పడగవిప్పిన జాత్యాంహకారం

No comments

మధ్యప్రాచ్చంలో నియంతలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లను మరవకముందే మరోమారు యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. యూదుల జాత్యాహంకారం పడగ విప్పడంతో పాలస్తీనా భూభాగం మరోసారి నెత్తురుతో తడిసింది. గత వారం రోజులుగా  అమెరికా అండదండలతో ఇజ్రాయెల్‌ సైన్యం పాలస్తీనాలోని గాజా పట్టణంపై వైమానిక దాడులకు దిగడంతో పదుల సంఖ్యలో పిల్లలు, వృద్ధులు, మహిళలు మృతి చెందాల్సి వచ్చింది. తాజాగా ఇజ్రాయెల్‌ భూభాగంపై పాలస్తీనీయులు రాకెట్లతో దాడులు చేశారనే సాకుతో ఇజ్రాయెల్‌ సైన్యం  గాజా పట్టణంపై సైన్యంతో విరుచుక పడింది. గత కొెన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌ పాలస్తీనీయుల్ని అడపాదడపా కవ్విస్తున్నప్పటికీ. ఈమధ్య కాలంలో తన జాత్యాంహంకారాన్ని నగ్నంగా ప్రదర్శిస్తూ ప్రత్యక్ష యుద్ధానికి కాలుదువ్వుతున్నది. ఇజ్రాయెల్‌  గతంతో తాను ఆక్రమించిన వెస్ట్‌బ్యాంక్‌ భూభాగంపై అక్రమ సెటిల్‌మెంట్‌ల నిర్మాణం వేగవంతం చేయడంతో అక్కడి పాలస్తీనీయులు ఈ అక్రమ నిర్మాణాలను తీవ్రంగా ప్రతిఘటిస్తూ వస్తున్నారు. అయితే అమెరికా అండదండలు పుష్కలంగా ఉన్న ఇజ్రాయెల్‌  ఈ ప్రతిఘటనను తన ఆయుధ సంపత్తితో సమర్తవంతంగా తిప్పికొడుతూ గాజా పట్టణాన్ని చుట్టుముట్టి తీవ్ర నిర్భందాలకు గురిచేస్తుంది. ప్రపంచ పెద్దన్నలా వ్యవహరిస్తున్న  అమెరికా ఈ రెండు దేశాల మధ్య జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తామని గత ఐదు దశాబ్దాలుగా చెబుతున్నప్పటికీ ప్రత్యక్షంగా ఇజ్రాయెల్‌నే సమర్థిస్తూ పాలస్తీనాపై యుద్ధానికి పురికొల్పుతున్నది. పాలస్తీనా భూభాగాలను అక్రమంగా ఆక్రమించుకుని నిర్మించిన సెటిల్‌మెంట్లపై విచారణ చేయాలని, ఇజ్రాయెల్‌ ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో పాలస్తీనీయుల ఆస్తులను కాపాడాలని, పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్‌ సెటిలర్ల హింసాత్మక దాడులను నివారించాలనీ, వారి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని గతంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ కోరింది. 47 మంది సభ్యులు గల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థల్లో, తీర్మానానికి అనుకూలంగా 36 దేశాలు ఓటు వేయగా పది దేశాలు ఓటింగ్‌లో పాల్గోనలేదు. అమెరికా ఒక్కటే తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ తీర్మాణాన్ని బట్టే తెలుస్తోంది అమెరికా ఎవరి వైపు నిలుచున్నదనేది తెలుసుకోవడానికి. మానవ హక్కులను హరించడంలోనూ, దారుణమైన యుద్ధ నేరాలకు పాల్పడడంలోనూ, మానవతా వ్యతిరేక నేరాలు సాగించడంలోనూ తిరుగులేని రికార్డు ఉన్న అమెరికా, అటువంటి నేరాల్లో అమెరికాకు జూనియర్‌ పార్టనర్‌గా ఉన్న ఇజ్రాయెల్‌కు వత్తాసుగా రావడం ఆశ్చర్చకరమేమీ కాదు. ఇజ్రాయెల్‌ సెటిల్‌మెంట్లు నిర్మించడం ఆపేస్తే తప్ప పాలస్తీనా సమస్య పరిష్కారం సాధ్యం కాదని ఒకవైపు  ప్రకటించిన ఒబామా, సదరు సెటిల్‌ మెంట్ల నిర్మాణాన్ని అరికట్టడంలో క్రియాశీలక పాత్ర నిర్వహించడానికి సిద్ధంగా లేడని అమెరికా వ్యతిరేక ఓటు ద్వారా స్పష్టం అవుతోంది. 

