానాన్ని కూడా కనుమరుగుచేసేందుకు పాలకులు విష సాంస్కృతిక దాడిని తీవ్రం చేశారు. గత రెండు దశాబ్దాల కాలంలో సామ్రాజ్యవాద సాంస్కృతిక మాధ్యమాలను ఆదివాసుల మధ్యకు జొప్పిస్తున్నారు.ఆధునిక సౌకర్యాల పేరిట, విద్యుత్తు వెలుగుల మాటున వినోదం, విజ్ఞానం బదులుగా వస్తు వ్యామోహ సంస్కృతితో ముంచెత్తుతున్నారు. టీవిలను, సెల్‌ఫోన్లను ఆదివాసులకు కూడా అందుబాటులోకి తేవడమే వారి అభివృద్ధికి నిదర్శనంగా పాలకవర్గ మేధావులు పేర్కొంటున్నారు. ఆగస్టు 15, జనవరి 26ల సందర్భంగా మువ్వన్నెల జెండాలను ఎగురవేసి దళిత, పీడిత, తాడిత ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యంగా గొంతుచించుకొనే పాలకులు, ఆదివాసీల సంక్షేమానికి చేపడుతున్న విధానాలు, చర్యలు శూన్యమని స్పష్టమవుతున్నది. ఆదివాసుల విద్య, వైద్యం, సంక్షేమం కోసం కేటాయించిచే నిధులనుకూడా కుదించివేస్తున్నారు. రాష్ర్ట బడ్జెట్‌లో గిరిజన సబ్‌ప్లాన్‌క్రింద 6.6 శాతం నిధులను ఖర్చుచేయాలి. కానీ కేటాయించిన నిధులనైనా వెచ్చించకుండా ఇతరేతర పద్దులలోకి దారి మళ్ళిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆదివాసుల్లో 50 శాతం మందికి కనీస పౌష్ఠికాహారం అందడం లేదు. మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత, పౌష్ఠికాహార లోపం కారణంగా పురిట్లోనే ప్రాణాలు విడుస్తున్న పసిబిడ్డల సంఖ్య అత్యధికంగా ఉంది. ప్రతి వెయ్యి మంది శిశువులకు శిశు మరణాలు150 నుండి 250 వరకూ ఉంటున్నాయి. అత్యధిక ఆదివాసీ గ్రామాల్లో నేటికీ కనీస వైద్య సదుపాయం కానీ, తగిన డాక్టర్లు, వైద్య సిబ్బంది, పరికరాలు, మందులు, వసతి సౌకర్యాలు కానీ అందుబాటులో లేవు.1999లో విశాఖ ఏజన్సీలో విషజ్వరాల బారినపడి 3 వేల మందిి పైగా జనం మరణించిన సంఘటనపై నాటి మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ డా వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషన్‌ ప్రభుత్వానికి అందజేసిన నివేదికను పాలకులు ఏనాడో పాతిపెట్టేశారు. ఈ సంవత్సరం జులై నాటికే విశాఖ ఏజన్సీలోనే 100 మందికి పైగా ఆదివాసులు మరేరియా, డయేరియా, కామెర్లవ్యాధులతో చనిపోయారు. గత సంవత్సరం విజయనగరం జిల్లాలోనే 4 వేలమంది ఆదివాసులు మరేరియా బారిన పడ్డారు. ఇప్పటికే ఈ ఏడాది ఆదివాసీ ప్రాంతాల్లో 280 మంది డెంగ్యూ, మలేరియా వ్యాధులకు గురయ్యారు. ఫాల్సీఫారమ్‌ మలేరియా మెదడుకు సోకి మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ నాటికీ అదివాసుల్లో అక్షరాస్యత 16 శాతానికి మించలేదు. సంక్షేమ హాస్టళ్ళు నరక కూపాలను తలపిస్తున్నాయి. ఇప్పు గిరిజన సంక్షేమహాస్టళ్ళను, గురుకుల పాఠశాలలను కుదించి వేస్తున్నారు. గురుకుల ఆదివాసీ పాఠశాలల్లో ఆడపిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. వీరిపై వేధింపులు, లైంగిక దాడులు, దౌర్జన్యాలు సర్వసాధారణమయ్యాయి. ఇటీవల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నిరోధిస్తుందని చెబుతూ ‘గర్దాసిల్‌’ అనే టీకాను గురుకుల పాఠశాలలో చదువుకునే ఆదివాసీబాలికలపై ప్రభుత్వ ప్రోద్బలంతో ప్రయోగించారు. అత్యంత ప్రమాదకరమైన ఈ అనైతిక ఔషధప్రయోగాల ఫలితంగా వీరిలో కొందరు మరణించగా అనేకమంది ఔషధ పరీక్షల దుష్ఫలితాలనెదుర్కొంటున్నారు.అదివాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కుదించి వేస్తున్నారు. ఎలాంటి హక్కులు, భద్రత లేని తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతుల్లో మాత్రమే కొన్నైనా అవకాశాలు కల్పిస్తున్నారు. గత 10 సంవత్సరాలలో 15 వేల అదివాసుల పోస్టులు వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయలేదు.ఆదివాసీ యువకులకు ఈ మధ్యకాలంలో ఎమైనా ఉద్యోగాలు కల్పించారంటే అవి పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యగాలు మాత్రమే!ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసుల పోరాటాలను ఏఎఫ్‌ఎస్‌పిఏ వంటి క్రూర చట్టాలతో పాలకులు అణయివేయ చూస్తున్నారు. అస్సాంలో ఆదివాసుల గుడిసెలను ఏనుగులతో తొక్కిస్తే, గుత్తికోయల గ్రామాలను మన రాష్ర్టంలో తగులబెట్టించే ఫాసిస్టు చర్యలకు పాల్పడుతున్నారు. ‘గ్రీన్‌హంట్‌’ పేరిట పోలీసు, సైనిక బలగాలను మోహరిస్తున్నారు. నక్సలైట్లను అణచి వేసేందుకోసం ‘సాల్వజుడుం’ పేరిట ఆదివాసుల నుండే ప్రత్యేక బలగాలను రూపొందించి, శిక్షణ, ఆయుధాలుఇచ్చి వారిని ప్రయోగిస్తున్నారు.ఆదివాసీ ప్రాంతా ల వారు దోపిడీ వ్యవస్థపై పోరాటం ఎక్కుబెట్టకుండా అనేక ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. సమస్తవనరులనూ కొల్లగొట్టేనిమితం మానవరహి త అడవులుగా మార్చేందుకు పూనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ పోరాట యోధులు బిర్సాముండా మొదలు కొమురంభీం వరకూ సాగించిన సమరశీల పోరాట స్ఫూర్తిని ఆదివాసీ ఉద్యమాలు స్వంతం చేసుకోవాలి. అటవీ భూముల సేకరణకు వ్యతిరేకంగా ఆదివాసులు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సాగిస్తున్న ఉద్యమాలను ఇతర పీడిత వర్గాల సమన్వయంతో సాగించాలి
(సూర్య   22-12-2012)

No comments :

