అవినీతిపై సమరం సమగ్రమేనా?

No comments
దేశానికి స్వాతంత్య్రం తేవడానికి ఏర్పడిందం టున్న కాంగ్రెస్‌ పార్టీ నిజానికి 1920ల వరకూ సంపూర్ణ స్వాతంత్య్ర నినాదం ఇవ్వలేదు. అప్పటి వరకూ ఉద్యమం రాయి తీల కోసమే జరిగింది. ఆతర్వాత అతివాదుల ప్రాబల్యం, కమ్యూని స్టు విప్లవకారుల ఉద్యమవ్యాప్తి కాంగ్రెస్‌ పార్టీని (గాంధీని) సంపూర్ణ్ణ స్వతంత్య్ర నినాదం ఇచ్చేలా చేశాయి. నేటి గాంధీగా చెలామణి అవుతున్న అన్నా హజారే,ఆరవింద్‌ కేజ్రీవాల్‌లు చేస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమం కూడా అలాంటిదే. డబ్బుఇచ్చిపుచ్చుకోవ డమే అవినీతిగా ప్రస్తుతం అంతా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ తరుణంలోఅవినీతికిచెంది న అనేక రూపాలను చర్చించు కోవలసిఉంది. ప్రజందరూ సమానులే, అంతస్తు, కుల మత ప్రాంతీయ అసమానతలు సమాజంలో ఉండరాదని అంగీకరించినట్లయితే, అందుకు వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యవస్థలు వ్యవహరిస్తే, అది సామాజిక, పాలనాపర అవినీతి కిందికి రాదా? అవినీతి అన్నిరంగాల్లో ఉన్నదనీ, ఒక్క లంచంపుచ్చుకోవడమే అవినీతి కాదని అంగీకరిస్తే, ఇతర రూపాలలోని అవినీతిపెై పోరాట దృక్పథాన్ని కలిగి ఉండాలన్న నియమం అమలులోకి వస్తుంది. అవినీతిపెై పోరాటం చేస్తున్నవాళ్ళు ఇతర సామాజిక అవినీతులను వ్యతిరేకించక పోవడం, వ్యతిరేకించినా మొక్కుబడి ప్రకటనలతో సరిపెట్టడం దేనికిందకు వస్తుంది?

అది సంపూర్ణ అవినీతివ్యతిరేక ఉద్యమం కాగలదా? పాలకులు పంట భూముల్ని రెైతుల్నుండి లాక్కొని అభివృద్ధి పేరుతో విదేశీ పరిశ్రమలకు ఇచ్చేస్తున్నారు. రెైతు దేశానికి వెన్నెముక అని గాంధీ చెప్పిన సూక్తిని నమ్మితే, నియమగిరి వేదాంత, పోస్కో జగత్‌పూర్‌, నొయిడా భూముల కైవసం, సోంపేట కాల్పులు తదితర సమస్యలపెై పోరాడకపోయినా కనీసం మద్దతుగా ప్రకటన చేయాల్సి ఉంది. కాని అవేవీ మన పౌర సమాజ నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వీళ్ళిక్కడ నిరాహారదీక్ష జరుసాగిస్తున్న కాలంలోనే జగత్‌సింగ్‌పూర్‌లో పోస్కో వ్యతిరేక ఉద్యమాన్ని స్థానికులు కొనసాగించారు. వారి గురించి ఒక్క ముక్క పౌరసమాజ నేతలు మాట్లాడింది లేదు. వీరిలో స్వామి అగ్నివేశ్‌కు తప్ప ఎవరికీ జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లలో గిరిజనుల దుర్భరపరిస్థితి గురించి ఆలోచన ఉన్నట్లు దాఖలాలు లేవు. చత్తీస్‌గఢ్‌లో పోలీసుల ముట్టడిలోఉన్న గ్రామస్థులకు స్వామి అగ్నివేశ్‌ అన్నపానీయాలు తీసుకెళ్తుంటే ఆయనపెైన దాడిచేసి వాటిని నేలపాలు చేశారు పోలీసులు. స్వామి అగ్నివేశ్‌పెై జరిగిన దాడిపెై విచారణ జరపాలని అన్నా బృందం ఒక్క డిమాండ్‌ ఎందుకు చేయలేదు?పోస్కో ప్రాజెకుకు వ్యతిరేకంగా స్థానికంగా పదిగ్రామాలకుపెైగా ప్రజలు గత ఆరు సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారు. వారికి సానుభూతిగా ఏఒక్క పౌర సమాజ కార్యకర్త రాలేదు.

శ్రీకాకుళం జిల్లా సొంపేటలో, తమ భూముల్లో ధర్మల్‌ప్రాజెక్టు కట్టడాన్ని వ్యతిరేకిస్తున్న వారిపెై పోలీసులు లాఠీచార్జీ, కాల్పులు జరిపి ఇద్దర్ని చంపేశారు. గత కొన్ని రోజుల క్రితమే ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నోయిడా రెైతులపెై కాల్పులు జరిపించి ఇద్దరు రెైతుల్ని బలి తీసుకుంది. లాఠీచార్జీ, కాల్పులు సాగించినా, వారి ఆందోళన పౌరసమాజ కార్యకర్తలకు పట్టదు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అన్నా కానీ, కేజ్రీవాల్‌ కానీ అవినీతిపెై సమరం అంటే అటువంటి సమరానికి అర్థం ఉంటుందా? అది పాక్షిక అవినీతి పోరాటమే తప్ప సంపూర్ణ అవినీతి పోరాటం కాగలదా?పెట్టుబడుల్లో వాటాలు పొంది భూముల్ని విదేశీ, స్వదేశీ కంపెనీలకు ఇచ్చేయ్యడం అవినీతి కాదా? అవినీతిపెై సమరం చేస్తామని చెబుతున్నప్పుడు అన్ని రంగాల్లోని అవినీతి పరిగణలోకి రావాలి. అన్నాబృందాని కి జన్‌లోక్‌పాల్‌ బిల్లును అంగీకరిస్తే అంతా ముగిసినట్టే. దానిలో కూడా కొన్ని సవరణలు చేసి ఆమోదించడానికి భూమిక తయారవుతోంది. ఇక దానితో అవినీతిపెై సమరం ముగి సినట్టేనా? అవినిపెై యుద్ధం దీర్ఘకాలికమైనది. ప్రజలంతా దానికి సహకరించాలి. అటువంటి సమ స్యను ఒక్క జన్‌లోక్‌పాల్‌ బిల్లుతోనే అంతం చేస్తామని భావించడం సబబు కాదు.

ఇప్పుడు అవినీతి ఉద్య మానికి వస్తున్న స్పందనకంటే విస్తృత స్థాయి సమీకరణ, సహాకారం దానికి అవసరం. కేవలం పట్టణ మధ్యతర గతితో గ్రౌండు నిండిపోవడంతోనే ‘మా ఉద్యమం అయిపోదు, భూము లు లాక్కోవడంపెై కూడా’ అని ఒక ముక్తసరి ప్రకటన ఇచ్చినంత మాత్రాన అది చిత్తశుద్ధి కానేరదు.ఇక పౌరసమాజ కార్యకర్తల్లో రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమకారులు ప్రముఖ భూమిక పోషిస్తున్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ‘ప్రతిభను రక్షించండి’ అన్న నినాదంతో పుట్టింది. ఈ దేశంలో ప్రతిభ ఏవర్గాల సోత్తో కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అన్ని సౌకర్యాలతో పెరిగి ప్రతిభ సంపాదించిన వారితో- గ్రామల్లో తరతరాల బానిసత్వంతో, సామాజిక అణచివేతకు గురవుతున్నవారిని పోటీ పడమని చెప్పడం ఏ నీతికి ప్రతీక? ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలలో ఇప్పటికీ 70 శాతం మంది అగ్ర కులస్థులేనని ఇటీవలి ప్రభుత్వసర్వే తెలిపినట్టు పత్రికలు పేర్కొన్నాయి. రిజర్వేషన్లు ఉండబట్టి ఒక మేరకు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశాలు వస్తున్నాయి తప్ప, లేకుంటే అవీ రావు. ఆ రిజర్వేషన్ల అమలులో కూడా లొసుగులతో నిండి ఉంటుంది.