రెండో ప్రపంచ యుద్ధం వరకు గాజా తదితర ప్రాంతాల్లో పాలస్తీనీయులే తమ భూభాగంగా ప్రకటించుకొని అక్కడ నివాసం ఏర్పాటుచేసుకున్న ప్పటికి అమెరికా, ఇంగ్లాండ్‌ దేశాలు తమ స్వప్రయోజనాలకోసం  జాతివిద్వేషాలు రెచ్చగొట్టడంతో ఈ ప్రాంతం గత డెభై ఏళ్లుగా యుద్ధాలతో మునిగితేలాల్సి వచ్చింది. ఈ భూభాగంలోనే పాలస్తీనీయులు, యూదులు గతంలో కలిసి నివసిస్తుండేవారు. ఈ ప్రాంతంపైన గ్రీకులు, రోమన్లు ఈజిష్షియన్లు అనేక సార్లు దండయాత్రలు చేసి పాలించారు. ఈ దండయాత్ర కాలంలో యూదుల్ని అక్కడినుంచి వెళ్లగొట్టారు. దాంతో వారు ప్రపంచంలో అన్ని వైపులకి వలస వెళ్ళారు. పాలస్తీనీయుల్ని కూడా వెళ్ళగొట్టిన సందర్భాలున్నాయి. కానీ వాళ్ళు ఆ దాడులను, దండయాత్రలను ప్రతిఘటిస్తూ అన్ని కాలాల్లో ఎక్కువమంది అక్కడే నివసించారు. యూరప్‌ దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన యూదులు ఆ దేశాల్లో  నివాసాలు ఏర్పాటు చేసుకొని అత్యధిక మంది తక్కువ కాలంలోనే ధనవంతులుగా మారారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ హిట్లర్‌ జాత్యాంహకారం శృతిమించడంతో యూరప్‌లోని యూదుల పరిస్థితి ప్రమాదంలో పడింది. నాజీ సైనికులు యూదుల్ని యూరప్‌ నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు. హిట్లర్‌ అయితే అమానుషంగా లక్షలాది మందిని ఊచకోత కోశాడు. ఇదే సందర్భంలో తమ దేశాల్లో కూడా వచ్చి స్థిరపడిన యూదుల్ని తరిమేసి వారికి చెందిన ఆస్తులను వశపరచుకోవాలని ఎన్నో ఏళ్ళుగా అనుకుంటున్న అమెరికా, ఇంగ్లండ్‌ దేశాలు ఈ పరిణామాలు కలిసివచ్చాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న బ్రిటన్‌, యూదులు తలదాచుకోవడానికి వారికొక దేశం కావాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాధనలకు ఇతర యూరప్‌, అమెరికా దేశాలు వంతపాడాయి. ఇట్లా తమ స్వప్రయోజనాల కోసం ఇజ్రాయెల్‌ అనే దేశాన్ని సృష్టించారు. వాస్తవానికి పశ్చిమ దేశాల్లోని యూదులపై మారణహోమానికి  పాల్పడింది హిట్లర్‌ నేతృత్వంలోని జర్మనీ. బాధితులు ఐరోపా దేశాలకు చెందిన యూదులు. వారికి అండగా నిలవాల్సింది,వారిని ఆదుకోవాల్సింది కూడా ఇంగ్లండ్‌, అమెరికా వంటి దేశాలే.  కానీ న్యాయం పేరుతో జరిగిన కుట్రలో ఏమాత్రం సంబంధం లేని పాలస్తీనా బలిపశువుగా మారిపోయింది. పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా అక్రమించి 1948 మే 15 తేదీన అమెరికా, బ్రిటన్‌లు ఇజ్రాయెల్‌ దేశాన్ని స్థాపించాయి. లక్షల మంది పాలస్తీనీయులను వారి ఇళ్ళ నుండి భూముల నుండి బలవంతంగా తరిమేసి వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయెలీయులను పాలస్తీనాకు రప్పించారు. పాలస్తీనీయుల ఆస్తులు, భూములను కట్టబెట్టారు. అలా తరిమివేయబడ్డ పాలస్తీనీయులు తమ స్వస్థలాలకు తిరిగి రావడానికి ప్రయత్నించడంతో తిరిగి ఘర్షణలు తలెత్తుతున్నాయి. దాదాపు పది లక్షల మంది పక్క దేశాలకి వలస వెళ్ళి అక్కడ శరణార్థులుగా ఇప్పటికీ ఉన్నారు. అప్పటి నుండీ పాలస్తీయులు తమ స్వస్థలానికి తిరిగిరావడానికి ఎదురు చూస్తున్నారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ పొరుగున ఉన్న అరబ్‌ దేశాలన్నీ 1967లో ఇజ్రాయెల్‌ పైన యుద్ధానికి దిగాయి. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్‌ అమెరికా అండదండలతో ఆరబ్‌ దేశాల్ని ఆరు రోజుల్లోనే ఓడించి పాలస్తీనా భూభాగాన్ని ఇంకా ఆక్రమించింది. ఈజిప్టు,సిరియా,జోర్డాన్‌ దేశాల భూభాగాల్ని కూడా ఆక్రమించింది. తర్వాత కాలంలో ఈజిప్టు ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకుని అమెరికా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌కు మిత్రదేశంగా ఉంటూ వచ్చింది. తమ నిలువు నీడ కోల్పోయిన పాలస్తీనీయులు ఉత్తరానా లెబనాన్‌, సిరియాలు, దక్షిణాన ఈజిప్టు,గాజా, తూర్పున వెస్టు బ్యాంకుల్లో తలదాచుకుంటున్నారు. పాలస్తీనీయులకు కనీస అవసరాలు తీరకుండా ఇజ్రాయెల్‌ అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. తాగునీరు. సాగునీరు. అందకుండా అడ్డుకుంటోంది. పాలస్తీనాలో ప్రధాన నీటి వనరు కుంటలు. సరస్సులే. ఈ నీటి వనరుల వద్దకు పాలస్తీనీయులు రాకుండా ఇజ్రాయెలీ సెటిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. నీటి కుంటలు, సరస్సులను టూరిస్టు కేంద్రాలుగా మారుస్తున్నారు. దానితో పాలస్తీనీయుల పొలాల పొలాలు పండడం గగనం అవుతోంది. వారి పొలాలన్నీ బీళ్ళుగా మారిపోతున్నాయి. ఆయుధాలు ధరించిన యూదు తీవ్రవాదులు పాలస్తీనీయులపై దాడులు చేస్తూ వారి ఇండ్ల నుంచి తరిమి కొట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. వారికి ఇజ్రాయెల్‌ పోలీసులు, సైన్యం సహాయంగా వస్తున్నారు. వీరి దుర్మార్గాలను ప్రశ్నించే వారిని అరెస్టు చేసి విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైళ్ళలో కుక్కుతున్నారు.

అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఈ పరిణామాలని గమనిస్తున్న ఐక్యరాజ్య సమితి పాలస్తీనీయులకు అండగా నిలిచింది. 1967 యుద్ధానికి ముందున్న సరిహద్దులకి వెనక్కి వెళ్ళాలని తిర్మానం చేసింది. ఆ యుద్ధంలో చేసిన ఆక్రమణలు చట్టవిరుద్ధమని ఇప్పటికీ వెస్ట్‌ బ్యాంక్‌లో కడుతున్న సెటిల్‌మెంట్లు చట్టవిరుద్ధమని సమితి తీర్మానం ఉన్నాయి. కానీ అమెరికా యూరప్‌ల అండవలన అవి అమలు కావడం లేదు. ఇజ్రాయెల్‌ ఇప్పుడు 1967 సరిహద్దులకి వెళ్ళడానికీ ఒప్పుకోవడం లేదు. పెద్ద గుండాగా తయారయ్యింది. ప్రపంచానికి అమెరికా పోలీసులయితే మధ్యప్రాచ్చానికి (పశ్చిమాసియా) ఇజ్రాయెల్‌ జూనియర్‌ పోలీసుగా అవతారం ఎత్తింది. ఇజ్రాయెల్‌ పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుని  జాతి వివక్ష పాటిసు జాత్యహంకారిగా వ్యవహరిస్తుంది. అమెరికాలో ఏ అధ్యక్షుడైనా పాలస్తీనాకి అనుకూలంగా ఉన్నా త్వరలోనే తన విధానాన్ని మార్చుకునేలా యూదుల వారిపై ఒత్తిడి తెస్తారు. అమెరికాలో ఉన్న యూదుల్ని ఇజ్రాయెల్‌ ఆర్గనైజ్‌ చేస్తు , వారు పెద్ద లాబీగా ఏర్పడి అమెరికా విధానాల్ని ప్రభావితం చేస్తారు. అమెరికాలో యూదుల లాబీ అత్యంత శక్తివంతమైనది. వాళ్ళ డబ్బు వారికా శక్తిని ప్రసాధించింది. చాలా పత్రికా సంస్థలు, ఎం.ఎన్‌.సిలు యూదులవి. గూగుల్‌ని యూదులు స్థాపించిందే. 

ఇజ్రాయెల్‌ సాగిస్తున్న ఈ దురన్యాయాలను అంతర్జాతీయ సమాజం గత యాభై సంవత్సరాలుగా చూస్తూ కూడా మౌనం పాటిస్తూ వచ్చింది. సిరియాలో లేని తిరుగుబాట్లను కిరాయి ఇచ్చి నడుపుతున్న అమెరికా, యూరప్‌లు యాభై యేళ్ళ నుండి సాగుతున్న ఇజ్రాయెల్‌ వలస పాలననూ, మానవ హక్కుల ఉల్లంఘనూ, పాలస్తీనీయులపై సాగుతున్న దమనకాండనూ అంత చేయడానికి ప్రయత్నించలేదు. తామూ ప్రయత్నించకపోవడమే కాక ఇతరులు చేసిన ప్రయత్నాలను అవి నీరుగారుస్తూ వచ్చాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమెన్‌ నేతన్యాహూ యుధావిధిగా మానవ హక్కుల సంస్థ తీర్మానంపై విషం కక్కాడు. ''మానవ హక్కుల సంస్థ తన తీర్మానానికి తానే సిగ్గు పడాలి'' అని హుంకరించాడు. 

అయితే గతంలో అలీనోద్యమంలో కీలక పాత్రను పోషించిన భారత్‌ వంటి దేశాల్లో చాలా సందర్భంల్లో మౌనంగా వ్యవహరించించి. గతంలో పాలస్తీనా సమస్యకు త్వరిత గతిన పరిష్కారారం కనుగోనాలని పిలుపు నిచ్చిన మనం ఆ రోజు చేసిన ప్రతినను ఈ సందర్భంగా పునరుద్ఘాటించాలి. తద్వారా సుదీర్ఘ కాలంగా బాధలు పడుతున్న పాలస్తీనా ప్రజలు శాంతితో, గౌరవంతో తమకంటూ సొంతదైన రాజ్యంలో బతికేందుకు దోహదపడాలి. ఏడు దశాబ్దాలుగా పాలస్తీనా సమస్యపై ప్రపంచ దేశాలు చేసిందేమి లేదు. 2007లో రెండు లక్షల మంది నివసించే అతి చిన్న పాలస్తీనా భుభాగంపై దురహంకార ఇజ్రాయెల్‌ అత్యాధునికి ఆయుధ సంపత్తితో ఏకపక్షంగా విరుచుకుపడి 1400 మంది ఆమాయక పౌరులను బలితీసుకుంటే ఇరాన్‌ తప్ప నోరు మెదిపిన అలీన దేశమే లేదు. 1947లో ఐరాస ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసినప్పుడు దానికి కేటాయిచింది దాదాపు 50 శాతం పాలస్తీనా భుభాగం. కాగా పాలస్తీనాకు నేడు వెస్ట్‌బ్యాంక్‌, గాజాలు మాత్రమే మిగిలాయి. హమాస్‌కు 

ఉగ్రవాద నేపథ్యం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబంద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారానే గాజాలో అధికారంలోకి వచ్చింది కానీ హమాస్‌పై ఉగ్రవాద సంస్థగా ముద్రవేసి ఇజ్రాయెల్‌, అమెరికా గాజాపై దిగ్బంధాన్ని సాగిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్తు, నీటి సరఫరా నిలిపివేస్తూ, ఆహారం,మందులు అందకుండా చేస్తున్నారు.ఈ ప్రాంతంలోకి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను అనుమతించాలని తమ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం వారు పాటించలేదు. ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే కొన్ని ఏళ్లలో పాలస్తీనా ప్రాంతమే లేకుండా పోతుంది. యూదు రాజ్యమైన ఇజ్రాయెల్‌ మాత్రమే మిగులుతుంది.


