కీలక దశలో ‘పోస్కో

No comments

పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ జగత్‌సింగ్‌పూర్‌ గ్రామస్థులు నిరవధిక దీక్షకు పిలుపివ్వడంతో పోస్కో వ్యతిరేక పోరాటం కీలక దశకు చేరుకున్నది. ఒడిషా రాష్ర్టంలోని జగత్‌పూర్‌ జిల్లాలో పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ కోసం బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ గ్రామీణులు గత 7 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. పోస్కో ఫ్యాక్టరీ కోసం బలవంతపు భూ సేకరణను అపాలని పొస్కో ప్రతిరోధ్‌ సంఘం సమితి (పిపిఎస్‌ఎస్‌) సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గ్రామసభ అనుమతి లేనిదే బలవంతపు భూసేకరణ చేయడం చట్టవ్యతిరేకం అని సుప్రీంకోర్టు 2013 ఏప్రిల్‌ 18న తీర్పు చెప్పడంతో గ్రామస్థులకు కొంత అండ దొరికి నట్లయింది. సుప్రీంకోర్టు తీర్పు గ్రామస్థులకు అనుకూలంగా వచ్చినప్పటికీ రాష్ర్ట ప్రభుత్వం 20 ప్లాటూన్ల పోలీసు బలగాలను దించి ధింకియా, గోవింద్‌ పూర్‌ గ్రామాలను ఖాళీ చేయించి బహుళజాతి ఉక్కు కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నాలను తీవ్రతరం చేసింది.


దాదాపు 4000 ఎకరాల్లోని అటవీభూముల్ని పోస్కోకి కట్టబెట్టడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేశాయి. ఈ భూముల్లోని అడవులపైన, అక్కడ ఉన్న తమలపాకు పంటపైనే ధింకియా, గోవింద్‌పూర్‌ ప్రజల జీవనోపాధి ఆధారపడి ఉంది. ఆ అడవులను కంపెనీకి ఇస్తే వారి బతుకు గడవదు. గ్రామాలు వదిలి పట్టణాల్లో అడుక్కుంటూ బతకడమో లేదా ఆకలికి చావడమో వారికి మిగిలింది. దాంతో గ్రామస్థులు ఆ చావేదో తమ గ్రామాల్లోనే చావాలని నిర్ణయించుకుని ప్రభుత్వాలతో యుద్ధానికి సిద్ధమయ్యారు.పిల్లలు, మహిళలు, వృద్ధులు మూడంచెల ప్రతిఘటనా వ్యవస్థను నిర్మించుకున్నారు. మొదటి వరసలో పిల్లలు దాదాపు వందమంది వరకు నేలకు మొఖం ఆనించి పడుకుని ఉండగా వారి వెనుక మహిళలు, వృద్ధులూ మరోక వంద మందికి పైగా రెండు వరసల్లో అదే విధంగా పడుకుని పోలీసులు గ్రామంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తున్నారు. 20 ప్లాటూన్ల పోలీసులతో తలపడడానికి వారు సిద్ధమయ్యారు. జిల్లా అధికారులు గ్రామస్థులకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వారు వినడం లేదు. ప్రభుత్వాల మాయ మాటలకు లొంగడమంటే తమ జీవనోపాధిని పోగొట్టుకోవడమని వారికి అర్థమయ్యింది.



2005లో దక్షిణ కొరియాకు చెందిన పోస్కో బహుళజాతి కంపెనీ ఉక్కుఫ్యాక్టరీ నిర్మించ డానికి ఒడిషా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 12 బిలియన్‌ డాలర్ల (రూ. 52,000 కోట్లు) పెట్టుబడి ఈ ప్రాజెక్టు రూపంలో భారత్‌కు వస్తుంది. మన దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకే కంపెనీ నుంచి ఇంత పెట్టుబడి మరి దేనికీ రాలేదు. ప్రాజెక్టు కట్టడం కోసం ఇది ఒడిషాలోని జగత్‌పూర్‌ జిల్లాలోని 4000 ఎకరాల అటవీ భూమి కావాలని కోరింది. రాష్ర్ట ప్రభుత్వం నయానో భయానో ఇప్పటికే 1800 ఎకరాల భూమికి సేకరించింది. ఇంకా ధింకియా, గోవింద్‌పూర్‌ గ్రామాల్లోని 60 శాతం భూమి కావాలి. కాని ఆ రెండు గ్రామాల ప్రజలు తమ భూముల్ని ఇవ్వడానికి నిరాకరించారు. అయితే పర్యావరణానికి భారీగా నష్టం వాటిల్లడంతో పాటు, పోస్కోకు కావలసిన భూమి అటవీ భూమి కావడంతో భూసేకరణ అటవీ చట్టాలు, పర్యావరణ చట్టాలు ఆటంకంగా మారాయి. దాంతో ఆరు సంవత్సరాలుగా ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతులు నిలిచి పోయాయి. గతంలో అనుమతి నిరాకరించిన పర్యావరణ మంత్రి జైరామ్‌ రమేష్‌ ఈ సంవత్సరం అనుమతి ఇచ్చేశారు. 



