మూడు దశాబ్దాల తెలుగుదేశం

No comments
గతమెంతో ఘనం
ఆశ నిరాశల మధ్య వర్తమానం
ఎన్టీఆర్‌ విప్లవాత్మక చర్యలు
చంద్రబాబు సంస్కరణల పాలన
తొమ్మిదేళ్ల అధికార వియోగం
పాదయాత్రతో ఆత్మ విశ్వాసం 
తెలుగుదేశం పార్టీది మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం. పుట్టుకతోనే ప్రభంజనాన్ని సృషించిన ఆ పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఉత్తాన పత నాలను చవి చూస్తూనే కనీవినీ ఎరుగని అఖండ విజయాలను సాధించింది. అదే స్థాయిలో ఊహిం చని పరాజయాలను, అంతుపట్టని సంక్షోభాలను ఎదుర్కొంది. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీటవేసి చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటింది. అయితే ఇదంతా గత చరిత్ర గానే చెప్పుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు తిరుగేలేని తెలుగుదేశం పార్టీకి నేడు ఎంత తిరిగిన ఫలితం దక్కడం లేదు. మూడు దశాబ్దాల కాలంలో దాదాపు సగం కాలం అధికారంలో మిగతా సగం ప్రతి పక్షంలో కొన సాగింది. అప్పట్లో ఉన్న రాష్ర్ట ఆర్థిక పరిస్థితిని గట్టేక్కించేందుకు ఆర్థిక సంస్క రణలు అమలుచేసి విప్లవాత్మక మార్పులకు స్వీకారం చుట్టామని, తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించి అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయామని చెప్పుకున్నా ప్రజలు మాత్రం గత 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంచారు.


అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలం రాష్ట్రాన్ని అభివృద్ధివైపు తీసుకెళుతున్న క్రమంలో కొన్ని పొరపాట్లను చేశామని వాటిని సవరించుకున్నామని పార్టీ అధినేత ఎన్నిసార్లు వివ రించినా ప్రజలు అధికార పగ్గాలకు దూరంగానే ఉంచారు. కానీ ఈ మధ్య కాలం లో చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహిచిన పాదయాత్ర పార్టీ బలోపేతానికి ఉపయోగపడిందని, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని ఈసారి అధికారంలోకి రావడం తథ్యమని తెలుగుదేశం శ్రేణులు ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈమధ్య నిర్వహించిన పాద యాత్రతో ఉత్సాహం మీద ఉన్న తెలుగుదేశం పార్టీ, వచ్చే ఎన్ని కల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు, ప్రజలకు చేరువయ్యేందుకు, గతాన్ని సమీక్షించుకు నేందుకు ఈనెల 27,28 తేదీలో గండిపేటలో మినిమహానాడును నిర్వహించుకో బోతుంది. ఈ సందర్భంలో 30 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం.



ఆంధ్రప్రదేశ్‌ అవతరించినప్పటినుంచి 1982 వరకు రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఏలుతూ వస్తున్నది. చీకటి పాలనకు విసిగి వేసారిపోయిన ప్రజలు దేశం మొత్తం కాంగ్రెస్‌ను విసిరి అవతల పారేస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. గంపెడాశతో గద్దెనెక్కించిన ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ నిరాశా, నిస్పృహలే మిగిల్చింది. మాటిమాటికి ముఖ్యమంత్రులను మారు స్తూ, వారిని అవహేళనచేస్తూ కీలుబొమ్మలుగా ఆడిస్తున్న రోజుల్లో కాంగ్రెస్‌ పాలన పై యావగింపు. ఓట్లేసి గెలిపించిన నేతల తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్ప డింది. పరిపాలనను అస్తవ్యస్తంగా మార్చివేస్తూ, సంక్షేమాన్ని గాలికొదిలేసి సీల్డు కవర్‌ ముఖ్యమంత్రులను నియమిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతుంటే ప్రజల్లో నైరాస్యం ఆవరించింది. పాలిత కాంగ్రెస్‌పై ప్రజల్లో ఆగ్ర హం అలుముకుంది. ఏం చేయాలో తెలియని ఆయోమయం. నిస్సాహయత. ఒక సమర్ధుడైన నాయకుడికోసం ఎదురుచూపు. ఒక బలీయమైన రాజకీయ పార్టీకోసం కలవరింతలు చేస్తున్న కాలంలో 1982 మార్చి 21, మద్రాస్‌లోని టి.నగర్‌లో ఒక ఉదయాన నందమూరి తారకరామారావు తన మనసులోని మాట బయట పెట్టాడు. రాజకీయాల్లోకి రావాలని ఉందని. ప్రజలకు సేవచేయాలనే సత్‌సంకల్పాన్ని ప్రక టించారు.



ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశం రాజకీయ రంగంలో ప్రకంపనలు రేపింది. తన మనసులో మాట ప్రకటించిన ఎన్టీఆర్‌ వారంరోజులు తిరక్కుండానే 1982 మార్చి 29న హైదరాబాద్‌లో న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి తన రాజకీయ ప్రవేశాన్ని స్పష్టం చేశాడు. స్వంతంగా పార్టీని ఏర్పాటు చేసి, పార్టీపేరు తెలుగుదేశం అని ప్రకటించాడు. పార్టీని ఏర్పాటుచేయడమే ఆల స్యంగా చైతన్యరథాన్ని ఊరువాడ తిప్పాడు. రాత్రింబవళ్లు, అలుపెరగకుండా ఆరు పదుల వయసులో ఊరువాడ తిరిగి ప్రజల మనసులో స్థానాన్ని సుస్థిరం చేసు కున్నాడు.ఎన్టీఆర్‌‌‌ రాజకీయ ప్రవేశాన్ని మొదట్లో ఆషామాషీ వ్యవహారంగా తీసు కున్న కాంగ్రెస్‌ తమ పార్టీ ముందు ఏపార్టీ నిలువజాలదని, ముఖానికి రంగులేసుకునే వాడివల్ల ఏమౌతుందిలే అని తనకుతానూ సర్థిచెప్పుకుంది. అప్పటి కమ్యూనిస్టులు కూడా ఎన్టీఆర్‌ శక్తిసామార్ధ్యాలపై సందేహాలు వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య సైతం కాంగ్రెస్‌ను ఢీకొని విజయం సాధించడం ఎన్టీఆర్‌‌‌ వల్ల ఏమౌతుందిలే అనే అపనమ్మకంతో ఉన్నారు. కానీ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు నాయకుల వ్యాఖ్యలను పరిహాసం చేస్తూ రాష్ట్రాన్ని తెలుగు దేశమనే రాజకీయ సునామి చుట్టుముట్టేసి, 1983 జనవరి 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఘనవిజయం సాధించింది. సంప్రదాయకంగా వస్తున్న ప్రమాణస్వీకారోత్సవాన్ని ధిక్కరించి, ప్రజలకే జవాబుదారి అని ఎన్టీఆర్‌ 1983 జన వరి 5న హైదరాబాద్‌లోని లాల్‌బహుదూర్‌ స్టేడియంలో అశేష ప్రజల సమక్షంలో అధికార పగ్గాలు చేపట్టారు. 



ఎన్టీఆర్‌ అధికారంలోకి వచ్చాక పరిపాలనలో విప్లవాత్మకమైన అనేక మార్పులకు స్వీకారం చుట్టాడు. పటేల్‌, పట్వారి వ్యవస్థను రద్దుచేసి, ప్రజల వద్దకే పరిపాలనను తీసుకురావడానికి మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. అప్పటి వరకు ఉన్న తాలూకా వ్యవస్థను రద్దుచేసి వాటిస్థానే మండల వ్యవస్థను తీసుకొచ్చాడు. సంక్షేమమంటే ఏమిటో ఎరుగని రాష్ట్రాన్ని సంక్షేమ బాట పట్టించాడు. పేద ప్రజ లకు కోసం రెండు రూపాయల కిలో బియ్యం. జనతా వస్త్రాల పంపిణీి, రైతులకు రుణమాఫీ, జోగిని వ్యవస్థ రద్దు, మహిళలకు ఆస్థిలో సమాన వాట, విద్యా ఉద్యో గాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వంటి పథకాల ద్వారా ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఎన్టీయార్‌ సంక్షేమ పథకాల వల్ల ఒక వర్గం ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటున్నాడో అదే సమయంలో కొన్ని వర్గాలను కూడా దూరం చేసుకోవాల్సి వచ్చింది. పటేల్‌, పట్వారి వ్యవస్థ రద్దు, రిటైర్‌మెంట్‌ వయసును 55 సంవత్సరాలకు తగ్గించడం వంటి నిర్ణయాల వలన తాత్కాలికంగా కొన్ని వర్గాలకు దూరం కావాల్సి వచ్చింది. 