No comments :

Post a Comment

ప్రమాదంలో బాల్యం

No comments

అరవెైఐదేళ్ళ స్వాతంత్య్రంలో ‘నేటిబాలలే రేపటి సంక్షోభాల బాధితులు’ అయ్యారు. మక్కుపచ్చలారని బాల్యాన్ని దేశ ఆర్థిక పరిస్థితులు, పౌష్ఠికాహార లోపం, అవిద్య, లింగవివక్ష, ఒత్తిడితోకూడిన చదువులు ఉక్కిరిబిక్కిరిచేస్తూ మొగ్గలోనే తుంచివేస్తున్నాయి. దేశ భావితరాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో వీధి బాలలు, బాల కార్మికులు, పెరిగి పోతున్నారు. 1959 నవంబర్‌ 20న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమితి బాలల హక్కుల ప్రకటనను రూపొందించింది. ఈ హక్కుల ప్రకటనను ఆమోదిస్తూ భారతదేశంతో పాటు 191 దేశాలు సంతాకాలు చేశాయి. వివిధ దేశాలలోని పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడానికి, పరస్పర అవగాహనను పెంచుకోవడానికి బాలల దినోత్సవాన్ని రూపకల్పన చేసింది. మనదేశం ఈ బాలల దినోత్స వాన్ని దేశ ప్రథమ ప్రధాని చాచా నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహిస్తోంది.

ఆయన బాలల కోసం అనేక విధానాలను అవలంభిచారు కానీ అనంతర పాలకులు వాటిని విస్మరించి బాలలపట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 సంవత్సరాలు గడిచినా మన ప్రభుత్వాలు బాలల హక్కుల పట్ల వారి భవిష్యత్తు పట్ల సరెైన ప్రణాళికలు రూపొందించలేకపోతున్నాయి. బాలల హక్కుల కోసం నామమాత్రంగా చేసిన  చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో మూడవవంతు భాగాన్ని బాలలు ఆక్రమించారు. ప్రపంచ వ్యాపితంగా దాదాపు 6 కోట్ల మంది వీధి బాలలు ఉండగా ఒక్క మన దేశంలోనే 1 కోటి 80 లక్షల మంది ఉన్నారు. దేశంలోని 30 కోట్లమంది బాలల్లో 6 కోట్ల మంది కార్మికులుగా మగ్గుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఒక స్వచ్ఛంద సంస్థ లెక్క ప్రకారం ప్రతి 10 మంది బాలలో ఇద్దరు బాలకార్మికులు. మూడింట ఒక వంతు పోషకాహారలేమితో కునారిల్లుతున్నారు.

గత ఏడాది మన దేశంలో 3 లక్షల 80 వేలమంది విటమిన్‌ డి లోపం వల్ల, 15.2 శాతం పిల్లలు శ్వాస సంబంధ వ్యాధుల వల్ల, 7 శాతం మంది పిల్లలు అతిసార వల్ల మరణించినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. దేశంలో 50 శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో పుడుతున్నారని, వారిలో దాదాపు 70 శాతం మంది రక్తహీనతతో బాదపడుతున్నారని తెలుస్తోంది. ప్రపంచంలో మన దేశంకంటె వెనుకబడిన దేశాలు బాలల రక్షణపట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే మనం నిర్లక్షంగా వ్యవహరిస్తున్నాము. ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్న భారతావనిలో పాలకుల అవినీతి వల్ల ఏడున్నర కోట్లమంది బాలలు ఆకలితోనే గడుపుతున్నట్లు యునిసెఫ్‌ లెక్కలు చెబుతున్నాయి. గోదాముల్లో నిల్వలుగా పేరుకుపోయిన ధాన్యంతో నిరుపేదల ఆకలి తీర్చమని గతంలో సుప్రీంకోర్టు సలహా ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పనికి ఆహార పథకం, మధ్యాహ్న భోజన పథకం వంటివి ఆర్భాటంగా ప్రారంభమైనా క్రమేణా దళారీల జేబులు నింపడానికే పనికొస్తున్నాయి.
బాలికల పరిస్థితి మరింత భయందోళనకు గురిచేస్తున్నది.
దేశంలో బాల, బాలికల నిష్పత్తి తగ్గిపోతుంటే, బాలికలకు రక్షణలేకుండా పోతుంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో ప్రకారం గత సంవత్సరం దేశంలో 7వేల 58 మంది బాలికలు అత్యాచారానికి గురయినట్లు తెలుస్తుంది. అంటే ప్రతిరోజు దాదాపు 19 మంది బాలకలు అత్యాచారాలకు గురవుతున్నారు. వారిపెై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిలో అత్యధికులు బంధువులే ఉంటున్నట్లు తెలిపింది. అత్యాచారానికి గురెైన బాలికలు సమాజానికి దూరమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంట్లో నిలువనీడలేక, సరెైన రక్షణలేక పట్టణాలకు వలసవచ్చిన పిల్లలను అరాచక మూకలు మాయ మాటలు చెప్పి ఆశ్రయం కల్పించి వారిని వేశ్యా వాటికల్లో అమ్ముతున్నాయి. అనధికార లెక్కల ప్రకారం దేశంలో దాదాపు 20 లక్షలమంది బాలవేశ్యలున్నట్లు తెలుస్తోంది. వారి పునరావాసానికి ప్రభుత్వం నామమాత్ర కమిటీలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వారిని రక్షించలేక పోతోంది.