Post a Comment

ఎన్నికల నుంచి గట్టేందుకే ఆహార భద్రత పథకం

No comments
ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుత్ను సమస్య ఆహార భద్రత. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు వెనుకబడిన దేశాలు సహితం నేడు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ దీనిని అధికమించలేకపోతున్నాయి. 'ఆరోగ్యకరంగా జీవించేందుకు అవసరమైన ఆహారాన్ని అన్ని వేళలా, అన్ని వర్గాల ప్రజలకు అభింపజేయటమే ఆహార భద్రత' అని అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ నిర్వచించింది. ప్రపంచలో ఏ ఒక్కరికి ఆకలి బాధ ఉండకూడదనే సంకల్పంతో ఐక్యరాజ్య సమితి, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గరైజేషన్‌ను 1945 అక్టొబర్‌ 16న కెనడాలో నెలకొల్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు తనవంతుగా 3 బిలియన్‌ డాలర్లను కేటాయిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి తాజాగా ప్రకటించింది. అయితే కేటాయించిన ఈ నిధులు చాలవని 2030 నాటిని ఆహార సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో నివారిలంచాలంటే ఏడాదికి కనీసం 20 బిలియన్‌ డాలర్లు ఖర్చుపెట్టాలని సూచించింది.   తీవ్ర కరువుకోరల్లో చిక్కుకున్న ఆఫ్రికా దేశాలతో పాటు ప్రపంచంలోని దాదాపు 30 దేశాల్లో ప్రజల ఆహార పరిస్థితి ప్రమాధంలో 

ఉందన్ని తెలిపింది. ఈ ఆహార సంక్షోభాన్ని సకాలంలో ఎదుర్కొనక పోతే ప్రపంచలోని దాదాపు 50 శాతం మంది పిల్లల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారే ప్రమాధం ఉందని తెలిపింది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేధికలో ప్రపంచంలోని మొత్తం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 25 శాతం భారత్‌లోనే ఉన్నారని పేర్కొంది. మన దేశంలోని మొత్తం పిల్లల్లో దాదాపు 22 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని, 5 సంవత్సరాలలోపు పిల్లల్లో 43.5 శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో ఉంటున్నారని, దాదాపు 7 శాతం మంది పిల్లలు పుట్టిన 5 సంవత్సరాల్లోనే మరణిస్తున్నారని  తన నివేదికలో వెల్లడించింది. భారతదేశంలోని 76 శాతం ప్రజలకు కావాల్సిన కేలరీల్లో ఆహారం లభించడంలేదు. గ్రామీణ జనాభాలో 80 శాతం, పట్టణ జనాభాలో 64 శాతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దేశంలోని మహిళల్లో సగం కాన్నా ఎక్కువమంది పిల్లల్లో మూడింట నాలుగోంతులు రక్తహీనతతో బాధపడుతున్నారు. అప్పుడే పుట్టిన పిల్లల్లో 30 శాతం తక్కువ బరువుతో ఉన్నారు. భారతదేశంలోని ప్రతి ముగ్గురు వయోజనుల్లో ఒకరు ఉండాల్సిన బరువు, ఎత్తులో లేరు. అంటే వారిలో దీర్ఘకాల శక్తిహీనత 

ఉన్నట్లేనని వైద్యశాస్త్రం చెబుతోంది. భారత రాజ్యంగం జీవించే హక్కును ప్రజలందరికీ ప్రాథమిక హక్కుగా ఇస్తోంది. ఆహార హక్కు జీవించే హక్కులో భాగమే. అందరికి అది దక్కాలంటే మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ధి సేవలు, తదితర పౌష్టికాహార పథకాలను ఆహార భద్రత చట్టం పరిధిలోకి తీసుకురావాలి.

జాతీయ శాంపిల్‌ సర్వే ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు 2400 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. కానీ గ్రామాల్లో 49 శాతం మంది, పట్టణాల్లో 53 శాతం మంది ఇన్ని క్యాలరీల ఆహారాన్ని తీనలేకపోతున్నారు. ప్రపంచ సగటు కేలరీలు 2718, అభివృద్ధి చెందిన దేశాల సగటు కేలరీలు 3206, వర్థమాన దేశాల సగటు కేలరీలు 2573 కాగా మన దేశంలో వర్థమాన దేశాల సగటు కేలరీల కంటే తక్కువగా వినియోగిస్తున్నారు. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ఉత్సా పట్నాయక్‌ వేసిన లెక్కల ప్రకారం గ్రామాల్లో 87 శాతం మందికి 2400 కేలరీల ఆహారం కూడా అందుబాటులో లేదు. దీనీకి ఆదాయం లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది. ప్రపంచ ఆహార ఉత్పతిల్లో మూడవ స్థానాన్ని ఆక్రమించిన భారత్‌ వంటి దేశాల్లో పౌష్టికాహార లోపంతో పిల్లలు మరణించడం పాలకుల నిర్లక్ష్యం, ఆర్థిక విధానాలే కారణమని నిపుణు పేర్కొంటున్నారు. మరోవైపు వైపు నిల్వ సదుపాయాలు లేకపోవడం వల్లా భారీ ఎత్తున ఆహార ధాన్యాలు గోదాముల్లో ముక్కిపోతున్నాయని భారత ఆహార సంస్థ ప్రభుత్వానికి నివేధిక సమర్పించింది. ఆహార నిల్వలు పర్వతాల్లా పేరుకుపోతున్నా,  దాచుకునే సామార్థం లేక వృథా కావడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సహితం గతంలో తప్పు పట్టింది. ధాన్యాన్ని ప్రజలకుఉచితంగా పంచవచ్చు కదా అంటూ మొట్టికాయ వేసింది. ఇది నేడు దేశంలో వున్న పరిస్థితి. 

అయితే ఈ పరిస్థితిని అధికమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత పథకాన్ని త్వరలో అమలుచేస్తున్నట్లు ప్రకటించింది.  దేశంలోని ప్రతి ఒక్కరూ 'చాలినంత ఆహారం' పొందే హక్కును చట్టంద్వారా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం మేరకు జాతీయ ఆహార భద్రత చట్టన్ని రూపొందిస్తున్నట్లు నాటీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ జూన్‌4, 2009న ప్రకటించింది. అయితే ఈ ఆహార భద్రత బిల్లు అమలులోకి వస్తే  దేశంలోని దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు చౌకధరల బియ్యం, గోధుమలు  వంటి ఆహార ధాన్యాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతుంది. అయితే ప్రజలను రెండు వర్గాలుగా విభజించడంలోనే పాలకుల కుట్ర దాగివుందని వామపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దేశంలోని ప్రజలందరికి ఆహారభద్రత కల్పించే విధంగా ఈ పథకాన్ని విస్తరించాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దారిద్య్రాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం సురేష్‌ టెండూల్కర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ.11.80 , పట్టణ ప్రాంతంలో రోజుకు రూ.17.8 సంపాదిస్తున్న వారినే దారిద్య్ర రేఖకు దిగువన 

ఉన్నవారిగా గుర్తిస్తున్నారు. మిగిలిన వారిని దారిద్య్ర రేఖకు ఎగువ ఉన్నవారిగా గుర్తిస్తున్నారు.  అదే విధంగా ప్రణాళిక సంఘం గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూపాయలు 22, పట్టణ ప్రాంతంలో రూ.28 కంటె ఎక్కువ సంపాదించేవారంతా దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు అని విభజించింది.  కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సర్వేల్లో వేటిని తీసుకున్నా దేశ జనాభలోని అత్యధికులు ఈ పథకానికి దూరంగానే ఉండవలసి వస్తుంది. ఇది కేవలం ప్రజలను మోసపుచ్చేందుకు ప్రకటించిన పథకంగానే మిగిలిపోతుంది. ఒకవైపు ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలకు క్రమంగా ఎత్తివేస్తున్న ప్రభుత్వాలు ఇన్నివేల కోట్ల రూపాయల సబ్సిడీలను భరించి పేదలకు ఆహారభద్రత కల్పించేందుకు ముందుకు వస్తుందంటే దీనివెనుక ఏదో కుట్ర దాగివుందని,2014లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం ఈ పథకాన్ని రూపకల్పన చేసిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రభుత్వానికి ఇంత ఆకస్మత్తుగా ప్రజలపై ప్రేమ ఎందుకు కలిగింది. దేశంలో లక్షలాధిమంది పిల్లలు పౌష్టికాహారంతో బాధ పడుతున్నారని, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు ఎన్నొ సంవత్సరాలుగా ఆహార భద్రత కోసం పట్టుబడుతున్నా ఏనాడు పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఇంత అడావుడిగా ప్రభుత్వం ఎందుకు అమలు చేసేందుకు సిద్ధపడుతుందనే ఆలోచించాలి. 