ఒకవైపు ఎన్టీఆర్‌‌‌ తెలుగువారి మనసుల్లో స్థానాన్ని సుస్థిర పరుచుకుంటున్న కాలంలోనే ఎన్టీఆర్‌ వ్యవహార శైలి కొంతమంది నేతలకు ఇబ్బందికి గురిచేసింది. తెలుగుదేశం పార్టీ అంటే తానేనని, తనతో పుట్టిన పార్టీ తనతోనే అంతమౌతుందనే ధోరణితో ఎన్టీఆర్‌‌‌ వ్యవహరిస్తున్నాడని, పార్టీ నిర్మాణంలో ఎన్టీఆర్‌‌‌కు చేదోడు వాదోడుగా ఉన్న నాదెండ్ల భాస్కరరావ్‌ నేతృత్వంలో తిరుగుబాటు జరగడంలో 1984 ఆగస్టు 16న ఎన్టీఆర్‌ అధికారం కోల్పోయారు. కలలో సైతం ఆయన ఊహించని పరిణామం ఆయనను ఆశనిపాతంలాతాకింది. అప్పటికే ఎన్టీఆర్‌ పట్ల ప్రజల్లో ఆదరణ పాలు బాగా పెరుగుతున్న కాలంలో ఎన్టీఆర్‌‌‌ను పదవీచ్యుతిడిని చేసిన తీరే ప్రజలకు నచ్చలేదు. ఇందులో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హస్తం ఉందని ప్రజలు బలంగా నమ్మారు. జనం ఆగ్రహించి రోడ్డెక్కారు. అప్పటికే తెలుగుదేశంలో చేరిన ఎన్టీఆర్‌ చిన్నల్లుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ నేత వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ నాయకుడు జైపాల్‌ రెడ్డి, ఉభయ కమ్యూనిస్టు నాయ కులు ఎన్టీఆర్‌‌‌కు అండగా నిలిచి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరిట మహోద్య మాన్ని నడిపారు.



ఆ ఉద్యమ ఫలితంగా నెలరోజుల వ్యవధిలోనే ఎన్టీఆర్‌‌‌ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తనకు వ్యతిరేకంగా సొంత ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌తో చేతులు కలిపి తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని గ్రహించిన ఎన్టీ ఆర్‌ 1984 అక్టోబర్‌లో అసెంబ్లీని రద్దుచేసి తిరిగి ప్రజాతీర్పును కోరారు. ఇందిరా గాంధీ హత్యానంతరం దేశంలో సానుభూతి పవనాలు బలంగా వీస్తున్న సమయ మది. దేశమంతట జరిగిన ఎలక్షన్‌లో కాంగ్రెస్‌ అఖండ విజయాన్ని నమోదు చేసు కుంది. ప్రతిపక్షాలన్ని మట్టికొట్టుకుపోయాయి. కాని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ మెజారిటీ లోక్‌సభ స్థానాలను దక్కించుకొని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఆ తర్వాత మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అదే జోరు కొనసాగించింది. మొత్తం 290 స్థానాలకు పోటీచేసి 202 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. 



1985-89 మధ్య కాలం ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా వున్న కాలంలోనే ఆయన జాతీయ స్థాయికి ఎదిగారు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటుచేసేందుకు విపక్ష నేతలందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. కుడి ఎడమల తేడా లేకుండా అందరిని కలుపుకుపోయి నేషనల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టగలిగాడు. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో అత్యంత కీలక పాత్ర పోషించడమన్నది ఎన్టీఆర్‌‌‌తోనే ప్రారంభమైంది. అయితే ఈ కాలం లోనే రాష్ర్ట పాలనపై ఎన్టీఆర్‌‌‌ శ్రద్ధ కోల్పోయారు. రాష్ర్టంలో పాలన దాదాపుగా స్థంభించిపోయింది. ప్రజల్లోను ప్రభుత్వం పట్ల విసుగొచ్చేసింది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెల్లుబికింది. ఈ నేపథ్యంలో 1989 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ ఓటమి చెందినా, అధికారంలోకి రాలేకపోయినా, క్యాడర్‌ మాత్రం చెక్కుచెదరలేదు. ఎన్టీ యార్‌ ఉన్నారన్న ధైర్యం, ధీమా, పార్టీని నమ్ముకునేలా చేసింది.