దేశంలో విద్య, జనాభాలో 80 శాతంపెైగా ఉన్న బడుగు బలహీన వర్గాల బాలలకు అందని ద్రాక్షగానే మారిపోయింది. 14 సంవత్సరాలలోపు బాలలకందరికి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని చట్టం చేసినప్పటికీ అది అమలుకు నోచుకోవడం లేదు. బడిలో చేరిన ప్రతి 100 మంది పిల్లల్లో దాదాపు 70 మంది పిల్లలు మాధ్యమిక విద్య పూర్తిచేసుకోకముందే డ్రాపౌట్‌కు గురవుతున్నారని ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి. డ్రాపౌట్‌కు గురవుతున్న బాలల్లో 80 శాతం మంది బిసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల పిల్లలు, వారిలో కూడా 60 శాతం మందికి పెైగా బాలికలే ఉంటున్నారు. సర్వశిక్షా అభియాన్‌ తాజా లెక్కల ప్రకారం మన రాష్ర్ట మొత్తం జనాభాలో బడి వయసుగలవారు 1 కోటి 55 లక్షల 75 వేల మంది. వీరిలో పాఠశాలల్లో వివిధ స్థాయిల్లో చేరిన వారు 1కోటి 36 లక్షల 91 వేల మంది. ఇంకా 18 లక్షల 83 వేల మంది విద్యార్థులు బాలకార్మికులుగా మగ్గుతున్నారు. నూటికి 64 శాతం మంది విద్యార్థులు బడి మధ్యలోనే మానేస్తున్నారు.

మినిస్టరీ ఆఫ్‌ హోం ఎఫెైర్స్‌ లెక్కల ప్రకారం 1వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ‘బళ్లో చేరిన’ పిల్లలలో నూటికి 64 మంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు. బళ్లో చేరిన పిల్లలో 1 నుండి 5వ తరగతి వచ్చే వరకు 19 శాతం మంది, 1 నుండి 7వ తరగతి వచ్చే వరకు 34 మంది,1 నుండి 10వ తరగతి వచ్చే వరకు 64 శాతం మంది పిల్లలు బడి మానేస్తున్నారు. కాని సాంఘికంగా, ఆర్థికంగా అట్టడుగున పడి నలుగుతున్న వెనుకబడిన తరగతుల కులాల పిల్లలలో ఈ శాతం మరీ ఎక్కువగా ఉంది. దుర్భర దారిద్య్ర పరిస్థితులే ఇందుకు ప్రధానకారణం.
ఈ గణాంకాలు చూస్తుంటే, రాజ్యాంగం వాగ్దానం చేసినట్లు 14 సంవత్సరాల వరకు నిర్బంధోచిత ప్రాధమిక విద్య అందరికీ అనేది ఇప్పట్లో వాస్తవరూపం ధరించేలా కనిపించడం లేదు.

రాజ్యాంగంలోని 24వ అధికరణం 14 ఏళ్లలోపు పిల్లలను ఫ్యాక్టరీల్లో, గనుల్లో, ఇతర వృత్తుల్లోఉపయోగించుకోవడాన్ని నిషేధించింది. 45వ అధికరణం 14 ఏళ్ల వరకు బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని స్పష్టం చేస్తోంది. ఈ రెండు రాజ్యాంగ భావనలనూ కలిపి చూస్తే బడికి వెళ్లడమన్నది 14 ఏళ్లలోపు బాల బాలికలకు ఉన్న ‘హక్కు’ అని మనం గుర్తించక తప్పదు.14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంద విద్య అందించాలని రాథకృష్ణన్‌ కమిషన్‌ (1948-49), కొఠారీ కమిషన్‌ (1964-66) తమ నివేదికల్లో నొక్కి చెప్పాయి. ప్రాథమిక విద్యకు ప్రాథాన్యం ఇవ్వడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ నివేదికలు సూచించాయి. వాటి అమలు కోసం అనేక కమిషన్‌లు వేసినా లక్షలాది మంది బాల బాలికలు చదువుకు దూరంగా బాలకార్మికులుగా మగ్గుతున్నారు.1979లో కేంద్రప్రభుత్వం ఎం.ఎస్‌‌‌ గురుపాద స్వామి నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. నిరక్షరాస్యతకు, బాలకార్మిక వ్యవస్థకు పేదరికమే పునాది అనీ, పేదరిక నిర్మూలనే ఇందుకు పరిష్కారంమని తేల్చిచెప్పింది. కానీ నేటి ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనకోసం శాశ్వత పరిష్కారాలు ఆలోచించకుండా, కేవలం ఆకర్షనీయమైన పథకాలతో ప్రజలను మభ్యపెడుతు శాశ్వతంగా వారికి అవిటి వాళ్లుగా, ప్రభుత్వాలు విసిరేసే తాయిలాలకోసం ఎదురుచూసే వారిగా తయారుచేస్తోంది. రాష్ర్టంలోని వెనకబడిన వర్గాల ప్రజానీకం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడనంత వరకు వారి పిల్లలు చదువుకు దూరంగా, బాలకార్మికులుగా మిగిలిపోతారు. భవిష్యత్‌ భారతం బాలలచేతుల్లోనే ఉంది.  వారిని సమర్థవంతంగా తీర్చిదిద్దితేనే భారత్‌ అభివృద్ధివెైపు దూసుకెడుతుంది. లేదంటే అంధకారంలో మగ్గాల్సి వస్తుంది.

(సూర్య 22-11-12)  

No comments :

Post a Comment

ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్న విదేశీ పెట్టుబడులు

No comments

చిల్లర వర్తకుల జేబుకు కేంద్రం చిల్లు పెట్టింది. చిల్లర వ్యాపారంపై బ్రతికే వారి ఆశలపై నీళ్ళు చల్లింది. రిటైల్‌ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు రెడ్‌ కార్పెట్‌ వేసి దిగువ, మధ్యతరగతి ప్రజల జీవనోపాధిని మరోసారి ప్రశ్నించింది. ఎప్పటి నుంచో చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని చూస్తున్న యూపిఏ, పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల అనంతరం తన మనషులోని మాట భయటపెట్టింది. మనదేశంలోని కిరాణా,సూపర్‌ మార్కెట్‌ వస్తువులను కుప్పకూలుస్తూ విదేశీ వాణిజ్యానికి అనుమతిచ్చేసింది. అదీకాక ఆర్థిక సంస్కరణలకు ఇదే మంచి తరుణమంటూ తన జబ్జలు తానే చరుచుకుంది.  