‘చట్ట వ్యతిరేకతను క్రమబద్ధీకరించడానికి నేను బద్ధ వ్యతిరేకిని. కానీ అందుకు అంగీకరించవలసి వచ్చింది’ అని అనుమతి ఇచ్చే సందర్భంగా ఆయన చెప్పడాన్ని బట్టి ఆయనపై ప్రధాని, ఇతర మంత్రిత్వ శాఖలనుండి వచ్చిన ఒత్తిడిని అర్థం చేసుకోవచ్చు. రూ. 52,000 కోట్ల వ్యయంతో, 5 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంతో తలపెట్టిన ఈ ఫ్యాక్టరీ భారత పాలక వర్గాలు భారత దేశాన్ని నయా ఉదారవాద ఆర్థిక విధానాల ద్వారా విదేశీ కంపెనీలకు అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాయా లేదా అన్నదానికి పరీక్షగా నిలిచింది. సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను ఎన్ని ఆటంకాలు ఎదురైనా, చివరికి ప్రజలపైకి పోలీసుల్ని ఉసిగొల్పి వారి ప్రాణాలు తీసైనాసరే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని భారత పాలకులు చెప్పదలుచుకున్నారు. దాన్ని రుజువు చేసుకోవడానికి వారు ఉరకలు వేస్తున్నారు. నేడు రెండు గ్రామాల ప్రజలపైకి ఇరవై ప్లాటూన్ల పోలీసుల్ని ఉసిగొల్పి చోద్యం చూస్తున్నాయి కేంద్ర, రాష్రప్రభుత్వాలు.భారత ప్రభుత్వం అడవులు కాపాడుకోవడం కోసం, అడవులపై ఆధారపడి నివసించే గిరిజనుల హక్కులను కాపాడడం కోసం ఆటవీ హక్కుల చట్టాన్ని ఇటీవలే చేసింది. 



ఆ ప్రకారం అడవి భూముల్ని తాకేహక్కు ఎవరికీలేదు. గిరిజనులకి అడవులపైన అన్నిహక్కులూ ఉంటాయి. గిరిజనుల భూముల్ని గిరిజనులు తప్ప ఎవరూ కొనకూడదు. కాని కేంద్ర ప్రభుత్వాలు విదేశీ కంపెనీల సేవల కోసం తానుచేసిన చట్టాలను తానే ఉల్లంఘించడానికి సిద్ధమైంది. కర్బన వాయువుల విడుదలవలన భూమి వేడిక్కి ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరిగింది. దాన్ని నివారించడానికి అడవుల పెంపకాలను విస్తృతంచేయాల్సి ఉంది. అందుకోసం అంతర్జాతీయ ఒప్పందంపై భారత్‌ సంతకం కూడా చేసింది. అయినప్పటికి బహుళజాతి కంపెనీకి గిరిజనుల భూముల్ని అప్పగించేందుకు అటు హక్కులచట్టం, ఇటు పర్యావరణచట్టాలను ఉల్లంఘించ డానికి కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు సిద్ధమైనాయి.ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, మాజీ హోమ్‌ మంత్రి చిదంబరం, వాణిజ్య మంత్రి ఆనంద్‌ శర్మ, వ్యవసాయ మంత్రి శరద్‌ పవార్‌ వంటి మార్కెట్‌ స్వేచ్ఛా సిద్ధాంత పండితులు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి పర్యావరణ అనుమతిని మంజూరు చేయించారు. వారికి తమకు ఓట్లు వేసి గెలిపించిన భారత ప్రజల ప్రయోజనాల కంటే విదేశీ కంపెనీల ప్రయోజనాలు, రెండంకెల జిడిపి వృద్ధిరేటు- అవే కావాలి. 