మరో ఏడాది న్నర కాలంలో ఎన్నికలున్నాయన్న తరుణంలో 1993 ఆగస్టులో ఎన్టీఆర్‌ లక్ష్మిపార్వతిని వివాహం చేసుకున్నారు. 70 ఏండ్ల వయసులో ఎన్టీఆర్‌ తీసుకున్న నిర్ణయం సంచ లనం సృష్టించింది. లక్ష్మిపార్వతి రాకతో తెలుగుదేశం పార్టీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. పార్టీకీ ఎన్టీయార్‌కు దూరం పెరగడం మొదలైంది. అప్పటికే చిన్న ల్లుడు చంద్రబాబు నాయుడు పార్టీలో పాతుకుపోయారు. గ్రామ స్థాయినుంచి పార్టీ కార్యకర్తలతో సత్‌సంబంధాలు పెట్టుకున్నాడు. పార్టీలో అన్నీ తానై వ్యవహ రించే స్థాయికి ఎదిగారు.అప్పటి వరకు ఎన్టీఆర్‌‌‌కు అన్నీ తానై వ్యవహరిస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు, పెద్దల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావులు సైతం ఎన్టీఆర్‌‌‌ను నేరుగా కలవలేని పరిస్థితి నెలకొన్నదనే ప్రచారం జరిగింది. లక్ష్మిపార్వతి కారణంగా ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యులకు మధ్య భేేదాభి ప్రాయలు పొడచూపాయి. అయినప్పటికి రాష్ర్ట వ్యాపితంగా తెలుగుదేశం పార్టీకి సుశిక్షితులైన యంత్రాంగం, నమ్మకమైన క్యాడర్‌ ఉండటంలో 1994 డిసెంబర్‌లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆఖండ విజయాన్ని సాధించి చరిత్రను తిరగరాసింది. కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదాకూడా దక్కలేని దయ నీయస్థితికి చేరుకుంది. లక్షలాదిమంది సమక్షంలో ఎన్టీఆర్‌‌‌ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మధ్యపాన నిషేధం ఫైల్‌పై తొలిసంతకం చేశారు. 



ఎన్టీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే పార్టీలో అనేక కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధికారం లోకి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. 1995 ఆగస్టు 21, 22 తేదీలలో ప్రజలవద్దకు పాలనంటూ ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతి సమే తంగా ఉత్తరాంధ్ర పర్యటనకు బయలుదేరడం రాజకీయ మలుపుకు దారితీసింది. లక్ష్మీ పార్వతి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి పావులు కదుపుతోందని, ఆమెచేతికి క్రమంగా పార్టీ పగ్గాలు చేరిపోతాయని ఆగ్రహించిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌‌‌పై తిరుగుబాటుచేసి మెజారిటీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలను చేర దీసి 1995 సెప్టెంబర్‌ 1న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటన తెలుగుదేశం పార్టీ చరిత్రలో మరో అధ్యా యం మొదలైంది. 



ఎన్టీఆర్‌ లాంటి అపరిమిత జనాదరణ వున్న నేత నుంచి పార్టీ పగ్గాలు చేజిక్కిం చుకున్న చంద్రబాబు తనకున్న రాజకీయ అనుభవం నుంచి బాగానే నెట్టుకొచ్చాడు. అప్పట్లో వున్న రాష్ర్ట ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆర్థిక సంస్కరణలు తీసు కొచ్చాడు. పాలనలో విప్లవాత్మక మార్పులతో తన ముద్రను వేసేందుకు శ్రమిం చాడు. 1995లో దీవించండి అంటూ ప్రజల్లోకి వచ్చిన చంద్రబాబుకు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో 1999లో శాసనసభ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో చంద్రబాబు విజయ ఢంకా మోగించారు. 1999 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత చంద్రబాబులో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. 



రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సంస్కరణలన్ని వేగవం తం చేశాడు. ఐటీ, సాఫ్ట్‌వేర్‌, క్రీడలు, మౌళిక సదుపాయాలు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చరిత్ర సామాజిక శాస్త్రాలు వంటి వాటిని విస్మరించి టూరిజమే అన్నింటికి పరిష్కారం చూపుతుందని వాటిని రద్దుచేశాడు. వ్యవసాయ రంగం దండగా అంటూ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశాడని పించుకు న్నారు. అదేకాలంలో రాష్ర్టంలో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడడంతో రైతులకు కష్టాలు ఎదురయ్యాయి. మరోవైపు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై భారాలు మోపాడు. విద్యుత్‌ చార్జీలు తగ్గించాలంటూ ప్రతిపక్షాలన్ని కలిసి చలో అసెంబ్లీకి పిలుపునిస్తే వారిపై కాల్పులు జరిపి ముగ్గురు యువకుల ప్రాణాలను బలిగొనడం జరిగింది. అంగన్‌వాడి కార్యకర్తలు తమ జీతాలుపెంచమని ఆందోళన నిర్వహిస్తే వారిని గుర్రా లతో తొక్కించడం వంటి పాశవిక చర్యలకు పాల్పడం ద్వారా ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే కాలంలో 2003 అక్టో్టబర్‌ 1న అలిపిరి దగ్గర చంద్ర బాబుపై నక్సలైట్‌ దాడి జరిగింది. తృటిలో ఆయన బయటపడ్డారు. చంద్రబాబుపై సానుభూతి పెల్లు బికింది. దాన్నీ ఓట్ల రూపంలో మార్చుకుందామన్న చంద్రబాబు తొమ్మిది నెలలకు ముందే సాధారణ ఎన్నికలకు వెళ్లాడు. 2003 డిసెంబర్‌ 14న అసెంబ్లీని రద్దు చేశారు.



అయినప్పటికి 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారు. 2004 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్ష పాత్రనే పోషిస్తూ అనేక గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కార ణంగా తెలంగాణ ప్రాంతంలో పట్టు కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. 2009 ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి ప్రతిపక్షాలను కలుపుకుని మహాకూటమిగా ఏర్పడి 2009 ఎన్నికల్లో బరిలోకి దిగినా గెలవలేక పోయింది. అయితే 2009 తర్వాత టీడీపీ పరిస్థితి పెనంమీద నుంచి పొయ్యిలో పడినట్లు తయారయ్యింది. 2004 కంటే 2009లో ఎక్కువ స్థానాలు గెలిచినా పార్టీ నానాటికి దిగజారింది.



తెలంగాణ సమస్య ఒకవైపు జగన్‌ పార్టీ హవా మరోవైపు. ఉప ఎన్నికల్లో పార్టీ వరుస పరాజయాలు, పార్టీని వదిలి వెళ్లిపోతున్న నేతలు, నేతల మధ్య అంతర్గతపోరు ఇలా అనేక సమస్యలతో పీకల్లో తుల్లో ఇరుక్కుపోయింది తెలుగు దేశం పార్టీ. సమస్యలు వచ్చిన ప్రతిసారి మరింత బలపడుతున్నామని నేతలు చెబుతున్నా, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. జీవన్మరణ సమస్యగా మారిన 2014 ఎన్నికల్లో మళ్లీ ఓటమి పాలవుతే పార్టీ భవిష్యత్తునే ఊహించడమే కష్టంగా ఉంది. అందుకే సర్వశక్తులు వడ్డి 62 ఏళ్ల వయసులో
ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా జనంలో తిరిగాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు సమయంలో ఎన్టీఆర్‌ చైతన్య రథంపై ఊరువాడ తిరిగి ప్రజలకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించి, అధికార పగ్గాల్ని చేజిక్కించుకున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా 2014లో జరిగే ఎన్నికల్లో విజ యం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంటాడా అనేది వేచిచూడాలి.

No comments :

Post a Comment