రిటైల్‌ రంగంలోకి  విదేశీ  ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ తృణమూలు కాంగ్రెస్‌, ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకున్నప్పటికీ ప్రభుత్వం వెనుకడుకు వేయడానికి సిద్దపడలేదు. యూపిఏ మొదటి దఫా పాలన కాలంలోనే  చిల్లర వ్యాపార రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తే  వామపక్షాలు అడ్డుతగలడం వల్ల వెనుకడుగు వేసింది. ఈ దఫా మాత్రం స్వపక్షం నుంచి విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయినప్పటికి ప్రభుత్వం మాత్రం తన మాటనే నెగ్గించుకుంది.  ప్రపంచంలోకెల్లా అత్యధిక చిల్లర వర్తకం ఉన్న దేశం మనది. ఒక అంచనా ప్రకారం భారత దేశ స్థూల జాతీయోత్పత్తిలో చిల్లర వర్తకం 30 లక్షల కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వర్తకం 2014వ సంవత్సరం నాటికి 45 లక్షల కోట్లకు చేరుకుంటుందని నిపుణుల అంచనా. ఇంత పెద్ద మార్కెట్‌ను తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవాలని బహుళజాతి కంపెనీలు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాయి. భారత్‌లో రిటైల్‌ రంగంలో విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేకపోవడంతో కొన్నాళ్లు  వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేశంలోకి సంస్కరణలను ప్రవేశపెట్టడంలో తన వంతు పాత్రను నిర్వర్తించిన ప్రధాని  ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న తరుణంలో భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటం కోసమే సంస్కరణలు అమలు చేస్తున్నామని వివరణ ఇచ్చుకున్నాడు. కానీ భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడానికి  కారణం ఎవరు అనేది మాత్రం ఆయన చెప్పడం లేదు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ప్రవేశ పెట్టిన సంస్కరణల ఫలితమే దేశం ఈనాడు ఎదుర్కొంటున్న దుస్థితికి కారణం అనేది విస్మరిస్తున్నాడు.

పాలకులు ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితంగా  దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరుగుతూ వచ్చింది. యువతకు సరియైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కోట్లాది నిరుద్యోగ భారతీయులు అనివార్యంగా కొద్దిపాటి పెట్టుబడులతో చిల్లర దుకాణాలు తెరవడమే ఏకైక ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. సుమారు కోటి 40 లక్షల చిల్లర దుకాణాలు నేడు దేశంలో వెలిశాయి. వీటిపై నాలుగు కోట్ల మంది చిరువ్యాపారులు ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. పరోక్షంగా కోట్లాదిమందికి 

ఉపాధి లభిస్తోంది. సంస్కరణల ఫలితంగానే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి ప్రజలు ప్రత్యామ్నాయంగా చిల్లర వర్తకాన్ని ఎంచుకుంటే నేడు ఆ రంగాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి భారత పాలకులు ఉభలాటపడుతున్నారు. ఇప్పటికే దేశంలో ఉపాధి అవకాశాల పరిస్థితి నిరాశాజనకంగా ఉన్న సమయంలో చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతిస్తే అది ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిల్లర వర్తకుల్లో స్వల్ప వ్యయంతో దుకాణాలు నడిపేవారు, స్వంత షాపులు పెట్టుకున్నవారు, జనరల్‌ స్టోర్స్‌ నిర్వాహకులు మొదలు వీధి దుకాణదారులు ఉన్నారు. లక్షలాది మంది సాంప్రదాయేతర రూపాల్లో చిల్లర వర్తకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. కొద్దిమొత్తం పెట్టుబడులతో స్వతంత్రంగా ఈ రంగంలో అడుగుపెట్టే వీలుండటంతో నిరుద్యోగులకు ఈ రంగం పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తున్నాయి. గత పది పన్నెండేళ్లలో చిల్లర వర్తకం మన దేశంలో పెరుగుతూ వచ్చింది. మొత్తంగా రిటైల్‌ రంగం పెరుగుదల కంటే ఇది వేగంగా పెరుగుతోంది. ఇలా పెరగడానికి  ప్రధాన కారణం మనం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పాక్షిక ఉద్యోగా సమస్యకు ఇది ప్రతిబింబంగా భావించవచ్చు. వ్యవసాయ రంగం ఇప్పటికే జనంతో నిండిపోయింది. అదనంగా ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశాలు అందులో లేవు. వస్తు తయారీ రంగంలో స్తబ్దత నెలకొంది. దీంతో లక్షలాది మంది భారతీయులు అనివార్యంగా సేవల రంగంలోకి ప్రవేశించి ఉపాధి వెతుక్కోవాల్సి వచ్చింది. అక్కడ కూడా అవకాశాలు అంతగా లేకపోవడంతో కొద్ది పాటి పెట్టుబడులు పెట్టగలిగినవారంతా చిల్లర దుకాణాలు తెరవటం ఏవైక ప్రత్యామ్నాయంగా  వచ్చిందే తప్ప ప్రత్యేకంగా ఎంచుకున్నది కాదు.