కులపరమైన అణచివేత ఈ దేశంలో అమలులోఉన్న అతిపెద్ద అవినీతి. బ్యాంకుల్లో, ఎల్‌ఐసిలో అగ్రకులస్థులదే అధిపత్యం. చిత్రం ఏమిటంటే, ఎల్‌ఐసీలో వామపక్ష పార్టీకి అనుబంధంగాఉన్న అతిపెద్ద యూనియన్‌లోకూడా అగ్రకులస్థులదే ఆధిపత్యం. ప్రమోషన్లు ట్రాన్స్‌ఫర్లు మొదలెైన వాటిపెై యూనియన్‌ నాయకులుగా వీరి మాటే చెల్లుబాటు అవుతుంది. ఆ నిర్ణయాలు ప్రధానంగా అగ్రవర్ణం వారికే అనుకూలంగా జరుగుతాయి. ఎదుటివారూ తమలాగే మనుషులని అంగీకరిస్తూనే, ఒక కులంలో పుట్టినందుకు వారితో సామాజిక కార్యక్రమాలకు అంగీకరించకపోవడం, అద్దెకు ఇళ్లు ఇవ్వకపోవడం, పెళ్ళిళ్ళకు పేరం టాలకు నిరాకరించడం- ఇవన్నీ సామాజిక అవినీతి కిందకు వస్తాయి. డిగ్రీలు, పిజీలు, ఐఎఎస్‌, ఐపిఎస్‌లు చదివికూడా కులఅహం కారంతో కొట్టుమిట్టాడడం అతి పెద్ద సామాజిక అవినీతి. ఈ అవినీతి గురించి ఆ ఉద్యమ కార్యకర్తలు ఎందుకు మాట్లా డరు? అరవింద్‌ కేజ్రీవాల్‌ అటువంటి రిజర్వేషన్‌ వ్యతిరేక, ప్రతిభా పరిరక్షక ఉద్యమానికి నాయ కత్వం వహించి నవాడిగా ఏఅవినీతిపెై పోరాడుతు న్నట్లు?

ఇన్నాళ్ళూ దేశాన్ని ఏలింది ఈ సోకాల్డ్‌ అగ్రకులంవారే. వీరే గత 66 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తూ వచ్చారు. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ, పత్రికారంగం- ఇవి నాలుగూ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని చెప్పుకుంటున్నాం. ఈ నాలుగు రంగాలలోనూ ఇన్నాళ్ళూ అగ్రకులంవాళ్ళే అధిపత్యం వహిస్తున్నారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ మాటల్లో చెప్పా లంటే- ఇన్నాళ్ళూ దేశాన్ని ప్రతిభగలవాళ్ళే పాలించారు. మరి 66 సంవత్సరాల భారత దేశం అవినీతిలో ఎందుకు కూరుకున్నట్లు? అన్నా హజారే అన్నట్లు, ఇప్పటికీ నిజమైన స్వాతంత్య్రం ప్రజలకి ఎందుకు సమకూరనట్లు? వ్యవస్థను ఆమూలాగ్రం మార్చుకుంటే తప్ప అవినీతి అంతం కాదని అన్నా హజారే ప్రకటించిన స్థాయిలో భారతదేశం ఎందుకున్నట్లు? న్యాయవ్యవస్థలో లక్షలకోట్ల కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నట్లు? ప్రతిభ ఉన్నవాళ్ళ పాలనలో ప్రభ ుత్వరంగం ఎందుకు విఫలమైనట్లు?
గ్రామంలో ప్రతి కులంవాడు ఎవరి పని వారు చేసినట్లయితే అటువంటి గ్రామాలు స్వయం పోషకాలు అవుతాయని, అటువంటి గ్రామాలు ఆదర్శ గ్రామాలనీ మహాత్మ గాంధీ ప్రబోధించాడు.

భగవద్గీత ప్రభోధించిన వర్ణాశ్రమ ధర్మాన్ని మహాత్మా గాంధీ ఆమూలాగ్రం సమర్ధించాడు. అటువంటి గాంధీకి అనుచరుడిగా ఉన్న అన్నా హజారే నుండి ఈ దేశంలో 70 శాతం పెైగాఉన్న దళితులు, వెనుకబడ్డ కులాలవారు ఏ న్యాయాన్ని ఆశించగలరు? ఆ గాంధీ వర్ణాశ్రమ ధర్మాన్ని పుణికి పుచ్చుకున్న సంస్థలకు సానుభూతిపరుడుగా ఉన్న అన్నా హజారే, ఏ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు? ఏ నీతిని సమర్థిస్లున్నట్లు?అంతెందుకు? గుజరాత్‌లో ముస్లిం ప్రజలను ఊచకోత కోసిన నరేంద్రమోడి పాలనను అద్భుతమైనదని మెచ్చుకున్న అన్నా హజారేకి ‘సరెైన పాలన’ అంటే అవగాహన ఉన్నదా? గుజరాత్‌ అభివృద్ధి చెందినదని ఒకటే రొద. ఏమిటా అభివృద్ధి? విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించగలగడమే అభివృద్ధిగా పాలకవర్గాలు చెలామణి చేస్తున్నాయి. అటువంటి అభివృద్ధే గుజరాత్‌లో జరుగుతోంది. అన్నా తన ప్రసంగాల్లో ‘వ్యవస్థ మారనిదే ప్రయోజనం లే’దని చెబుతున్నారు. అదే నిజమైతే ఈవ్యవస్థ మారడానికి ఆయన బృందం ఎందుకు కృషి చేయదు? లోక్‌పాల్‌ బిల్లును సాధించడమే ఏకైక కర్తవ్యంగా ఎందుకు పరిమితమైనట్ల్లు?

కులవ్యవస్థ సమాజం నుండి తొలగిపోలేదు.చదువు పెరిగేకొద్దీ కొత్త రూపాల్లో కుల వ్యవస్థ ముందుకొస్తోంది. గ్రామాల్లో సామూహిక హత్యలు, సంఘ బహిష్కరణలు, రెండు గ్లాసుల ఆచరణలు అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి.
ఇటువంటి పరమ అసమాన వ్యవస్థలో రిజర్వేషన్లు అవసరం లేకుండా ఉంటుందనీ, ప్రతిభ ఆధారంగా చదువు, ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యమం చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌ సామాజిక అవినీతి పల్లకీని మోస్తున్నవాడు కాదా?సమాజంలోని చెడులన్నీ ఏదో ఒక అనెైతికత నుండీ, అవినీతి నుండి ఉద్భవిస్తున్నవే.కనుకనే అవినీతిని అంతం చేయాలనుకున్న వారు వ్యవస్థ మూలాలపెైనే పోరాటం చేయవలసి ఉంటుంది.ఎన్నుకున్న సమస్యలపెై సమర శంఖం పూరించాలంటూ ఉద్యమం ప్రారంభిస్తే అది వారు చెప్పిన అవినీతి సమస్యను కూడా పరిష్కరించలేదు. చెైనాలో ఉరిశిక్షలు వేస్తున్నా అవినీతి కొనసాగుతోంది. ఇండియాలో జన్‌లోక్‌పాల్‌ బిల్లు వచ్చినా అదే పరిస్థితి. కాకుంటే ప్రజల నెత్తిన మరోక నిరంకుశ పాలనా వ్యవస్థ వచ్చి కూర్చుంటుంది.