ప్రస్తుతం దేశంలో ఏడున్నర కోట్ల టన్నుల ఆహార నిల్వలు పేరుకుపోయాయని, ఇవి త్వరలో చెడిపోయి ఆహార వినిమయానికి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని భారత ఆహార సంస్థ హెచ్చరించింది.  దీనిని అధికమించాలంటే రాష్ట్రాలకు ఇస్తున్న కేంద్ర కోటాను పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి నివేధిక పంపింది. గోదాముల్లో పేరుకుపోయిన ఆహార నిల్వలను త్వరలో  పంపిణి చేయకపోతే దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగుని స్థాయిలో ఆహార నిల్వలు పాడైపోయే ప్రమాధం ఉందని సూచించింది. గతంతో గోదాముల్లో ఆహార నిల్వలు పాడైపోతున్న విషయాన్ని సుప్రీం కోర్టు సహితం తప్పు పట్టిన విషయం గమనంలో ఉంచుకున్న కేంద్రం ఆహార నిల్వలు పాడైపోతే పెద్ద అపవాదును మూటకట్టుకోవాల్సి వస్తుందని ఆలోచించింది. దీని నుంచి అధికమించేందుకు మరియు 2014 ఎన్నికల్లో గట్టెక్కెండుకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో విపక్షాలు, మేధావుల అనుమానిస్తున్నట్లు ఆహార భద్రత పథకం ఒట్లను ఆకర్షించే పథకంగా మారుతుందా లేదా పేదలకు ఉపయోగపడుతుందా? బ్లాక్‌ మార్కెట్‌ దారులకుఉపయోగపడే పథకం అవుతుందా అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఎన్నికల కోసం ప్రభుత్వం గోదాముల్లో పేరుకుపోయిన నిల్వలను పంపిణి చేసి తాత్కాలికంగా ప్రజల ఆహార కోతను తీర్చగలిగిన భవిష్యత్తులో ఆహారకోరతను ఎలా ఎదుర్కొంటారు అనేది పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. 

మన దేశం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి కారణమేంటనేది ఆలోచించకుండా పరిష్కారాన్ని కనుగొనలేము. భారతదేశంలో ఆహార సంక్షోభం అకస్మాత్తుగా తలెత్తినది కాదు. గత దశాబ్దానికి పైగా అనుసరిస్తున్న ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచబ్యాంకు, డబ్లూటిఓ అదేశిత విధానాన్ని అమలుచేయడం కారణంగా ఏర్పడింది. 90వ దశకంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పుట్టుకువచ్చిన వాణిజ్య సరళితో, జన్యుమార్పిడి పంటలతో ఆహార సంక్షోభం తీవ్రమయింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ద్వారా పారిశ్రామిక దోపిడి పెరిగింది. మన దేశంలో రైతులను ప్రభుత్వాలు వ్యాణిజ్య పంటలు పండించేందుకు ప్రొత్సహించడంతో రైతలకు సరైన అవగాహన లేకపోవడం, వాటికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతాంగం తీవ్ర నష్టాలను చవిచూశారు.  అనవసర ఖర్చుల కారణంగా రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు అనేకం జరిగాయి. దీనిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నియమించిన జయతి ఘోష్‌ కమిలీ, స్వామినాథన్‌ కమిటీ అనేక సూచనలు చేసింది కానీ పాలకులు వీటిని పట్టించుకోకపోవడంతో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఆహారసంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వ్యవసాయ రంగానికి నిధులు పెంచడం ఒక్కటే పరిష్కారమని సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి కార్యదర్శి బాన్‌కిమూన్‌ సెలవిచ్చాడు. వ్యవసాయానికి ఉపయోగపడే భూములను వ్యవసాయేతర రంగాలకు మళ్లించకుండా సమగ్ర చట్టం చేయాలి. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.  పండించే పంట నిల్వచేసుకునేందుకు గ్రామాల్లోనే  శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. అప్పుడే ఆహారభద్రత ఏర్పడే అవకాశం ఉంటుంది.  వ్యవసాయ రంగానికి ప్రత్యేక దృష్టిపెట్టి అధిక నిధులు కేటాయించని పక్షంలో ఆహారం కోసం అలమటించేవారి సంఖ్య రాబోయే రోజుల్లో అనుహ్యంగా పెరిగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

నిజానికి మొన్నటి పాత 'పనికి ఆహార పథకమూ', నేటి కొత్త 'ఆహార భద్రతా పథకమూ' బడా కార్పోరేటు ఆర్థిక వ్యవస్థ బుర్రలో పుట్టిన పథకాలే? ఇవేవి సోషలిస్టు, లేదా సోషటిస్టు తరహా భావాల నుంచి పుట్టినవి కావు. పెటుట్బడిదార్ల కోసం, పెట్టుబడి దార్ల చేతి, పెట్టుబడిదార్ల యొక్క పథకాలు ఇవి. విస్తృతమైన మన గ్రామీణ వ్యవస్థను కార్పోరేటు వాణిజ్య, పారిశ్రామిక వ్యవస్థకు అనుసంధానం చేసే ప్రణాళికలో భాగంగానే రూపొందిన పథకాలివి. పనికి ఆహార పథకం తమను రాజకీయ సంక్షోభం నుంచి కాపాడిందని నిర్ధారించుకున్నాయి. దాని వల్ల గ్రామీణ ప్రజల చేతికి అందిన సొమ్ముతో సాగించిన అదనపు కొనుగోళ్ళ కష్టకాలంలో తమకు ఒకింత చేయూత నిచ్చినట్లు కార్పొరేటు కంపెనీలు గుర్తించాయి. ఆ స్పూర్తితో అలాంటి మరికొన్ని సంక్షేమ పథకాలను రూపకల్పన చేశాయి. అందులో భాగమే తాజా ఆహార భద్రత. పట్టణ మధ్య తరగతి కుటుంబం తమ ఆదాయంలో 20-30 శాతం సొమ్మునే ఆహారావసరాలకు ఖర్చు చేస్తున్నది. మిగిలిందే ఆహారేతర వస్తే సామాగ్రికి, ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నది. కానీ కోట్లాది గ్రామీణ పేదలు తమ అల్ప రాబడిలో 60 శాతం పైగా ఆహారావసరాలకే ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా నిరుపేదల విషయంలో ఉపాధి హామీ సొమ్ములో తొంభై శాతం ఆహారావసరాలకే మళ్లించబడుతున్నదని అవి నిర్ధారించాయి. గ్రామీణ పేదల ఆహార బడ్డెట్‌ వ్యయాన్ని తగ్గిస్తే తప్ప తమకు తగినంత లాభం చేకూరదని కూడా అవి గుర్తించాయి. అందుకే రాజకీయ వ్యవస్థ ద్వారా ప్రజాధనంతో తక్కువ ధరలకు పేద ప్రజల ఆహారావసరాలను తీర్చదలచింది. తద్వారా వారి డబ్బును ఆహారేతర ఖాతాలోకి మళ్ళించి పథకం పన్నింది. అందుకోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని ఆహార భద్రత, జాతీయఉపాధి పథకం. ఇలాంటిదే ఆరోగ్యశ్రీ పథకమైనా! అంతిమంగా డబ్బు ప్రవహించేది కార్పోరేట్‌ ఆసుపత్రులకే మరి! ఆ రూపంగా ఓ ప్రక్క ఓటు కొనుగోలు చేసుకుంటుంది. మరో ప్రక్క కార్పోరేటు కంపెనీలకి చైతన్యానిచ్చే వ్యాపారాన్ని ప్రవహింపచేస్తున్నది. బదులుగా కంపెనీల నుండి భారీ మొత్తాలని పార్టీ ఫండులుగా, వ్యక్తిగత కానుకలుగదా లేదా లంచాలుగా రాబట్టుకుంటుంది. ఇలా ఇదో వలయం, దోపిడి మూలం.
18-12-12