ప్రస్తుతం వాల్‌మార్ట్‌ బహుళజాతి కంపెనీ ప్రపంచంలోని 15 దేశాలలో 55 పేర్లతో 8,500 షాపులను తెలిచింది. వాల్‌మార్ట్‌, పుస్టరికో పేర్లతో అమెరికాలో, వాల్‌మెక్స్‌ పేరుతో మెక్సికోలో, ఆస్థా పేరుతో లండన్‌లో, బెస్ట్‌ప్రైస్‌ పేరుతో ఇండియాలో ఇప్పటికే తన వ్యాపారాన్ని నడుపుతుంది. 2006లో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌తో వాల్‌మార్ట్‌ తన వ్యాపార భాగస్వామ్యాన్ని మన దేశంలో ప్రారంభించింది. బెస్టప్రైస్‌ పేరుతో వాల్‌మార్ట్‌ కంపెనీ తన మొదటి షాప్‌ను 2012 మేలో అమృత్‌సర్‌లో ప్రారంభించింది. భారత ప్రభుత్వం రిటైల్‌ రంగంలో 51 శాతం విదేశీ పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ సెప్టెంబర్‌ 14న పచ్చజెండా ఉపడంతో తన వ్యాపారాన్ని విస్తరించడానికి వాల్‌మార్ట్‌కు అవకాశం ఏర్పడింది. అయితే వాల్‌మార్ట్‌ వంటి విదేశీ బహుళజాతీ కంపెనీలు మనదేశ  రిటైల్‌ రంగంలోకి ప్రవేశిస్తే అధనంగా లక్షలాధిగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిపోతాయని ఎఫ్‌డిఐ సమర్థకులు వాదిస్తున్నారు. కానీ వివిధ దేశాల అనుభవం దీనికి భిన్నంగా ఉంది. వాల్‌మార్ట్‌ వంటి బడా కంపెనీలు భారతదేశంలోకి అడుగుపెడితే అది కొత్తగా ఒక్క ఉద్యోగాన్ని సృష్టిస్తే చిల్లర వర్తకాన్ని నమ్ముకున్న 17 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని  జర్మనీకి చెందిన మెట్రోక్యాష్‌ అండ్‌ క్యారీ కంపెనీ ప్రకటించింది. వాల్‌మార్ట్‌ రిటైల్‌ రంగంలో ప్రవేశించిన పదిసంవత్సరాల్లోనే దాదాపు 50 శాతం మంది చిన్న వర్తకంపై ఆధారపడినవారు తన వ్యాపారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని కెన్నిత్‌ స్టోన్‌ అనే అమెరికన్‌ ఆర్థికవేత్త తన సర్వేలో పేర్కొన్నాడు. ఒక్క వాల్‌మార్ట్‌ కంపెనే చైనా నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడం మూలంగా అమెరికాలో దాదాపు 2 లక్షల మంది కార్మీకులు తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వాల్‌మార్ట్‌ 2006లో షికాగోలోని అస్టిన్‌ ప్రాంతో కాలుమోపితే 2008 కల్లా ఆ ప్రాంతంలోని మొత్తం 306 చిన్న దుకాణాల్లో 82 దుకాణాలు మూతపడ్డాయని అమెరికా నుంచి వెలువడుతున్న 'అట్టాంటిక్‌ సిటీస్‌'' అనే పత్రిక వెలువరించింది. వాల్‌మార్ట్‌ చుట్టుపక్కల దుకాణాల మూసివేత రేటు 35 శాతం నుంచి 60 శాతం ఉంటుందని ''ది ఎకానమిక్‌ డెవలప్‌మెంట్‌ క్వార్టర్లీ'' తన అధ్యయనంలో వెల్లడించింది. వాల్‌మార్ట్‌ వంటి బహుళజాతి కంపెనీల వల్లా కొత్త ఉద్యోగాల మాట ఎట్లా వున్నా ఉన్న ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఎన్నో అధ్యయనాలు తెలుపుతున్నాయి. వాస్తవాలు ఇలా వుంటే ప్రభుత్వం మాత్రం కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ధరలు తగ్గుతాయని వాస్తవాలను దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. బహుళజాతి కంపెనీలు రిటైల్‌ రంగంలోకి వచ్చిన తర్వాత ప్రాథమిక దశలో కొన్ని విలాస వస్తువులు చౌక ధరలకు లభించినప్పటికి భవిష్యత్తులో దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. భవిష్యత్తు లాభాల కోసం దేశీయ మార్కెట్‌ ధరల కంటే కొంత కాలం బడా కంపెనీలు తక్కువకే వస్తువులను అమ్ముతాయి. దీని వల్ల ఆ షాపింగ్‌ మాల్‌ చుట్టుప్రక్కల ఉన్న చిల్లర దుకాణాలు మూతవేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా మూత పడిన చిల్లర వ్యాపార రంగాన్ని స్వాధీనం చేసుకున్న  బడా కంపెనీలు తమకు ఇష్టమొచ్చిన రేట్లకు అమ్ముతూ వినియోగదారులను దోపిడీ గురిచేస్తాయి. ధాయ్‌లాండ్‌లో విదేశీ పెట్టుబడులు ప్రవేశించిన కొద్ది కాలానికే ఆ దేశంలో రిటైల్‌ రంగం మొత్తం వ్యాపారంలో 40 శాతాన్ని ఈ కంపెనీలు అక్రమించిచాయి. భారీ ఎత్తున చిల్లర దుకాణాలు మూతపడ్డాయి. యజమానులు నిరుద్యోగులయ్యారు. 2003లో ఎసి నీల్సన్‌ 'ఆసియాలో రిటైల్‌ వాణిజ్యం పరిస్థితి'' నివేధికను విడుదల చేసింది. ఈ నివేదికలో  చైనా,దక్షిణకొరియా,మలేషియా,సింగపూర్‌,తైవాన్‌,ధాయ్‌లాండ్‌లు రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించిన తర్వాత భారీ ఎత్తున షాపింగ్‌ మాల్స్‌ పుట్టుకువచ్చాయని, తద్వారా 90 దశకంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించిన రిటైల్‌ రంగం చావుదెబ్బతిన్నదని స్ఫష్టం చేస్తోంది. అమెరికాలోనే కాదు, తూర్పు ఆసియా దేశాలలో కూడా జరిగింది ఇదే. వాల్‌మార్ట్‌,టెస్కో,కెర్రిపాల్‌ వంటి బహుళజాతి కంపెనీలు చిల్లర వర్తకంలో అడుగుపెట్టిన ప్రతిచోట చిరువ్యాపారులు రోడ్డున పడిన పరిస్థితి అంతర్జాతీయంగా అనుభావాలు చెబుతున్నాయి.

