దళితుల తొలి విప్లవ పోరాటం

1 comment

1927 మార్చి 20వ తేదీ అది దళితులు విప్లవానికి శంఖారావం పూరించిన దినం. భారతదేశపు జాతీయ జీవితంలోనూ, సాంఘిక జీవితంలోనూ ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిన దినం.దళిత సమాజం మొట్టమొదటి సారిగా వాస్తవమైన ఆందోళనలో పాల్గొన్న దినం. ఒక అస్పృశ్యుడి నాయకత్వంలో తరతరాలుగా తమను అంటరానివారిగా చూస్తూ, సాటి మానవుని కంటే హీనంగా చూస్తున్న మనువాద సమాజానికి సమాధి కట్టేెందుకు అంకురార్పన చేపట్టిన దినం. అదే తొలి దళిత విప్లవ పోరాటానికి నాంది. ''చవదార్‌ చెరవులో'' (మహాద్‌్‌ చెరువు) నీళ్ళు తాగి తతిమ్మా జనం లాగే దళితులు మనుషులే అని చాటి చెబుతూ డా|| బి.ఆర్‌ అంబేద్కర్‌ నాయకత్వాన సమానత్వానికై జరిగిన పోరాటానికి ప్రారంభ సూచిక అయిన చవ్‌దార్‌ చెరువు ఘటన జరిగి మార్చి 20 నాటికి  85 సంవత్సరాలు గడుస్తూంది.  ఈ సందర్భంగా ఈ ఘటనను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిది.
డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ అప్పటి వరకు అస్పృశ్య సమాజంలో ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని మేలుకొల్పడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. దళిత సమాజంతో ఆత్మగౌరవం కలిగేటట్టు చూశాడు. మానసికంగా అస్పృశ్య సమాజం ఎంత ముందుకు వెళ్ళిందో అంచనా వేసుకున్నాడు. అస్పృశ్యుల గుండెల్లో ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని అయితే నాటగలిగాడు కాని వస్తాదుకు పోటిలో దిగేంతవరకూ తన శక్తి మీద తనకు నమ్మకం కుదరదు, తన బలాన్ని శత్రు సైనిక బలంతో పోల్చి అంచనా వేయడం కుదరదు. అట్లాగే ప్రయత్న పూర్వకంగా పోరాటంలోకి దిగిన తర్వాతే అస్పృశ్య సమాజానికి ఉన్న శక్తి ఎంత అనేది పరీక్షించడానికి వీలు కలుగుతుంది. డాక్టర్‌ అంబేద్కర్‌కు కూడా ఇదే భావం కలిగింది. అస్పృశ్య సమాజం తన శక్తి సామార్థ్యాలను నిరుపించుకునేందుకు సమయం ఆసన్నమైంది, దానికి మూహుర్తాన్ని మార్చి 20న నిర్ణయించారు. నిచ్చనమెట్ల కుల సమాజంలో మూడువేల సంవత్సరాలుగా  పంచమ కులంగా అగ్రవర్ణ సమాజంచే చీదరించబడుతూ, మంచినీటి చెరువులకు, నదులకు, ఆస్పత్రులకు, విద్యాసంస్థలకు, కోర్టులకు, దేవాలయాలు లాంటి సార్వజనిన స్థలాలన్నింటికి దూరంగా ఉంచిన మనుధర్మాన్ని ధిక్కరించడానికి పూనుకున్నాడు. దీనికి వేదికగా మహాద్‌్‌ను ఎన్నుకున్నాడు. దీనికి కారణం మహాద్‌్‌ ఆయనకు బాగా తెలిసిన ప్రాంతం. సైనిక ఉద్యోగాల నుంచి పెన్షన్‌ పుచ్చుకున్న మహార్‌ జాతికి చెందిన జనం మహాద్‌్‌లోనే నివాసాలు ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా అక్కడ నివశిస్తున్న వారిలో చాలామందికి సాంఘీక కార్యకలాపాల గురించి అవగాహన ఉంది. వీళ్ళందరూ అవసరం వచ్చినప్పుడు జాతికోసం తమ ప్రాణాలని సైతం ఫణంగా పెట్టడానికి సిద్దపడతారనే నమ్మకం బాబాసాహెబ్‌కు ఉంది. అంతేకాకుండా వాళ్ళందరూ సైన్యం నుంచి రిటైర్‌ అయి వచ్చిన వాళ్ళవడం చేత క్రమశిక్షణ వాళ్ళ రక్తంలో ఉంది. 