No comments :

Post a Comment

అగ్రవర్ణ పాలకుల కుట్ర !

No comments

ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంధ్ర ప్రభుత్వం ఈ మధ్య రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి విఫలం అయింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ బుద్దులు దేశ ప్రజల ముందు నగ్నంగా ప్రదర్శితమయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ, శివసేన పార్టీలు బిల్లుకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నాయి. కోల్‌-గేట్‌ కుంభకోణాన్ని సాకుగా చూపి ప్రయోషన్ల బిల్లుకి బి.జె.పి మోకాలడ్డింది. ''ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడం వలన జూనియర్లు సీనియర్లవుతారు. ఇదేం జోకా? ప్రభుత్వ పాలనే జోకైపోయింది'' అని మూలాయం ఎస్సీ,ఎస్టీల జీవితాలపై పరిహాసమాడాడు. నలభై యేళ్లు కూడా నిండని తన కొడుకుని దేశంలోని అతిపెద్ద రాష్రానికి ముఖ్యమంత్రిగా రుద్దిన ములాయం అగ్రకుల సినియర్లపై, ఎస్సీ,ఎస్టీ జూనియర్లు పెత్తనం సాగిస్తారని తెగ ఆందోళన పడ్డాడు. కోడలిని పోటీలేకుండా పార్లమెంటుకి ఎంపిక చేసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థనే పెద్ద జోక్‌గా మార్చిన ములాయం, న్యాయబద్దమైన చట్టాన్ని జోకుగా చెప్పేందుకు బరితెగించాడు. ఈ బిల్లు సందర్భంగా అగ్రవర్ణాల ఓట్ల కోసం ఒక పార్టీ,  హిందూ ఓట్ల కోసం మరోక పార్టీ ఈ బిల్లును అడ్దుకోవడమే కాక, తమ కుల దురహంకారాలను కూడా నిస్సిగ్గుగా బైట పెట్టుకున్నాయి.

ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం తలపెట్టిన బిల్లు సమావేశాల చివరి రోజుల్లో ప్రవేశపెట్టడమే ఆ పార్టీ చిత్తశుద్దిని తెలుపుతోంది. ప్రమోషన్ల బిల్లుని ఈ సమావేశాల్లో ఆమోదం పొందడం కష్టమని మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ప్రకటించడమే దీనికి రుజువు. కోల్‌గేట్‌ కుంభక్షోణానికి సంబంధించి ప్రధాని రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌కి  తలొగ్గితే ఎస్సీ,ఎస్టీ ప్రమోషన్‌ బిల్లుపై చర్చకు సిద్ధమని బి.జె.పి ప్రకటించడం బి.జె.పి మార్కు మోసం. ప్రమోషన్ల బిల్లుపై చర్యకు అనుమతీస్తే కోల్‌-గేట్‌ డిమాండ్‌కి వచ్చే నష్టం ఏమిటట? ప్రమోషన్ల బిల్లుపై చర్చ జరిగితే కాంగ్రెస్‌ పార్టీ కోల్‌-గేట్‌ కుంభకోణం నుంచి బైటపడుతుందా? కేవలం ఒక న్యాయమైన బిల్లు చట్టంగా మారే అవకాశం ఇచ్చినంత మాత్రాన బి.జె.పి పోరాట పటిమ మొద్దుబారుతుందా?

భారత దేశ బ్యూరోక్రటిక్‌లో ఒక మెట్టు ఎక్కడానికి అవకాశన్నిచ్చే ముఖ్యమైన,న్యాయమైన బిల్లు, పాలక,ప్రతిపక్ష ముఠాల రాజకీయ వికృత క్రీడలో పావుగా మారిపోయింది. ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించిన లెక్కల ప్రకారమే 149 సెక్రటరీ స్థాయి అధికారుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎస్సీ వ్యక్తి లేడు. 180 మంది అదనపు కార్యదర్శుల్లో ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీ అధికారులు మాత్రమే ఉన్నారు. ఇక జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారులు 477 మంది ఉంటే ఎస్సీలు 31 మంది(6.5%), ఎస్టీలు 15 మంది(3.1%) మాత్రమే ఉన్నారు. ఇక డైరెక్టర్లు 590 మంది ఉంటే వారిలో ఎస్సీలు 17 మంది (2.9%) కాగా ఎస్టీలు 7గురు (1.2%) మాత్రమే. ఉన్నతాధికారుల లెక్క మొత్తం చూస్తే 1324 మందిలో 50 మంది (3.78%)ఎస్సీలు, 28 మంది (2.11%) ఎస్టీలు మాత్రమే ఉన్నారు. ఎస్సీ ఉద్యోగులు 15%, ఎస్టీ ఉద్యోగులు 7.5% రిజర్వేషన్లు ఉండవలసిన చోట కేవలం 3.7, 2.11 శాతం మాత్రమే ఉండడాన్ని బట్టి ఉన్నత స్థానాలను అక్రమించింది ప్రతిభా సంపన్నులని చెప్పుకుంటున్నవారేనని గ్రహించవచ్చు. ఈ సమాచారం అంతా ప్రభుత్వం ఇచ్చినదే. పార్లమెంటులో చర్చజరుగుతున్న సందర్భంగా పి.ఎం.ఓ సహాయ మంత్రి పి.నారాయణ స్వామి ఈ గణాంకాలు ప్రకటించాడు.