No comments :

Post a Comment

శామీకోద్యమ నాయకుడు - డా||బి.ఆర్‌.అంబేద్కర్‌

No comments
''డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌'' ఈ పేరు తలిస్తేనే దళితుల గుండెల్లో ఉత్తేజం, ఉద్వేగం కలుగుతాయి. తరతరాలుగా నిచ్చనమెట్ల కుల సమాజంలో బానిసత్వం కంటే ఘోరమైన అస్పృశ్యత కారణంగా సమాజంచే చీదరించబడుతూ అనేక అవమానాలు ఎదుర్కొంన్న ఒక అస్పృశ్యుడు భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగాడు. పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దవాడై విదేశాలలో ఉన్నత చదువులు చదివి కూడా ఈ నిచ్చెన మెట్ల కుల సమాజంలో అనేక అవమానాలను, బాధలను సహించాల్సి వచ్చింది. ఈ అమానుషమైన అస్పృశ్యతకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడాడు. అదేవిదంగా వెట్టి చాకిరీకి, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల కోసం, కనీస వేతన చట్టం కోసం, 10 గంటల పని దినాన్ని 8 గంటలకు తగ్గించేందుకు, స్త్రీ అభ్యున్నతి కోసం పోరాడాడు.
అయితే చాలా మంది అంబేద్కర్‌ను అస్పృశ్యుల నాయకుడిగా, కేవలం ఆయన అస్పృశ్యుల సమస్యల కోసం పోరాడిన వ్యక్తిగానే చూస్తారు. కానీ ఆయన అస్పృశ్యుల అభ్యున్నతి కొరకు ఎంత పోరాటం నిర్వహించాడో అంతే పోరాటాన్ని ఈ దేశంలో అణిచి వేయబడుతున్న వర్గాలైన కార్మికులు, రైతులు, స్త్రీల పక్షాన పోరాటం నిర్వహించాడు అనే విషయం చాలా మందికి తెలియదు. తెలిసిన వ్యక్తులు వాటిని మరుగున పరిచి ఆయనను ఒక అస్పృశ్యుల నాయకుడిగానే ముద్రవేశారు. అబేద్కర్‌ తరతరాలుగా జమీందారుల దౌర్జన్యాలకు, దాష్టీకాలకు గురువుతున్న  రైతులను, వ్యవసాయ కార్మికులను ఆయన చూసి చలించిపోయాడు. వారి హక్కుల సాధనకై ఆందోళన నిర్వహించాడు. 
ఆనాటి మహారాష్ట్రలోని కొంకణ ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు భూమిని దున్ని పండిస్తూంటే ఆ భూమి మీద హక్కులు మాత్రం 'ఖోటీ'లనబడే భూస్వామీ వర్గాల చేతులల్లో ఉండేవి. పెద్ద మొత్తాల్లో బీదరైత్నులుండి భూమి శిస్తులు వసూలు చేస్తూ అందులో వారు కొంత తీసుకొని, మిగతాది ప్రభుత్వినికి చెల్లించేవారు. రైతాంగం పండించే పంటలను కూడా కొంత భాగం స్వాధినం చేసుకుంటూ, రైతులను రైతూ కూలీలను బానిసలకంటే ఆధ్వానంగా చూసేవారు. ఈ 'ఖోటీ' అనబడే ఘోర దుర్భర పరిస్థితి కొన్ని దశాబ్దాల పాటు కొనసాగుతూ వచ్చింది. రైతు కూలీలను దోపిడీ చేస్తున్న యీ ఖోటీ పద్దతిని నిర్మూలించాలని అంబేద్కర్‌ కంకణం కట్టుకున్నాడు. 1929 ఏప్రిల్‌ 14న రత్నగిరి జిల్లా చిప్లాన్‌లో జరిగిన రైతాంగ మహాసభలో అంబేద్కర్‌ రైతాంగాపు రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్న ఖోటీ పద్దతికి తక్షణమే స్వస్తి చెప్పాలని ఆ ఖోటీ పద్దతికి వ్యతిరేకంగా రైతాంగాన్ని కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపాడు. రత్నగిరి, సతారా, నాసిక్‌, ప్రాంతాల నుండి వేలాఏది మంది రైతాంగాన్ని సమీకరించి, పెద్ద ఉరేగింపుతో బొంబాయి శాసన సభ వరకు వారిని తీసుకెళ్లి ఖోటీ నిర్మూలన గూర్చి ఆందోళన చేసారు. నాటి బ్రిటీష్‌ ప్రభుత్వంపై ఖోటీ నిర్మూలన కోసం, రైతాంగపు స్వేచ్ఛా జీవనం కోసం ఎంతో ఒత్తిడి తెచ్చారు. అంబేద్కర్‌ ఆందోళన ఫలితంగా 1937 సెప్టెంబర్‌ 17న ఖోటీ నిర్మూలన బిల్లును ప్రవేశపెట్టించడంలో విజయం సాధించాడు. అంబేద్కర్‌ చేసిన ఆందోళన ఫలితంగా 1949లో ఖోటీ నిర్మూలన బిల్లు చట్ట రూపంలో అమలులోకి వచ్చింది. దాని ఫలితంగా భూస్వాములకు కొంత నష్టపరిహారాన్ని చెల్లిస్తూ రైతులకు భూమిని దున్నుకునే స్వేచ్ఛ హక్కులను ప్రభుత్వం కల్పిచింది. ఈ విధంగా దున్నే వాడిదే భూమి అనే నినాదానికి అంబేద్కర్‌ ఆద్యుడయ్యాడు. 
అలాగే మహార్‌ కులాల ప్రజలు రాత్రనకా పగలనక వెట్టిచాకిరి చేయడం, ఊళ్లో ఉన్న అగ్రకులాల  పెద్దలను ఒక స్థలం నుండి మరో స్థలానికి భూజాలమీద కావడీల మీద మోసుకెళ్లడం, చచ్చిన శవాలను పారేయడం, గ్రామాన్ని శుద్ధి చేయడం వంటి అమానుష దూరాచారాలు చేయవలసి ఉండేవి. ఈ వెట్టి పనులకు గానూ చారెడు గింజలు పండించుకోవడానికి కొద్దిగా భూమిని ఉపయోగించుకోనిచ్చేవారు దానినే ''మహార్‌వతన్‌'' అని పిలిచేవారు. ఈ వెట్టి చేసే జనానికి చారెడు గింజలు తప్ప వాళ్ళు ఏ ఇతర హక్కులు కలిగి ఉండేవారు. కాదు. కానీ  దేశ్‌పాండే, దేశ్‌ముఖ్‌, కులకర్ణి, పటేల్‌ తలాతి మొదలైన వాళ్ళు ఏ పన్నులు  కట్టకుండా ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకొని నిరుపేద కూలీల చేత వెట్టి పనులు చేయించుకొనేవారు. వారిచేతనే పన్నులు కూడా కట్టించుకునేవారు. భూమి మీద వచ్చే ఫలితాలను మాత్రం ఉన్నత కూలాల వారు అనుభవించేవారు. ఇలాంటి అమానుష దురాచాలైన వెట్టి పనులను వ్యతిరేకిస్తూ ప్రజానీకాన్ని కూడగట్టి డా||బి.ఆర్‌. అంబేద్కర్‌ ఆందోళన నిర్వహించి ''మహార్‌వతన్‌'' నిర్మూలనకు కృషిచేశాడు. ఫలితంగా వెట్టిచాకిరీకి గురైన వ్యవసాయ కూలీలకు భూస్వాముల కబంధ హస్తాలనుండి విముక్తి లభించింది. 