అనుకున్నట్టుగానే మార్చి 19వ తేదిన మహాద్‌్‌లో పరిషత్‌ను ప్రారంభించడానికి నిర్ణయించారు. దీనిలో పాల్గోనడానికి గుజరాత్‌, మహారాష్ట్రకి చెందిన పల్లెలనుండి సుమారు ఐదువేల మంది జనం వచ్చారు. సాయంత్రం పరిషత్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేయబోయే కార్యాన్ని గురించి బాబసాహెబ్‌ ప్రారంభ సూచకంగా ఉత్సాహపూరితమైన ప్రసంగాన్ని ఇచ్చాడు. ఈ ప్రసంగంలో మూడు సూత్రాలను చేపట్టమని బాబాసాహెబు పిలుపిచ్చాడు. 
అవి 1. చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడం మానెయ్యండి. 2. ఎంగిలి భోజనాన్ని స్వీకరించకండి. 3. పెద్దా, చిన్నా అన్న ఊహని మనస్సులోంచి తీసేసి ఉన్నత వర్గాల జీవన విధానాలని స్వీకరించండి. అస్పృశ్య వర్గం వ్యవసాయాన్ని కూడా వృత్తిగా చేపట్టండి అని సలహా ఇచ్చాడు. దళితుల ఆత్మగౌరవాన్ని మేలుకొలిపేటట్లు ఆయన ఉపన్యసించాడు. ఈ ఉపన్యాసం ఆయన కోరుకున్న ప్రభావాన్ని జనంలో కలిగించింది.మహాద్‌్‌ చెరువు విషయంలో ఆ సమయంలోనే మహాద్‌ మున్సిపాలిటీ ఒక తీర్మానం చేసింది. '' ఈ చెరువు సార్వజనికమైనదని దీని నీటిని అస్పృశ్యులతో పాటు జనం యావన్మందీ వాడుకోవచ్చని'' ఈ తీర్మానం సారాంశం. ఈ తీర్మానం  బాబాసాహెబ్‌కు పోరాటానికి మార్గాన్ని సులభతరం చేసినట్టయింది. రెండవరోజు మార్చి 20వ తేదిన ఉదయం తొమ్మిది గంటలకు సమావేశం మొదలయ్యింది. ముందస్తుగా మహాద్‌్‌ మున్సిపాలిటి చేసిన తీర్మానాన్ని అమోదించారు. ఈ తీర్మానాన్ని వెంటనే అమలు పెట్టాలని లక్ష్యంతో బాబాసాహెబు ముందు నడవగా ఐదువేల మంది దళిత సమాజం ఊరేగింపుగా, ఉత్సాహాంగా పాటలు పాడుతూ చవ్‌దార్‌ చెరువు గట్టుకు చేరుకున్నారు. బాబాసాహెబ్‌, ఆ తర్వాత దళిత సమాజం అంతా తరతరాలుగా తమ జాతికి దూరంగా ఉంచబడిన మంచి నీటిని దోసిట్లోకి తీసుకుని తృప్తిగా తాగి మనుధర్మాన్ని ధిక్కరించారు. ఒక పౌరుడిగా, మనిషిగా, మా హక్కుగా మేము తాగుతున్నాం అని మంచినీటిని తాగి తమ హక్కుని ఋజువు  చేశారు. నీళ్ళు తాగిన వారందరి మొహాల్లోనూ వింతైన ఉత్సాహం, సంతోషం తాండవించాయి.