ఇక ఉన్నత పదవుల్లోకి వచ్చే వారిలో అత్యధికులు ఐ.ఏ.ఎస్‌, ఐ.పి.ఎస్‌, ఐ,ఎఫ్‌.ఎస్‌ క్యాడర్‌ వారే ఉంటారు. ఇతర్లు ప్రమోషన్ల ద్వారా ఈ క్యాడర్‌లోకి నేరుగా నియమించిచడతారు. ఐ.ఏ.ఎస్‌ కి సంబంధించి డైరెక్ట్‌ రిక్రూట్లు 2011 మార్చి నాటికి 3251 మంది ఉంటే వారిలో ఎస్సీలు 454 మంది (13.9 శాతం), ఎస్టీలు 240 మంది (7.3 శాతం), ఓబిసీలు కేవలం 420 మంది, (12.9 శాతం) మొత్తం 34.1% మంది  మాత్రమే ఉన్నారు. రాజ్యాంగం నిర్దేశం ప్రకారం 15 శాతం ఎస్సీలు, 7.5 శాతం ఎస్టీలు ఈ టాప్‌ కేడర్లలో నియమించవలసి ఉండగా అలా జరగలేదు. అంటే ఉన్నత స్థానాల్లో రిజర్వేషన్లు సరిగ్గా అమలు జరగడం లేదని గమనించవచ్చు. అంతేకాకుండా ఇతర ఉన్నత, మధ్యస్థాయి స్థానాల్లో ఎస్సీ,ఎస్టీల కోసం రిజర్వ్‌ చేసిన అనేక పోస్టులు నేటికి ఖాళీగా ఉన్నాయి. లోక్‌సభలో గత నవంబర్‌లో వి. నారాయఱ స్వామి చేసిన ప్రకటన ప్రకారం 73 ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో ఎస్సీల కోసం రిజర్వ్‌ చేసిన పోస్టులు 25,034 ఖాళీగా ఉన్నాయి. ఇందులో 4,518 పోస్టుల్లో ప్రమోషన్‌ ఇవ్వడానికి ఎస్సీ అభ్యర్ధులెవరూ అందుబాటులో లేనందున ఖాళీగా పడి ఉన్నాయి. ఇక ఎస్టీ పోస్టులు 28,178 ఖాళీగా ఉంటే 7,416 పోస్టులు ప్రమోషన్ల కోసం అభ్యర్ధులు లేనందువలస ఖాళీగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఖాళీగా పడి ఉన్న పోస్టులను నింపడానికి ప్రమోషన్ల బిల్లు అవసరం అయింది. ఈ బిల్లు వలన  అగ్రవర్ణాలకు చెందిన ప్రతిభాసంపన్నులు కోల్పోతున్న ఉద్యోగాలు ఏమీ లేవు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టంగానే చెబుతున్నారు. అయినా సరే పోస్టులు ఖాళీగా అయినా ఉండొచ్చు గానీ ప్రజలకు సేవలు అందకపోయినా, పరిపాలన కుంటుబడినా పర్వాలేదు గాని ఎస్సీ,ఎస్టీలు ఉన్నత స్థానాల్లో చేరడానికి వీలే లేదు.  ఇలా నియమించడం వల్ల బ్యూరోక్రసిలో ఎస్సీ,ఎస్టీలు ప్రవేశిస్తారని, దీని వల్ల ప్రతిభ దెబ్బతింటుందని అగ్రవర్ణాలు గగ్గోలు పెడుతున్నారు. 

ఈ బిల్లును అడ్డుకుంటున్నారు. రిజర్వేషన్‌ కోటాలో కేటాయించిన పోస్టుల్లో కూడా ఎస్సీ,ఎస్టీలు నియమించకుండా నిరోధించడమంటే ఇది స్పష్టంగా కుల వివక్షతే. మాదిగలు, మాలలు, కొండ జాతులు ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లోకి చేరకుండా నిరోధించే కులవివక్ష. ఓట్ల కోసం రిజర్వేషన్లు ప్రకటిస్తూ, ప్రకటించిన రిజర్వేషన్లు కూడా భర్తీ కాకుండా ప్రయత్న పూర్వకంగా నిరోధిస్తున్న అత్యంత నగ్నమైన కుల వివక్ష.  భారత దేశ పరిపాలనా వ్యవస్థకు ఒక మూల స్తంభంగా ఉన్న బ్యూరోక్రసీలో ఎస్సీ,ఎస్టీలు లేరు. 

ఉన్నవారి చేతుల్లో అధికారం ఉండదు. ఒక వేళ ఉన్నా అది పైఅధికారుల అదుపాజ్ఞలకు లోబడి ఉండవలసిందేనని, తామేమి చేయలేకపోతున్నామంటూ కొందరూ ఎస్సీ,ఎస్టీ ఉన్నతాధికారులు వివిధ సందర్భాలలో తన ఆవేధనను వ్యక్తం చేశారు. అంటే దేశ పాలనా పగ్గాలన్నీ అగ్రకుల ప్రతిభా సంపన్నుల చేతుల్లోనే ఉన్నది తప్ప ప్రతిభ లేదని చెప్పబడుతున్న ఎస్సీ, ఎస్టీ చేతుల్లో లేదని స్పష్టంగా తెలుస్తోంది.

అరవైయారేళ్ల స్వతంత్ర భారతం ప్రపంచంలోని సగం దరిద్రానికి నిలయంగా మగ్గుతోందంటే, శక్తివంతమైన మందులు ఉన్నప్పటికీ బీద గిరిజన జనం ఇప్పటికీ మలేరియా,టైఫాయిడ్‌ జ్వరాలతో చస్తున్నారంటే, మురుగు కాలవల కోసం కూడా అతి చిన్న యూరప్‌ దేశాలముందు దేహీ అంటూ బిచ్చమెత్తుతున్నదంటే, మానవాభివృద్ధి సూచికలో 134వ స్థానంలో, తలసరి ఆదాయంలో 128వ స్థానంలో, విద్యా సూచికలో 147వ స్థానంలో దేశం కునారిల్లుతున్నదంటే, బల్లకింద చేయి తడిపితే తప్ప కార్యదర్శి నుంచి క్లర్కు దాకా పైలు ఒక్క అంగుళం కూడా కదలదంటే, దేశ వనరులను ప్రజలకు ఉపయోగపెట్టకుండా విదేశీ కంపెనీలకు అమ్ముకుని అవి విదిల్చే డాలర్ల మెతుకులను ఎరుకునే పాలకులు ఉన్నారంటే కారణం ఎవరు? దీనికంతటికి ఉన్నత పదవుల్లో ఉన్న అగ్రకుల ప్రతిభా సంపన్నులు కారణం కాదా?.... ఈ దేశం ఎస్సీ,ఎస్టీ,బిసి, ముస్లింల చేతుల్లో లేదు. ఈ దేశం ప్రతిభా! ప్రతిభా! అంటూ గొల పెడుతున్న అగ్రకుల సంపన్నుల చేతుల్లో ఉంది. ఎస్సీ, ఎస్టీలు,బిసిలు ప్రధానంగా శ్రమచేసి దేశాన్ని నిర్మిస్తున్న వర్గాల్లో ఉన్నారు తప్ప పెత్తందారుల్లో లేదు. ఒకరు ఇద్దరు ఆ కోవలో ఉన్నా పెత్తందారులకు సేవకులే. కనుక నేటి భారత దేశ దుస్థితికి కారణం అగ్రకుల సంపన్నులే. కులం కులం అంటూ గోక్కుంటున్న అగ్రకుల పేదలకు కూడా అగ్రకుల ప్రతిభావాదంతో ఒరిగిందేమీ లేదు. 

ఈ ప్రతిభా సంపన్నుల ఆరవైయారేళ్ల ఏలుబడిలో ఈ దేశం ఊడబొడిచింది ఏమన్నా ఉందంటే అది 18 లక్షల కోట్ల విదేశీ అప్పు, 40 లక్షల కోట్ల స్వదేశీ అప్పు. ప్రపంచ బ్యాంక్‌ అప్పు ఇస్తే తప్ప ఈ దేశంలో సిమెంట్‌ రోడ్డు పడని స్థితికి దేశాన్ని దిగజార్చారు. మురుగు కాల్వలు తవ్వాలన్నా నార్వే, హాలాండ్‌ లాంటి అతి చిన్న దేశాల ముందు జోలె పట్టవలసిందే. 75 శాతం వ్యవసాయ భూములు  నీటి పారుదల సౌకర్యం లేక వర్షపు చుక్క కోసం చాతక పక్షుల్లా ప్రతిఏడూ మోరఎత్తి చూడవలసిందే. వీరు ప్రవచించిన ఆధునిక దేవాలయాలు నేర్రెలిచ్చి కారుతోంటే పూడ్వడానికి మళ్లీ ప్రపంచబ్యాంకు పథకాలు కావాలి. ప్రపంచలో సగం దరిద్రం భారతదేశంలోనే నివాసం. దారిద్య్ర రేఖని కిందకి, ఇంకా కిందకి తొక్కేస్తే తప్ప దరిద్రాన్ని తగ్గించలేని దరిద్రం ఈ ప్రతిభా సంపన్నులది. 