ఇదే సందర్భంలో 1938 డిసెంబర్‌లో శ్రామికులు సమ్మెలు చేయడానికి వ్యతిరేకంగా పారిశ్రామిక వివాదం గురించిన ఒక బిల్లు బొంబాయి విధానసభలో ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లు ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితిలో శ్రామికులు హర్తాళ్‌ చేయడం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. ఈ బిల్లు శ్రామికుల పాలిట శాపం అని డా||బి.ఆర్‌ ఆంబెద్కర్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు. ''స్వాతంత్య్రం కోసం సహాయం నిరాకరణ ఒక పవిత్రమైన హక్కు అయితే శ్రామికులకు హర్తాళ్‌ చేసే హక్కు కూడా అంతే పవిత్రమైనదని'' ఈ బిల్లు శ్రామికులకు పౌరస్వేచ్చని నేలరాసే చట్టం అవుతుందని అన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మజ్‌దూర్‌ యూనియన్‌, స్వతంత్ర మజ్‌దూర్‌ పార్టీలు రెండూ కలిసి ఈ చట్టానికి విరుద్దంగా హర్తాల్‌ చేయడానికి యుద్ధ ఢంకా మోగించారు. ఈ సందర్భంగా జరిగిన హర్తాళ్‌లో పరులేకర్‌, డాంగే, నింబ్‌కర్‌ మొదలైన నాయకులతో పాటుగా అంబేద్కర్‌ పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సుమారు ఎనభై వేల మంది శ్రామికులను సంభోదిస్తూ అంబేద్కర్‌ ''శ్రామికుల చేతికి పరిపాలనాధికారం రానంతవరకూ వారి సమస్యలు పరిష్కరించబడవు'' అని పిలుపు నిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ''కార్మిక, కర్షకుల పాలనలోనే నా ప్రజలు యీ దేశంలో సామ్యవాదాన్ని స్థాపించగలరు. అని పెర్కోన్నాడు. 
డా||బి.ఆర్‌ అంబేద్కర్‌ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నకాలంలో కూడా (1942 నుండి 1946) శ్రామికుల ప్రయోజనార్థం అనేక చట్టాలు చేశాడు. టీ తోటల్లో పనిచేసే శ్రామికుల పరిస్థితి మెరుగుపడాలని ఇండియన్‌ టీ కంట్రోలు సంస్కరణ బిల్లుని ఆమోదింపచేశారు. మిల్లులో పనిచేసే కార్మికులకు యుద్ధకాలంలో నష్టం వాటిల్లితే కార్మికులకు నష్టపరిహారాన్ని యాజమాన్యమే చెల్లించే విధంగా బిల్లు అమలయ్యేటట్టు చూశాడు. గనుల్లో పనిచేసే గర్భవంతులైన మహిళా శ్రామికులకు ప్రసవకాలపు సెలవులున్ని. జీతం ఏర్పాటును కలిగించే బిల్లును కూడా ఆయన ఆమోదింపచేశాడు. ఫలితంగా1945 మార్చిలో గనుల్లో పనిచేసే మహిళా కార్మికుల ప్రసవకాల గైరుహాజరు సెలవు విషయంలో ముఖ్యమైన బిల్లుని పాసు చేయించారు. 1846 ఫిబ్రవరిలో ఆయన 10 గంటల పనిదినాన్ని 8 గంటల పనిదినంగా తగ్గించటానికి బిల్లును పాసు చేయించి భారతదేశపు కార్మికుల జీవితంలో విప్లవాత్మకమైన సంస్కరణను తెచ్చారు. 1943 సెప్టెంబర్‌ 9న ప్లీనరీ లేబర్‌ పరిషత్తులో పారిశ్రామీకరణ మీద ఉపన్యాసం ఇస్తూ ''పెట్టుబడిదారీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రెండు విషయాలు తప్పకుండా ఉంటాయని, పనిచేసే వాళ్ళు బీదరికంలో ఉండవలసి వస్తుంది. పనిచేయని వారి దగ్గర లెక్కపెట్టలేనంత పెట్టుబడి పొగవుతుందని తెలిపారు. ఒక వైపు రాజకీయ అసమానత్వం రెండోవైపు ఆర్థిక వ్యత్యాసాలు. శ్రామికులకి కూడు, గూడు, గుడ్డ, ఆరోగ్యమైన జీవితం లభించనంతవరకు, విశేషించి గౌరవంగా తలెత్తుకుని నిర్భయంగా జీవితాన్ని గడపనంతవరకు స్వాతంత్య్రానికి ఏమి అర్ధం లేదు'' అన్నాడు. భారతీయ కార్మిక సమాఖ్య వారు 1943 మే నెల 11వ తేదిన బొంబాయిలో ఏర్పాడు చేసిన ఉత్సవాల్లో  డా||బి.ఆర్‌ అంబేద్కర్‌ పాల్గోని మాట్లాడుతూ ''కార్మిక ఉద్యమంలో కావలసింది ప్రయోజన శూన్యమైన పైపై మెరుగులు కాదు. కార్మిక నాయకులు తమ తమ విభేదాలు మరచి, ఒక ఐక్యవేదికగా ఏర్పడి పెట్టుబడి దారి విధానాన్ని ఎదుర్కొవాలని అన్నాడు. కార్మికులు ఉద్యమించి బ్రిటన్‌లో రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని చేజిక్కించుకోగలిగారు. బ్రిటన్‌లో జరిగినట్టుగానే భారతీయ కార్మి వ్యవస్థ ఈ దేశంలో కూడా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని. అందుకు కార్మిక నాయకులంగా ఐక్యంగా సంఘటితం కావాల్సిన అవసరం ఎంతయిన  ఉందని పేర్కోన్నాడు. కార్మిక వర్గం యొక్క శక్తి సామార్ధాలమీదనే ఈ దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని పేర్కొన్నాడు. ఆయన కార్మిక వర్గం యొక్క శక్తి సామార్ధాలను గుర్తించి మీరు అధికారాన్ని చేపట్టేందుకు సంఘాలు కట్టి ఐక్యంగా ఉద్యమించండి అని పిలుపునిచ్చాడు. 
ఈ దేశంలో వున్న ప్రత్యేక పరిస్థితుల్లో కుల,వర్గ పోరాటాలు రెండూ జరగాలని అంబేద్కర్‌ అశించారు. అయితే సామాజిక సమస్య పరిష్కారమైతేనే ఆర్థిక సమస్యపై పోరాటం నిర్వహించడానికి ప్రజలు ఏకమౌతారని ఆయన తన వాదనను వినిపించాడు.  కానీ వర్గపోరాటాలను విస్మరించి, కేవలం సామాజిక పోరాటాలు మాత్రమే నిర్వహించాలని ఆయన చెప్పినట్లు చాలామంది దళిత మేధావులు ఆయన సిద్ధాంతాన్ని వక్రికరిస్తునారు. ఆయన జీవించి ఉన్న కాలమంతా  వర్గ-కుల సమస్యలపై ఆయన పోరాటం నిర్వహిచాడు. చాలామంది దళిత మేధావులు పోరాటాలు నిర్వహించకుండా కేవలం రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమౌవుతాయని ప్రచారం నిర్వహిస్తున్నారు. కులపరంగా విభజించబడిన భారత్‌ వంటి పరిస్థితుల్లో దోపిడికి గురవుతున్న ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు వర్గపోరాటాలు నిర్వహిస్తూనే సామాజిక న్యాయం కోసం కూడా పోరాటం చేయాలి. ఈ రెండింటి సమన్వయం ద్వారా దోపిడికి గురవుతున్న కులాల-వర్గాలను సంఘటితపర్చడం అవసరం. అంటే అంబేద్కరిజాన్ని, మార్కిజాన్ని సృజనాత్మకంగా అన్వయించి కుల-వర్గపోరాల్ని జతపరచి అగ్రకుల భూర్జువా, భూస్వామ్య వర్గాలపై పోరాటం నిర్వహించడం ద్వారానే ఈదేశంలో ఉన్న కుల-వర్గ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనగలము. కానీ నేడు ఆయన వారసులం అని అనుకుంటున్న వాళ్ళు ఏ ఆశయాల కోసం డా|| బి.ఆర్‌ అంబేద్కర్‌ గారు పోరాటం చేశాడో వాటిని విస్మరిస్తున్నారు. అంబేద్కర్‌ ఆశయాలు కొనసాగించడం అంటే కేవలం ఆయన జయంతికి, వర్థంతికి నివాళ్ళు అర్పించడమే అనుకుంటున్నారు. ఆయన జయంతి వర్థంతిలలో తప్పా ఆయన పోరాటాలను గుర్తుకు తెచ్చుకోవడం లేదు. డా|| అంబేద్కర్‌ 119 జయంతి సందర్భంగానైనా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి పునరంకితమవుదాం.