ఈ ఉత్సాహంలో బాబాసాహెబ్‌ నాయకత్వంలో దేన్నయిన సాధించవచ్చనే నమ్మకం ఏర్పరచుకున్నారు. ఒక్కోక్కరుగా నీటిని త్రాగిన జనం జట్లుజట్లుగా విడిపోయి తిరిగి సభాస్తలికి చేరుకున్నారు. తరతరాలుగా తాము పవిత్రంగా భావిస్తున్న మనుధర్మానికి ఈ ఘటనతో  పగుళ్ళు ఏర్పడ్డాయని భావించిన సనాతనులు దళితులను ఎదురుదెబ్బ తియడానికి రహస్య మంతనాలు మొదలెట్టారు. మతం విపత్తులో పడిందని  సర్వత్రా ప్రచారం నిర్వహించారు. తమతమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడుతున్న దళితులపై  అకస్మాత్తుగా సనాతన గుండాలు దండెత్తి వచ్చి లాఠీల వర్షం కురిపించారు. ఊరంతా తిరుగుతూ కనిపించిన ప్రతినిధులను కొట్టడం మొదలెట్టారు. ఈ వార్త బాబాసాహెబ్‌కు చేరింది. స్పృహ తప్పి పడిపోయిన జనాన్ని, దెబ్బల బాధని సహించలేక గిలగిల కొట్టుకుంటున్న ప్రతినిధులని చూసి  బాబాసాహెబ్‌ నెత్తురు ఉడుకెత్తింది. అయిన తన కోపాన్ని అదుపులోకి తెచ్చుకొని ఎంతో గాంభీర్యంతో ఈ తరుణంలో మీరు కోపంతో ఉద్రిక్తులు కావద్దు, చెయ్యి చేసుకొవద్దు. మీరు మీ కోపాన్ని దిగమింగుకొని వారి దెబ్బలను సహిస్తూ ఈ సనాతనులకి అహింస మహాత్తు ఎంతో చూపించాలి అని దళిత సమూహానికి బోధించాడు. ప్రతికారేచ్చతో రగిలిపోతున్న దళిత సమాజం, ఆప్ఘను యుద్ధంలోనూ, తదితర యుద్ధాల్లోనూ తమ పరాక్రమాన్ని, వీరత్వాన్ని ప్రదర్శించిన సైనికులు తమ కోపాన్ని దిగమింగుకొని  సనాతులు కురిపిస్తున్న రాళ్ళ వర్షానికి దెబ్బలు తగిలి ఒకరి తర్వాత ఒకరు నేలవాలిపోతున్న అస్పృశ్యులు తిప్పి కొట్టలేదు. తమ నాయకుడి అదేశాన్ని శిరసావహించి సహానం ప్రదర్శించారు. ఒకవేల  అస్పృశ్యులు ఎదురు దెబ్బతియ్యాలని సంకల్పించుకోని ఉంటే, దాడిచేసి ఉంటే  సనాతుల ప్రాణాలను కాపాడడం ఎవరి తరం కాకపోయేది. దెబ్బలు తిన్న వారిని బాబాసాహెబ్‌ స్వయంగా ఆస్పత్రితో చేర్చాడు, ఈ ఘటన జరిగాక సనాతన గుండాలపై కేసులు నమోదు చేయించాడు. 1927 జూన్‌ 6 వ తేదిన తొమ్మిది మంది నేరస్థుల్లో ఐదుగురికి కఠిన కారగార శిక్ష పడింది. ఈ సందర్భంగా '' ఈ కొట్లాట తరుణంలో హిందుయేతర అధికారులు ఉండి ఉండకపోతే విచారణ పక్షపాత రహితంగా జరగడం కష్టం అయ్యేది'' అని అంబేద్కర్‌ అన్నారు. ఆ తర్వాత ఊరూర పల్లెపల్లెలో అస్పృశ్యుల మీద హిందువులు చేసే అత్యాచారాలను, బహిష్కరణలను వారు ఎదుర్కోవలసి వచ్చింది. యావత్‌ భారతదేశంలో అక్కడక్కడా దీనికి ప్రతిస్పందన కనిపించింది. తరువాత సనాతులంతా కలిసి చావదార్‌ చెరువును శుద్ధి చేయ్యాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం చావదార్‌ చెరువులోంచి 108 బిందెల నీళ్ళు తీయించారు. ఇంటింటి నుంచి పేడ, గోమూత్రం పోగుచేసి పాలు, పెరుగు బిందెల్లో కలిపారు. మొత్తం వాటన్నింటిని చావదార్‌ చెరువులో పోసి, శుద్ధి అయ్యిందని ప్రకటించారు. ''మనువాద సమాజంలో మనిషి స్పర్శతో పోల్చితే ఆవుపేడా, గోమూత్రం అధిక పరిశుద్థంగా ప్రకిటించడంలో మనువాద సమాజంలో అస్పృశ్యుల స్థితి ఎలాంటీదో తెలియజేస్తూంది''.