భారత ప్రజల జీవనోపాధి గంగలో కలిసినా వారి బాధలేదు. అభివృద్ధి పేరులో ప్రజల నోటివద్ద కూడు లాగివేస్తూ విదేశాలకు బంగారు పళ్ళెంలో పెట్టి అర్పించుకుంటున్నాయి. వేల బిలియన్ల రూపాయల ప్రాజెక్టులతో పాటు వచ్చే కమిషన్లు స్విస్‌ బ్యాంకులకు తరలిపోతున్నాయి.
ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూముల్ని అప్పగించకూడదని పోస్కో బాధిత ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారు. తాము ఉంటున్న ప్రాంతాన్ని వదిలిపోతే తమకు ఇక జీవనోపాధి ఉండదని బాగానే అర్థమయ్యింది. ఏడు సంవత్సరాలనుండి అలుపెరగకుండా పోరాడు తున్నారు. చివరికి ఇరవై ప్లాటూన్ల పోలీసుల్ని దించి ధింకియా గ్రామం ప్రవేశం దగ్గర మొహరించారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులతో సహా వేలమంది గ్రామస్థులు గ్రామ ప్రవేశం వద్ద ఎర్రటి ఎండలో నేలపైపడుకుని గ్రామంలోకి పోలీసులు రాకుండా అడ్డగించడానికి సిద్ధపడ్డారు. రాష్ర్ట ప్రభుత్వం గ్రామంలో, చుట్టూ నిషేధాజ్ఞలు విధించింది. నలుగురైదుగురి కంటే గుమికూడదని ఆజ్ఞాపించింది. ఎండ ఎంత తీక్షణంగా ఉందంటే ఇద్దరు పోలీసులు స్పృహతప్పి పడిపోయారు. పిల్లల్లో చాలా మంది స్పృహ తప్పారు. 



వారు కోలుకుని మంచినీళ్ళు తాగి దీక్ష కొనసాగించారే తప్ప వెనుదిరగ లేదు. మధ్యాహ్నానికల్లా కలెక్టర్‌ గ్రామ ప్రజల నిరసన చట్ట వ్యతిరేకం అని ప్రకటించాడు. ప్రజలు వెళ్ళిపోవాలనీ లేకుంటే లాఠీ ఛార్జీ, కాల్పులు తప్పవనీ మైకుల్లో పోలీసులు హెచ్చరించారు.ధింకియా, గోవింద్‌పూర్‌ గ్రామల ప్రజల పోరాటాన్ని ఒడిషా రాష్ర్టం, కేంద్ర ప్రభుత్వాలు ‘కొన్ని వర్గాలు పథకం ప్రకారం చేస్తున్న ప్రణాళిక బద్ద నిరసన’ గానూ, కొద్ది మంది సృష్టించిన ‘కేవలం శాంతి భద్రతల సమస్య’ గానూ, ‘భూస్వాధీనానికి ఎదురౌతున్న చిన్న సమస్య’ గానూ చిత్రిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిజానికి ప్రజల ప్రయోజనార్థమేనని నమ్మబలుకుతున్నాయి. మోజారిటి ప్రజలు వాస్తవంగా ప్రాజెక్టుకు తమ ఆమోదాన్ని ఎన్నడో తెలిపారనీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. అదే నిజమైతే గ్రామ సభల నుండి ప్రాజెక్టును సమర్థిస్తూ ఒక తీర్మానాన్నయినా ప్రభుత్వాలు రికార్డు చేశాయా? అటవీ హక్కుల చట్టాన్ని ఆ గ్రామ ప్రజలకు ఎందుకు వర్తింప జేయరు? అనే ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలనుంచి సమాధానాలు రావడం లేదు. ప్రభుత్వాలు, కంపెనీ చెబుతున్నట్లు పోస్కో ప్రాజెక్టు వలన వీసమెత్తు ప్రయోజనం కూడా ప్రజలకు కలగదు.



పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ స్వయంగా నియమించిన ఎంక్వైరీ కమిటీ విచారణ జరిపి ‘ప్రాజెక్టు వలన పర్యావరణానికి తీవ్రమైన వినాశకరమైన ప్రభావం పడుతుంది’ అని తేల్చింది. పర్యావరణంపై ఓడిషా రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి రాసిన అంశాలు గ ఆ ఎంక్వైరీలో మైకుల్లో పోలీసులు తేలాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, పోస్కో కంపెనీలు సమగ్రమైనరీతిలో, ఒక పద్ధతిప్రకారం, ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కయి, చట్టాలను ఉల్లంఘించడానికి సిద్ధపడ్డాయి. పాలకులు స్వయంగా ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చడం కోసం భారతచట్టాలను గేలిచేయడానికి, ప్రజల హక్కుల ను అణచివేయడానికి పచ్చి అబద్ధాలతో దేశ ప్రజలను మోసం చేయడానికీ నిర్ణయించుకున్నాయి. ఈ అబద్ధాలు, మోసాలూ, నయవంచనలూ, దుష్ర్పచారాలూ కేవలం ఒడిషా ప్రభుత్వానికి, పోస్కో కంపెనీలకే పరిమితమైనవి కావు. దేశ వ్యాపితంగా కొన్ని వందల కంపెనీల కోసం కొన్ని లక్షల ఎకరాల భూములను ప్రజలనుండి బలవం తంగా లాక్కొని విదేశీ కంపెనీలకు, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నాయి ప్రభుత్వాలు. 



అటవీహక్కుల చట్టాన్ని ఉల్లంఘించి, లక్షలాది కుటుంబాలకు చెందిన వ్యవ సాయ భూముల్ని, అటవీ భూముల్ని లాక్కొని అతితక్కువ రేట్లకు విదేశీ, స్వదేశీ ప్రైవేటుకంపెనీలకు ఇచ్చేస్తున్నాయి. వివిధ సందర్భాల్లో పర్యావరణ శాఖ నిర్ణయాల ను ప్రజాసంఘాలు సవాలు చేస్తుంటే అది తన నేరాలను అంగీకరించడానికి కూడా వెనకాడ్డంలేదు. అయినా తప్పదని పచ్చిగానే చెబుతున్నాయి. పర్యావరణ చట్టాలను తామింకా అర్థం చేసుకుంటూనే ఉన్నామని జైరామ్‌ చెబుతున్నారు. భారత దేశ వనరుల నిర్వహణలో భారతప్రభుత్వం ఎన్ని ఘోరమైన తప్పులు చేస్తున్నదో, ప్రజల సంపదలను ఎంతనీచంగా పరాయి కంపెనీలకు అప్పనంగా అప్పజెపుతు న్నదో పోస్కోవంటి వ్యవహారాలు విప్పి చూపుతున్నాయి. అభివృద్ధి పేరుతో ప్రభు త్వాలు ఎంతటి నేరాలకు పాల్పడుతున్నాయో కూడా వివరించి చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుల వలన అంతిమంగా లబ్ధి పొందేది విదేశీ, స్వదేశీ ప్రైవేటు కంపెనీలేతప్ప ప్రజలకు మిగిలేది అకలే అన్న నిజాల్ని సమర్థవం తంగా కప్పిపెడుతున్నాయి. పోస్కో గ్రామస్థులు జరుపుతున్న పోరాటం భూమి కోసం, జానెడు పొట్ట కోసం పడే ఆరాటం మాత్రమే కాదు. ఇది చావు బతుకుల పోరాటం.

No comments :

Post a Comment

ఎరుపెక్కిన అడవికి బాధ్యులెవరు?

1 comment

భారతావనికి పచ్చని వడ్డాణంలా, అపార ఖనిజ నిక్షేపాల నిలయంగా విరాజిల్లిన దండకారణ్యం తాజా చత్తీస్‌గఢ్‌ ఘటనతో మరోసారి ఎరువెక్కింది. ‘సల్వాజుడుం’, ‘ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌’ల పేరిట రాజ్యం తలపెట్టిన సాయుధ కార్యక్రమం అక్కడి పచ్చదనాన్ని పొట్టనపెట్టుకునే దిశగా సాగుతోంటే, దానిని ప్రతిఘటిస్తున్న విప్లవోద్యమం ఎదురు దాడులకు దిగుతోంది. ఫలితంగా ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు, ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారు.