No comments :

Post a Comment

దొరల రాజ్యం సంగతి?

No comments
 ‘ప్రాంతేతరుడు దోపిడీచేస్తే ప్రాంతం దాటేవరకు పారదోలుదాం. ప్రాం తం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతరపెడదాం’ అని కాళోజీ పిలుపిచ్చాడు. ఇవ్వాళ ప్రాంతేతరుని దోపిడీని ప్రశ్నిస్తున్న సందర్భంలో, ప్రాంతంవాడు కూడా దోపిడీచేస్తే ఏంచేయాలనేది కూడా చర్చిం చాలి. వందల సంవత్సరాలుగా దొరల,పటేళ్ళ, దేశ్‌ ముఖ్‌ల చేతిలో ఘోరాతి ఘోరంగా అనుభవించిన పీడన,అణిచివేత, వెట్టిచాకిరిల నుండి విముక్తికోసం జనం దండు కట్టిన చరిత్ర తెలంగాణది. ఆ పోరా టం అంతిమంగా ఏ లక్ష్యాన్ని చేరుకున్నదనేది పక్కన పెడితే, ఆ పోరాటచెైతన్యం తెలంగాణలో జరిగిన అనేకఉద్యమాలకు స్ఫూర్తి నింపింది. అయితే ఈ ప్రజాస్వామిక పోరాటాలకు ప్రధానంగా శ్రామికవర్గం నాయకత్వం వహించింది.
కానీ నేడు జరుగుతున్న ప్రత్యేకవాద ఉద్యమంలో- శ్రామిక వర్గం క్రీయాశీలంగా పాల్గొంటున్నప్పటికీ ప్రధానశక్తిగా మాత్రం భూస్వామ్య, పెట్టుబడి దారీవర్గం నాయకత్వం విహస్తోంది. ప్రజాఆకాంక్షను ఓట్లుగా మలుచుకునే అవకా శం ఉండడంవల్ల ఈ వర్గాలు తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చనే లక్ష్యంలో ప్రాంతీయవాద ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాయి. అయితే ఈ వర్గాల ఉద్దే శం నేరవేరనప్పుడు వారు తమ సొంతగూటికి చేరిన విషయం చరిత్రలోచూశాం. గతంలో తెలంగాణ ఉద్యమంలోకివచ్చిన ఇంద్రారెడ్డి వంటివారు చివరికి ఎక్కడికి చేరారో తెలిసిందే. ఇప్పుడు గ్రామ పునాదులను తాకిన తెలంగాణ ప్రజాఉద్య మంలో  విప్లవపార్టీలనుండి మతోన్మాదుల వరకు అందరూ కలగలిసిపోయారు. అందరి లక్ష్యం తెలంగాణే అంటున్నారు. నిన్నటివరకు దొరల, భూస్వాముల దళారి రాజకీయపార్టీలతో విభేదించి వారికి వ్యతిరేకంగా ఉద్యమించిన విప్లవపార్టీలు, విప్లవోద్యమ సానుభూతిపరులు, మాజీ నక్సలెైట్లు ఆ దొరల న్యాయకత్వంలో ఒక డిమాండుపెై కలిసి పనిచేయడం ఆసక్తి కలిగించే విషయం.
 అయితే పరస్పర విరు ద్ధ భావాలతోఉన్న పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు ఏక సూత్రంపెై నేడు కలిసిపనిచేస్తూ సామాన్యప్రజల్లోకి పంపుతున్న సంకేతాలు ఏవర్గ ప్రయోజనాలను నెరవేరుస్తాయనేది చర్చించాలి. నేడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానపార్టీ టీఆర్‌ఎస్‌,రాజకీయ జేఏసీ. వాటిలోని వ్యక్తు లు (కేసీఆర్‌తో సహా) వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేసి, పదవులు అనుభవించి, అక్కడ ఇమడలేక తమ అస్తిత్వంకోసం బయటకు వచ్చి తెలంగాణఉద్యమంలో పని చేస్తున్నారు. వీళ్లు ప్రజల్లో ఎన్నాళ్లుగానో నిగూఢంగాఉన్న ప్రత్యేకఆకాంక్షను అందిపుచ్చుకొని దానికొక రాజకీయ రూపును,జాతీయస్థాయిలో స్థానాన్ని కల్పించినప్ప టికీ వీరినాయకత్వంలో ఉద్యమం రేపు ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో అంచనా వేయవచ్చు. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్న కాలంలో తెలంగాణ ప్రజలకు ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అనేది గమనంలో ఉంచుకోవాలి. పుట్టిన కులం,పనిచేస్తున్నసంస్థ-ఇవే వారి సామాజిక అస్తిత్వాన్ని నిర్ణయిస్తాయి.