వాల్‌మార్ట్‌ వంటి బహుళజాతి కంపెనీలను రిటైల్‌ రంగంలోకి అనుమతించడం వల్లే చైనా దేశం త్వరిత గతిన అభివృద్ధిని సాధించిందని,ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలని మన్మోహన్‌ సెలవిస్తున్నాడు.  కానీ చైనా అనుభవం భిన్నంగా ఉంది. వాల్‌మార్ట్‌ సరుకుల్లో దాదాపు  70 శాతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. చైనా వస్తూత్పత్తి రంగం ఎంత బలమైనదో అందరికి తెలిసిందే. ఇలా 70 శాతం చైనా వస్తువులతో వాల్‌మార్ట్‌ ఎక్కడ వ్యాపారం చేసిన బాగుపడేది చైనా లేదా వాల్‌మార్ట్‌(అమెరికా) గాని భారత్‌ కాదు. ఒక దేశంలో సంస్కరణలు అవలింబించేటప్పుడు, అదేశానికి ఏ రంగాల్లో విదేశాల నుంచి సహాకారం అవసరం 

ఉంటుందో ఆ రంగాల్లోనే విదేశీ సహాకారాన్ని ఆహ్వానిస్తారు. ఇలా ఆహ్వానించబడిన కంపెనీలు కూడా స్వదేశీ కార్మీకులకే ఉద్యోగం కల్పించాలి. అలా ఆహ్వానించినప్పుడే ఏ దేశానికైనా ఉపయోగం ఉంటుంది.  విదేశీ పెట్టుబడుల ద్వారా దేశంలో పారిశ్రామిక ఉత్పాదన పెంచేదై ఉండాలి. సంస్కరణలు జాతిని ఉద్దరించాలి కానీ పరాయి దేశాలకు జాతికి తాకట్టుపెట్టడం కాదు. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులను మనదేశంలోకి అనుమతిస్తే ఇక్కడ జరిగేది అదే. 

విదేశీ పెట్టుబడిదారులకు మనం విశ్వాసం కలిగించాలని, అప్పుడే విదేశీ పెట్టుబడులు మనదేశానికి వస్తాయని ప్రధాని అంటున్నాడు. విదేశీ పెట్టుబడిదారులేమన్నా శారీరక,మానసిక వికలాంగులా? లేక వారు భారత సమాజంలో సాంఘీక అసమానతలకు లోనవుతున్నారా? వారిలో ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించడానికి. పెట్టుబడిదారుల అదుపాజ్ఞలతో నడుస్తున్న బహుళజాతి కంపెనీలు దేశాన్ని దోచుకోవడానికి ప్రవేశిస్తుంటే వాటని నివారించాల్సిందిపోయి వారికి ఎర్రతివాచీలు పరిచి స్వాగతించడం ఎవరి ప్రయోజనాలకోసం ప్రధానే సెలవివ్వాలి. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారతదేశంలో సంస్కరణలు ఇంకా వేగవంతం కావాలని తన అవేదనను వ్యక్తం చేశాడు. అంటే అమెరికా కంపెనీలకు మనదేశంలో ప్రవేశం కల్పించాలని ఆయన కోరాడు. ఆర్థిక మాంధ్యంలో చిక్కుకున్న తన దేశాన్ని ఈ బహుళజాతి కంపెనీలు బయట దేశాలతో వ్యాపారం నిర్వహించి ఆర్థిక మాంధ్యం నుంచి గట్టెకించాలని ఆయన కోరుతున్నాడు. అమెరికా పెద్దన్న మాటలకు తలొగ్గిన మన ప్రధాన్ని స్వపక్షం నుంచి  విపక్షలానుంచి తుదకు దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పటికీ వెనక్కితగ్గడం లేదు. విదేశీ పెట్టుబడులు మన దేశాభివృద్ధికి, మన ప్రజలకి ఏ విధంగా, ఎంతవరకు ఉపయోగపడుతోందో అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కానీ, మరో దేశపు వత్తిడికి తలొగ్గి మన దేశాన్ని తాకట్టులో పెట్టరాదు. 

విదేశీ వస్తువులకు వ్యతిరేకంగా, పాలనకు వ్యతిరేకంగా దేశం యావత్తు పెద్దఎత్తున పోరాటం నిర్వహించిన చరిత్ర మనది. అట్లాంటీ నేలపైకే విదేశీ కంపెనీలకు ఎర్రతివాచీలు పరిచి స్వాగతం పలకడం స్వాతంత్రోద్యమాన్ని, పోరాట నాయకత్వాని కించపడచడమే అవుతుంది.  గాంధీ సిద్ధాంతపై నిర్మించబడ్డ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌, మరీ గాంధీ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి బహుళజాతి సంస్థల ముందు మోకాలముందు నిలబడడం ఏ వారసత్వమో దేశ ప్రజలకు చెప్పాలి. గతంలో ఫ్రెంచివారు, తర్వాత ఇంగ్లీషువారు ఇలానే వ్యాపారంతో మొదలుపెట్టి తర్వాత పాలకులైన ఉదంతం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్కరణల పుణ్యమా అని మళ్ళీ విదేశీ బహుళజాతి కంపెనీలకు మన భూములను, వ్యాపారాన్నీ అప్పగించడం మన సార్వభౌమత్వాన్ని తాకట్టు పెటడమే అవుతుంది.

No comments :

Post a Comment