పదుల సంఖ్యలో రాజకీయ నాయకులు, పోలీసులు హతమౌతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు కొత్తేమి కాకపోయినా ఇంత పెద్ద స్థాయిలో ఒక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ముఖ్యనేతలు నక్సల్స్‌ చేతిలో హతమవ్వడాన్ని మాత్రం పెద్ద సంఘటనగా చెప్పవచ్చు. కేంద్ర రాష్ర్ట పాలకులు మృతుల కుంటుంబాలను ఓదార్చి, ఘటనను ఖండించి, అదనపు బలగాలను పంపుతామని హామీ ఇచ్చి తమ బాధ్యతను నిర్వహించారు. ఒక రాష్ర్టంలోని ఒక పార్టీముఖ్య నాయకత్వమంతా దాదాపుగా తుడుచికుపెట్టుకపో యిన తర్వాతనైనా పాలకవర్గాలు, రాజకీయ పక్షాలు, మేధావులు, సమాజం అంతా దీని విషయం తీవ్రంగా ఆలోచించాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కావడానికి కారణాలేమిటో, వాటి పరిష్కారాలేమిటో వెతకాలి. గత నాలుగు దశాబ్దాలుగా కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జరుగుతున్నది ఇదే. పాలక వర్గాలు తమ సొంత ప్రజల్నే చంపడానికి లక్షలాది పారా మిలటరి బలగాలను, పోలీసులను పంపి వేటాడి చంపే స్థితి ఎందుకొచ్చిందనేది చర్చించాలి. చత్తీస్‌గఢ్‌ ఘటనకు తమదే బాధ్యత అంటూ మావోయిస్టులు ప్రకటించుకున్నట్లు వార్తలు వచ్చాయి. సల్వాజుడుం వంటి ముఠాలను ఏర్పాటుచేసి వేలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నందుకే ఈ దాడికి పాల్పడ్డామని మావోయిస్టులు స్పష్టం చేశారు. 



ఆంధ్రరాష్టంలోని జగిత్యాల జైత్రయాత్ర తరువాత 1979లో వామపక్ష విప్లవోద్యమం గోదావరినది దాటి సిరొంచ, గడ్చిరోలి మీదుగా బస్తర్‌ ప్రాంతానికి, దండకారణ్యానికి విస్తరించింది. దండకారణ్యం కేంద్రంగా దాని చుట్టూ ఉన్న ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిషా, మహారాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను పెంచుకున్నది. అయితే 1990లోనే దండకారణ్యంలో నక్సలైట్ల ప్రాబల్యాన్ని నిరోధించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. 1991లో కాంగ్రెస్‌ నాయకుడు మహేంద్రకర్మ (సిపిఐ మాజీనాయకుడు) బస్తర్‌ ప్రాంతంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా ‘జన జాగరణ్‌ అభియాన్‌’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. నక్సలైట్ల తీవ్ర ప్రతిఘటనతో ఈ సంస్థ మనలేకపోయింది. మళ్లీ కొంత కాలానికి చత్తీస్‌గఢ్‌ శాసనసభా నేతగా ఉన్న మహేద్రకర్మ 2005 జూన్‌లో శాంతిసేన పేరిట ‘సల్వాజుడుం’ అనే సంస్థను స్థాపించాడు.



తెగలరీత్యా విభేదాలున్న రాచకోయలు, గుత్తికొయ్యల మధ్య విద్వేషాలను మరింతగా పెంచి మహేద్రకర్మ కొంత విజయం సాధించాడు. నక్సలైట్లకు వెన్నుదన్నుగా గొత్తికోయలు నిలిస్తే వారితో తెగ రీత్యా విభేదాలున్న రాచకోయలు సల్వాజుడుంకు మద్దతు తెలపడంతో గిరిజన సమాజం చీలికలు పేలికలైంది. అప్పటికే గనుల తవ్వకానికి ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వానికి నక్సల్స్‌ అడ్డుతగిలారు. వారిని అడ్డుతొలగించుకోవాలని భావించి చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సల్వాజుడుంకు మద్దతు తెలిపింది. దాదాపు 40 వేల మంది సభ్యులున్న ఈ సేనలో 10 వేల మందికి పైగా సభ్యులకు తుపాకులతో శిక్షణ ఇచ్చింది. నెలకు రూ.1500 జీతంతో దాదాపు నాలుగు వేలమందిని ప్రత్యేక పోలీస్‌ అధికారులుగా (ఎస్పీఒ) నక్సలైట్లను తుదముట్టించడానికి ప్రభుత్వం నియమించింది. మావోయిస్టులను ఎదుర్కొనే లక్ష్యంతో ప్రారంభమైన సల్వాజుడుం చివరకు లూఠీలకు, హత్యలకు, అత్యాచారాలకు, గృహ దహనాలకు దారితీసింది. వీరి ఆగడాలతో దాదాపు 700 గ్రామాలు నామరూపం లేకుండా పోయాయి. వందలాది మంది అత్యాచారాలకు గురయ్యారు. వెయ్యి మందికి పైగా ఆదివాసీలు హతులయ్యారు. దాదాపు 3.5 లక్షలమంది నిర్వాసితులయ్యారని, రెండు లక్షలమంది గిరిజనుల ఆచూకీ ఇప్పటికీ దొరకడం లేదని చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. 