భారత దేశమే భారత దేశ ప్రజల చేతుల్లో లేదు. బ్రిటిష్‌ వాడు ఉన్నదాకా వాడొక్కడే ఈదేశానికి ప్రభువు. ఇప్పుడయితే ప్రభువులకు కొదవలేదు. అమెరికా,ఫ్రాన్స్‌,రష్యా,జపాన్‌,జర్మనీ, చీమ తలకాయంత హాలండ్‌, బెల్జీయంలు చివరికి నిన్నగాక మొన్న లేచి నిలబడిన దక్షిణకోరియా కూడా భారత పాలకులకు ప్రభువులే. ఈ దేశాలన్నింటా గొలుసుకట్టులా వ్యాపించి ఉన్న బహుళజాతి కంపెనీలే భారత దేశంతో పాటు అనేక పేదదేశాలకు ప్రభువులు. అరవైయారేళ్ల పాటు ఈ ప్రభువులకు సేవ చేయడంలోనే అగ్రకుల పాలకులు, ప్రతిభావాదులు గడిపారు తప్ప భారత ప్రజలకు సేవ చేయడంలో కాదు. వెలికి తీసిన వనరుల్లో,వినియోగంలోకి తెచ్చిన సంపదల్లో అత్యధిక భాగం విదేశాలకు తరలిపోయింది. వాల్‌స్ట్రీట్‌ బ్యాంకుల్లో, లండన్‌ పైనాన్స్‌ కంపెనీల్లో, స్విస్‌ బ్యాంకుల్లో, ప్యారిస్‌, బెర్లిన్‌,టోక్యో తదితర ఆధునిక నగరాల ప్రవేటు ఆకాశహర్మ్యాలలో భారత దేశ సంపద కుప్పలుగా పేరుకుపోయింది. ఆ కుప్పల నుంచి భారత దేశాంలోకి తిరిగి వస్తున్నదే విదేశీ పెట్టుబడులు. మన డబ్బుని మనం ఎఫ్‌.డి.ఐ, ఎఫ్‌.ఎఫ్‌.ఐల రూపంలో కొద్దిగా విదిలించడానికి దేశ  సార్వభౌమాధికారిన్ని బలితీసుకుంటున్నాయి బహుళజాతి కంపెనీలు.  ప్రతిభా సంపన్నులు చూడవలసింది, ఆవేశపడవలసింది ఈ దోపిడిని చూసి గానీ, ఆరకొర వేతన బతుకుల కోసం అతృత పడుతున్న ఎస్సీ,ఎస్టీ,బిసిలను చూసి కాదు. చేతనైతే తమ ప్రతిభను సరిహద్దు దాటిపోతున్న సంపదను అడ్డుకోవడంలో ప్రతిభావాదులు చూపాలి. భారత ప్రజల చేజారిపోయిన భారత సార్వభౌమాధికారాన్ని తిరిగి ప్రజల చేతుల్లోకి చేర్చడంలో చూపాలి. ఆదివాసుల కాళ్ళకింద ఉన్న ఖనిజవనరులను కొల్లగొట్టడం కోసం సల్వాజుడుంలనూ, రణవీర్‌ సేనలను సృష్టిస్తున్న పాలకుల కుట్రలను నిలవరించడంలో చూపాలి. ప్రపంచ సామాజిక పటంపై దేశాన్ని అట్టడుగు స్థాయిలో నిలిపిన కుల వ్యవస్థను రూపుమాపి సమానత్వం నెలకొల్పడం కోసం తమ ప్రతిభను సానపెట్టాలి. నిస్సహాయ ఆదివాసీ ప్రజలపైనా, ఈనాన్య ప్రజలపైనా లక్షలాది సైనికులతో యుద్ధం చేస్తున్న పాలకుల దురన్యాయాలను ఎదుర్కొవడంలో ప్రతిభను వినియోగించాలి. కూలీ డబ్బులతో, ఖాళీ కడుపులతో, దీక్షలు అవసరం లేని నిరసనలతో, కులాల ఉక్కు సంకేళ్లతో బతుకులీడుస్తున్న బీదాబిక్కి జనానికి దక్కుతున్న కాసిన్ని మెతుకులలో భాగం కోసం పోటీపడే ప్రతిభ అసలు ప్రతిభే కాదని ప్రతిభావాదులు గుర్తించాలి.

No comments :

Post a Comment

అస్తిత్వ సంక్షోభాల అంతరంగ ఘోషకు నోబెల్‌.

No comments
శతాబ్దానికి పైనున్న సాహిత్య నోబెల్‌ చరిత్రలో ఒక చైనీస్‌ రచయితను అది వరించడం ఇదే ప్రప్రథమం. 1901లో మొదటిసారి సాహిత్య రంగా నికి నోబెల్‌ బహుమతి ఇవ్వడం ప్రారంభించారు. మొదటిసారి ఈ అవార్డు ఫ్రెంచ్‌ కవి, తత్వవేత్త సుల్లీ ప్రూడోమిని వరించింది. సాహిత్యంలో నోబెల్‌ బహు మతి ఇవ్వడం వెనుక ఒక చిన్న చరిత్ర ఉంది. ధన వంతుడైన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌కు మొదటినుంచి సాహి త్యమన్నా కళలన్నా చాలా ఇష్టం ఉండేది. నోబెల్‌ తన దగ్గర ఉన్న డబ్బు మానవాళికి తోడ్పడే రంగాలకు ఉపయోగ పడాలనే ఉద్దేశంతో 1895లో మానవాళి కి ఉపయోగ రంగాల్లో విశేషంగా కృషి చేసిన వారికి నోబెల్‌ బహుమతి ఇవ్వడం ప్రారంభించాడు. అయితే మొదటి నోబెల్‌ ప్రైజ్‌ భౌతిక, రసాయన శాస్త్రం, మెడిసిన్‌, శాంతి రంగాలకు మాత్రమే పరి మితమై ఉండేది. కానీ తదనంతరం దీన్ని సాహిత్య రంగాలకు కూడా ఇవ్వడం ప్రారంభించారు.

ఆ ్‌ఫ్రెడ్‌ నోబెల్‌కు సాహిత్యమంటే అభిమానం ఉండటం తో దానికి నోబెల్‌ బహుమతుల్లో నాలుగవ స్థానం కల్పించాడు. 2012 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్‌ అందుకున్న మో యాన్‌ (57)1955లో తూర్పు మధ్య షాండాన్‌ ప్రావీన్స్‌లో జన్మించాడు. ఆయన అసలు పేరు గుయాన్‌ మోయె. 12 సంవత్సరాల వయసులో చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవంలో పాల్గొనడానికి తన చదువు కూడా మధ్యలోనే వదిలే శాడు. 1976లో పీపుల్స్‌ ఆర్మీలో చేరాడు. సాంస్కృ తిక విప్లవంలో పనిచేస్తూన్న కాలంలో అతనికి సాహిత్యం పట్ల అభిరుచి పెరిగింది. పీపుల్స్‌ లిబరేష న్‌ ఆర్మీలో కొనసాగుతూ ‘మో యాన్‌’ కలం పేరుతో రచనలు కొనసాగించాడు. మో యాన్‌ అంటే ‘మాట్లా డొద్దు’, ‘మౌనంగా ఉండడం’ అని అర్థం. మో యాన్‌ 1981 తన చిన్న కథలు ప్రారంభించాడు. తన తొలి నవల ‘వగరుబోతు’ ను సైైన్యంలో పని చేస్తూ రాశాడు. తన రెండో నవల ‘ఎర్ర జొన్న’ పలు అవార్డు లు అందుకోగా, తద నంతర కాలంలో సిని మాగా రూపొంది ప్రతిష్ఠాత్మక బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ అవార్డును సొంతం చేసుకున్నది.