తెలంగాణ నేలపెై నక్సల్బరీ ఉద్యమ ప్రభావంతో, ప్రజల పోరాటాలు, త్యాగాల మూలంగా భూస్వాములు, దొరలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పట్నానికి తరలివచ్చారు. ఇక్కడికివచ్చి తమరూపాన్ని మార్చుకుని దొరలు పెట్టుబడి దారులు గా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులుగా మారిపోయారు. ఎప్పుడెైతే తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిందో అప్పుడు ఈ దొరలు, భూస్వాములు రాజకీయ నాయకులు గా కొత్త అవతారం ఎత్తినారు. ఈ ఉద్యమం సందర్భంగా దొరల, భూస్వాముల స్వరూపం మారిందేతప్ప స్వభావంమారలేదు. అందుకే రాయలసీమఐనా, సీమాం ధ్రఐనా, తెలంగాణ ప్రాంతామైనా- ప్రాంతాలు వేరుకావచ్చు, కానీ భూస్వామ్య విధానం, పాలకవర్గాల నెైజంలో మార్పుఉండదు. సామాన్య ప్రజల పట్ల వారి వెైఖరి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. తెలంగాణలోని సంపన్నవర్గానికి తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పడితే- ఆంధ్రలోని పెట్టుబడిదారుల, భూస్వాములు ఆధిపత్యం ఉండదు కాబట్టి, అప్పుడు సంపదను తామే యథేచ్ఛగా అనుభవించవచ్చు, దోచు కోవచ్చు అనే భావన నిండుగా ఉంది.

కనుక ఈ వర్గాలకు ఉండే స్వభావ రీత్యా దోిపిడీ, పీడన లేని తెలంగాణ రావాలని కోరుకోరు, పెైగా యథాస్థితి అమలుకు వారి ప్రయత్నాలు, పాలనా వ్యవహారాలు సాగుతాయి.
తెలంగాణ ఉద్యమంలో సబ్బండ కులాల ప్రజలు చురుకుగా పాల్గొంటున్న తరుణంలో- వచ్చే తెలంగాణలో ఏ సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది, అంతిమంగా ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి అనేది ప్రశ్నించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాహసంగానే కనిపించవచ్చు.కానీ ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్న సందర్భంగా ఆ ఉద్యమ లోటుపాట్లను, అంతిమలక్ష్యాలను చర్చించడం అని వార్యమే అవుతుంది. ఒకవెైపు టీఆర్‌ఎస్‌పార్టీ, రాజకీయ జేఏసీ తెలంగాణ ఉద్య మంలో క్రియాశీలంగా పాల్గొంటున్న సందర్భంలోనే కేసీఆర్‌ నాయకత్వాన్ని వ్యతిరే కిస్తూ కొన్ని ఫ్రంట్‌లు, గ్రూపులు, దొరల తెలంగాణ కాదు, సామాజికతెలంగాణ కావాలంటూ ప్రత్యేకఉద్యమాలు నిర్వహిస్తున్నాయి.

ఈసందర్భంలోనే ఈగ్రూపు లు- దొరల నాయకత్వంలో వచ్చే తెలంగాణలో దళితులకు, బడుగులకు ఒరిగేది ఏముండదు, మళ్ళీ దొరలరాజ్యమే వస్తుంది-అని వివిధ సందర్భాల్లో తమ అభిప్రా యాన్ని వ్యక్తంచేశాయి. ఈ విమర్శలు ఎక్కుపెట్టిన వారిపెై సహజంగానే చాలా వ్యతి రేకత వచ్చింది. మొదట ఏదో ఒక తెలంగాణ రానీయండి, తర్వాత మనకు కావా ల్సిన తెలంగాణను తెచ్చుకోవచ్చు అన్నారు. ఈ దళిత బహుజనులు ఎప్పుడు ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూనేఉంటారంటూ అగ్రవర్ణాలనుంచి దళితులలోఒక సెక్షన్‌వరకు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. వీలయితే అప్పుడప్పుడు దళిత బహుజన కూట ములపెై దాడులు, విమర్శలుకూడా చేస్తూన్నారు. మొన్న కాకతీయ యూనివర్సి టీలోజరిగిన పోలికేకలో మందకృష్ణపెై జరిగిన దాడినుంచి నిన్న మిలియన్‌ మార్చ్‌ లో విమలక్క మాటలపెై వచ్చిన విమర్శలే ఇందుకు ఉదాహరణ. దళిత బహుజనులు తమఅనుమానాన్ని వ్యక్తంచేసిన ప్రతిసారీ ఇలాంటి దాడు లు కొనసాగుతూనే ఉన్నాయి.

అది తెలంగాణ విషయంలోనేకాదు, గతంలో మహి ళా బిల్లుపెై పార్లమెంటులో జరిగిన చర్చలసందర్భంలో దళిత బహుజనులకు నాయ కత్వంవహిస్తున్న పార్టీలు మహిళా రిజర్వేషన్‌లో దళిత,బహుజన మహిళలకు కోటా కావాలని డిమాండుచేసిన సందర్భంలోకూడా ఇలాంటి వ్యతిరేకత అగ్రవర్ణ పార్టీల నుంచి వచ్చింది. మొదట మహిళా బిల్లు రానీయండి తర్వాత చూసుకుందామంటూ వ్యాఖ్యానించారు.ఈ డిమాండును లేవనెత్తిన వారిని విమర్శించారు. ఇటువంటి సందర్భంలోనే ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న పార్టీలను, జేఏసీలను ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉన్నది.1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి భిన్నంగా గత 2009 నవంబర్‌ నుండి ఇప్పటివరకు వివిధవిశ్వవిద్యాలయాల్లో దళితబహుజన విద్యార్థుల నాయకత్వంలో నే ఉద్యమాలు సాగుతున్నాయి. 1969 తెలంగాణ ఉద్యమంలో అగ్రవర్ణ వ్యక్తులు, పార్టీలు, అగ్రవర్ణ విద్యార్థులు ఉద్యమం ముందువరుసల్లో ఉండగా, 2009 నుంచి జరుగుతున్న ఉద్యమంలో దళిత, బహుజన విద్యార్థులే నాయకత్వం వహిస్తున్నారు.

పోలీసులు పెట్టిన కేసుల్లో కూడా ఈ వర్గాలకు చెందిన విద్యార్థులే ఉంటున్నారు. చివరకు తెలంగాణకోసం ఆత్మహత్యలు చేసుకోవడంలోను ఈ సమూహాలకు చెందిన విద్యార్థులే ముందు వరుసలో ఉంటున్నారు. అటువంటి సందర్భంలో సహ జంగానే తెలంగాణరాష్ర్టం ఏర్పడితే దళిత, బలహీనవర్గాల విద్యార్థులకు ఏంప్ర యోజనం చేకూరుతుంది అనేది ప్రశ్నించాల్సిందే. షోయబుల్లాఖాన్‌, చాకలి ఐల మ్మ, కొమురం భీం మొదలు బెల్లి లలిత, శ్రీకాంత్‌చారి, సంపత్‌ కుమార్‌ వరకు తెలంగాణ బిడ్డలు వెన్నెల లాంటి తెలంగాణను స్వప్నించి ప్రాణాల్ని అర్పించారు. ఇంతమంది తెలంగాణ దళిత బహుజనులు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే, వారి త్యాగాలను ముడిసరుకుగావాడుకొని ఫలితాలను అనుభవిస్తూ నాయకత్వా నికి ఎగబాకుతున్న వారిని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ.