ఈ ఘటన అనంతరం ఆగష్టు 4వ తేదిన మహాడ్‌ మునిసిపాలిటీ ఒక కొత్త తీర్మానాన్ని అమోదించి గతంలో ప్రకటించిన తీర్మానాన్ని రద్దుచేసుకుంది. ఈ తీర్మానాన్ని అంబేద్కర్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు చవ్‌దార్‌ చెరువులో సనాతులతో సమానంగా అస్పృశ్యులు హక్కుగా పొందేవరకు పోరాడాలని నిక్షయించుకున్నాడు. భవిష్యత్‌ కార్యక్రమాన్ని డిసెంబర్‌ 25 వ తేదికి పిలుపునిచ్చాడు, ఈ పిలుపును వ్యతిరేకిస్తూ సనాతులు కోర్టుకు వెళ్ళిన బాబాసాహెబు వెనక్కి తగ్గలేదు. ఈ సందర్భంగా బాబాసాహెబ్‌ మాట్లాడుతూ '' చవ్‌దార్‌ చెరువులోని  నీళ్ళు మనం తాగకపోతే మన ప్రాణాలు ఏమీపోవు, అయితే తతిమ్మా జనంలాగా మనమూ మనుషులమే అని వారందరికి చెప్పాలని మనం వాంఛిస్తున్నాం. సమానత్వానికి శ్రీకారం చుట్టడానికే ఈ ఘటన అని ఆయన పేర్కోన్నాడు''. ఈ హిందు సమాజాన్ని పునర్నిర్మాణం చేయ్యాలని దానికోసం సమానత్వం, జాతిరహిత సహాజం అనేవి మన లక్ష్యాలు కావాలని పిలుపునిచ్చాడు.1789 మే 5వ తేదిన ఫ్రాన్సులోని బర్సాయ దగ్గర జరిగిన  జాతీయసభతో ఈ పరిషత్‌ సభను పోల్చుతూ ''ఫ్రెంచి విప్లవం కోసం వారు ఎలాగు  సంఘటితం కావల్సివచ్చిందో అలాగే మనం కూడా సంఘటితం కావాల్సి ఉంది.ఈ సభలో నిర్దేశించబడిన మార్గమే హిందు సమాజపు అభ్యుదయానికి కావలసిన అత్యవసరమైన మార్గం'' అని చెప్పాడు.  ''పుట్టుకరీత్యా అందరూ సమానంగా పుడతారు వారు చనిపోయేదాక సమానంగా ఉండాలి'', ''మనుస్మృతిని'' దగ్థం చేసేందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ తీర్మానానికి  పరిషత్‌లో పాల్గోన్న సమాజమంతా ముక్తకంఠంతో అమోదం తెలిపారు. అనుకున్నదే తడువుగా రాత్రి తొమ్మిది గంటలకు  ఒక వేదిక మీద '' మనుస్మృతిని'' దగ్థం చేశారు. అనంతరం చెరువు విషయంలో మహద్‌్‌ మునిసిపాలిటీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం డాక్టర్‌ అంబేద్కర్‌ మహడ్‌ సబ్‌జడ్జీ ఎదుట ''విధించిన నిషేదాజ్ఞలకు'' వ్యతిరేకంగా తిరుగులేని వాదన చేశారు. అయన వాదాన్ని ఖండించడం