తన రచనల్లో మో యాన్‌ ఎక్కువగా యవ్వన దశలో అనుభవించిన విషయాలను, అస్తిత్వ సంక్షో భాలను వ్యక్తం చేసేవాడు. తన నవలల్లో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఆదర్శవంతంగా జీవించిన పాత్రలకు ఆయన ఊపిరిపోశాడు. చైనాలోని ప్రాచీ న సాహిత్యాన్ని, జానపద గేయ సంప్రదాయాన్ని సమర్థవంతంగా వాడుకొని కాల్పనిక, చారిత్రక, సామాజిక రచనలు చేశాడు. మో తన రచనల్లో ఎక్కువగా జానపద సాంప్రదాయాన్ని అనుసరించ డంతో ఆయన జానపద మాంత్రికుడుగా మారిపో యాడు. అతనికి అనేక భాషలలో పాండిత్యం ఉండ డంతో ఇంగ్లీష్‌, చైనా, జర్మనీ, స్వీడీస్‌, ఫ్రెంచ్‌ భాషల్లో రచనలు కొనసా గించాడు. 2006లో ఇంగ్లీష్‌లో ‘లైఫ్‌ అండ్‌ డెత్‌ ఆర్‌ వేరింగ్‌ మీ అవుట్‌’ అనే రచన చేశాడు. ఈ రచనలో నల్లజాతి వాళ్ళ పట్ల సమాజం ఏవిధంగా ఎగతాళిని వ్యక్తం చేస్తుందో హృదయ విదారకరంగా రాశాడు.

హింసాత్మకత ఒక స్థాయి నుంచి ఇంకోస్థాయికి ఏ విధంగా మారుతుందో ఆయన ఆ రచనల్లో రాశాడు. అంతే కాకుండా చైనా లో ‘ఒక్క బిడ్డ’ విధానం అమలులోకి వచ్చిన తర్వాత దాని దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయం లో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు . అయితే చైనీస్‌ రచయిత గావో జింగ్జాన్‌కు 2000 సంవత్స రంలోనే నోబెల్‌ బహుమతి దక్కినా అతను ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి ఫ్రాన్స్‌కు వలసపో వడంతో ఆ అవార్డును కమ్యూనిస్టు దేశం తిరస్కరిం చింది. 2012కు సంబంధించి మో రచనా శైలి ‘భ్ర మాజనిత వాస్తవికత’ (హెలూసినేటరీ రియాలిజం) కు ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి లభించింది.

 సూర్య 16-10-12


No comments :

Post a Comment

అణు విలయానికి ఆహ్వానమా?

No comments

ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన, ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం చూపే, పర్యావరణాన్ని కాలుష్యంతో నింపివేసే అణువిద్యుత్‌ కేంద్రాల నిర్మాణాలను నిరసిస్తూ ప్రపంచ వ్యాపితంగానూ ముఖ్యంగా మన దేశంలోనూ వ్యతిరేకత, ఆందోళనలు పెద్దఎత్తున వ్యక్తమౌతున్నాయి. గత సంవత్సరం మార్చినెలలో జపాన్‌ దేశంలో సంభవించిన సునామీ, భూకంపాలకు దైచీ అణువిద్యుత్‌ కేంద్రంలో సంభవించిన వినాశనం ప్రపంచ ప్రజలను ఉలిక్కిపడేట్లు చేసింది. దీనితో అన్ని దేశాలలోనూ అణవిద్యుత్‌ వ్యతిరేక నిరసనాందోళనలు తీవ్రమయ్యాయి. 

ప్రస్తుతం ప్రపంచ వ్యాపితంగా 30 దేశాల్లో 443 అణురియాక్టర్లు విద్యుదుత్పత్తి సాగిస్తుండగా పుకిషిమాలోని అణువిద్యుత్తు కేంద్రాలలోని పరిణామాల అనంతరం వివిధ దేశాలలోని ప్రజల ఆందోళనల ఫలితంగా ఈ కేంద్రాలలో కొన్నింటి మూసివేతలు, మరికొన్నింటి పాక్షిక మూసివేతలు, మొత్తంగా సమగ్ర సమీక్షలకు సిద్దమౌతున్నాయి. దేశ భద్రతను సైతం నడివీధిలో వేలం వేయటానికి సిద్ధపడిన మన పాలకులు మాత్రం మన దేశంలో అణువ్యవస్థ దుర్భేద్యమైనదని ఢంకా బజాయిస్తున్నారు. ఇందుకు పూర్వరంగం అమెరికాతో సహకార అణు ఒప్పందం; అణు ప్రమాద నష్టపూరిత చట్టాలను నిండు పార్లమెంటులో నిస్సంకోచంగా ఆమోదించుకోవటంలో వివిధ పాలక వర్గ పార్టీలన్నీ 'చేయి' కలిపాయి. తదనుగుణంగా వాటి నిర్మాణాలకు పాలకులు వేగిరపడుతున్నారు.

మనదేశంలో 1960లో నిర్మించిన తారాపూర్‌ అణువిద్యుత్‌ కేంద్రం మొదలుకొని ఇప్పటికి మొత్తంగా ఆరు అణు విద్యుత్‌ కేంద్రాలలో 20 అణు రియాక్టర్ల ద్వారా 4780 మెగావాట్ల విద్యుదుత్పాదన జరుగుతున్నది. ఇంకా, మహారాష్ట్రలోని జైతాపూర్‌ (9900 మె.వా) హర్యానాలోని గోరఖ్‌పూర్‌ (2800 మె.వా), గుజరాత్‌లోని మిథివిర్ధి (6000 మె.వా), మధ్యప్రదేశ్‌లోని ఛుట్కా (1400 మె.వా), ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడ (6000 మె.వా) తమిళనాడులోని కూడంకుళం (9200 మె.వా)  అణువిద్యుత్‌ కేంద్రాలు నిర్మాణంలో వివిధ దశలలో నుండగా, మరికొన్ని అణు విద్యుత్‌ కేంద్రాలు ప్రతిపాదనల దశలో వున్నాయి. ప్రజల నిరసన, ఆందోళనల నేపథ్యంలో ఇటీవల పక్షిమబెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం 4800 మె.వా స్థాపిత స్థామర్థ్యంతో తూర్పు మిడ్నపూర్‌ జిల్లా హరిపూర్‌లో నిర్మించ తలపెట్టిన అణువిద్యుత్‌ కేంద్రాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించింది. 

ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని కుడంకుళం అణు విద్యత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసన ఆందోళనలు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో తొలిదశ నిర్మాణం పూర్తిచేసుకున్నది. తిరునెల్వేలి జిల్లాలోని కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రానికి సంబంధించిన ఒప్పందం భారత రష్యా ప్రధాన మంత్రుల మధ్య 1988లో జరిగింది. తొలుత ఈ విద్యుత్‌ కేంద్రాన్ని కేరళ తీరంలో నెలకొల్పాలని ప్రయత్నించినారు కానీ, ప్రజావ్యతిరేకత, ప్రతిఘటనల ఫలితంగా 2003 నాటికి తమిళనాడు తీరంలోని కూడంకుళంలో చివరికి ఖాయం చేశారు.