అన్ని రాజకీయపార్టీలూ తాము అధికారంలోకి రావడానికిచేసే వాగ్దానాల వలెనే, తెలంగాణఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్‌- టీఆర్‌ఎస్‌ను ఏర్పాటుచేసి న నాటినుంచి నిన్నజరిగిన సూర్యాపేట సమరభేరిసభవరకు తెలంగాణ ఏర్పడితే ఎవరెవరికి ఏపదవులు కట్టబెడతారో, ఏపథకాలు అమలుచేస్తారో తెలుపుతూ చాలా ఉపన్యాసాలు ఇస్తూవచ్చారు. కానీ, ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరించే విధానాలే రాష్ర్ట భవిషత్తును నిర్ణయిస్తాయి. అయితే ఇక్కడ కేసీఆర్‌ను ఒక విషయంలో అభినందించవచ్చు. అది- వచ్చే తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని తొలిముఖ్యమంత్రిగా నియమిస్తాననడం. అయితే దళితుడిని ముఖ్యమంత్రిని  చేస్తే సమస్యలు తీరుస్తాడాఅంటే అనుమానమే?ఎందుకంటే ఒక అగ్రవరపార్టీకి చెం దిన, అగ్రవర్ణవ్యక్తి చేతిలో రాజ్యాధికారం ఉంచుకొని దళితుడిని ముఖ్యమంతిని చేసినా, గిరిజనుడిని ముఖ్యమంతినిచేసినా ఒరిగేది ఏఉండదు.

కాకపోతే, దళితు డు ముఖ్యమంత్రి అయ్యాడు అనే ఆనందంతప్ప! కాంగ్రెస్‌పార్టీ దామోదరం సంజీవ య్యను ముఖ్యమంత్రిని చేసింది. క్రిిందివర్గాలకు ఏమీ చేయకుండా ఆయనకు అడ్డుపడ్డ సందర్భాలు చాలాఉన్నాయి. కాబట్టి దళితుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య‚మంతి అయినా ఒరిగేది ఏముండదు.రాష్ర్టంలోని లక్షలాది వ్యవసాయ భూములకు నీటి సదుపాయం కల్పిస్తానని ప్రకటించారు. ఇది ఆచరణసాధ్యమా? ఒక వేళ  చిత్తశుద్ధితో అమలు చేసినా నేరవేరేది ఎవరి ప్రయోజనాలు? ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా గోదావరి నదీ జలాలు పుష్కలంగా ఉండి మూడు కాలాలు పంటలు పండిస్తున్నా దాని ప్రతిఫలం ఏ వర్గాలకు దక్కుతోంది? తెలంగాణలో దళిత బహుజనులకు ఉన్న భూమి నామమాత్రమే. నీరుఉన్నా, లేకున్నా ఆంధ్ర ప్రాంత బహుజనుల జీవన విధానంలో ఎలాంటి మార్పులేదు.

రేపు తెలంగాణకు నదీజలాలు వచ్చినా ఎవరి భూములకు నీరు అందుతుంది, నీటి వనరులు ఉపయోగంగా ఉండేది ఎవరికి? అగ్రవర్ణాల నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే అది అగ్రవర్ణ ఆధిపత్య కులాలకే ప్రయోజనం.అధిపత్య కులాలు ఆర్థికంగా మరింత బలపడితే అది క్రింది వర్గాలను ఇంకా అణచివేసేందుకు, వారిని రాజకీయంగా, సాంఘికంగా అణగదొక్కేందుకు ఉపయోగపడుతుంది. రాష్ర్టంలో దళితుల మీద దాడులు తెలంగాణలోకంటే ఆంధ్రప్రాంతంలోనే ఎక్కువగాజరిగాయి. ఎందుకంటే అగ్రవర్ణాల చేతిలోనే భూమి ఉంది కాబట్టి. వారు ఆర్థికంగా బలపడడంవల్ల రాజకీయ రంగాన్ని, పోలీసు శాఖను, న్యాయస్థానాలనూ నియంత్రించగలుగుతున్నారు. ఒకనాడు అన్నల భయంతో పల్లెలు వదిలి పట్నాల బాట పట్టిన దొరలు, రెడ్లు తెలంగాణ రాష్ర్ట ఉద్య మం ఊపందుకున్న  తర్వాత నేడు తిరిగి పల్లెలకు పయనిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని డబ్బుసంచులతో కొనడానికి ప్రయత్నిస్తున్నారు.

రేపు తెలంగాణ రాష్ర్టంలో పాలకుల విధానాలు ఎలా ఉండబోతాయనేదే అభివృ ద్ధిని నిర్ణయిస్తుంది. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ వస్తే ఓపెన్‌కాస్ట్‌ రద్దు అయి పోతుందా, మిగులు భూముల పంపకం జరుగుతుందా, సహజ సంపద ప్రజలకు దక్కుతుందా, కామన్‌ స్కూల్‌ సిస్టమ్‌లో శాస్త్రీయ విద్య అందుతుందా, వెైద్య, సంక్షేమ, ఉద్యోగ, ఉపాధి, సేవా రంగాలు ప్రెైవేట్‌ పరం కాకుండా చూస్తారా, నక్స లెైట్ల పేరుతో జరుగుతున్న హత్యలు ఆగుతాయా, ప్రజాస్వామిక, మానవహక్కులకు హామీ ఉంటుందా, మూసివేసిన పరిశ్రమలను తెరిపిస్తారా, రెైతుల, చేతివృత్తి దారుల ఆత్మహత్యలు ఆగుతాయా, మహిళలకు కనీస రక్షణ ఉంటుందా, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో సమస్త ప్రజలు ఎదుర్కొనే సమస్య లకు కచ్చితమైన పరిష్కారంఉంటుందా? ఈ ప్రశ్నలన్నింటిపెై ఉద్యమ నాయకత్వా లనుంచి సమాధానాలు రాబట్టాల్సిందే.

నేడు అన్ని రంగాలలో విస్తరించిన సంక్షోభా నికి ప్రధాన కారణమైన ప్రపం చీకరణ పట్ల ఎటువంటి విధానం ఉండబోతుంది అనేది కూడా అంతిమంగా పెైన పేర్కొన అన్ని సమస్యలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు అగ్రవర్ణ పార్టీతో, వారి నాయకత్వంలో ఒక ఉమ్మడి ప్రయోజనం కోసం జట్టుకట్టి పనిచేస్తున్నారు. కానీ రేపు వీరితోనే కొట్లాట ఉంటుందని గుర్తెరిగి, వారిస్వభావం, వారి సామాజిక, చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకుని పోరాటంలో పాల్గొంటేనే దళిత, బహుజనులు తమ గమ్యాన్ని చేరల్గొ గలరు. లేదంటే ఈవర్గాల పరిస్థితి పెనంలోనుంచి పొయ్యిలోపడ్డ చందంగా తయా రవుతుంది.


(సూర్య 1-12-12)

No comments :

Post a Comment