అసంభమయ్యింది. ఫిబ్రవరి 23వ తేదిన జడ్జి ఆ ఆదేశాన్ని రద్ధు చేస్తూ తీర్పు నిచ్చాడు. ఈ సందర్భంగా మహాద్‌్‌లో జరిగిన విప్లవం గురించి డా|| అంబేద్కర్‌ మాట్లాడుతూ ''నోరు వాని లేని పీిడిత ప్రజలు, చెప్పకోదగిన ఏ ఆఘాయిత్యం జరగకుండా, అతి తక్కువ సమయంలో, సమాన హక్కులను పొందడం అన్నది ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ జరగని, అనుకోని, ఆశించని విప్లవం'' అని పేర్కోన్నారు.
అయితే ఈ తొలి దళిత విప్లవ పోరాటానికి నాంది అయిన సంఘటన జరిగి నేటికి 86 సంవత్సరాలు గడిచిపోయింది. స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కులవివక్షత, అంటరాతనం వివిధ రూపాల్లో నేటికి కోనసాగుతోంది. గతంలో సాక్షి హ్యూమన్‌ రైట్స్‌ నిర్వహించిన సర్వేలో నేటికి 74 శాతం గ్రామాల్లో మంచినీటిసేకరణ వద్ధ, 86 శాతం గ్రామాల్లో ఆలయ ప్రవేశం విషయంలో, 92 శాతం గ్రామాల్లో ఇళ్ళు అద్దెకు ఇవ్వడం దగ్గర, 54 శాతం గ్రామాల్లో హోటల్ల దగ్గర, 90 గ్రామాల్లో బట్టలుతకడం దగ్గర, 82 శాతం గ్రామాల్లో క్షౌరం దగ్గర వివక్ష కొనసాగుతుందని తెలియజేసింది. వీటి నిర్మూలన కోసం అనేక చట్టాలు వచ్చిన అంటరాని తనాన్ని కానీ, కులవివక్షను కాని అరికట్టలేక పోతున్నాయి. అంబేద్కర్‌ వారసులమని చెలామని అవుతున్న నాయకులు కాని సంఘాలు కాని వీటికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించలేకపోతున్నాయి. దళితులపేరు చెప్పుకొని దళిత ప్రతినిధులుగా చట్టసభల్లో ఎన్నికయిన నాయకులు చట్టసభల్లో వీటిగురించి పల్లెత్తు మాటైన మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఓట్లదగ్గర, సీట్లదగ్గర కులాన్ని వాడుకోనే నాయకులు అంబేద్కర్‌ వారసులుగా కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా నిర్మించిన పోరాటాల్లో,  తమ భాగస్వామ్యం ఎంతో బేరీజువేసుకోవాలి.  అంబేద్కర్‌ వారసులంగా ''బోధించు, సమీకరించు, పోరాడు'' అనే నినాదాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత,వీటికి వ్యతిరేకంగా పోరాడిల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.అదే డా|| బి.ఆర్‌ అంబేద్కర్‌ నాయకత్వాన జరిగిన తొలి దళిత విప్లవ పోరాటం ఇచ్చిన పిలుపు.

(సూర్య 20-3-2012)

1 comment :

  1. చాలా బాగా వివరించారు..
    ధన్యవాదాలు..🙏
    జై భీమ్..✊

    ReplyDelete