ఈ అణు విద్యుత్‌ కేంద్రం పట్ల తమిళనాడులోనూ ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని తిరునెల్వేలి, కన్యాకూమారి, తూత్తుకుడి జిల్లాల ప్రజానీకం, వివిధ ప్రజాసంఘాలు ఆదినుండీ తమ భయాందోళనలను, వ్యతిరేకతను వ్యక్తంచేస్తూ వస్తున్నప్పటికీ వాటిని బేఖాతరుచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అణువిద్యుత్‌ కేంద్ర తొలిదశ నిర్మాణాలను కొనసాగించి పూర్తిచేశాయి. 13,700 కోట్ల వ్యయం అంచనాతో నిర్మిస్తున్న ఈ అణు విద్యుత్‌ కేంద్రంలో 1000 మె.వా సామర్థ్యంతో రెండు యూనిట్ల నిర్మాణం దాదాపు పూర్తికావస్తున్నది. మరో ఆరు యూనిట్ల నిర్మాణం జరగవలసివుంది. ఈ సంవత్సరం డిసెంబర్‌లో మొదటి యూనిట్‌లో విద్యుదుత్పాదనకు ఎస్‌.పి.సి.ఎల్‌ సన్నాహాలలో వుంది.

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పిసిఐ) ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రాన్ని తమిళనాడు రాష్ట్రంలోని అధికార ఎఐడిఎమ్‌కె, ప్రతిపక్ష డిఎంకె పార్టీలతో సహా ఇతర పాలక వర్గ పార్టీలన్ని స్వాగతించినవే, సానుకూలంగా వ్యవహరించినవే! తమిళనాడులో అధికారంలోనున్న ఎఐడిఎంకె పార్టీ అధినాయకురాలు జయలలిత ఈ అణువిద్యుత్‌ కేంద్ర నిర్మాణంలో అన్ని రకాలైన భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లూ; ఈ ప్రాంతం 'భూకంప మండలం-2' లో వున్న కారణంగా భూకంపాలకు గురయ్యే ప్రమాదం లేదనీ, నిశ్చితంగా వుండవచ్చుననీ ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కూడా! అయినప్పటికీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు, ఆందోళన కొనసాగింది.

జపాన్‌లోని పుకిషిమా అణువిద్యుత్‌ కేంద్ర విషాద పరిణామాల తర్వాత దేశంలో నిర్మాణంలోవున్న అణువిద్యుత్‌ కేంద్రాలన్నింటితోపాటు కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్ర ప్రాంతంలోనూ మరింత ఆందోళన అధికమైంది. 'అణు విద్యుత్‌  కేంద్ర వ్యతిరేక పోరాట కమిటీ'గా ఏర్పడిన ఈ ప్రాంత ప్రజానీకం ఆగస్టు 15 నాటికే వివిధ గ్రామ సభలు జరిపి, తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. విజ్ఞప్తులు, ధర్నాలు, నిరసనలు ప్రకటించారు. సెప్టెంబర్‌లో వారి ఆందోళనను తీవ్రతరం చేశారు. అణు విద్యుత్‌ కేంద్ర ప్రభావిత ప్రాంతంలోని వివిధ గ్రామాలకు ప్రాతినిధ్యం వహించే 127 మంది ఆందోళన కారులు అణు విద్యుత్‌ కేంద్రాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కూడంకుళం సమీపంలోని ఇందితకరాయ్‌ గ్రామంలో సామూహిక నిరవధిక నిరాహారదీక్ష చేబూని 12 రోజుల పాటు సాగించారు. ఈ ఆందోళనలు సాగిన కాలమంతటా తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాలో విద్యాసంస్థలను బహిష్కరించి విద్యార్థులు ఈ ఆందోళనల్లో భాగస్వాములయ్యారు. ఈ జిల్లాల మత్య్సకారులు తమ జీవనోపాధి అయిన చేపలవేటను ప్రక్కనబెట్టి అణువిద్యుత్‌ కేంద్రాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కుల, మతాతీతంగా ప్రజలంతా ఒక్క గొంతుతో ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఆందోళనకారులతో కూడిన వివిధ ప్రజాసంఘాల, పార్టీల ప్రతినిధి బృందం అక్టోబర్‌ 7వ తేదీన ప్రధానిని కలిసి అణువిద్యుత్‌ కేంద్రాన్ని రద్దు చేయాలనే తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. అణు విద్యుత్‌ కేంద్ర నిర్మాణం పట్ల కేంద్ర ప్రభుత్వం నిశ్చయాత్మకంగా వుండటంతో 'పోరాట సమితి' తన ఆందోళనను ఆక్టొబర్‌ 9 నుండీ తిరిగి ప్రారంభించి ఉదృతం చేసింది. అక్టోబర్‌ 13 నుండి కుడంకుళం అణువిద్యుత్‌ కేంద్రంలో పనులేవి సాగనివ్వకుండా, బయటనుండి కార్మికులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఎవ్వరినీ లోనికి వెళ్ళనీయకుండా దిగ్భందించారు. రోజుల తరబడి ప్రజలు వంతులవారిగా రేయింబవళ్ళూ అణువిద్యుత్‌ కేంద్రానికి దోవతీసే రోడ్లన్నింటిపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 

ఒక వైపు ప్రపంచ వ్యాపితంగా ప్రమాదకరమైన అణువిద్యుత్‌కు వ్యతిరేకంగా ప్రజానీకం అందోళనలు నిర్వహిస్తుంటే భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మాత్రం అణువిద్యుత్‌ను స్వాగతిస్తూ మాట్లాడడం దేశ ప్రజానీకాన్ని విస్మయానికి గురిచేసింది.  అబ్దుల్‌ కలాం కుడంకుళం ప్లాంటును సందర్శించి ప్రభుత్వం తరపునా, కంపెనీ తరపునా వకాల్తా పుచ్చుకుని ప్లాంటులో భద్రతా ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని సర్టిఫికెట్‌ ఇచ్చాడు. సమస్త భద్రతా అంశాలను పరిగణలోని తీసుకుని ప్లాంటు నిర్మిస్తున్నారని,  ప్లాంటు భూకంప కేంద్ర పాయింటుకు 1300 కి.మీ దూరంలో, సముద్ర మట్టానికి 13.5 మీటర్ల ఎత్తులో ఉందని, ప్లాంటుకు సంబంధించిన భద్రత విషయంలో ఆందోళన అనవసరమని సెలవిచ్చాడు. 