సల్వాజుడుం పేరుతో పిల్లల చేతికి తూపాకులు ఇచ్చారని ప్రజాసంఘాలు మండిపడ్డాయి. గిరిజనుల్ని ఎత్తుకెళ్లి సల్వాజుడుం శిబిరాల్లో పెడుతున్నారని, అక్కడ ఉండటానికి ఇష్టపడకపోతే వారిని మావోయిస్టులుగా చిత్రీకరిస్తూ క్రూరంగా హింస్తున్నారని హక్కుల సంఘాలు ఆరోపించాయి. కొందరు ఈ విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించగా, సుప్రీం బెంచి తీర్పునిస్తూ, 5వ తరగతి మాత్రమే చదివిన యువకులకు ఆయుధాలిచ్చి, పోలీసులతో సమానమైన అధికారాలు ల్పించడం రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకం అని రాష్ర్ట ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. వెంటనే వారి నుండి ఆయుధాలను వశం చేసుకోవాలని ఆదేశించింది. అయితే చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అధికారికంగా సల్వాజుడుంను రద్దుచేసినప్పటికి ప్రత్యేక పోలీసులు అధికారులుగా నియమించిన వారిని మాత్రం ఇంకా కొనసాగిస్తూనే ఉంది. చత్తీస్‌గఢ్‌లో రమణ్‌ సింగ్‌ ప్రభుత్వం భారీ నిర్బంధ కాండను కొనసాగిస్తూ ప్రతి ఒక్కరినీ అణచివేసేందుకు ప్రయత్నించింది. ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ రెండో దశలో బస్తర్‌ ప్రాంతంలో పోలీసులు, పారామిలిటరీ- చింతల్‌నార్‌ ప్రాంతంలో నక్సలైట్లకు సహాయం చేస్తున్నారనే సాకుతో దాదాపు 300 ఇండ్లనుబూడిదచేసి, ముగ్గురు గ్రామీణులను హత్యచేశారు. 


ఆరుగురు మహిలలపై సామూహిక అత్యాచారానికి పాల్ప డ్డారు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల కనుసన్నలలో మిలటరీ, పోలీసులు ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకు పాల్పడి, హక్కుల కార్యకర్తలను, మేధావులను నిర్బంధాలకు గురిచే స్తూ, వేలాదిమందిని హతమారుస్తూ, ఊళ్లకు ఊళ్లను తగలబెడుతూ, లక్షలాదిమందిని నిరాశ్రయులను చేస్తుంటే, ఏనాడూ ఆదివాసులకు అండగా నిలబడని రాజకీయపార్టీలు చత్తీస్‌గఢ్‌ ఘటను ఖండిం చడం, మహేద్రకర్మపై సాను భూతి వ్యక్తంచేయడం గమనార్హం. ఇవాళ దేశ వ్యాపితంగా అనేక ప్రాంతాల్లో బహుళజాతి కంపెనీలు కాలుమోపి ఈ దేశ వనరుల్ని దోచుకుపోతుంటే రాజకీయ పార్టీలన్నీ ఆ బహుళజాతి కంపెనీలకు రాయితీలు కల్పిస్తూ వారికి అండగా నిలబడున్నాయి తప్ప, ఆ వనరుల్ని కాపాడేందుకు ముందుకు రావడం లేదు. మన రాష్ర్టంలోనే సాగునీటి ప్రాజెక్టు పేరుతో, జలవిద్యుత్‌ పేరుతో, గనులు, పరిశ్రమల పేరుతో, అడవుల నుంచి ఆదివాసులను వెళ్లగొడుతున్నా అడ్డుకోలేకపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం, గోదావరి జిల్లాలో 300 గిరిజన గ్రామాలు, వారి అస్తిత్వాలు, వారి సంస్కృతి నామరూపం లేకుండా పోతున్నాయి. అణిచివేత ప్రక్రియను ఆపకుండా, పోలీసులు, మిలటరీబలగాలతో సమస్యను పరిష్కారించాలని ప్రభుత్వాలు అనుకు న్నంత కాలం చత్తీస్‌గఢ్‌ వంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇందుకు బాధ్యత పాలకులు, ప్రభుత్వాలే వహించాల్సి ఉంటుంది.

http://www.suryaa.com/opinion/edit-page/article-139826

1 comment :

Post a Comment