జపాన్‌లో భూకంపాలు సహజం. కనుక భూకంపం తట్టుకునేలా ప్లాంటు నిర్మించారు. సునామీని తట్టుకోవడానికి పది మీటర్ల ఎత్తున రక్షణ గోడ నిర్మించారు కానీ సునామి అలలు ఇరవై మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. పుకుషిమా వద్ద విద్యుత్‌ సరఫరా విఫలమైతే ఆటోమేటిక్‌గా  ప్రారంభమయ్యే జరరేటర్లు ఉన్నాయి భూకంపం వచ్చిన వెంటనే ప్లాంటు పనిచేయకుండా ఆగిపొయ్యే ఏర్పాట్లు ఉన్నాయి అయినా పెద్ద ప్రమాదం సంభవించింది. సునామీ అలల ద్వారా వచ్చిన సముద్రనీటిలో జనరేటర్లు నిండా మునిగిపోవడంతో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించబడలేదు. దానితో కూలింగ్‌ వ్యవస్థ పని చేయడం మానేసింది. ఫలితంగా రియాక్టర్లలో ఇంధనం వేడెక్కి కరిగిపోయి బైటికి లీకు కావడంతో పెద్ద ఎత్తున రేడియేషన్‌ వాతావరణంలోకి విడుదలయింది. కుడంకుళం వద్ద ఏ కారణం వల్లనైనా విద్యుత్‌ సరఫరా ఆగిపోతే జనరేటర్లు ఉన్నాయని కలాం తెలిపాడు. జనరేటర్లు మహా అయితే కొద్ది గంటలపాటు మాత్రమే విద్యుత్‌ అందిస్థాయి తప్ప నిరంతరాయంగా సూదీర్ఘకాలం పాటు విద్యుత్‌ అందించలేదు. ఆ తర్వాత ఏమిటన్నది సమాధానం లేదు. ''అంతా సవ్యంగా ఉంది'' అని భరోసా ఇవ్వడం వేరు నిజంగానే అంతా సవ్వంగా ఉండటం వేరు అని పుకిషిమా ప్రమాదం తెలియజెప్పింది పుకిషిమా అణు విద్యుత్‌ ప్లాంటును పనిచేయకుండా చేసి, పూడ్చిపెట్టి, పరిసరాలు శుభ్రం చేయడానికి కనీసం 30 సంవత్సరాలు పడుతుందని జపాన్‌ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. కుడంకుళం వద్ద సైతం అనుకోని ప్రమాదాలు సంభవించవన్న గ్యారంటి లేదు. మన కన్నా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో ముందంజ సాధించిన జర్మనీయే అణు విద్యుత్‌ వల్ల ప్రమాదం లేదని గ్యారంటీ ఇవ్వలేక అణువిద్యుత్‌ వినియోగాన్ని రద్దు చేసుకోగా అంతకంటే మెరుగైన వ్యవస్థలు ఇండియా వద్ద ఉన్నాయని భావించగలమా?

ప్రపంచ దేశాల 'వెనకడుగు' - భారత పాలకుల బరితెగింపు:

ప్రమాదరహితంగా అణువిద్యుత్‌ కేంద్రాల నిర్వహణ సాధ్యంకాదనే విషయాన్ని మనదేశంతో సహా వివిధ ప్రపంచ దేశాల్లో సంభవించిన ప్రమాదాలు నిర్వివాదంగా రుజువుచేస్తున్నాయి. 1984లో రష్యాలోని చెర్నోబిల్‌ అణువిద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రేలుడులో వేలాదిమంది మృత్యువాతపడగా, దాని నుండి వెలువడిన అణుధార్మిక దుష్పలితాలను ఆ దేశ ప్రజలు ఈనాటికీ అనుభవిస్తున్నారు. అనాటి నుండి మొదలుకొని, ఈ సంవత్సరం పుకిషిమా అణువిద్యుత్‌ కేంద్ర విలయం వరకు అణువిద్యుత్‌ కేంద్ర ప్రమాదాల జాబితా చాలా పెద్దదే వుంది. వీటి ఫలితంగా అనాటికి జరిగినే ప్రాణ, ఆస్థి నష్టమేకాక, వాటినుండి వెలువడే అణుధార్మికతతతో ఈనాడేకాగ రానున్న తరాలుకూడా తీవ్ర దుష్బ్రభావాలు ఎదుర్కొనున్నాయి. పుకుషిమా అణువిద్యుత్‌ కేంద్ర వినాశనం అనంతరం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఎఐఇఏ) నిపుణుల బృందంతో నిర్వహించిన అధ్యయనంలో సునామీలాంటి 

ఉత్పాతాల్ని సమర్థంగా కాచుకునే వ్యవస్థ ఇప్పటికింకా ఏర్పాటు కాలేదని తేల్చిచెప్పింది. సునామీ, భూకంపాలవంటి ఉత్పాతాలు సంభవించినపుడు తక్షణ నిర్ణయాలు తీసుకోలేని సంక్లిష్ట అధికార వ్యవస్థలు అవరోధంగా మారాయని తన నివేధికలో పేర్కొంది.

పుకిషిమా ఘోర పరిణామాలనంతరం జపాన్‌, తన దేశంలోని అణు విద్యుత్‌ కేంద్రాలన్నింటినీ పునస్సమీక్ష చేయాలని నిర్ణయించింది. 2022 నాటికి జర్మనీ, తన దేశంలోని అణు విద్యుత్‌ కేంద్రాలన్నింటినీ మూనివేయాలని, 2034 నాటికి దశలవారిగా స్విట్జర్లాండ్‌ తమ దేశంలోని అణు విద్యుత్‌ ఉత్పత్తిని పూర్తిగా ఆపివేయాలని నిర్ణయించుకోగా, అణువిద్యుత్‌ కేంద్రాల నిర్వహణపై ఇటలీలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలంతా వాటి రద్దునుకోరుతూ తీర్పునిచ్చారు. ఈ పరిణామాలనంతరం జపాన్‌ సైతం అణువిద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నది. సెప్టెంబర్‌ 19న జపాన్‌ రాజధాని టోక్యోలో 'అణువిద్యుత్‌కు వీడ్కోలు పలకండంటూ'' 60 వేల మంది పౌరులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. 

వివిధ రంగాలలో ప్రపంచాలనే శాసించే అభివృద్ధిని సాధించామంటున్న అమెరికా, రష్యా, జపాన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర సామ్రాజ్యవాద దేశాలన్నీ తమతమ దేశాలలోని అణువిద్యుత్‌ కేంద్రాలలో సంభవించే ప్రమాదాలనే నివారించలేక చేతులెత్తివేస్తూండటాన్ని మనం గమనించవచ్చు. ఆయా దేశాలలో వీటిపట్ల ప్రజలనుండి వ్యక్తమౌతున్న వ్యతిరేకతల కారణంగా అవి తమ దేశంలోని అణువిద్యుత్‌ కేంద్రాల మూసివేతలకో, పాక్షిక మూసివేతలకో, పునస్సమీక్షలకో పూనుకుంటూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారిస్తున్నాయి. అత్యున్నత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నామన్న దేశాలే కల్పించలేని భద్రతను అణువిద్యుత్‌ కేంద్రాల విషయంలో మన పాలకులు తాము కల్పిస్తామనటం ప్రగల్భాలాలు పలకటమేకాదు. ప్రజలను నిలువుగా వంచించటమే. 

ఈ నేపథ్యంలో మనదేశ ప్రజల అవసరాల కనుగుణమైన దేశీయ విద్యుత్‌ విధానాన్ని రూపొందించాలని, దేశ ప్రజల జీవితాలలో పెను విషాదాన్ని నింపే అణు విద్యుత్‌ కేంద్రాల నిర్మాణాన్ని ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణం సాగిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణాన్ని నిలిపివేయాలని, మన దేశంలో లభ్యమయ్యే ప్రమాద రహితమైన జల,వాయు, సూర్యరశ్మి, గ్యాస్‌ తదితర వనరులపై అధారపడి విద్యుత్‌ అవసరాలను అందుకోవాలని విద్యుత్‌ను ప్రజా అవసరాలకు రైతాంగాని, దేశీయ పరిశ్రమలకు ప్రాధాన్యతా క్రమంలో అందించాలని డిమాండ్‌ చేస్తూ ప్రజలు, ప్రజాతంత్ర వాదుల, దేశభక్తియుత శక్తులు ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
                                                                                                                                                                                    సూర్య 09-10-2012


No comments :

Post a Comment